Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిస్థితులు అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మన వైఫల్యాలు బయటపడవు.. ఒకవేళ బయటపడ్డా వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఈ సూత్రం మన పాలకులకు ఇప్పుడు బాగా వర్తింస్తుందనుకోవచ్చు. ఇప్పటిదాకా ఉచిత స్కీమ్లు, పథకాల పేరుతో ఓట్లు దండుకుంటూ కాలాన్ని నెట్టుకొస్తున్న ప్రభుత్వాల అసలు రంగును కరోనా బయట పెడుతూ వస్తున్నది. దీంతో పాలనాధీశుల వైఖరులు, ప్రజల పట్ల వారి చిత్తశుద్ధి కలుగులోని ఎలుకలాగా ఒక్కోటి బహిర్గతమవుతున్నది. మొన్నటిదాకా దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా... మతం పేరిట, సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ పేరిట ఉద్రిక్తతలు సృష్టించి, తద్వారా ఎలక్షన్లలో గట్టెక్కిన బీజేపీ పప్పులు... తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉడకలేదు. కోవిడ్ సమయంలో దేశాన్ని గాలికొదిలేసి... జనాల ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా ఎన్నికలే తమకు లక్ష్యమనే విధంగా వ్యవహరించిన కమలనాథులకు... ఓటర్లు కర్రు కాల్చి వాతపెట్టారు. అయినా గుణపాఠం నేర్వని బీజేపీ... దేశం ఎటన్నా పోనీ, జనాలు ఏమైనా ఫరవాలేదు, ఎంత డబ్బు ఖర్చయినా ఫరవాలేదు... కానీ ఢిల్లీలో నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా (కొత్త పార్లమెంటు భవనం) పనులు ఎంతమాత్రమూ ఆగొద్దనే విధంగా వ్యవహరించటం మన పాలకుల దుర్నీతికి ప్రత్యక్ష ఉదాహరణ. భారత్లో కరోనా మరణాల గురించి అంతర్జాతీయ మీడియా కన్నీరు పెట్టుకుంటూ కథనాలు రాస్తున్నా... 'నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు...' అనుకుంటున్న కేంద్రాన్ని ఈ దేశం క్షమించదు గాక క్షమించదు. ఇక అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు... మన రాష్ట్రంలో గులాబీ దళపతి కూడా బీజేపీకి ఎంతమాత్రమూ తగ్గొద్దన్నట్టు... గతేడాది కరోనా మొదటి దశలోనే బ్రహ్మాండంగా ఉన్న పాత సచివాలయాన్ని ఆఘమేఘాల మీద కూల్చేశారు. విశాలమైన ఆ భవనాలను ఇప్పటికిప్పుడు కూల్చొద్దు మొర్రో అంటూ ప్రతిపక్షాలు నెత్తీనోరూ బాదుకున్నా మన సీఎం సాబ్ వినలేదు. ఆ బిల్డింగులను కరోనా ఐసోలేషన్ సెంటర్లుగా మార్చడం ద్వారా కోవిడ్ సోకిన వేలాది మంది పేదలను ఆదుకోవచ్చంటూ వైద్య నిపుణులు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. పైగా రెండో దశ విజృంభించిన ప్రస్తుత తరుణంలోనూ మన సారు దృష్టంతా కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపైన్నే ఉంది. ఢిల్లీలో ప్రధాని మోడీ సెంట్రల్ విస్టాకు ధీటుగా హైదరాబాద్లో కూడా మనమూ సెంట్రల్ విస్టా (నూతన సచివాలయం) యమ స్పీడుగా కంప్లీట్ చేయాలనే తాపత్రయంతో ఉన్నారు సీఎం సాబ్... వీళ్ల వైఖరి మారేదెన్నడో...
- బి.వి.యన్.పద్మరాజు