Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హౌచిమిన్ వియత్నాం జాతి ప్రతిబింబం. హౌచిమిన్, వియత్నాం విప్లవం రెండూ వేరు కాదు. విప్లవ జీవితం తప్ప వ్యక్తిగత జీవితం కానరాని మహౌన్నత విప్లవకారుడాయన. బహుశ ప్రపంచ విప్లవాల చరిత్రలో ఇదో అసాధారణం. విప్లవాత్మక కార్యకలాపాలు, నిరాడంబర జీవితం, నిజాయతీల సమ్మిళిత స్వరూపం ఆయన. 30సంవత్సరాలు విదేశాలలో, మరో 30సంవత్సరాలకు పైగా స్వదేశీ గడ్డమీద అలుపెరగకుండా పోరాడినా పై లక్షణాలను ఆయన ఏమాత్రం చెక్కుచెదరనీయలేదు. శత్రువులు ఇంటిముందే తెగబడుతున్నా తడబడకుండా అరివీర భయంకరుడిలా పోరాడిన అసాధారణ విప్లవనేత హౌచిమిన్. అత్యంత క్రూరమైన ఫ్రాన్స్, జపాన్ వలస పాలనకు వ్యతిరేకంగా చివరకు అమెరికా పైశాచికత్వానికి వ్యతిరేకంగా మూడు దశాబ్దాలపాటు పార్టీని, ప్రజాబాహుళ్యాన్ని సాయుధ తిరుగుబాటులో, ప్రతిఘటనలో ఐక్యంగా నడిపించిన అద్భుతమైన సమర్థత ఆయనది.
సామ్రాజ్యవాదాన్ని మట్టి గరిపించిన మహావిప్లవం
వియత్నాం విప్లవం దానికదే గొప్ప చారిత్రక ప్రాధాన్యత కలిగినది. 35సంవత్సరాలపాటు కనీవినీ ఎరుగని సామ్రాజ్యవాద క్రూరత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరాటమది. వియత్నాం అనేది చాలాకాలం ఫ్రాన్స్ దేశానికి వలసగా ఉండింది. ఫ్రాన్స్ దీన్ని మూడు ముక్కలుగా విడగొట్టింది. దక్షిణ, మధ్య, ఉత్తర వియత్నాంలుగా విడగొట్టి ఆ తరువాత పక్కనే ఉన్న కాంబోడియా, లావోస్‌లను కూడా కలిపి ''ఇండో చైనా''గా తన పాలన సాగించింది. ఫ్రెంచి దురాగతాలకు వ్యతిరేకంగా అనేక వామపక్ష విప్లవ గ్రూపులు అనేక సంవత్సరాలు పోరాటాలు సల్పుతూవచ్చాయి. ఈ పోరాటాల నడుమనుంచి తమ దేశ స్వాతంత్య్రం కోసం హౌచిమిన్ వీరోచిత ప్రస్థానం ప్రారంభమైంది. తమ దేశాన్ని బానిసత్వంలో ముంచెత్తుతున్న ఫ్రాన్స్‌కే 21యేండ్ల వయసులో హౌచిమిన్ చేరుకున్నాడు. వంటవాడిగా, తోటమాలిగా, మంచుతుడిచే కూలిగా, ఫొటోగ్రాఫర్‌గా, ప్రింటర్‌గా, స్టాకర్‌గా... ఇలా అనేక వృత్తులు, ఉద్యోగాలు చేస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాడు సాగుతున్న ఉద్యమాలలోకి ప్రవేశించాడు. ఆ దేశంలో ఉన్న వియత్నాం కష్టజీవులను దగ్గరకు చేర్చి ''వియత్నాం దేశ భక్తుల సంఘం'' ప్రారంభించాడు. 1917లో రష్యాలో కార్మికవర్గ మహా విప్లవం జయప్రదం కావడం, అనంతరం కామ్రేడ్ లెనిన్ రెండవ ఇంటర్నేషనల్‌ను రద్దుచేసి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ ప్రారంభించడం, అందులో వలస దేశాల విముక్తిపై చేసిన గొప్ప తీర్మానం వంటి ఘటనలు హౌచిమిన్ను కమ్యూనిజం వైపు ఆకర్షించాయి. 1920లో ఫ్రాన్స్‌లో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా చేరాడు. మొదటి ప్రపంచ యుద్ధం అయిన వెంటనే (1918లో) విజయం సాధించిన సామ్రాజ్యవాద కూటమి దేశాలు (ఫ్రాన్స్, ఇంగ్లండ్, అమెరికా) తిరిగి ప్రపంచాన్ని పంచుకోవడానికి ఫ్రాన్స్‌లోని వర్సెలో సభ నిర్వహించాయి. ఆ సభలో హౌచిమిన్ ఫ్రాన్స్ సాగిస్తున్న మారణకాండపై పిటిషన్ యిచ్చాడు. ఈ పిటీషన్ ఫ్రాన్స్‌లో జరుగుతున్న సోషలిస్టు ఉద్యమానికి, వియత్నాం (యావత్ ఇండో చైనాలో)లో సాగుతున్న స్వాతంత్య్రోద్యమానికి ఓ గొప్ప ఊపు నిచ్చింది. హౌచిమిన్ కార్యకలాపాలను కట్టడి చేయడానికి ఫ్రాన్స్, ఇంగ్లండ్ ప్రభుత్వాలు వలవేసి పట్టుకుని రెండు సంవత్సరాలపాటు కఠిన కారాగార శిక్షకు గురిచేశారు. అనేక దేశాలలో వచ్చిన వత్తిడి పర్యవసానంగా అయన్ని విడుదల చేశారు. వెంటనే ఆయన సోషలిస్టు రష్యాలోనూ, ఉధృతంగా సాగుతున్న విప్లవ చైనాలలో వివిధ పేర్లతో తలదాచుకున్నారు. అక్కడి నుండే వియత్నాం వలస వ్యతిరేక పోరాటాన్ని నడిపించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆయన మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం, విప్లవ సైన్యాన్ని శక్తివంతంగా నడపడంలో ప్రావీణ్యతను సంపాదించాడు. ప్రత్యేకించి బలమైన శత్రువును ఓడించే గెరిల్లా, సాయుధ తిరుగుబాట్లలో అత్యంత నైపుణ్యం పొందాడు. 1945లో పెద్దయెత్తున ప్రారంభమైన వియత్నాం విప్లవంలోకి ప్రత్యక్షంగా ప్రవేశించి దాదాపు 25సంవత్సరాలపాటు విప్లవమే ఆయన, ఆయనే విప్లవంగా పోరాటాన్ని సాగించాడు. 1945లో ఉత్తర వియత్నాం స్వాతంత్య్రం సాధించినప్పటికీ దక్షిణ వియత్నాం ఫ్రెంచ్, ఆ తరువాత జపాన్ సామ్రాజ్యవాదుల వలస కిందే మగ్గుతూ ఉండింది. స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఉత్తర వియత్నాంపైన ఫ్రెంచి వలసవాదుల ఆధిపత్యం దాదాపు తొమ్మిదేండ్లపాటు సాగుతూనే ఉండింది. 1954లో హౌచిమిన్ నాయకత్వాన విప్లవ దళాలు, ప్రజలు అంతిమ పోరాటం సాగించి ఫ్రెంచి ఆధిపత్నాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే వియత్నాం ప్రజల చిరకాల కోరిక అయిన వియత్నాం ఏకీకరణ మాత్రం సాధ్యం కాకుండా సామ్రాజ్యవాదం అడ్డుపడింది. ఈ పరిస్థితుల్లో ఉత్తర వియత్నాంలో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం, దక్షిణ వియత్నాంలో విముక్తికై సాగే జాతీయ ప్రజాతంత్ర విప్లవాలను జమిలిగా హౌచిమిన్ సాగించారు.. ఈ పరిస్థితులలో దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టు పార్టీ జాతీయ విముక్తి సంఘటన ఏర్పాటు చేసింది. దక్షిణ వియత్నాంని చేజారనీయకుండా ఉత్తర వియత్నాంలో సోషలిస్టు నిర్మాణాన్ని దెబ్బతీయడమనే వ్యూహంతో అమెరికా రంగంలోకి దిగింది.
చివరికి అమెరికా వల్ల కూడా కాలేదు
1968లో హౌచిమిన్ సారధ్యంలో అమెరికాపై ''టెట్ ఎదురుదాడి'' పేరిట వియత్నాం కమ్యూనిస్టు పార్టీ దక్షిణ వియత్నాంలో బలమైన ఎదురుదాడి జరిపింది. అమెరికా గుక్క తిప్పుకోలేకపోయింది. అప్పటికే 58 వేల మంది అమెరికన్ సైన్యం చనిపోయారు. 3లక్షల 4వేల మంది క్షతగాత్రులయ్యారు. అయితే వియత్నాం వైపు కూడా తీవ్రమైన నష్టమే జరిగింది. 40లక్షల మంది వియత్నాం ప్రజలు చనిపోవడం, యిల్లు వాకిళ్లు కోల్పోవడం జరిగింది. అమెరికాలో ఒక రాష్ట్రమైన కాలిఫోర్నియాతో సమానమైన దక్షిణ వియత్నాంపై అమెరికా కోటి నలభై లక్షల టన్నుల బాంబులు వేసింది. దాదాపు ఒక ఎకరానికి 142 పౌండ్ల బాంబులు పడ్డాయి. విప్లవకారులకి ఆహారం అందకుండా ఉండటానికి, వారు తలదాచుకోవడానికి వీలులేకుండా చేయడానికి 60లక్షల ఎకరాలకి పైగా అమెరికా ధ్వంసం చేసింది. ఒక్క బాంబుదాడే కాదు, కోటి ఎనభైలక్షల గాలన్ల 'డయాక్సిన్' (పంటలు నాశనం చేసే రసాయనం) వెదజల్లి కొన్ని దశాబ్దాలపాటు ఆ భూములు వ్యవసాయానికి పనికిరాకుండా చేసింది. ఉత్తర వియత్నాంపైన కూడా బాంబుదాడి జరిగింది. అయితే ఈ ప్రాంతంలో ప్రాజెక్టులను, ఫ్యాక్టరీలను, రోడ్లను, బ్రిడ్జిలను లక్ష్యంగా చేసుకుని బాంబుదాడులు చేసింది అమెరికా. కిలోమీటరుకి సగటున 24 బాంబులు వేసిందని నాటి లెక్కలు తెలుపుతున్నాయి. అయినప్పటికీ ఫ్రాన్స్, జపాన్‌కి సాధ్యం కానిది ప్రజా విప్లవాన్ని అంతం చేయగలిగిన మొనగాడుగా జబ్బలు చరుచుకుని దిగిన అమెరికాను హౌచిమిన్ నాయకత్వాన (ఆయన మరణానంతరం కూడా) వియత్నాం ప్రజలు మట్టి కరిపించారు. ప్రపంచ వ్యాపితంగా అమెరికా పైశాచికత్వాన్ని పెద్ద యెత్తున అసహ్యించుకోవడం, చివరికి అమెరికాలో కూడా వియత్నాం విప్లవ అనుకూల ఉద్యమాలు ప్రారంభం కావడంతో చావుతప్పి కన్ను లొట్టపోయిన అమెరికా అంతిమంగా 1975లో తలదించుకుని వైదొలిగింది. ఉత్తర, దక్షిణ వియత్నాంలు ఏకీకరించబడ్డాయి. వియత్నాం సోషలిస్టు రిపబ్లిక్ ఏర్పడింది.
విప్లవ పార్టీ నిర్మాణానికి విప్లవ నైతికతే జీవం
విప్లవ పార్టీ నిర్మాణంలో విప్లవ నైతికత అనే ఓ నూతన అంశాన్ని ఆయన ముందుకు తెచ్చాడు. మనలాంటి వెనుకబడిన దేశాలలో దీర్ఘకాలం శాంతియుత వాతావరణంలో భారీ విప్లవ ఉద్యమాలు లేని వాతావరణంలో కమ్యూనిస్టు పార్టీని ఓ బలమైన విప్లవ పార్టీగా రూపొందించుకోవడానికి విప్లవ నైతికత అనేది ఓ సజీవమైన బంధంగా ఉంటుంది. ''వ్యక్తివాదం అనేది గత సమాజపు ఓ నిజమైన, అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇది మన హృదయంలో దాగి ఉన్న ఒక అంతర్గత శత్రువు. బయటి శత్రువు కన్నా ప్రమాదమైనది. వ్యక్తివాదం అనేది ఓ ప్రమాదకరమైన బాక్టీరియా. ఓ పెద్ద జబ్బు. విప్లవ ఆశయాలను పతనంచేసే అనేక జబ్బులను పుట్టించే తల్లి జబ్బు వంటిది'' అని ఆయన ప్రకటించాడు. అంతేకాదు ''వ్యక్తివాదం అనేది విప్లవ నైతికతకు విరుద్ధంగా నడుస్తుంది. యిది చాలా కుట్రపూరితంగా, సమర్థవంతంగా మనలోని విప్లవతత్వాన్ని వెనక్కి నెడుతుంది. దీని మూలంగానే చాలామంది కామ్రేడ్స్ తాము పార్టీకి ఎంతో చేశామని, అందువలన పార్టీ తమకు ఎంతో చేయాల్సి వుంటుందని వాదిస్తూ ఉంటారు. కాదంటే పార్టీకి వ్యతిరేకంగా తయారవుతారు'' అని హెచ్చరించాడు. ఈ విప్లవ నైతికతను నిర్వచిస్తూ ఆయన ''పార్టీ క్రమశిక్షణ పాటించడం, పార్టీ రాజకీయాలను, విధానాలను అమలుచేయడం, ప్రజలకు హృదయపూర్వకంగా సేవలు అందించడం, ప్రతి విషయంలోనూ ఆదర్శంగా ఉండటం. మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడం. సైద్ధాంతిక పరిజ్ఞానం పెంచుకోవడానికి విమర్శ, ఆత్మవిమర్శలను ఆచరించడం యితర కామ్రేడ్స్‌తో కలిసి అభివృద్ధి చెందటానికి ప్రయత్నించడం'' అని పేర్కొన్నారు. ''విప్లవ నైతికత అనేది ప్రజలతో మమేకమవడం, వారి అభిప్రాయాలను గౌరవిం చడం, ప్రజలపై నమ్మకముంచడం'' అన్నారు హౌచిమిన్.
సోషలిజం అజేయం
సోషలిజంపై హౌచిమిన్ యొక్క అవగాహనని జాతి మొత్తానికి అందించాడు. ''సోషలిజం అంటే ప్రజల్ని ధనవంతులుగాను, శక్తివంతులుగాను చేయడం. సోషలిజం అంటే ప్రజలకు స్వేచ్ఛను, ఆర్థిక పురోగతిని, సంతోషాన్ని యివ్వడం. సోషలిజం అంటే ప్రజలకు విద్య, వైద్యం, సౌకర్యవంతమైన గృహవసతి కల్పించడం. సోషలిజంలో పిల్లల బాగు, వృద్ధుల బాగోగులకు గ్యారంటీ యివ్వడం'' అని ఆయన ప్రజలకు చెప్పేవాడు. అలాగే ఆయన తన దేశలో సోషలిజం ఎలా నిర్మించబడాలి అనేదానికి సూచనలిస్తూ ''సోషలిజం అనేది ఒక సమూలమైన మోడల్ కాదు. అది ఒక నిర్దిష్టమైన సూత్రీకరణ. కాబట్టి సోషలిజం నిర్మాణంలో ఆచరణాత్మకత, వస్తుగత పరిస్థితులను అర్థం చేసుకోవడం, సోషలిస్టు సూత్రీకరణను నిర్ధిష్ట పరిస్థితులకి అనుగుణంగా, సృజనాత్మకంగా అమలు చేయడం జరగాలి. మూఢ విశ్వాసంతోనూ, అచ్చుగుద్దినట్టు ఒకే మాదిరిగా ఉండాలన్న మూర్ఖపు వాదనలకు తావుండకూడదు'' అని ఆయన చెప్పిన మాటలను ఆయన మరణానంతరం వియత్నాం కమ్యూనిస్టు పార్టీ తు.చ. తప్పకుండా సోషలిజాన్ని నిర్మించడం వలన ఈ రోజు ఆర్ధిక సంక్షోభాలు లేకుండా, కరోనా లాంటి మహమ్మారితో ప్రపంచం అల్లాడుతుంటే... వియత్నాం ఇప్పటికీ ఒక్క మరణం కూడా లేకుండా అనేక దేశాలకి మందులను, టీకాలను, చివరికి తన దేశాన్నే సర్వనాశనం చేసిన అగ్రరాజ్యం అమెరికాకి సైతం పంపుతుందంటే అదీ సోషలిజం యొక్క గొప్పతనమేనని ప్రపంచం అంగీకరించాలి. ఈ విజయం వెనుక మహత్తర వియత్నాం ప్రజా విప్లవ పోరాటం, దానికి మహౌన్నతుడు హౌచిమిన్ నాయకత్వం చిరస్మరణీయమైనవి.
- ఆర్. రఘు