Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవయువకులే కలసి / చేయి చేయి కలిపి / ప్రగతికై పోరాడితే.. రాకుండునా సమ సమాజం.. / పోకుండునా బానిసత్వం...
- దశాబ్దాలుగా పాడుకునే అభ్యుదయ గీతం ఇది. వాస్తవం కూడా. ఏ దేశ ప్రగతికైనా, భవితకైనా యువశక్తే ఆయువు పట్టు.
ప్రపంచంలో మరేదేశంలో లేనంతగా యువశక్తి మన భారతదేశంలోనే ఉన్నది. అదే సందర్భంలో మరే దేశంలో లేనంతగా యువశక్తి నిర్వీర్యమైపోతున్నదీ మనదేశం లోనే. కారణం మన పాలకుల వద్ద సరైన 'యువ..నవ' ప్రణాళికలు లేవు. యువతకుచెందిన బలమైన శక్తి సామర్థ్యాలను సమర్థవంతంగా వినియోగించుకునే రీతిలో ఎప్పటికప్పుడు నిత్యనూతన విధి విధానాలను రూపొందించలేకపోతున్నారు. అందుకే బంగారంలాంటి యువత నానాటికి నిరుద్యోగ ఊబిలోకి కూరుకుపోతున్నది. భయంకరమైన నిస్తేజానికి గురవుతున్నది. కరోనా నేపథ్యంలో ఇది మరింత తీవ్రంగా పరిణమిస్తున్నది.
గడచిన ఒక్క ఏప్రిల్ మాసంలోనే 70లక్షల మందికిపైగా ఉపాధి అవకాశాలు కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటర్ ఇండియన్ ఎకానమి సంస్థ (సి.ఎం.ఐ.ఈ) నివేదించింది. దీంతో నిరుద్యోగ శాతం ఎనిమిదికి పెరిగింది. కరోనా కారణంగా కర్ఫ్యూలు, లాక్డౌన్ల వలన పరిస్థితి మరింత విషమించినట్టు వేరుగా చెప్పక్కర్లేదు. గత ఏడాది నుంచి విద్యారంగం కుదేలైన విషయమూ తెలిసిందే.
మొత్తం మీద గత ఏడాది నుంచి కరోనా కారణంగా ఒకకోటి 26లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. గత ఏడాది 8.59కోట్ల మంది ఉద్యోగులు ఉంటే, ఇప్పుడు 7.33కోట్ల మందే ఉన్నారు.
ఉద్యోగాలు కోల్పోయిన వారిలో నూటికి 68మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే, 32 మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. కుటుంబాలను పోషించుకోలేని వీరి బాధలు వర్ణనా తీతం.
ఉద్యోగావకాశాలను భయంకరంగా దెబ్బతీసిన ఈ కరోనా 'అడ్డుకట్ట' వచ్చే ఏడు కూడా కొనసాగవచ్చని సి.ఎం.ఐ.ఈ. కుండ బద్దలు కొట్టింది.
ఇది నాణానికి ఒకవైపే. మరోవైపు..ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వేత్తలు మనదేశాన్ని 'యువ భారతం' (యంగ్ ఇండియా)గా పిలుస్తున్నారు.
15-24 సంవత్సరాల వయస్సు ఉన్న వారిని యువతగా గుర్తించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ.) పేర్కొన్నది. మన కేంద్ర ప్రభుత్వం 13-35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిని యువతగా గుర్తించింది. అంటే ప్రస్తుతం మన జనాభాలో 65శాతం మంది యువతే.. దాదాపు ప్రతి ముగ్గురిలో ఇద్దరు యువత ఉన్నారు. ఇది ఎంత గొప్ప మానవ వనరుల సంపద. నేడు సగటు భారతీయుని వయసు 29సంవత్సరాలు. ఇదిమనకు గర్వకారణం.
ఏ విపత్తునైనా ఎదుర్కొని తట్టుకోగలిగే దృఢమైన (శారీరక) భౌతికశక్తి మన భారత యువతకు ఉన్నది. ఎప్పుడు..? సక్రమరీతిలో పెట్టినప్పుడు. ఉక్కును కరిగించే కండరాలు, నరాలు పొంగే ధీరత్వం మన యువశక్తి సొంతం కావాలని వివేకానందుడు భావించాడు.
అయితే అందుకు అందవలసిన శాస్త్రీయ విజ్ఞానం నేటికీ మన భారతయువతకు అందకుండా పోతున్నది. 74ఏండ్ల స్వతంత్ర భారతావనిలో కల్పించిన విద్యావిధానం యువతను కేవలం వ్యక్తిగత ఆర్థిక ప్రగతివైపు నెట్టింది. లేదా వారి ఆధునిక భౌతిక అవసరాలు తీర్చేటందుకు పరిమితమైంది. సమగ్ర వికాసం వైపు నడపడంలో వైఫల్యం చెందింది.
ప్రకృతి పరిరక్షణ, సామాజిక బాధ్యతవైపు ఆలోచించే దిశగా విజ్ఞానాన్ని ఏ ప్రభుత్వమూ యువతకు అందించలేక పోయింది. ఈ పరుగు పందెంలో పెట్టుబడిదారీ విద్యావ్యవస్థ పక్కవాణ్ణి పట్టించుకోనవసరం లేదనే అమానవీయ దృక్పథానికి తెరదీసింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు ప్రపంచీకరణ దోపిడీ విధానాలు అవినీతిని తారాస్థాయికి పెంచాయి.
కరోనా విషమస్థితిలో ఇదే చేదు నిజాన్ని ఇప్పుడు మనం చవిచూస్తున్నాం. చాలా మంది పాలకుల్లో, అధికారుల్లో కరుడుగట్టిన పాషాణత్వాన్ని గమనించగలుగుతున్నాం.
అయితే కరోనా అనంతరం ప్రధాన జనజీవన స్రవంతిలో కచ్చితంగా ప్రాధాన్యతలు మారతాయి. యువత మీద కేంద్రీకరణ పెరుగుతుంది.
ఇప్పటికే దాహం వేసినప్పుడే బావులు తవ్వుకోవాలనే ప్రాప్తకాలజ్ఞతకు స్వస్తిపలకాలని కోరుతున్నారు. విగ్రహాలకు ఆరాధన స్థలాలకు, సెంట్రల్ విస్టాలకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టేకన్నా ప్రజల ప్రాణరక్షణకు అవసరమయ్యే వైద్య చర్యలు చేపట్టమని డిమాండ్ చేస్తున్నారు.
ఎక్కడ ఏ విపత్తు సంభవించినా అక్కడ ఆ యువత ప్రాణాలకు తెగించి సేవా కార్యక్రమాల్లో నిమగం కావడం సర్వకాలీన సార్వజనీయ సత్యం. కాగ్నిటెవ్ ఇమ్యూనిటీవ్ ఫోర్స్ (సానుకూల సహజమైన వ్యాధి నిరోధక శక్తి) పెంపొందించేలా విద్యావిధానంలో హేతువాద దృక్పథాన్ని (రేషనల్ థింకింగ్‌ను) ప్రవేశపెట్టాలి. అప్పుడు యువత శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక సామాజిక ఆరోగ్యాన్ని దృఢంగా పొందగలరు. సంకుచిత వ్యక్తిగత అభివృద్ధి దృష్టినుంచి దేశ ప్రగతికి నడుం గడతారు. శాస్త్రజ్ఞులు ఇదే చెపుతున్నారు.
కరోనా వంటి మహమ్మారులను మున్ముందు తట్టుకునేలా దేశం యావత్తును సన్నద్దం చేయాలంటే ముందుగా యువతను సిద్ధం చేయాలి. దేశరక్షణకు సైన్యంలా ప్రజల ప్రాణరక్షణకు బేర్ ఫుట్ డాక్టర్స్ (వైద్య కార్యకర్తలు) ఎల్లెడలా అవసరం అని అంటున్నారు. ఆ ఓర్పు, నేర్పు, సేవాగుణం, చాకచక్యం, నైపుణ్యం అన్నింటికీ మించి హేతువాద దృక్పథాన్ని వారికి అందించాలి. శాస్త్రీయత పునాదిగా వారిని తీర్చిదిద్దాలి. అప్పుడు ఈ దేశం నాది. ఈ ప్రజలు నావారు అన్న కర్తవ్య నిష్టతో కదులుతారు. ఆత్మస్థైర్యంతో వెలుగొందుతూ ప్రజాసేవలో దేశ సేవలో నిమగమవుతారు.స్వయం ఉపాధిని కూడా పొందుగలుగుతారు.
హేతువాదము లేనిదే నితిజనతకు రాదురా.. నీతి జనతకు రానిదే జాతి (దేశం) ప్రగతికి పోదురా' అని పెద్దలు అన్నది అక్షర సత్యం. ప్రభుత్వాలను ఈ సోయిలోకి తీసుకురావడం నేడు పౌర సమాజం ముందున్న కర్తవ్యం.
- కె. శాంతారావు
సెల్: 9959745723