Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ కమ్యూనిస్టు కామ్రేడ్ కుంజా బొజ్జి తన 95వ ఏట అనారోగ్యంతో ఏప్రిల్ 12న తుది శ్వాస విడిచారు. అత్యంత సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఆయనది. మారుమూల అడవి వెంకన్నగూడెంలో జన్మించిన ఆయన సాయుధ తెలంగాణ పోరాట దళాలకు అండగా నిలిచిన నాటి నుంచి ప్రస్థానం మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మూడు పర్యాయాలు-(1985, 1989, 1994) భద్రాచలం నియోజకవర్గం నుంచి బొజ్జి ఎన్నికయ్యారు. ప్రతి జిల్లాలో ఏదో ఒక కార్యక్రమంలో, పోరాటంలో ఆయన పాల్గొన్నారు. శాసనసభ సభ్యునిగా 1999లో బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత 'పార్టీ నాకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతల్లో ఉంటానని' ప్రకటించి విప్లవాశయం కోసం ఉద్యమాలలోనే చివరి వరకు కొనసాగిన ధన్యజీవి.
బొజ్జి గారు యంఎల్ఎ కాకముందే ప్రాణాలు లెక్క చేయకుండా పార్టీ కోసం నిలబడ్డారు. 1983 నవంబర్ 11న అప్పటికే పార్టీపై, గిరిజనోద్యమంపై దాడులు ముమ్మరం చేసిన పిడబ్యుజి గ్రూపు నక్సలైట్లు ఎ.వి గూడెంకు 30మంది సాయుధలైన దళం వెళ్ళి 'నువ్వు సీపీఐ(ఎం)కి రాజీనామా చేయాలి. మొండిగా వ్యవహరిస్తున్నావు. నిన్ను చంపుతాం' అని బొజ్జి గారిని బెదిరించారు (అప్పటికే అనేక గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు హెచ్చరికలు, దాడులు, బెదిరింపులు సాగుతున్నాయి). ఈ సంఘటనను ఆయన అనేక సభలలో తరువాత కాలంలో చెప్పేవారు. 'నేను ఎత్తిన ఎర్రజెండాను దించను. చంపినా నాకు భయంలేదు. నేను అనారోగ్యంతోనో, మరోరకంగానో చనిపోతే వందల జెండాలు లేస్తాయి. మీరో, కాంగ్రెస్ వారో బెదిరిస్తున్నట్టుగా నన్ను చంపితే వేల జెండాలు లేస్తాయి. మా జనం మిమ్ముల్ని క్షమించరు...' అని ఎదురు తిరిగారు. 1982 సమితి ఎన్నికల్లో అభ్యర్థిగా బొజ్జి గారిని పార్టీ నిలిపితే, వి.ఆర్.పురంలో నామినేషన్ వేయనీకుండా దాడి చేయాలని కాంగ్రెస్ పార్టీ వారు పథకం వేశారు. అనేక గ్రామాల నుంచి వందలాది మంది ఆదివాసీ ఎర్రసైన్యం తమ సాంప్రదాయక ఆయుధాలైన విల్లంబులతో తరలివచ్చి వారి పథకాన్ని వమ్ముచేశారు. శాంతియుతంగా కార్యక్రమం జరిగేలా పార్టీ ప్రతివ్యూహరచన చేసింది. సాంప్రదాయకంగా కాంగ్రెస్ తిరుగులేకుండా గెలుస్తున్న వి.ఆర్.పురంలో పార్టీ చాలా స్వల్పమైన తేడా వరకూ వచ్చి బొజ్జి గారు ఓడిపోయారు. అయినా తరువాత కూడా పార్టీ వేగంగా పురోగమించింది. అందువల్లనే కాంగ్రెస్, నక్సలైట్లు పరస్పరం సహకరించుకుంటూ సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలపై దాడులు, కుట్రలు చేశారు. 'ప్రతి రాత్రీ ఒక కాళరాత్రిలా... ప్రతి పగలు ఒక దుర్మార్గంలా' అన్నట్లు కార్యకర్తలు, నాయకులపై దాడులు, కాళ్ళు చేతులు నరకడం, కుటుంబ సభ్యులను బెదిరించి లొంగతీసుకోవాలనుకోవడం, దారికాచి హత్యలు చేయడానికి ప్రయత్నించడం ముమ్మరం అయ్యాయి. గోళ్ళగట్ట గ్రామంలో బండారు సూర్యనారాయణ, శ్రీరామ్మూర్తి, మల్లెంపేటలో శ్యామల వెంకటరెడ్డి, సత్యా రెడ్డి ఇలా అనేక మందిని గొడ్డళ్ళతో నరికారు. ఎక్కడ దాడి జరిగినా ప్రజలను సమీకరించడం ద్వారా పార్టీ విధానానికి అనుగుణంగానే ఎదుర్కోవడం జరిగింది.
భద్రాచల ఉద్యమ చరిత్రలో 1985 నవంబర్ 5 అత్యంత విషాదకరమైన రోజు. దారికాచిన నరహంతకులు... డివిజన్ పార్టీ నాయకులు చంద్రరావు, భీష్మారావులను దారుణంగా హతమార్చారు. బొజ్జి గారిని తీవ్రంగా గాయపర్చి 'ఇప్పటికి కొట్టి వదిలేస్తున్నాం. ఈసారి చంపి తీరుతాం. వాళ్ళకు పట్టిన గతే నీకూ పడుతుంద'ని హెచ్చరించి వెళ్లారు. అదే జీపులో కామ్రేడ్ రాజయ్య కూడా గాయాలతో మిగిలారు. ఆ తరువాత మూడు పర్యాయాలు ఎంఎల్ఎగా ఎన్నికై చివరి వరకు ఎర్రజెండా నీడలోనే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కొనసాగారు.
కామ్రేడ్ బొజ్జి పెద్దబాలశిక్ష ద్వారా విద్యాభ్యాసం చేశారు. ప్రజాశక్తి వారపత్రిక అయినా, దినపత్రిక అయినా, నవతెలంగాణ అయినా సంపాదకీయం, వ్యాసాలు, వార్తలు చదవని రోజు ఒక్కటి కూడా ఉండి ఉండదు. 1960 దశకంలోనే 'నేను వారపత్రికకు సంవత్సర చందా కడతాను. సలహా ఇవ్వండి' అని నాయకత్వాన్ని అడిగాను. వారి సూచన మేరకు నాకున్న ఎడ్లు, గేదెలు, మేకలలో ఒక దానిని అమ్మి పేపర్ చందా కట్టాను. ఆ రోజు నుంచి పేపర్ చదవకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడింది.' అని అనేక క్లాసుల్లో ఆయన బోధించేవారు. ప్రభుత్వం, అధికారుల నుంచి వచ్చే ఉత్తర ప్రత్యుత్తరాలను తనే స్వయంగా చదవడానికి ప్రయత్నం చేశారు. ఇంగ్లీషులో ఉంటే తెలుగులో అర్థమయ్యేలా చెప్పించుకునేవారు. సీరియస్ విషయాలను కూడా సామెతలు, చతురోక్తులు, హాస్యం, రోజువారీ ప్రజా జీవనంలోని ఘటనలను జోడించి చెపుతూ ఆయన ఉపన్యాసాలు సాగేవి. మైక్ దగ్గరకు వస్తున్నారంటే ప్రజల్లో ఒక రకమైన ఆసక్తి నెలకొనేది. ఆయన ఉపన్యాసాన్ని జనం చెవులు రిక్కించి వినేవారు.
ఆయన అమర వీరుల కుటుంబాలను ఆప్యాయంగా పలకరించి, కుటుంబ యోగక్షేమాలు తెలుసుకునేవారు. ఆయన బాగా ప్రేమించినవారిలో నేను మొదటి వరసలో ఉంటాను. ఆయన ఎంఎల్ఎగా ఉంటూ వ్యవసాయ వార్షిక సంఘం డివిజన్ అధ్యక్షుడిగా నేను కార్యదర్శిగా చాలా కాలం పని చేశాం. 1993 నుంచి 2006 మధ్య కాలంలో వ్యవసాయ కార్మిక ఉద్యమాలు, భూ పోరాటాల ద్వారా పార్టీ వేగంగా విస్తరించింది. 1996 సెప్టెంబర్లో శ్యామల వెంకటరెడ్డి గారు హత్యకు గురయ్యాక పార్టీ డివిజన్ కేంద్రంగా బొజ్జి గారు, రాజయ్య గారు నేను ముగ్గురం మిగిలాం. ప్రజా సంఘాలన్నీ బలంగాను, స్వతంత్రంగా పని చేసేవి. అనతి కాలంలో పార్టీ కోలుకున్నది. నిలదొక్కుకొని పురోగమించింది.
శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకూ విస్తరించి ఉన్న గొలుసుకట్టు గిరిజన ప్రాంతంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో లేనన్ని విద్యా, వైద్య సంస్థలు, రోడ్లు, కరెంటు సదుపాయాలు భద్రాచలంలో ఉన్నాయంటే అందుకు కారణం ఏకకాలంలో ప్రజాప్రతినిధుల కృషి, పార్టీ, ప్రజాసంఘాలు, ప్రతినిధులు ప్రజలను సమీకరించి చేసిన పోరాటాలు, ఉద్యమాల సమన్వయం. తునికాకు ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలోనే తలమానికమైనది. వెట్టి చాకిరి, మేకల పుల్లరి, వేతన దోపిడీ, మహిళలపై లైంగిక దోపిడీలను ప్రజా ఉద్యమాలు తిప్పికొట్టాయి. అసెంబ్లీ, ఐటిడిఎ పాలక మండలి, జిల్లా పరిషత్ మీటింగ్ ఏదైనా పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రజల గొంతుకగా తన వాణిని వనిపిస్తుండగానే, ప్రజా ఉద్యమాల గొంతుకలు కూడా ఏక కాలంలో గర్జిస్తుండేవి. మోతుగూడెం, దిగువ సీలేరు విద్యుత్ కార్మికుల పోరాటం విజయవంతం కావడంతో... 157 మంది బొజ్జి గారి కృషితో 1998లో రెగ్యులరైజ్ అయ్యారు. తునికాకు సీజన్లో, ధాన్యం సీజన్లో ప్రజలు ధన, వస్తు రూపంలో నిధులు సేకరించి పార్టీని పోషించుకునేవారు.
గిరిజన, గిరిజనేతరుల ఐక్యత అనేది ఆదివాసీలు కేంద్రంగా ఉండాలనీ, వ్యవసాయ కార్మిక, పేద రైతులు పునాదిగా గ్రామీణ పేదలను సమీకరించాలనే పార్టీ విధానం అమలు చేయడంవల్లనే ప్రజా ఉద్యమం అభివృద్ధి అయ్యింది. శత్రు దాడుల్లో ముఖ్యులు నేలకొరుగుతున్నా, దానితోపాటు ఫారెస్ట్, పోలీసు నిర్బంధం, కార్మికుల పోరాటంపై పేపర్ బోర్డు యాజమాన్యం నిర్బంధం, దాడులు, కేసులు కూడా ఏకకాలంలో సాగాయి. ఫారెస్టు కార్మికుల సమ్మె సందర్భంగా తప్పడు కేసులలో ఇరికించి బెయిల్ రాకుండా చేసి జైళ్ళలో ఉంచినా పోరాటాలు జయప్రదం అయ్యాయి. పార్టీ ప్రజాసంఘాలు పోరాటాల ద్వారా ప్రజా పునాది విస్తరిస్తేనే పార్లమెంటరీ రంగంలో విజయాలు సాధించగలమనే సూత్రాన్ని నమ్మిన కామ్రేడ్ బొజ్జి దాన్నే పార్టీ జనరల్ బాడీల్లో, క్లాసుల్లో చెప్పేవారు. ''పార్టీ బలంగా ఉంటేనే ఎంఎల్ఎలు గెలుస్తారు. ఎంఎల్ఎల మీద, పైరవీల మీద ఆధారపడి పార్టీ నిలబడదు. ఎంత కష్టమొచ్చినా నిలబడి పోరాడే కార్యకర్తల సైన్యం ద్వారా, ప్రజా మద్దతు ద్వారానే ఎన్నికల్లో గెలుస్తాం'' అని ఆయన ఎపుడూ అంటుండేవారు. 'బొజ్జి గారు పార్లమెంటరీ, పార్లమెంటేతర పోరాటాల అన్వయింపునకు చక్కని తార్కాణం' అని సంస్మరణ సభలో మాజీ ఎం.పి డాక్టర్ మిడియం బాబూరావు అన్న మాటలు అక్షర సత్యాలు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే నిజమైన నివాళి.
- బండారు రవికుమార్
సెల్:9121080160