Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా గ్రామీణ ప్రాంతాల్లో కరాళ నత్యం మొదలు పెట్టింది. కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారమే దేశంలో 533 గ్రామీణ జిల్లాల్లో కరోనా రెండో ఉప్పెన ఊడ్చిపెట్టడం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో సగటున పదిశాతం కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా విశ్లేషణ ప్రకారం మార్చిలో 36.8శాతం కేసులు నమోదు అయితే మే నాటికి నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల శాతం 48.5కి పెరిగింది. మొదటి దఫా కరోనాను భారతదేశం తట్టుకోవడానికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాలకి విస్తరించకుండా నిలువరించగలగటమే. కానీ రెండో ఉప్పెనలో ఆ పని చెయలేక పోయాము. చేసే అవకాశం కూడా లేదు. మొత్తం దేశ జనాభాలో 65 శాతం గ్రామీణ ప్రాంతంలోనే నివశిస్తున్నారు. శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, నాణ్యమైన వైద్య సదుపాయాలు, రోగ నిర్ధారణ సదుపాయాలు, మందకొడిగా సాగుతున్న వాక్సినేషన్లకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం జతకలవడంతో వైరస్ వ్యాప్తి జాతీయ స్థాయి మానవ సంక్షోభం స్థాయికి చేరింది. ఈ సంక్షోభం ప్రభావం కేవలం ప్రాణ నష్టంతోనే సరిపెట్టుకోదు. జాతీయ ప్రాంతీయ స్థాయిల్లో ఆర్ధిక వ్యవస్థ కూడా అంతే మోతాదులో నష్టాన్ని చవిచూడనుంది. వ్యవసాయోత్పత్తుల సరఫరా దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఈ క్రమంలో వ్యవసాయోత్పత్తులు మార్కెట్‌కి అక్కడి నుండి వినియోగదారులకు చేరటంలో కూడా అనేక అంతరాయాలను ఎదుర్కొ వలసి వస్తుంది. తక్షణమే తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆహార సంక్షోభం ఏర్పడి ఆహారం దిగుమతి చేసుకునే పరిస్థితులు దాపురించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సంక్షోభం నుండి బైట పడాలంటే కేంద్రం ఈ ప్రతిపాదించిన చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. మొదటిది గ్రామీణ భారతదేశానికి ఔషదాలను, వైద్య సిబ్బందిని అధికంగా కేటాయించి సత్వర వాక్సినేషన్ ఉద్యమం చేపట్టాలి. దాన్ని పర్యవేక్షించాలి. తద్వారా పట్టణ మరియు గ్రామీణ భారతదేశం మధ్య ఆరోగ్య సంరక్షణ వసతుల్లోని అసమానతలను తొలగించే దిశగా దీర్ఘకాలిక దృష్టితో చర్యలను మొదలు పెట్టడానికి వీలవుతుంది.
ప్రభుత్వ సౌజన్యంతో లేదా భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన ఆరోగ్య సదుపాయాలను నెలకొల్పాలి. రెండవది, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తోడ్పటానికి అన్ని రాజకీయ పార్టీల సిబ్బంది, అనుయాయులు, ఫాలోయర్స్ కేడర్‌తో కూడిన అనుబంధ విభాగాలను పూర్తిగా కోవిడ్ నియంత్రణ సేవలకు సమీకరించాలి. కోవిడ్ నియంత్రణలో కేంద్రం వైఫల్యం గురించి భిన్న సామాజిక తరగతులు జాతీయ అంతర్జాతీయ వైద్య రంగ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాల నుండి వస్తున్న విమర్శలు విశ్లేషణలు, సూచనల పట్ల సానుకూలంగా ఉండాలి.
కోవిడ్ మహమ్మారి వలన గ్రామీణ భారతంలో ఉపాధి, ఉద్యోగం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ చేయాలి. ఆర్నెళ్లపాటు గ్రామీణ భారతంలో అన్ని కుటుంబాలకు, పట్టణ మురికివాడల్లోని అన్ని కుటుంబాలకు ఉచితంగా రేషన్ సరఫరా చేయాలి.
ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ లో కేటాయించిన దానికి రెట్టింపు నిధులు విడుదల చేయాలి. గ్రామ సభలు జరిపి. ప్రజాపనులు విస్తృతంగా చేపట్టాలి. పట్టణ ఉపాధి హామీ చట్టం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలి. విద్యార్థులకు అన్ని స్థాయిల్లోనూ ప్రభుత్వ ప్రయివేటు విద్యాలయాల్లో ఫీజు మాఫీ చేయాలి. గ్రామీణ పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్ల నిర్మానాణానికి లక్ష కోట్లు విడుదల చేయటం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి గ్యారంటీ చేయాలి. కోవిడ్ చికిత్సను ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం కిందకి తేవాలి. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చు పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి.
- కొండూరు వీరయ్య
సెల్: 8971794037