Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ నియంత్రణ విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానపరంగానే, వ్యూహబద్దంగానే వ్యవహరిస్తోందని, న్యాయస్థానాల జోక్యం అవసరం లేదనీ న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయాధికారి తుషార్ మెహతా ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. అంతకు ముందు వివిధ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, ప్రజారోగ్య వ్యవస్థలో ఉన్న లోపాలు, రెండోదఫా కోవిడ్ ఉప్పెన విరుచుకుపడటం వెనక ఉన్న కారణాలు, వాటిని నియంత్రించటంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వంటి అనేక అంశాలను ఉన్నత న్యాయస్థానం విచారణకు చేపట్టింది. ఇందులో భాగంగా వాక్సిన్ ధరల విషయంలో ద్వంద్వ ప్రమాణాలేమిటని ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో ప్రజలందరికీ సమానంగా వాక్సిన్ అందుబాటులోకి తెచ్చే ఉద్దేశ్యంతోనే వేర్వేరు ధరలు నిర్ణయించామని బుకాయించింది. ధరల వ్యత్యాసాలు, ఒకరికి ఎక్కువ ధరలు, మరొకరికి తక్కువ ధరలు నిర్ణయించటం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రం అమలు చేయటంలో భాగమేనన్న అవగాహన కలిగిన వాళ్లు కేంద్ర న్యాయశాఖ బాధ్యతలు చూస్తున్నందుకు ఈ దేశం సిగ్గుతో తలొంచుకుంటుంది.
మరోవైపున బీహార్‌లో కోవిడ్ మృతుల శవాలు గుట్టలు గుట్టలుగా గంగా, కోస్గి నదుల్లో తేలాడుతున్నాయన్న వార్తలు భయానక వాస్తవికతను కండ్లముందుంచుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్ విస్తరణ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్నో ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న ఓ రోగి తన శరీరంలో ఆక్సిజన్ వేగంగా పడిపోతోందని, ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేదని, ఎవరన్నా ఆక్సిజన్ అందించి తన ప్రాణాలు కాపాడాలని ట్విటర్లో విజ్ఞప్తులు పెట్టాడు. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టు కొన్ని సత్వర చర్యలకుగాను మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ స్థాయిలో ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాను పర్యవేక్షించేందుకు ఓ టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసింది. కోవిడ్ రోగుల సంఖ్యలో హెచ్చుతగ్గులను బట్టి వివిధ రాష్ట్రాలకు ఆయా మోతాదుల్లో ఆక్సిజన్ సరఫరా చేయాలని ఆదేశించింది. ఈ పరిణామాలు కండ్లారా చూస్తున్నప్పుడు పత్రికల్లో చదువుతున్నప్పుడు రాజ్యాంగ యంత్రం వైఫల్యానికి ఇంతకన్నా నిదర్శనమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.
భారతీయులమైన మేము అన్న మకుటంతో మొదలయ్యే భారత రాజ్యాంగం ద్వారా మన పాలకులుగా ఎన్నికైన వాళ్లు ఈ దేశంలో ప్రజల ప్రాణాలు కాపాడటానికి చిత్తశుద్ధితో నిజాయితీగా కృషి చేయటం మాట అటుంచి కనీసం ప్రయత్నం కూడా చేయటానికి సిద్ధంగా లేరన్న వాస్తవం అర్థం చేసుకోలేని స్థితికి మనం నెట్టివేయబడ్డాం. భారత ప్రజాస్వామ్యానికి పునాది పత్రం రాజ్యాంగం. రాజ్యాంగం ఉనికిలోకి రాకముందే జీవించే హక్కు జీవించి ఉండనిచ్చే హక్కు నైతిక హక్కులుగా ఉన్నాయి. రాజులు కూడా తమ భూభాగాల పరిధిలోని ప్రజలను శతృదేశాల దాడులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడటానికి బాధ్యత తీసుకున్న కొనసాగింపే ప్రజల నుంచి పన్నులు వసూలు చేశారు. యుద్ధాల సంగతి పక్కన పెట్టినా ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు మాత్రం కొన్నైనా చర్యలు తీసుకున్నారు. ఈ నైతిక హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కుగా మారి ప్రాథమిక హక్కుల్లో స్థానం పొందింది. సుప్రీం కోర్టు కూడా అనేక సందర్భాల్లో జీవించే హక్కును మౌలిక రాజకీయ హక్కుగానూ, రాజ్యాంబద్ధమైన హక్కుగానూ గుర్తిస్తూ వందల కొద్దీ తీర్పులిచ్చింది. కానీ 21వ శతాబ్దంలో భారతదేశం ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని బాకాలూదుతున్న సమయంలో కనీసం ప్రజల ప్రాణాలు కాపాడటానికి కావల్సిన ప్రాణవాయును సరఫరా చేయలేని దుస్థితి మన కండ్ల ముందుంది.
మొదటి దఫా కోవిడ్ విస్తరణ కాలంలో దేశాన్ని ఆత్మనిర్భరత వైపు నడిపిస్తున్నామని కేంద్రం జబ్బలు చర్చుకొంది. దీపాలార్పటం అన్న పదానికి తెలుగు భాషలో ఓ ప్రత్యేకమైన అర్థం ఉంది. అటువంటి దీపాలార్పటం ద్వారా కోవిడ్‌ను కట్టడి చేయవచ్చని, కంచాలు మోగించటం ద్వారా కట్టడి చేయొచ్చని పోసుకోలు కబుర్లు చెప్పే వారిని కనీస ఇంగితం ఉన్న వాళ్లు ప్రశ్నించారు. ప్రజల బాధలకు పత్రికారంగం స్థానం ఇచ్చే పరిస్థితి లేకపోవటంతో సోషల్ మీడియా వేదికయ్యింది. మోడీ 2002 నుంచీ నిర్మించుకుంటూ వచ్చిన ఇమేజిని కోవిడ్ కాకి ఎత్తుకుపోయింది. దాంతో ప్రజోపయోగ చర్యలు తీసుకోవటం ద్వారా ప్రజల మన్ననలు పొందటానికి బదులు ఏకంగా ఆ కాస్త ధిక్కార స్వరాలకైనా వేదికగా మిగిలిన సోషల్ మీడియా గొంతునొక్కటానికి కావల్సిన కట్టుదిట్టమైన నిబంధనలు రూపొందించే పనిలో మునిగింది కేంద్రం. అటువంటి నిబంధనల పర్యవసానమే ఉత్తరప్రదేశ్‌లో తన ప్రాణాలు నిలపడానికి ఆక్సిజన్ సరఫరా చేయాలంటూ ట్విటర్లో పోస్ట్ పెట్టిన రోగి, వారి కుటుంబంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేయడం. అంటే ప్రాణాలు కాపాడటమని అడగటం కూడా బీజేపీ పాలనలో చట్టరీత్యా నేరమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పకనే చెపుతున్నాయి. ఇక ఆకలి దప్పుల గురించి సాగే ఆందోళనలను ఉగ్రవాద చర్యలతో ముడిపెట్టడానికి ఇటువంటి రాక్షసపాలనకు అడ్డేముంటుంది? పైగా తమ పరిపాలనను అభాసుపాల్చేజేసేందుకు కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలోనూ విదేశీ ప్రసార మాధ్యమాల్లోనూ అపోహలు సృష్టిస్తున్నారంటూ సిగ్గు ఎగ్గు లేకుండా కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి మైకుపట్టుకుని బయల్దేరాడు.
ఈ పరిస్థితులన్నీ గమనించినప్పుడు రాజ్యాంగయంత్రం వైఫల్యం గురించిన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత రాజ్యాంగాన్ని రూపొందిం చేటప్పుడు ఈ రాజ్యాంగం ప్రజల అవసరాలు తీర్చటంలో విఫలమవుతుందా అన్న సందేహం కొద్దిమందికి రాకపోలేదు. దీనికి సమాధానంగా అంబేద్కర్ రాజ్యాంగ వైఫల్యం రాజ్యాంగంలో ఉన్న లోపాల వలన కాదు, దాన్ని అమలు చేయటంలో అనుసరించే వైఖరి వల్లనే జరుగుతుందని సమాధానమిచ్చారు. ఈ చర్చను మరింత ముందుకు తీసుకెళ్తూ 1935 నాటి చట్టంలో అత్యవసర పరిస్థితులను రాజ్యాంగంలో పొందుపర్చాలా వద్దా అన్న లోతైనచర్చ జరిగింది. సుదీర్ఘ చర్చల తర్వాత భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో 352 నుంచి 360 అధికరణాల్లో రాజ్యాంగయంత్రం విఫలం అయితే తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధి విధానాలు పొందుపర్చారు.
తర్వాతి కాలంలో రాజకీయ అవసరాల కోసం ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే రాజ్యాంగ యంత్రం విఫలం కావడాలూ, దానిపై న్యాయస్థానాల తీర్పులు, సర్కారియా కమిషన్ సిఫార్సులు వంటి అనేక పరిణామాలు సమకాలీన రాజ్యాంగ వ్యాఖ్యానంలో అంతర్భాగమయ్యాయి. 1992 డిసెంబరు 6న జాతీయ సమగ్రతా మండలికి, సుప్రీం కోర్టుకు ఇచ్చిన వాగ్దానాన్ని భంగపర్చి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలోని బీజేపీ ప్రభుత్వాలు అయోధ్య విధ్వంసానికి తెరతీసిన నేపథ్యంలో నాటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ యంత్రం వైఫల్యం కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసి రాష్ట్రపతిపాలన విధించింది. దానిపై దాఖలైన కేసులో సుప్రీం కోర్టు దాదాపు 200 పేజీల సుదీర్ఘమైన తీర్పునిచ్చింది. ఇందులో మొదటి యాభై పేజీల్లో రాజ్యాంగయంత్రం అంటే ఏమటి, దాని వైఫల్యం ఏమిటి, వైఫల్యం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ పరిపాలనా చర్యలేమిటి అన్నది లోతుగా చర్చించింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు చెప్పిన ఓ విషయం ఇక్కడ ప్రస్తావించాలి.
రాజ్యాంగయంత్రం విఫలం అయ్యిందని నిరూపించేందుకు రెండు మార్గాలు. మొదటిది రాజ్యాంగం ఆదేశించిన నియమనిబంధనల ప్రకారం ప్రభుత్వాలు తమ బాధ్యతలు నెరవేరుస్తున్నాయా లేదా, నెరవేర్చేందుకు వీలైన పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది వస్తుగత పరిశీలన ద్వారా అంచనా వేసి నిర్ధారణకు రావటం. ఇది వ్యవస్థల చలామణికి సంబంధించిన అంశం. ఇక రెండోది, రాజ్యాంగపరమైన హక్కులు, అవకాశాలు, వెసులుబాట్లు, సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా ప్రజలు పొందుతున్నారా లేదా అన్నది ఎవరికి వారే అంచనా వేసుకుని రాజ్యాంగయంత్రం విఫలమైందా లేదా (ప్రభుత్వం పని చేస్తోందా లేదా) అన్నది తేల్చుకోవటం రెండో మార్గం. మొదటి మార్గంలో తప్పొప్పులు జరిగినప్పుడు మాత్రమే న్యాయస్థానాల జోక్యం ఓ మేరకు వ్యవస్థను సరిదిద్దటానికి ఉపయోగపడుతుంది. రెండో మార్గంలో ప్రజలే తుది తీర్పునివ్వాలి. దానికి కార్యక్షేత్రం న్యాయస్థానాలు కాదు. రాజకీయాలేనని తేల్చి చెప్పింది. కోవిడ్ నేపథ్యంలో రాజ్యాంగ యంత్రం వైఫల్యం అన్న మాటలు ఉపయోగించకపోయినా ఆచరణలో ఆ విషయం రోజురోజుకూ రుజువవుతోంది. ఈ వాస్తవం ప్రజలందరి జీవితంలోనూ వ్యక్తమవుతోంది. తదుపరి ఏమి చేయాలన్నది నిర్ణయించాల్సింది ప్రజా న్యాయస్థానమే. ఇప్పటికే కోట్లాదిమంది ఫేసుబుక్, ట్విటర్ వేదికలుగా ప్రధాని రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన దేశం కూడా ఈ దిశగా నడవాల్సిన సమయం దగ్గరపడింది.
- కొండూరి వీరయ్య
సెల్: 8971794037