Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వింటే రామాయణమంతా, చెప్పితే మహాభారతమంతా అన్నట్టు కరోనా కష్టాలు చెప్పనలవిగానివి. తుమ్మితే, దగ్గితే, జలుపు చేస్తే, చివరకు చీమిడికారితే కూడా అవి కరోనా లక్షణాలే అన్నంతగా జనం గజగజ వణికిపోతున్నారు. ప్రసార సాధనాల్లోనూ మరణాలను పదేపదే చూపించడంతో భయాందోళనలకు గురి అవుతున్నారు. సర్వసాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులు సైతం కరోనా రోగ లక్షణాలను డామినేట్ చేస్తున్నాయి. కరోనా పరీక్షల కోసం గంటలకొద్ది క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తుంది. జర్వమెస్తే క్యారంటైన్ కష్టాలు. ఆస్పత్రిలో పడకలు పడకేశాయి. ఊపిరి అందక గాలి కష్టాలు. ఆయాసం ఎక్కువై, శ్వాసలో ఇబ్బందులు తలెత్తితే ఇంజక్షన్లు కరువు. ఇవన్నీ దాటుకుంటూ పోతే సరేసరి. లేకపోతే ఏకంగా ఊపిరి గాలిలో కలిసిపోతుంది. ఆ తర్వాత అంతిమ సంస్కారాల కోసం శ్మశానాల్లో జాగా దొరకడం మరీ కష్టం. శవాన్ని కాల్చేందుకు కట్టేలూ కరువే. బతికుంటే సేవలు చేయలేరు. చనిపోతే తాకలేరు. ముఖాన్ని చూడలేరు. దగ్గరికి రాలేరు. కడచూపుకు నోచుకోలేరు... మనిషన్నవాడు పడే కష్టాలేనా? ఇవి. ఈ కష్టాల కడలి నుంచి బయటపడేందుకు కొంత మంది సొంత వైద్యమనే నీతులు వల్లిస్తున్నారు. అసలు వైద్యం ఎందుకు అందలేదో, అందుకు బాధ్యులెవరో చెప్పకుండా ధర్మోపన్యాసాలు ఇస్తున్నారు మహాపండితులు. ప్రపంచంలో కొన్ని దేశాలు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొని ముందడుగేశాయి. మన దేశంలో మాత్రం రోమ్ నగరం తగులబడిపోతుంటే... ఫిడేలు వాయించి నట్టుగా ఉంది కేంద్ర ప్రభుత్వ తీరు. అంతా బంతిలో కూర్చున్నాక, విస్తరాకులు కుట్టేందుకు పుల్లల కోసం వెతికినట్టు మోడీ ప్రవర్తన ఉంది. చివరకు 'మోడీగారు మీరు దిగిపోండి' అంటూ నెటిజన్లు తిరగబడే రోజులొచ్చాయి. అయినా అన్ని వదిలేసిన వాడికి గోచిగుడ్డతో ఏం పని అన్నట్టున్న సర్కారు తీరు మనల్ని ఆశ్యర్యానికి గురి చేస్తున్నది.
- గుడిగ రఘు