Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆపత్కాలంలో ప్రభుత్వం - ప్రతిపక్షం అనే వ్యత్యాసం లేకుండా కలసి ప్రజలకు అవసరమైన సహాయ చర్యలకు ఉపక్రమించినప్పుడే పార్టీలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది. గత ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహామ్మారి ప్రజలను పట్టి పీడిస్తున్నది. చిన్న, పెద్ద, కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని వ్యవస్ధలను నాశనం చేస్తున్నది. రెండో దశ (సేకండ్ వేవ్) కరోనా ఉహించని విధంగా విజృంభిస్తున్నది. ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. హస్పటల్‌కి పోయినవారు తిరిగివస్తారనే భరోసా లేకుండా పోయింది. ఇటువంటి సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పి వారిలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉంది. రాజకీయాలు, విమర్శలు, ఆరోపణలు పక్కకు పెట్టి తమ వంతు కర్తవ్యాంగా ప్రజల్లోకి వెళ్ళి వారికి అవసరమైన సహాయ చర్యలు పార్టీ యంత్రాంగం ద్వారా అందించినప్పుడే రాజకీయాలపై, రాజకీయ పార్టీలపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పటిదాకా లాక్డౌన్ కాలంలో చాల మంది వ్యక్తులు, సంస్థలు, సంఘాలు తమ దాతృత్వం ప్రదర్శించి మానవత్వం అనేది ఇంకా బతికే ఉందని చాటి చెప్పారు. కానీ ఇప్పుడు కరువులో ఉన్నవారికి అన్నం కంటే.. కరోనా పాజిటివ్ పేషంట్స్‌కి సహాయం అందించడం అనేది సవాల్‌గా మారింది. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులలో బెడ్స్ లేకపోవడం, అక్సిజన్ వంటివి సకాలంలో అందకపోవడంతో అంబులెన్స్‌లోనే అంత్యక్రియలకు వెళుతున్న ఘటనలు కోకోల్లలు. ఇవన్నీ ఒక వైపు అయితే హైదరాబాద్ వంటి మహానగరంతో పాటు.. రాష్ట్రంలోని వివిధ పట్టణ ప్రాంతాల్లో ఇండ్లలో అద్దెకు ఉండే వారికి, ఉమ్మడి కుటుంబాల్లోని వారికి పాజిటివ్ లక్షణాలు వస్తే చాలు కుటుంబం మొత్తం హాడలిపోతుంది. ఇంటి యాజమాని ఒక రకమైన భయంతో వారి పట్ల ఒకలా వ్యవహరిస్తే.. కుటుంబ సభ్యులు మరోలా వ్యవహారిస్తున్నారు. వీరు హౌమ్ ఐసోలేషన్‌లో పెట్టుకునే పరిస్థితిలేక, హస్పటల్స్లో బెడ్స్ సంపాదించి ఖర్చుపెట్టే స్థోమత లేక అందోళకు గురవుతున్నారు. ఇటువంటి సమయంలో రాజకీయ పార్టీగా అన్ని పార్టీల కంటే సీపీఐ(ఎం) ఒక అడుగు ముందుకు వేసింది. దేశ వ్యాప్తంగా తమ పార్టీ, అనుబంధ సంఘాల కార్యాలయాలన్నింటిని ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చి అందరికీ ఆదర్శంగా మారింది. నగరంలోని సుందరయ్య విజ్ణాన కేంద్రంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కార్యాలయాలు, సంఘాల కార్యాలయాలన్నింటినీ ఐసోలేషన్ సెంటర్లుగా మార్చి రోగులకు ఉచితంగా సేవలందిస్తున్నారు. రక్త సంబంధీకులే దగ్గరకు వెళ్ళాలంటే బయపడుతున్న నేపథ్యంలో స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే వాలంటీర్లుగా పేషేంట్స్‌కి సేవలు అందించడం అభినందనీయం. అయితే కమ్యూనిస్టులకు ఇవేవి కొత్త కాదు. నిత్యం ప్రజా క్షేత్రంలో ప్రభుత్వ విధానాలపై అలుపెరుగని పోరాటంలో ఉండే వారికి ఈ సేవలు మరో కోణం. నాడు దీవి సీమ ఉప్పెన నుంచి నేటి కరోనా మహమ్మారీ వరకు ప్రజలెప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా అందరికంటే ఒక అడుగు ముందు మేమున్నాం అంటూ.. తమకున్న వనరులు, శక్తి అంతా కూడదీసుకునీ మిగతా వారికి స్ఫూర్తినిచ్చేలా ప్రజాసేవకు అంకితమవ్వడం వారి నైజం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటరీ విధానానిది అత్యంత కీలకపాత్ర. ఈ పార్లమెంటరీ విధానాన్ని నిర్వహించేది, ప్రభుత్వానికి బాధ్యత వహించేది రాజకీయ పార్టీలు. ప్రభుత్వాన్ని ఎన్నుకునేది, ఆ పార్టీలను గెలిపించేది ప్రజలు. కాబట్టి రాజకీయ పార్టీలకు ప్రజలే కేంద్రంగా ఉండటం ప్రాధాన్యత కలిగిన అంశం. సాధారణంగా పార్టీలు అధికార-ప్రతిపక్షాలుగా ఉంటాయి. అయినప్పటికీ పార్టీ కార్యాలయాలను ఎప్పుడూ ఒకే కోణంలో రాజకీయ ఎత్తుగడల కేంద్రాలుగా, పోరాట వ్యూహాలకు నెలవుగా మాత్రమే కాకుండా ప్రజల కోసం పార్టీలు అనే విధంగా మారిస్తే ప్రజలకు రాజకీయ వ్యవస్థపై, రాజకీయా పార్టీలపై విశ్వాసం పెరుగుతుంది. ప్రత్యేకించి ఇటువంటి సంక్షోభ సమయాల్లో రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు స్వయంగా రంగంలోకి దిగినప్పుడే ప్రజలు ధైర్యంగా ఉండగలుగుతారు. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో ప్రతి అంశాన్ని రాజకీయ లబ్దికోసమే ఉపయోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తామే అంతా సవ్యంగా చేశామని చెప్పుకునే ప్రయత్నంలో ప్రభుత్వాన్ని నడిపే అధికార పార్టీ, మా ఒత్తిడి వల్లే ప్రభుత్వం దిగివచ్చి నిర్ణయం తీసుకుందని ప్రచారం చేసుకునేపనిలో ప్రతిపక్షాలు ఉండటం భాధాకరమైన విషయం. ఈ విపత్కర పరిస్థితుల్లో తన, మన భేదాలు మరిచి అధికార, ప్రతిపక్షాలు కలసి ప్రజల కోసం పని చేయాలనే అలోచనతో అడుగులు వేసిన కేరళ రాజకీయాలు దేశానికి ఆదర్శం కావాలి. ఇప్పటికైనా ఒక్క కమ్యూనిస్టులే కాకుండా లక్షాలాది కార్యకర్తలు కలిగిని ప్రతిపార్టీ రంగంలోకి దిగి ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం-ప్రతిపక్షం అనే తారతామ్యం లేకుండా వ్యవహరించాలి. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆదుకునేందుకు తమ పార్టీ కార్యాలాయల్లో కూడా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలచి అండగా ఉండాలి. అప్పుడే ఈ పోలిటికల్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలిపోకుండా ఉంటుంది. ప్రజల మేలు కోరే నిజమైన పార్టీలుగా ప్రజల ఆదరణ పొందవచ్చు.
- రాజు కలుకూరి
సెల్: 9676956966