Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''జీవితం ఎప్పుడూ చీకటి ముసుగేసుకుని
భయపెడుతూనే ఉంటుంది. నక్షత్రాలు మొలవని దారిలోనూ
వెనుకడుగేయని పాదాలు - గుండె కొమ్మపై ఆడే చిరునవ్వుతీగలు
గంపల కొద్దీ వెలుగుపూలను పూస్తాయి!'' అంటూ ఆశను చిరునవ్వు చేసుకుని తన కవితా పాదాలని ముందుకువేస్తాడు సాంబమూర్తి లండ
అవును గుండెల నిండా ఆశ, సమున్నత ఆశయమూ ఉన్నవాళ్ళకు ఆటంకాలను, ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకుపోయే బలం, సామర్థ్యం మెండుగా ఉంటాయి. మానసిక బలం భౌతిక బలం కంటే శక్తివంతమైనది. మనం తప్పక విజయం సాధిస్తామనే సానుకూల దృక్పథం చాలా కీలకమైన విషయం. గెలుపుమీద విశ్వాసం అనేది నిజాయితీతో మనం చేసే ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. ఆశలూ ఆశయాలు లేనివాళ్ళవి ఆగిపోయిన జీవితాలు. బలాలను కూడదీసుకుని ముందుకు పోవటమే మనం చేయాల్సింది.
జీవితం ఎప్పటికీ ఓ సవాలు. ఎలా ఎదుర్కోవాలో అనుభవం ద్వారా తెలుసుకోవాలి. చిక్కులు పడ్డ దారాన్ని చిన్నగా మెలకువతో తీసినట్టుగానే జీవితమూను. ప్రకృతి సిద్ధమైన సవాళ్ళు ఉంటాయి. పరిణామ క్రమంలో మానవుడు ఒక్కొక్కటీ జయిస్తూ వస్తున్నాడు. లేదా మనుషులు, ప్రత్యర్థులు, ప్రభుత్వాలు, అధికారము కలిగించే కష్టాలు, సవాళ్ళూ ఉంటాయి. వాటినెలా ఎదుర్కోవడమన్నది కూడా మనదగ్గరే ఉంటుంది. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, కళ్ళెదుటే మరణాలు, మానవ సంబంధాలలో వస్తున్న మార్పులు మనల్ని కకావికలం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్య ధోరణి, బాధ్యతలేని తనమూ చూస్తూనే ఉన్నాము. అంతా నిరాశా నిస్పృహల ఆవరణం నిండిపోతున్న తరుణంలోనూ ఆశకు, వెలుగుకూ బోలెడంత జాగా కనపడుతూనే ఉంది. మనం చూడాలి. అటువైపుగా కదలాలి. ఆలోచనలకు పదునుపెట్టాలి. అలుముకున్న చీకటిని చూసి వెలుగు లేదనుకోరాదు. ఇలాంటి సంక్షోభాల సందర్భంలోనే మనల్ని నడిపించే సరైనదారిలో ఆలోచించాలి. ప్రతికూల పరిస్థితులలోనూ అనుకూలంశాలు దాగుంటాయి. జాగ్రత్తగా వాటిని పట్టుకోవాలి. సాధారణ ప్రజలు, మధ్యతరగతి, పేదలు ఇలాంటి విపత్కర పరిస్థితులలో విపరీతమైన కష్టాలకు లోనవుతారు. కానీ ఈ పరిస్థితులే కొందరికి విపరీత లాభాలను, ధనాన్ని సమకూర్చిపెడతాయి. మోసాలు, మాయలు పెరుగుతాయి. ఎందుకంటే ఈ వ్యవస్థ లక్షణమది. ప్రభుత్వాలు ప్రజల కోసం ఉన్నాయని అమాయకంగా మనం అనుకుంటాము. కానీ అవి కచ్చితంగా ఉన్నవాళ్ళకోసమే పనిచేస్తాయి. ఆ డబ్బు ఆధారంగా అవి మనుగడ సాగిస్తున్నాయి. కనుక, ఆపదకాలాన్ని దోచుకునే కాలంగా మార్చుకోవడాన్ని చూసీ చూడనట్లే ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి.
కానీ ఇదే సందర్భంలో ఈకాలంలోనే, మొత్తం దేశానికి దీపదారిలా నిలిచిన విధానాలూ, పనితనాలు, ఫలితాలు మనకండ్లముందు కనపడుతూనే ఉన్నాయి. ప్రజలకు భరోసాను, కొండంత ధైర్యాన్ని అందించే చేతులు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడూ ఉన్నాయి. వాటిని చూసి, ఆశతో ముందుకు పోవడం, ఆ బాటను అనుసరించడం ఒకటే మన ముందున్న మార్గం. వలసకూలీలు రక్తాలు కారుతున్న కాళ్లతో తమ ఊళ్ళకు పోతున్నా కనికరంలేని వాళ్ళు వారి దగ్గరా రైలు చార్జీలు వసూళ్ళు చేసిన చేతులున్నచోటే, వలస కూలీలను 'గెస్ట్ వర్కర్స్' అతిథులుగా భావించి భోజనాన్ని వసతిని అందించిన చేతులూ ఉన్నాయి. ఒక్కరు కూడా ఆకలికి గురికావడానికి వీలులేదని ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వాలూ ఉన్నాయి. ఆపద కోసం సేకరించిన కోట్లాది రూపాయలకు లెక్కలు డొక్కలు చూపకపోగా ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తుంటే ఆ డబ్బును వెచ్చించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే మహా నికృష్ట నాయకులున్నచోటే, సొంత ఆస్తిని కూడా అమ్మేసి ఊపిరి పోయేవాళ్ళకు ప్రాణం పోస్తున్న సోనూసూద్ లాంటి మానవీయులూ ఉన్నారు.
''సంఘసేవ''కులమని ప్రగల్భాలు పలుకుతూ మనుషులను మతం పేర చంపటానికీ వెనుకాడని సమూహాలున్న చోటే, ఐసోలేషన్ క్యాంపులు పెట్టి, అన్ని సౌకర్యాలనూ ఉచితంగా అందిస్తున్న మానవీయ సమూహాలూ ఉన్నాయి. మానవతా మూర్తి అమరుడు సుందరయ్య పేరునున్న విజ్ఞాన కేంద్రమంతా ఆపదలోనున్న వారికి చేయందిస్తూనే ఉన్నది. అక్కడే కాదు, నేడు కమ్యూనిస్టు కార్యాలయాలన్నీ కోవిడ్ వైద్యాలయాలుగా బాధితులకు నీడపడుతున్నాయి. ఆశల కాగడాలై వెలుగుపూలు పూస్తున్నాయి. యువజన సంఘ కార్యకర్తలు, మహిళా సంఘ ప్రతినిధులు, విద్యార్థులు అందరూ తమ వంతు సేవకు పూనుకుంటున్నారు. మరోవైపు ఉచితంగా వైద్యాన్ని అందిస్తామని ముందుకు వస్తున్న ప్రజావైద్యులూ ఉన్నారు. ఉదారంగా ఆర్థిక సహాయాన్ని అందించే దాతలూ ఉన్నారు.
ఆప్యాయంగా పలకరించేవాళ్ళు, మాట సహాయం చేసేవాళ్ళు, ధైర్యానిచ్చేవాళ్ళు, నేనున్నానని ఆత్మ విశ్వాసాన్ని నింపేవాళ్లూ మన కెందరో కనపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళను చూడాలి. ఎవరెవరు దేనికోసం మాట్లాడుతున్నారో, ఎవరు నిజంగా మానవతతో ప్రవర్తిస్తున్నారో గమనించాలి. వ్యక్తులు మానవీయులు ఉంటారు. కానీ మొత్తం సమాజంలోని ప్రజలకు బాధ్యత వహించే శక్తులేవో గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆపదలోనూ, చీకటిలోనూ ఆశల చివుళ్ళను కనిపెట్టుకుని చూడాలి. వెలుగురేఖలను గుర్తించాలి. బతుకంటేనే పోరాట మనుకున్నాక పోరాడాలి. 'ఆశలు ఎడారులై, దు:ఖప్రవాహం గుండెను ముంచేసి, నిశీథి ఆవహించిన మనిషికి ఎదురెళ్ళి ఒక చేయి ఆశల కాగడాతో దారిని చూపిస్తూనే ఉంటుంద'ని కవి అన్నట్టు ఆ చేతిని అందుకొని ముందుకు నడవాలి!