Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టుకతో వచ్చే వివక్ష పోయేందుకు, నిర్మూలించేందుకు న్యాయబద్దమైన ప్రభుత్వ స్థాపన అవసరం. సమ సమాజ స్థాపన కోసం వైజ్ఞానిక దృక్పథంతో పనిచేసే యంత్రాంగం, వ్యవస్థలు మనకు అవసరం. అందుకు బౌద్ధ ధమ్మ జ్ఞానం, నైతికత అత్యవసరం అవుతోంది. మనుషుల్ని విభజించే నిచ్చెనమెట్ల కుల సమాజం అవసరమా? దాన్ని తోసిపుచ్చి, మన మంతా ఒక్కటే అనే మానవీయ విలువలతో నడిచే సమాజం అవసరమా? తీవ్రంగా ఆలోచించుకునే సమయం వచ్చేసింది!
మధ్య యుగాల యూరొప్‌లో అసమానత్వ సామాజిక వ్యవస్థ వర్థిల్లింది. అక్కడి చర్చ్‌లు, మత న్యాయస్థానాలు, మత బోధకులు సమాజాన్ని భూస్వామ్య ధనవంతులుగా, వ్యాపారులుగా, శ్రామిక, రైతు, కూలి వర్గాలుగా విభజించారు. 'దేవుని ఆజ్ఞ' అనే వంకతో లక్షల మందిని బానిసలుగా మార్చారు. దాంతో చెప్పరాని హింస చెలరేగి, మానవత్వాన్ని మంట గలిపింది. సామాన్యుల్నే గాక, శాస్త్రవేత్తల్ని, తత్త్వవేత్తల్ని, మేథావుల్ని, ప్రతిభావంతుల్ని మతం అక్కడ నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుంది. చరిత్ర పుటల్లో అవన్నీ నిక్షిప్తమయ్యే ఉన్నాయి. అలాంటి అనాగరిక మత సమాజం క్రమంగా మేల్కొని, నాగరిక భావనతో ముందుకు నడిచింది. ప్రాచీన సంస్కృతుల్లో ఒకటిగా పరిఢవిల్లినా, భారతీయ సమాజం అంతగా గర్వపడాల్సింది ఏమీలేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విభజనలు, వైదిక ధర్మంపేరుతో ఇక్కడ జరిగాయి. నిచ్చెనమెట్ల ఆధిపత్య సమాజం వర్థిల్లింది. పై వర్గాలకు ప్రత్యేక అవకాశాలిస్తూ కింది వర్గాలను అమానుషంగా చిత్రహింసలకు గురిచేసింది. ఇరవై అయిదు శతాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన ఈ దుర్మార్గం ఇంకా వేళ్ళూనుకునే ఉంది. ఎందుకంటే సామాజిక చలనాన్ని, వైజ్ఞానిక భావాలను వైదిక / బ్రాహ్మణ / హిందూ ధర్మం అంగీకరించడం లేదు.
ప్రతికులం ఏ వృత్తి చేయాలో, ఎటువంటి గుణగణాలు కలిగి ఉండాలో వైదికవాదం నిర్దేశించింది. వారి న్యాయ గ్రంథం మనుస్మృతి. సృష్టికర్త - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్గాలకు వరుసగా చదువు, పాలన, వ్యాపారం, శ్రమ - కేటాయించాడని చెపుతోంది(1.88.91). ప్రతి వర్గానికీ ఉన్న బాధ్యతను అంటే కర్తవ్యాన్ని భగవద్గీత నిర్వచించింది (V××× 42-44). ఆ కర్తవ్యాన్నే ''స్వధర్మం'' అని అన్నారు. స్వధర్మాన్ని - అంటే తమకు నిర్దేశించిన పనిని, ఏ కులంలోని వ్యక్తి అయినా సరిగా నిర్వర్తించకపోతే, వచ్చే జన్మలో మరింత హీనమైన పుట్టుక పుట్టి, దుర్భరమైన జీవితం జీవించాల్సి ఉంటుంది. భవద్గీతలో చెప్పిన 'కర్మ' కేవలం ఆయా వర్గాల పనిని, గుణాన్ని నిర్దేశించింది. పైగా అది పునర్జన్మకు, పునర్జన్మ ఫలాలకూ కూడా వర్తిస్తుంది. స్వధర్మాన్ని ఉల్లంఘిస్తే బ్రాహ్మణీయ ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు, ధర్మ స్మృతులు కఠినమైన శిక్షలు విధిస్తాయి. స్వధర్మసిద్దాంతం భారతదేశంలో కుల వ్యవస్థను బలోపేతం చేసింది.
కారణం ద్వారానే దేని ఉనికైనా ఉంటుందని, ఈ విశ్వం గతిశీలమైందని, పరిణామాత్మకమైందని, సాపేక్షికమైందని బుద్ధుడు భావించాడు. బ్రహ్మ - ఆత్మ వంటి సిద్ధాంతాలను ఆయన అంగీకరించలేదు. అందుకే బౌద్ధం వైదికుల పవిత్ర గ్రంథాలకు వ్యతిరేకమైంది. శృతికి వ్యతిరేకమైంది. బ్రాహ్మణవాదానికి పునాదిగా ఉన్న శృతి గ్రంథాలను బౌద్ధం పట్టించుకోలేదు. ఆ గ్రంథాలకు ఏ విలువనూ ఇవ్వలేదు. పునర్జన్మ నుంచి తప్పించుకుని, ఆత్మ బ్రహ్మలో విలీనమవడాన్ని 'విముక్తిగా / మోక్షంగా' బ్రాహ్మణవాదం చెపుతుంది. మానవ జీవితంలో భౌతిక అస్థిత్వంలో వేదన తీరడమే 'నిర్వాణమ'ని బౌద్ధం భావిస్తుంది. వైదిక / బ్రాహ్మణ / హిందూ దేవుళ్ళు బౌద్ధంలో మనిషి కంటే తక్కువ స్థాయి వారు. మనిషి కేంద్రంగా.. మనిషి అస్థిత్వమే జ్ఞానం (బోధి) అని, దు:ఖ నిర్మూలనే నిర్వాణం - అని బుద్ధుడు బోధించాడు. ఇవీ బౌద్ధానికీ - బ్రాహ్మణవాదానికీ మధ్య ఉన్న వైరుధ్యాలు!
1. భౌతిక వాస్తవాలు 2. మానవ చర్యలు 3. ప్రవర్తనలు 4. వాటి గురించిన సూత్రాలు కొన్ని చట్టాల కలయికే - బౌద్ధ సిద్ధాంతం! అదే ధమ్మం!! ఈ నాలుగు గొప్ప సత్యాలే. మానవ విముక్తికి మూల సూత్రాలు. ప్రతీత సముత్పాదం అంటే కార్యకారణ సిద్ధాంతం. కర్మ విశాక - అంటే నైతిక విలువల గూర్చిన సూత్రాలు. శూన్యత అంటే నిరంతర పరివర్తన - సాపేక్షిత.. వంటివి బౌద్ధ ధమ్మంలో ప్రధానమైన అంశాలు. బుద్ధుడి బోధనలు విశ్వనియమాలను బోధించాయి. ఈ నియమాలు ఏ దేవుడూ సృష్టించినవి కావు. నియంత్రించేవీ కావు. ఆ నియమాలు బుద్ధుడు ఆవిష్కరించినవి కూడా కాదు. ఈ విశ్వంలో అవి అనంతంగా ఉన్నవే. కార్యకారణ సంబంధంతోనే ఈ విశ్వం ఉనికిలో ఉందని బుద్ధుడు 'సంయుక్త గమ' గ్రంథంలో (17,18 సూత్రాలు) తెలిపాడు. ఇది భౌతిక సత్యం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పిన విషయాలే దాదాపు బుద్ధుడు చెప్పాడు. అదీ కామన్ ఎరాకు ఎంతో ముందు! అత్యున్నత జ్ఞానాన్ని (బోధి) పొందిన బుద్ధుడు, అంతకు ముందు ప్రపంచానికి తెలియని వినూత్న ఆనందాన్ని ఒక సిద్ధాంతంగా ప్రభోదించాడు. దేవుడి గూర్చి, ఆధ్యాత్మికత గూర్చి బుద్ధుడు ప్రవచించలేదు. ''ఉనికిలో ఉన్నదానికి కారణం ఉంది'' అన్నాడు. ''ఆ కారణాన్ని నిర్మూలిస్తే, సమస్యను నిర్మూలించవచ్చు'' అని అన్నాడు. ''ప్రతీత్య సముద్పాద'' అనేది ఒక తాత్త్విక సిద్ధాంతం! ఇదే ఈ ఒకే ఒక్క మాటే - బుద్ధుని ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు. వేల సంవత్సరాల క్రితమే కార్యకారణ సంబంధాన్ని గ్రహించడం మాటలుకాదు కదా? వైదికవాద శృతికి భిన్నంగా మానవ కార్యాచరణతోనే బౌద్ధం ప్రారంభమవుతుంది. మానవ జీవన అస్థిత్వ విధానానికి అవసరమైన మంచి జ్ఞానం - ఎటువంటి ఆధిపత్యానికీ, ఎటువంటి విశ్వాసాలకూ తలవంచదని బుద్ధుడు చెప్పాడు. బౌద్ధం - భౌతిక వాస్తవాన్ని నియంత్రించే చలన సూత్రాలను ముందుగా చెపుతుంది. ఇందులో ముఖ్యమైంది మొదటి సూత్రం - ప్రతీత్య సముద్పాదం - అంటే, కార్యకారణ సిద్ధాంతం. ''ప్రతీత్య సముద్పాదాన్ని చూసినవారు ధమ్మాన్ని, ఆ తర్వాత బుద్ధుణ్ణీ చూడగలరని'' పాలిస్తంభ సూత్రం వ్యాఖ్యానించింది.
స్వయంగా కళాసృష్టి చేయకపోయినా, బుద్ధుని జీవితమే ఒక కళాఖండం. ఆయన నెలకొల్పిన బౌద్ధ ధర్మమే ఒక కళా నిలయం. సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని ధారబోసిన ఈ మహనీయుడు తన ధర్మంలోనే తనకు ఎలాంటి స్థానాన్ని ఆపాదించుకోలేదు. తన వారసుణ్ణి నియమించడానికి కూడా ఒప్పుకోలేదు. 'ధర్మానికి వారసుడు ధర్మమే'అని చెప్పాడు. సిద్ధాంతం దానంతట అదే నిలబడాలి కానీ, ఎవరి అధికారానికో లోబడికాదు - అలా అధికారానికి లోబడేది అసలు సిద్ధాంతమే కాదు - అని అన్నాడు. వారసుణ్ణి నియమించాలని అనుయాయులు రెండు మూడు సార్లు కోరారు. కానీ, బుద్ధుడు ప్రతిసారీ తిరస్కరించాడు. ధర్మాన్ని నడిపించడానికి, ఆ ధర్మ సంస్థాపకుని పేరు ప్రస్తావించాల్సి వస్తే అది ధర్మమే కాదు - అని అన్నాడు. వారసత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చాడు. బుద్ధుడి జీవిత చరిత్రను అనుయాయులెవరూ గ్రంథస్థం చేయలేదు. అయితే కాశ్యపుడనే అనుయాయి రాసిన రెండు పిటకాల వల్ల ఏవో కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. బౌద్ధాన్ని బోధించిన వ్యక్తిగా కాకుండా బుద్ధుణ్ణి, బౌద్ధం ఆచరించిన వ్యక్తిగా చూడాలి. అదే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తర్వాత కాలాలలో కొందరు బౌద్ధంలో మార్మిక గాధలెన్నో చేరుస్తూ వచ్చారు. అలాంటి వాటిని పక్కనపెట్టి పరిశీలిస్తే బుద్ధుడి జీవితంలో ఆచరణాత్మక వ్యక్తిత్వ విశిష్టత కనిపిస్తుంది.
''నాకు పిచ్చెక్కించే వారూ, నా గుండెలు చీల్చేవారు, నా రెండు కాళ్ళుపట్టి, గిరగిరా తిప్పి ఆవలి ఒడ్డుకు విసిరేవారూ ఈ ప్రపంచంలో ఎవరో ఉన్నారని నేననుకోను'' అని అన్నాడు బుద్ధుడు. అళవాకుడనే వాడు బుద్ధుణ్ణి సవాల్ చేసినప్పుడు, అతనిని ఉద్దేశించి బుద్ధుడు నిబ్బరంగా చెప్పిన సమాధానం - అది! ఆ మాటలు ఆయన అచంచల విశ్వాసాన్ని తెలియజేసేవిగా ఉన్నాయి. నిరంతర అప్రమత్తతను బోధిస్తూ సాగిన తధాగతుడి ఆఖరి మజిలీ 'పావ' - అనే గ్రామం. వృద్ధాప్యంతో చిక్కి శల్యమైన శాక్యముని అక్కడి నుంచి కుశీనగరానికి అతికష్టం మీద చేరుకున్నాడు. కుశీనగరం నేపాల్ తూర్పు ప్రాంతంలో ఉంది. ఆఖరి క్షణాల్లో కూడా సుబుద్ధుడు - అనే అతనికి ధర్మ బోధ చేసిన తధాగతుడు, బిసిఈ 483వ సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజున కన్నుమూశాడు. ఆ సన్నివేశం పాళీ గ్రంథంలో ఇలా వర్ణించబడి ఉంది. ''సూర్యుడు పగలు మాత్రమే ప్రకాశిస్తాడు. చంద్రుడు రాత్రివేళలో మాత్రమే కాంతినిస్తాడు. యోధుడు సాయుధుడై ఉన్నప్పుడే ప్రకాశిస్తాడు. కానీ బుద్ధుడు రాత్రీ పగలు కేవలం తన ఆలోచనలతోనే వెలుగులిస్తాడు. బుద్ధుడు ఈ విశ్వానికి నిరంతరం వెలుగులు పంచుతున్నాడు గనకనే, ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా, కోట్ల కోట్ల మంది జన్మిస్తూ ఉన్నా - ఆయన ఇప్పటికీ శిఖరాయమానంగానే ఉన్నాడు. బుద్ధుడు తన శిష్యులకు చెప్పిన ఆఖరు మాటలు ఇలా ఉన్నాయి.. ''అన్ని మిశ్రమ పదార్థాలూ నశించక తప్పదు. అలాగే నేనూ నశిస్తున్నాను. జ్ఞానం పొందడి. మీ నిర్వాణాన్ని మీరే శ్రద్ధతో సాధించుకోండి!''
భారతదేశ సామాజిక వ్యవస్థలో రెండు ముఖ్యాంశాలున్నాయి. 1. కుల వ్యవస్థ 2. మత పరమైన అపరిశుద్ధత. పుట్టుకతోనే కొందరిది ఎక్కువ హౌదా, మరికొందరిది తక్కువ హౌదా కావడం. ఏరకంగా చూసినా ఇది అజ్ఞానంలోంచి, మూర్ఖత్వంలోంచి చేసిన విభజనగా కనిపిస్తుంది. ఈ అజ్ఞానంలోంచి, మూర్ఖత్వంలోంచి దేశానికి, సమాజానికి విముక్తి అక్కరలేదా? ఆలోచించాలి. మధ్య యుగాల యూరప్ ఏదో కారణంగా బయటపడుతూ వచ్చింది. భారతదేశమే ఇంకా బయటపడలేకపోతుంది. అందుకే నేటి తరం సంసిద్ధం కావాలి. మత మౌఢ్యాన్ని ఎదుర్కోవాలి. దేవుడి పేరుతో, మతం పేరుతో సంస్కృతి సంప్రదాయాల పేరుతో చేసే రాజకీయాల్ని మట్టి కరిపించాలి. సమాజాన్ని ఒక నూతన వైజ్ఞానిక ప్రగతిశీల సమాజంగా రూపుదిద్దుకోవాలి. ఈనాటికీ అనేక దేశాల్లో మనిషి పుట్టుకే అతని విధిని నిర్ణయిస్తోంది. పేదరికంలో పుట్టినవారు దు:ఖంలో ఉన్నారు. ఆ దు:ఖ నివారణకు నేడు 'బౌద్ధులు' కృషి చేయాల్సిన అవసరం ఉంది. పుట్టుకతో వచ్చే వివక్ష పోయేందుకు, నిర్మూలించేందుకు న్యాయబద్దమైన ప్రభుత్వ స్థాపన అవసరం. సమ సమాజ స్థాపన కోసం వైజ్ఞానిక దృక్పథంతో పనిచేసే యంత్రాంగం, వ్యవస్థలు మనకు అవసరం. అందుకు బౌద్ధ ధమ్మ జ్ఞానం, నైతికత అత్యవసరం అవుతోంది. మనుషుల్ని విభజించే నిచ్చెనమెట్ల కుల సమాజం అవసరమా? దాన్ని తోసిపుచ్చి, మన మంతా ఒక్కటే అనే మానవీయ విలువలతో నడిచే సమాజం అవస రమా? తీవ్రంగా ఆలోచించుకునే సమయం వచ్చేసింది!
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహిత్యవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహరాజు