Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ''భారతీయ సాహిత్యం - చతురాశ్రమ ధర్మాలు'' అనే లక్ష్యంతో పరిశోధనా పత్రాలు సేకరించి, ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురించి, ఈ నెల 30న అంతర్జాతీయ సదస్సు నిర్వహించబోతున్నట్టు 'స్టేట్ ఎడ్యుకేషన్ తెలంగాణ' వాట్సాప్ గ్రూపులో కొన్ని రోజులుగా కనిపిస్తోంది. 'నేటి మానవ జీవనం సంక్లిష్టమై, అశాంతిమయమై సాగుతున్నది. ఈ మానవుడు తన ధర్మాలను సరియైన సమయంలో సరియైన విధంగా పాటించకపోవడమే ఈ అశాంతికి కారణం. ఆ ధర్మాలను ఒక్కసారి సమాజానికి జ్ఞాపకం చేసి, తద్వారా శాంతియుతమైన మనుగడతో వర్ధిల్లేలా చేయడమే ఈ సదస్సు లక్ష్యం' అని నిర్వాహకులు చెప్పారు. ఉన్నత విద్యా సంస్థల్లో నిర్వహించే పరిశోధనలు రాజ్యాంగ లక్ష్యాల సాధనకు, దేశ ఔన్నత్యానికి, మానవ వనరుల వికాసానికి, మెరుగైన జీవనానికి తోడ్పడాలి. సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్వహించే సదస్సు లక్ష్యం అందుకు దోహదం చేస్తుందా అనే కోణంలో పరిశీలించాలి.
భారత దేశం ఒకనాడు (వేద కాలంలో) విశ్వ గురువుగా విలసిల్లిందని, అలనాటి సామాజిక జీవన విధానం ఆదర్శవంతమైందని, దాని పునరుజ్జీవనానికే ప్రభుత్వ విద్యా సంస్థలను పని చేయించాలనేది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రాచీన భారతీయ సామాజిక జీవన విలువలను, సనాతన సాంప్రదాయాలను విస్తృతంగా ప్రచారం చేసి ఆచరింప చేయడానికే విద్యారంగం కృషి చేయాలని 'నూతన విద్యా విధానం 2020'లో ప్రాధాన్యతా విషయంగా వివరించడం జరిగింది. సదాశివపేట డిగ్రీ కాలేజీ చేపట్టిన కార్యక్రమం అందులో భాగమే కావచ్చు. ఈ ధోరణి మన దేశానికి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అనేది చర్చనీయాంశం. సుదీర్ఘ మానవ సమాజ పరిణామాన్ని ప్రధానంగా నాలుగు దశలుగా అర్థం చేసుకోవచ్చని అనేకమంది సామాజిక శాస్త్రవేత్తలు వివరించారు. ఆయా దశల్లో గల జీవన విధానం, విలువలు, ఆచార వ్యవహారాలు, పరిపాలనా పద్ధతులలో కొన్ని అంతరించిపోతూ మరికొన్ని ఆవిష్కృతం అవుతూ కాలానుగుణంగా మారుతూ వచ్చింది. కాలంచెల్లినవి అంతరిస్తూ, అవసరమైనవి ఆవిష్కృతమవుతూ రావడం వలెనే సమాజం ప్రగతిపథంలో పయని స్తోంది. ఆదిమ సమాజం కంటే బానిస సమాజం మెరుగైందని, బానిస సమాజం కంటే ఫ్యూడల్ సమాజం మెరుగైందని, దానికంటే పెట్టుబడిదారీ సమాజం మెరుగైందనే విషయం తెలిసిందే. ప్రతి సమాజంలోనూ అనేక సమస్యలు ఉన్నవి. వాటిని పరిష్కరించుకొంటూ ముందుకు పోవాల్సిందే. కొన్ని విషయాల్లో పాత రోజులే మంచివి అని అనుకొన్నా వెనక్కి వెళ్లలేం. సమాజం ముందుకే తప్ప వెనక్కి నడవదు.
మానవ జీవితం చతుర్విధ ఆశ్రమాలతో నడుస్తుందని హిందూ పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు చెప్పుకొచ్చాయి. మానవులకు బాల్య, కౌమార, యౌవన, వార్థక్యాల వంటివే 'బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసం' అనే నాలుగు ఆశ్రమ ధర్మాలుగా ప్రచారం చేయబడినవి. ప్రతిఒక్కరూ వీటి విలువ తెలుసుకొని మసలుకోగలిగితే జీవన సార్ధకత సిద్ధిస్తుంది. ఈ ధర్మాలను సరిగా ఆచరించినవారికే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. బ్రహ్మ చర్యాశ్రమంలో వేదా ధ్యయనం, గురు శుశ్రూష, ఇంద్రియ నిగ్రహం, పెద్దలయందు గౌరవం కలిగియుండాలి. గృహ స్థాశ్రమంలో ఏకపత్నీ వ్రతం, తల్లిదండ్రుల సేవ, అతిధి సత్కారం, ధర్మ సంతానం, ఆచార నిర్వహణం, అనాధా లయందు ఆదరణ, బీదలకు సహకారం ముఖ్యమైనవి. వానప్రస్థాశ్రమంలో ధర్మ వ్యవహార బద్ధులై వయోభారాన్ని దృష్టిలో ఉంచుకొని, కర్మలయందు స్వార్థంను వీడి సంతానమునకు వ్యవహార మప్పగించి, ధర్మ త్నితో కందమూలాదుల నాహారించి తపమాచరించడం చేయాలి. సన్యాసాశ్రమంలో ధర్మపత్నిని సంతానంన కప్పగించి, కామక్రోధాదులను జయించి, నిర్లిప్తులై శేష జీవితంను లోకోద్ధరణకై ధర్మ ప్రబోధనైక లక్ష్యంతో ఆత్మ సాక్షాత్కారంతో జీవితాన్ని ముగించాలి. ఇవి ఒకనాడు ధర్మాలుగా చలామణి అయినవేమో గానీ ఈనాటి ఆధునిక కాలంలో ఒక్క గృహస్థాశ్రమం తప్ప మిగిలినవి అధర్మాలు అవుతాయి. ఆనాడు కూడా ఇవి అతి కొద్దిమందికి తప్ప అందరికీ సంబంధించినవి కావు, అందరూ ఆచరించినవీ కావు. బ్రహ్మచర్యాశ్రమంలో విద్యాధ్యయనం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులలోని పురుషులకే పరిమితం చేయబడింది, శూద్రులకు పూర్తిగా నిరోధించబడింది. నడి వయసు తర్వాత భార్యతో కలిసి అడవులకేగి కందమూలాలతో కడుపు నింపుకొని తపమాచరించినవారిని వేళ్ళ మీద లెక్కించవచ్చు.
సన్యాసాశ్రమ ధర్మం ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా అనవసరమైంది, అసంబద్ధమైంది కూడాను. సన్యాసులతో సమాజానికి ఒరిగేదేమీ లేకపోగా అపారమైన కీడు జరుగుతున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఆశ్రమాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అత్యాచారాలు, వ్యభిచారం, కుంభకోణాలు, భోగభాగ్యాలు, కటకటాల పాలైన యోగులు, స్వాముల బండారాలు తెలిసినవే. ఈనాడు సన్యాసులుగా చెప్పుకొంటున్నవారు సదరు ఆశ్రమ ధర్మాన్ని పాటించడం లేదు. దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బ్రహ్మచారులా లేక సన్యాసాశ్రమవాసులా? రెండింటిలో ఏదైనా పరిపాలకులుగా ఉండకూడదే! ఎన్.టి. రామారావు రెండో పెండ్లి చేసుకొంటేనే, వానప్రస్థాశ్రమ/సన్యాసాశ్రమ ధర్మాన్ని పాటించలేక పోయారని హిందూ ధర్మ పండితులు పెదవి విరిచారు. ఈ ధర్మాల ప్రకారం భార్య చనిపోయిన వారు మళ్ళీ పెండ్లి చేసుకోకూడదు. మనువు మానవ జీవితాన్ని వంద సంవత్సరాలుగా నిర్ణయించి నాలుగు భాగాలు చేసి నాలుగు ఆశ్రమ ధర్మాలకు కేటాయించాడు. దాని ప్రకారం 50సంవత్సరాలు దాటిన భార్యాభర్తలు అడవుల్లో ఉండాలి. 75సంవత్సరాలు దాటిన పురుషులు భార్యను పిల్లల వద్దకు పంపి, ముక్కు మూసుకొని తపస్సు చేస్తూ తనువు చాలించాలి. అలాంటి ఆశ్రమ ధర్మాలను ఈనాటి భారతీయులు ఎవరూ పాటించడం లేదు, పాటించలేరు కూడాను. ఆచరణ యోగ్యం కాని విషయాలపైన పరిశోధన పత్రాలు ఎందుకు? అంతర్జాతీయ సదస్సు ఎందుకు?
- నాగటి నారాయణ
సెల్: 9490300577