Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం మెజారిటీ తీర్పుతో మళ్లీ ఎన్నికైంది. అనేక కోణాల్లో ఇది చాలా ముఖ్యమైన, చారిత్రక విజయం. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మొదటి అంశమేమంటే, ప్రస్తుతమున్న ప్రభుత్వమే రెండోసారి అధికారంలోకి రావడం 1977 తర్వాత కేరళలో ఇదే మొదటిసారి. 1957లో కేరళలో మొదటిసారి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆధునిక కేరళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ నేతృత్వంలో మొదటిసారి ప్రభుత్వం ఏర్పడింది. 29 మాసాల తర్వాత ఈ ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసింది. 1967లో వామపక్షాల నేతత్వంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కూడా తన పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయింది. 1980 ఎన్నికల తర్వాత ఇ.కె.నయనార్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం కూడా స్వల్పకాలమే వుంది. 1987, 1996, 2006ల్లో ఎల్డీఎఫ్ ప్రభుత్వాలు మాత్రమే పూర్తి పదవీకాలాలు పనిచేశాయి. కానీ అవేవీ కూడా తిరిగి ఎన్నికవలేదు. ఈ ధోరణికి స్వస్తి చెప్పి 2016లో ఎన్నికై అధికారంలోకి వచ్చిన పినరయి విజయన్ ప్రభుత్వం మళ్లీ రెండోసారి ఇప్పుడు కూడా గెలుపొంది చరిత్ర సృష్టించింది.
ఇక ఈ ఎన్నికల్లో రెండో ముఖ్యమైన అంశమేమంటే గత ఎన్నికల కన్నా ఈసారి మరింత భారీ మెజారిటీతో ఎల్డిఎఫ్ ప్రభుత్వం విజయం సాధించింది. 2016లో 140 సీట్లకు గానూ ఎల్డీఎఫ్ 91సీట్లను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో 99సీట్లను కైవసం చేసుకుంది. అంటే మొత్తం సీట్లలో 71శాతం సీట్లను గెలుచుకుందన్నమాట. అంటే మూడింట రెండు వంతుల మెజారిటీ. పైగా, ఎల్డీఎఫ్కి ప్రజా మద్దతు కూడా బాగా వుంది. 2021లో పోలైన మొత్తం ఓట్లలో 45.3శాతం ఓట్లు వచ్చాయి. 2016లో 43.3శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. జనాభాలోని అన్ని వర్గాల మద్దతును ఎల్డీఎఫ్ పెంచుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు ఓట్ల వ్యాపారం చేయకపోతే ఈ విజయం స్థాయి మరింత ఎక్కువగా వుండేది. కనీసం పది స్థానాల్లో, బీజేపీ నుంచి బదిలీ అయిన ఓట్లతో యుడిఎఫ్ గెలుపొందింది.
ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ పట్ల వామపక్షాల దార్శనికతతో రూపొందిన రాష్ట్ర అభివృద్ధి నమూనా ఈ ఎన్నికలో గుర్తించదగ్గ మూడో అంశం. ఎల్డీఎఫ్ ప్రభుత్వం అమలు చేసిన ఈ నమూనాకు ప్రజల్లో విస్తతంగా ఆమోదం లభించింది. భారత ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన తర్వాత పంచవర్ష ప్రణాళికలు, వార్షిక ప్రణాళికల క్రమాన్ని కొనసాగించేది దేశంలో కెల్లా కేవలం కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం మాత్రమే. సామాజికాభివృద్ధి ముఖ్యంగా ప్రభుత్వ విద్య, ప్రజారోగ్యం, సామాజిక సంక్షేమం, సామాజిక న్యాయంతో కూడిన రాష్ట్ర వారసత్వాన్ని మరింత బలోపేతం చేసేలా విధానపరమైన చట్రపరిధిని రూపొందించింది. మానవ వికాసానికి సంబంధించిన ఈ రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలను బలోపేతం చేస్తూనే...మరోపక్క ఈ విజయాలనే పునాదిగా వినియోగించి కొత్త ఉపాధి అవకాశాలు (ముఖ్యంగా యువతకు) సృష్టించాలని... మౌలిక సదుపాయాలు నిర్మించాలని నిర్ణయించింది. దేశంలో ప్రభుత్వ విద్య, ప్రజారోగ్య వ్యవస్థ వంటి రంగాలను ప్రయివేటీకరించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆ రంగాలను రాష్ట్రంలో బలోపేతం చేయడం ఇక్కడ కీలకమైన అంశంగా గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆర్థిక వనరుల కొరత ఎదుర్కొంటున్నా కెఐఐఎఫ్‌బి (కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధి బోర్డు) వంటి సంస్థ ద్వారా ఎల్డీఎఫ్ ప్రభుత్వం వనరులను సమీకరించిన తీరు, వాటితో మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం కూడా ఇక్కడ గమనంలోకి తీసుకోవాల్సిన అంశమే. ప్రణాళిక, అభివృద్ధి క్రమంలో ప్రజా ప్రాతినిధ్యం పాత్ర, స్థానిక ప్రభుత్వ సంస్థలు పోషించిన పాత్ర ఈ రెండూ అభివృద్ధి విధానంలో కీలకాంశాలే. లౌకికవాదం పట్ల ఎల్డీఎఫ్ ప్రభుత్వం దృఢమైన నిబద్ధతను ప్రదర్శించింది. మతోన్మాద శక్తుల పట్ల రాజీ లేని ధోరణిని ప్రదర్శించింది. చివరగా, రాష్ట్రంలో సంభవించిన వరుస ప్రకృతి వైపరీత్యాలను పినరయి విజయన్ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగింది. 2017లో ఓఖి తుపాను, ఆ తర్వాత కుండపోత వర్షాలు, 2018, 2019ల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడడం, 2018లో నిఫా వైరస్ విజృంభణ, 2020-21లో కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడం వరకు - వీటన్నింటిలోనూ భిన్నమైన తీరును, పాలనాపరమైన నాణ్యతను ప్రదర్శించింది.
ప్రజలకు సంబంధించినంత వరకు, తమ జీవితాలను, జీవనోపాధులను ప్రభావితం చేసే సంక్షోభాలను ప్రభుత్వం ఎంత సమర్ధవంతంగా పరిష్కరించిందన్నదే చూస్తారు. అదే ప్రభుత్వానికి పరీక్ష వంటిది. ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఈ పరీక్షలో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. ఎల్డీఎఫ్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, బీజేపీలపై పోరు సల్పింది. ఈ రెండు శక్తులు ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో విషపూరిత ప్రచారాన్ని సాగించాయి. ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీపీఐ(ఎం)ని అప్రతిష్టపాల్జేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపడంతో సహా నైతిక విలువలకు తిలోదకాలిచ్చే పలు ప్రయత్నాలు చేపట్టాయి. 1980లో వామపక్ష సంఘటనకు వ్యతిరేకంగా ప్రారంభమైన యూడీఎఫ్ ఇప్పుడు రాజకీయంగా మరో మార్గం లేని, కానరాని దశకు చేరుకుంది. వాగాడంబరమైన వ్యాఖ్యలు చేస్తూ, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టిన బీజేపీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను చవిచూసింది.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యక్తిత్వం, ఆయన పోషించిన పాత్ర వల్లనే ఈ విజయమంటూ ఈ చారిత్రక విజయం స్థాయిని తగ్గించడానికి మీడియాలోని కొన్ని వర్గాలు, కొంతమంది రాజకీయ వ్యాఖ్యాతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం, పార్టీలపై ఒక వ్యక్తి ఆధిపత్యంగా వారు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ విధానాల రూపకల్పనకు రాజకీయ మార్గనిర్దేశాన్ని అందించడంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజా ప్రయోజనాలే సదా ఆయన దృష్టిలో ఉండేవి. రూపొందించిన విధానాలు అమలయ్యేలా చూడడంలో పాలనాపరమైన సామర్ధ్యాన్ని ప్రదర్శించారు. అయినప్పటికీ, ఈ విజయం అనేది వ్యక్తిగత, సమిష్టి కృషి ఫలితమే అని చెప్పాలి. సీపీఐ(ఎం), ఎల్డీఎఫ్కి సంబంధించినంత వరకు రాబోయే మంత్రివర్గం కూడా సమిష్టి కృషి, వ్యక్తిగత బాధ్యత అనే సాంప్రదాయాన్ని కొనసాగించాలి.
గత ఐదేండ్లుగా చాలా ప్రతికూలమైన రాజకీయ వాతావరణంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం పనిచేయాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా మితవాద దాడులు పెరుగుతూ వచ్చాయి. వామపక్షాలకు పెట్టనికోటగా ఉండే పశ్చిమ బెంగాల్, త్రిపురలో వామపక్షాలు పరాజయం పాలయ్యాయి. పార్లమెంట్లో ఎన్నడూలేని రీతిలో వామపక్షాల ప్రాతినిధ్యం తగ్గిపోవడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక గత ఏడాదైతే మితవాద, కమ్యూనిస్టు వ్యతిరేక పార్టీలు ప్రభుత్వాన్ని దిగ్బంధించేశాయి. అయినా కూడా ఎల్డీఎఫ్ ప్రభుత్వం తన ప్రజానుకూల అభివృద్ధి కార్యక్రమాల అమలును కొనసాగించింది.
ఎల్డీఎఫ్ ప్రభుత్వం తిరిగి ఎన్నికవడం దేశంలో నేడు వామపక్షాల ప్రాధాన్యతను సరైన సమయంలో గుర్తు చేసింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వం అనుసరించే విధానాలు నయా ఉదారవాద హిందూత్వ ఎజెండాకు అత్యంత కీలకమైన ప్రత్యామ్నాయాన్ని చూపిస్తాయి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, కేరళను మరింత మెరుగైన సమాజంగా తీర్చి దిద్దేందుకు కొత్త ఎల్డీఎఫ్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆ ప్రభుత్వానికి దేశంలోని అన్ని ప్రజాతంత్ర, లౌకికశక్తుల శుభాకాంక్షలు, మద్దతు ఉంటాయి.
- 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం