Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ ఎర్రసైన్యం నాజీ సైన్యంపై గెలిచింది. ప్రజల అంతులేని బాధలను అంతంచేసింది. మే 9న ప్రపంచ సామ్యవాద కాముకులు విజయ దిన వేడుక జరుపుకుంటారు. ''నాజీయిజం అవశేషాలు నేటికీ బలంగా ఉన్నాయి. లక్షలాది ప్రజల రక్తంతో చేతులు తడిచిన దేశద్రోహులు, మోసగాళ్ళు, నేరగాళ్లను సమర్థిస్తూ చరిత్రను తిరగరాస్తున్నారు. నాజీలు తమ భావ జాలాలతో ప్రజలను పీడించారు. నకిలీ ప్రత్యేకతల భ్రమభ్రాంతుల సిద్దాంతాన్ని తిరిగి రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి.'' అని 9.5.2021న 76వ విజయ దినోత్సవంలో మాస్కో రెడ్ స్క్వేర్ లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.
బ్రిటిష్ ప్రధాని చాంబర్లయిన్ 1938లో హిట్లర్‌తో తెలివితక్కువ 'మ్యూనిచ్ ఒప్పందం' చేసుకున్నారు. జెకొస్లోవేకియాలో జర్మన్లు నివసించే సుడేటన్లండ్ ప్రాంతాన్ని జర్మనీకిచ్చారు. సుడేటన్లండ్ తప్ప ఇతర ప్రాంతాలపై ఆశలేదని హిట్లర్ నమ్మబలికాడు. ఇది శాంతి ఒప్పందమని చాంబర్లయిన్ గుడ్డి నమ్మకం. ఈ ప్రాంతాన్ని కోల్పోయిన జెకొస్లోవేకియా జర్మనీ యుద్ధయంత్రాగాన్ని ఎదుర్కోలేక పోయింది. అవిశ్వాస తీర్మానంలో ఓడిన చాంబర్లయిన్ స్థానంలో నౌకాదళ ప్రథమస్థాన అధికారి విన్స్టన్ చర్చిల్ మే 1940న ప్రధాని అయ్యారు. కొత్తగా శక్తియుక్తులు పొందిన నాజీ నుండి ప్రాణాంతక ముప్పు గురించి చర్చిల్ ప్రధాని కాక ముందు నుండి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఐనా 1939లో పోలండ్, జెకొస్లోవేకియాలపై హిట్లర్ దాడిచేసేవరకూ ఎవరూ నమ్మలేదు. మెరుగైన సౌకర్యాల చోటుకు తరలిస్తున్నామని జలవాయురహిత నరకకూపాలకు రాజకీయ ఖైదీలను మార్చిన అసత్య హరిశ్చంద్రుడు హిట్లర్.
నిన్నటి దాకా శబ్దాలంకారాల, సంక్షిప్తపద వాక్చాతుర్యాలను హిట్లర్ కంటే ఎక్కువ దుష్ప్రభావాలకు వాడినవారు ప్రపంచంలో లేరు. మన అధినేత ఆ లోటు తీర్చారు. హిట్లర్ జనసమూహాల కవాతుల్లో శ్రోతలను ఉన్మాదావేశంతో ఉర్రూతలూగించేవారు. ప్రేక్షకులు ఆయన మాటమాటకూ మద్దతుగా కేకలేసేవారు. నవ్వేవారు. ఆయన విజయ నినాదాల్లో గొంతుకలిపేవారు. ఈ ప్రాణాంతక ప్రతిభ తప్ప జనపోరాటంలో ప్రజల హృదయాలను గెలిచే మరో ఆయుధం ఆయన వద్ద లేదు. అనేక అంశాల్లో ఆయన మామూలు విద్యార్థి. మొదటి ప్రపంచ యుద్ధంలో సామాన్య సిపాయి. యుద్ధం తర్వాత తీవ్ర జాతీయవాద రాజకీయాలకు మళ్ళారు. సమస్యలపై ప్రజలను రెచ్చగొట్టి క్రోధాగ్నితో మండించగల సామర్థ్యం ఆయన అజేయ ఆయుధం. 1921కి నాజీ పార్టీ నాయకునిగా ఎదిగారు. ఉన్మాదంతో నిండిన ఆయన ఉపన్యాసాలు ప్రజలను ఆకర్షించాయి. ఆయన ఉన్మాదోద్యమానికి అనుచరులను సంపాదించాయి. ఆపై హిట్లర్ ఊపుకు ఆపులేదు. ప్రజాదరణ పెరుగుతూ పోయింది. 1933లో జర్మనీ ఛాన్సలర్ అయ్యాడు. త్వరలోనే రాజకీయ రౌడీయిజం, సైనిక హింసలతో ఏకంగా రిపబ్లిక్‌నే రద్దుచేశాడు. కొత్త థర్డ్ రీచ్ (మూడవ సామ్రాజ్యం) స్థాపించాడు. జర్మనీ, పోలండ్పై యుద్ధం చేయబోతోందని 1.09.1939 న ఉపన్యాసం ద్వారా తన మంత్రివర్గ సహచరులకు ప్రకటించాడు హిట్లర్. దాంతో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. మనం కూడా ఇప్పుడు రోజూ ఇలాంటి ఉపన్యాసాలు వింటున్నాం. మన విశ్వగురు తాత్విక పూర్వీకుల జర్మనీ సందర్శనల ఫలితంగా ఆయన జీవితంలో ఈ గుణగణాల ఘటనలు జరిగాయి.
హిట్లర్ ఉపన్యాసం: ''వర్సయిల్స్ సమస్య సృష్టించిన హింసతో నెలల తరబడి బాధపడుతున్నాం. ఆ సమస్య భరించరాని స్థాయికి చేరింది. (వర్సయిల్స్ అతి ముఖ్యమైన శాంతి ఒప్పందం. మొదటి ప్రపంచ యుద్ధాన్ని కొంతకాలం ఆపింది.) డాంజింగ్, కారిడార్లను పోలండ్‌కు ఇచ్చిన ఈ ఒప్పందాన్ని సవరించి సమస్యను శాంతియుతంగా పరిష్కరించే, పరిస్థితులను మార్చే ప్రయత్నాలు, ప్రతిపాదనలు చాలా చేశాను. వీటన్నిటినీ తిరస్కరించారని మీకు తెలుసు. నన్ను తప్పు అంచనా వేశారు. నా శాంతిప్రియత్వాన్ని, ఓర్పును బలహీనతగా, పిరికితనంగా భావించారు. అందుకే నిన్న రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాను. పోలండ్‌కు మాతో గంభీర సంప్రదింపులు జరిపే ఇష్టమున్నట్టు నాకు నమ్మకంలేదని బ్రిటన్‌కు చెప్పాను. నాలుగేండ్ల నుండి చర్చలకు సిద్ధంగా ఉన్నాను. జర్మన్లను కష్టాలపాల్జేయను. ముందు కంటే ఎక్కువగా నా ప్రజల కోసం ప్రాణాలు ఒడ్డుతున్నాను. ఈ క్షణం నుంచి జర్మన్ సామ్రాజ్య ప్రథమ సైనికున్ని. (మన నాయకుడు ప్రధాన సేవకుడు). ప్రియమైన అతిపవిత్రమైన నా కవచాన్ని మరోమారు ధరించాను. విజయం సిద్ధించే వరకు వదలను. గెలవకుంటే చస్తాను. జాతీయ సామ్యవాదిగా, జర్మన్ సేనానిగా (56 ఇంచీల) గట్టి గుండెతో పోరాటం చేస్తున్నాను. నా ప్రజలు, దేశ ప్రతిష్ట పునరుద్ధరణ, జర్మనీల కోసం నా జీవితమంతా పోరాటం తప్ప మరొకటి లేదు. ఈ పోరాటానికి ప్రజలపై విశ్వాసం ఒక్కటే సంకేతపదం. లొంగిపోడం నేను నేర్వని పదం. జర్మనీ చరిత్రలో నవంబర్ 1918 (మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ లొంగిన నెల) పునరావతంకాదని ప్రపంచానికి హామీఇస్తున్నాను. సామ్రాజ్యాధికారం కోసం పోరు ప్రారంభించినప్పుడు చేసిన తీర్మానం తో ముగిస్తున్నాను. ఏ కష్టం, ఏ బాధ అణచలేనంత బలసంకల్పముంటే మన సంకల్పం, జర్మన్ బలం ప్రబలంగా వ్యాపిస్తాయి.'' ఇలాంటి మాటలు మన నేత నోట కూడా 2002 నుండి, మరీ ఎక్కువగా 2013 నుండి రోజూ వింటూనే ఉన్నాం.
తర్వాతి పరిణామాలు గమనిస్తే హిట్లర్ ఉపన్యాసం ఆశ్చర్యకరమైన అబద్దాల జాబితా అని తేలింది. వాగ్దానాలు, గంభీర ప్రకటనలు కొన్నేళ్లకే భంగమయాయి. కల్పిత బాధల గర్జనలన్నీ సిగ్గులేని సాకులే. జర్మనీని యుద్ధంలో దించే కుయుక్తులే. ఫ్రాన్స్, బ్రిటన్లు పోలండ్ స్వాతంత్రానికి హామీఇచ్చాయి. జర్మన్లు దాడిచేసినప్పుడు తమ మిత్రపక్షాలకు మద్దతివ్వడం తప్ప ఈ పాశ్చాత్య దేశాలకు మరో మార్గం లేదు. 1939 ఆగస్టులో నాజీ-సోవియట్ రహస్య ఒప్పందం కుదిరింది. ఆ మేరకు 17.9.1939న సోవియట్ తూర్పు పోలండ్పై దాడిచేసింది. ఈ ఒప్పందాన్ని కాలదన్ని 1941లో జర్మనీ రష్యాపై దాడిచేసింది. తమ పీర్ల్ రేవుపై జపాన్ మెరుపుదాడి తర్వాత 1941 లో అమెరికా యుద్ధరంగంలో ప్రవేశించింది. ఈ ఆక్రమణ యుద్ధంలో జర్మనీ విజయవంత మౌతుందన్నది హిట్లర్ ఉపన్యాస అబద్దాలలో అతి పెద్దది. 1945కు జర్మనీ డాంబిక సైన్యం పటాపంచలైంది. ఈ విశ్వవినాశక మారణహౌమ యుద్ధంలో 8కోట్ల మంది చనిపోయారు. 60లక్షల యూదులు, అంతే సంఖ్యలో స్లావ్లు, కమ్యూనిస్టులు, జిప్సీలు (సంచారజాతులు), ఇతరులు మరణించారు. ఐరోపాలో వసంతం వచ్చేనాటికి బెర్లిన్ శిధిల వీధుల్లోకి సోవియట్ సైన్యాలు చొరబడ్డాయి. చావు తప్పదని తెలిసిన హిట్లర్, బెర్లిన్ భస్మశిధిలాలలో ప్రియురాలు ఎవా బ్రవున్తో సహా 30.4.1945న స్వీయహత్య చేసుకున్నారు. లొంగిపోనన్న వాగ్దానాన్ని ఇలా నిలబెట్టుకున్నారు.
పుతిన్ హెచ్చరికలోని ప్రతి పదం భారత్ కు వర్తిస్తుంది. మన ప్రధాన సేవకుని ప్రతి పనీ అతిశయోక్తుల, ఉద్విగ ఉద్రేకతల, అబద్దాల నాటకమే. అహంకార దుర్లక్ష్యాలతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. దేశం సర్వనాశనం వైపు పరుగెడు తోంది. దేశవిదేశాల నిరసనలు, ప్రధాని రాజీనామా డిమాండు నేపథ్యంలో ఆయన భవిష్య ప్రణాళిక ఏమిటో? ఈ దేశం ఏమౌతుందో? మనమా విజయదినం జరుపుకునే రోజు రావాలని విజ్ఞుల బలమైన కోరిక.
- ఎస్. హనుమంత రెడ్డి
సెల్: 9490204545