Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ల కొరత ఎంత తీవ్రంగా ఉందో వ్యాక్సినేషన్ కేంద్రాల దగ్గర గుంపులు గుంపులుగా గుమిగూడి, వ్యాక్సిన్ దొరకదని తెలిసి నిరాశతో వెనుదిరుగుతున్న జనాల్ని చూస్తే తెలుస్తుంది.
మనకు సామర్థ్యం లేదా ?
వాస్తవానికి ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రంగా భారతదేశం ఉంది. 1920 దశకం లోనే వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం బొంబాయిలో హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్ ఏర్పడింది. 1970లో చేసిన ఇండియన్ పేటెంట్ యాక్ట్‌ను ఉపయోగించుకుని దేశంలోని సిఎస్ఐఆర్ ల్యాబ్‌లు, సిసిఎంబి వంటి కేంద్ర పరిశోధనా సంస్థలు సాగించిన పరిశోధనలు మన దేశ వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని, బయోలాజిక్ సామర్ధ్యాన్ని పెంచాయి. ఈ మందుల, వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రధానంగా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ దృక్పథం కల సిప్లా వంటి కంపెనీలు చేపట్టాయి. ఫలితంగా ప్రపంచానికి జెనరిక్ మందులు, వ్యాక్సిన్ లు అతి ఎక్కువ మోతాదులో సరఫరా చేయగల దేశంగా భారత్ ఎదిగింది. బహుళజాతి డ్రగ్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయగలిగిన స్థితి వచ్చింది. మన దేశపు వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం అంతా ప్రయివేటు కంపెనీల పుణ్యమే అని మోడీ ప్రచారం చేస్తున్న దాంట్లో ఏ మాత్రమూ వాస్తవం లేదు. 1950-90ల మధ్య ప్రభుత్వ రంగంలో జరిగిన కషి ఫలితాలను ఇప్పుడు ప్రయివేటు సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి అంతే.
మన దేశంలో ఉన్న పేటెంటు చట్టాల వెనక వామపక్షాల కృషి, చొరవ కీలకమైనది. ప్రభుత్వ రంగంలో ఔషధాల తయారీ జరగడం కూడా అంతే కీలకం. అందుకే అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలు మన దేశ ఔషధ ఉత్పత్తి సామర్ధ్యాన్ని దెబ్బ తీయడమే తమ లక్ష్యంగా పెట్టుకుని భారత ప్రభుత్వం మీద ఒత్తిడులను పెంచాయి. ప్రభుత్వ రంగ ఔషధ ఉత్పత్తి సంస్థలు (ఐడిపిఎల్ వంటివి), ప్రభుత్వ పరిశోధనా సంస్థలు బలహీనపడడం మొదలైంది.
సకాలంలో వ్యాక్సిన్‌ను అందరికీ అందించలేమా?
వర్తమానంలోకి వస్తే, ఇప్పుడు దేశంలో 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతీ ఒక్కరికీ రెండు డోసుల వ్యాక్సిన్ అందించాలంటే మొత్తం 200కోట్ల డోసుల వ్యాక్సిన్ కావాలి. మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ తోబాటు బయొలాజికల్ ఇవాన్స్, హాఫ్కిన్ బయో ఫార్మా, జిఎస్కె, మరికొన్ని ఇతర సంస్థలు ఈ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగలవు. ఇప్పటికే ఒక ఏడాదిలో 300కోట్ల డోసుల ఉత్పత్తి చేయడానికి ఇవి ప్లాను చేసుకుంటున్నాయి. వీటికి తోడు ప్రభుత్వ రంగ ఫార్మాను కూడా రంగంలోకి దించితే సులువుగా 400కోట్ల డోసుల ఉత్పత్తి ఒక ఏడాదిలోనే సాధించగలం. మన దేశ అవసరాలు తీర్చడమే గాక ప్రపంచంలో ఇతర దేశాలకు కూడా సరఫరా చేయగలిగేవాళ్ళం.
కానీ ఆ విధంగా ఎందుకు జరగలేదు? వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల సంస్థలు చాలా ఉన్నప్పటికీ, రెండే రెండు సంస్థలు మాత్రమే ప్రస్తుతం వ్యాక్సిన్ తయారీలో ఎందుకు ఉన్నాయి? వ్యాక్సిన్ల కొరత ఎందుకు ఉంది? పంపిణీ ఎందుకు ఇంత అధ్వాన్నంగా ఉంది? ఈ ప్రశ్నలకు ఒక్కటే సమాధానం. ఇదంతా మోడీ ప్రభుత్వ వైఫల్యం. బాధ్యతారాహిత్యం. ప్రయివేటు రంగానికి ఈ ప్రభుత్వం దాసోహమనడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది.
మోడీ ప్రభుత్వ స్వయంకృతమే
2021 జనవరి 11న మాత్రమే మోడీ ప్రభుత్వం సీరం ఇన్స్టిట్యూట్కు వ్యాక్సిన్ల కోసం ఆర్డరు పెట్టారు. అది కూడా కేవలం ఒక కోటి పది లక్షల డోసులకు మాత్రమే. మార్చిలో, కేసులు పెరగడం మొదలయాక మరో 12 కోట్ల డోసులకు ఆర్డరు పెట్టారు. విదేశీ పరిజ్ఞానంతో కోవిషీల్డ్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. ఇక మన దేశంలో ఐసిఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధించి కనుగొన్న కోవ్యాక్సిన్‌ను మన దేశంలో ఎన్ని సంస్థల ద్వారానైనా ఉత్పత్తి చేయించవచ్చు. కాని మోడీ ప్రభుత్వం కేవలం భారత్ బయోటెక్‌కి మాత్రమే అందుకు అనుమతిచ్చింది. చాలా విమర్శలను ఎదుర్కొన్నాక, మహారాష్ట్ర ప్రభుత్వం అధీనంలో నడిచే హాఫ్కిన్ బయో ఫార్మాకి ఇప్పుడు అనుమతిచ్చింది. మరోపక్క భారత్ బయోటెక్‌కి, సీరం ఇన్స్టిట్యూట్కి కలిపి రూ.4,500 కోట్లు గ్రాంటు ఇచ్చింది.
ఏ అవసరం వచ్చినా దానిని ప్రయివేటు రంగం తీర్చగలదన్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మోడీ అనుసరించిన విధానాలకు మూలం. అదే ఇప్పుడు మన దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. ప్రభుత్వ రంగానికి మాత్రమే గాక, ఎటువంటి ప్లానింగ్‌నూ ఈ సిద్ధాంతం సహించదు. దేశానికి కావలసిన వ్యాక్సిన్ ఉత్పత్తిని సాధించాలంటే అందుకు అవసరమైన టెక్నాలజీ, పెట్టుబడి సమకూర్చడంతోబాటు, ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేవరకూ ప్లానింగ్ కావాలి. వ్యాక్సిన్ తయారీకి కావలసిన ముడి పదార్థాల సేకరణ, ఫిల్టర్లు, సప్లయి బ్యాగ్‌లు వంటి అవసరాలు (37 రకాల ఇంటర్మీడియరీస్ అవసరం) సేకరించుకోవాలి. వీటి సరఫరాపై అమెరికా నిషేధం విధించింది (1950 రక్షణ రంగ ఉత్పత్తుల చట్టం ప్రాతిపదికగా!). తన ఆధిపత్యాన్ని నిలుపుకోడం కోసం కాలం చెల్లిన చట్టాలను వాడుకుంటూ అమెరికా అడ్డగోలుగా వ్యవహరిస్తూంటే కనీసం నిరసన తెలిపే సాహసం కూడా మోడీ ప్రభుత్వానికి లేకపోయింది. మొత్తం వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా, సమన్వయం చేయడానికి కేంద్రీకృతంగా ప్లానింగ్ కావాలి. కాని మన నిటిఆయోగులకు ప్లానింగ్ అంటేనే పడదు కదా!
ముందుగా మేల్కొని ఒక ప్రణాళికాబద్ధ కృషితో వ్యవహరించినందు వలన అంతవరకూ మనకన్నా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యంలో వెనకబడివున్న చైనా స్వంతంగా మూడు రకాల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది (సైనోఫార్మ్, సైనోవాక్, కాన్సినో). తన దేశంలో కోవిడ్‌ను పూర్తిగా నియంత్రించగలిగింది. దేశీయంగా వ్యాక్సిన్ అవసరాలను తీర్చడంతోబాటు, ఇప్పుడు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు అతి పెద్ద సరఫరాదారుగా చైనా ఉంది.
మన పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మన దేశీయ అవసరాలను కూడా తీర్చలేకపోతున్నాం. 2021 పూర్తయ్యే నాటికి దేశంలో సగం మందికి కూడా వ్యాక్సినేషన్ చేయగలుగుతామన్న గ్యారంటీలేని పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడిదారులు చేయగల ''అద్భుతాల'' మీద అత్యాశలు పెట్టుకున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, దానిని పాటించే పాలకులూ మనల్ని ఈ స్థితికి తీసుకు వచ్చారు.
- ప్రభీర్ పురకాయస్థ