Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుందరయ్య పోరాట యోధుడు. వర్గ పోరాటమే సమాజాన్ని ముందుకు నడుపుతుందని, ఈ దోపిడీి వ్యవస్థను అంతం చేసి, దోపిడి, పీడన లేని సమ సమాజాన్ని స్థాపిస్తుందని నమ్మి తన జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితంజేశారు. దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. పోరాటాలకు నాయకత్వం వహించారు. పీడన, అసమానత, అన్యాయాలను ఎదిరించారు. వాటిని జన సమ్మతం చేసే వ్యవస్ధలు, పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు, మూఢ నమ్మకాలను రాజీ లేకుండా ప్రతిఘటించారు. పీడిత ప్రజలను చైతన్య పర్చేందుకు కృషిజేశారు. ప్రజలు ఈతి బాధల్లో ఉన్నప్పుడు, ప్రకృతి విపత్తులు, కరువు కాటకాలకు కష్టనష్టాల పాలయినప్పుడు ఉద్యమాన్ని సమీకరించి అండగా నిలిచారు. ప్రజా పోరాటాలను, సంఘ సంస్కరణలను, సేవా కార్యక్రమాలను మేళవించి సామాజిక మార్పు ఉద్యమానికి మార్గనిర్దేశం చేశారు.
సుందరయ్య అవిశ్రాంత పోరాట యోధుడన్నది అందరికి తెలిసిందే. హైదరాబాదు సంస్థానంలో ఫ్యూడల్ నిరంకుశ నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1946-51 వరకు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఒక మహత్తర ప్రజా పోరాటంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చైనా విప్లవ ఉద్యమంలో 'యానాన్' నిర్వహించిన పాత్రను పోషిస్తుందేమోనని పాలకులు భయపడ్డారు. అటువంటి పోరాటానికి సారథ్యం వహించిన వారిలో సుందరయ్య అగ్రగణ్యులు. ఆంధ్రా ప్రాంతంలో విస్తృతంగా జరిగిన జమీందారీ వ్యతిరేక పోరాటాలలో... రైతు రక్షణ యాత్రలలో వ్యవసాయ కార్మికులకు స్వతంత్ర సంఘాన్ని స్థాపించి కూలి, కౌలు పోరాటాలు నిర్వహించడంలో... 'విశాలాంధ్ర, ప్రజారాజ్యం' ఉద్యమంతో భాషాప్రయుక్త రాష్ట్రాల అంశాన్ని రాజకీయ ఎజెండా కిందికి తేవడంలో... కొన్నింటికి ప్రత్యక్షంగా మరికొన్నింటికి పరోక్షంగా మార్గదర్శకత్వం వహించారు. ఈ పోరాట పటిమ, ఉద్యమ అనుభవమే ఆనాడు కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్న అతిరథ మహారథులైన అనేక మంది నాయకులలో సుందరయ్య గారిని 1964లో సీపీఐ(ఎం) ఏర్పడినప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసింది.
సుందరయ్య సంఘ సంస్కరణలను విప్లవోద్యమంలో అంతర్భాగంగానే చూశారు. సంఘసంస్కరణలు స్వభావరీత్యా అభ్యుదయకరమైనవి. అప్పటి వ్యవస్ధలో ఉన్న నష్టదాయకమైన విడివిడి రుగ్మతలను సాధ్యమైన మేరకు సరిదిద్దడానికి చేసే ప్రయత్నాలైనందున మౌలికంగా సామాజిక మార్పు కృషిలో పురోగమన పాత్ర నిర్వహిస్తాయి. అటువంటి కృషి ఎవరు చేసినా ఆహ్వానించాలి. కమ్యూనిస్టు ఉద్యమం అటువంటి సంస్కరణ కార్యకలాపాలను ప్రోత్సహించాలి. విప్లవోద్యమానికి నిరుపయోగం అని భావించరాదు. విప్లవోద్యమం తిరస్కరించాల్సింది సంస్కరణను కాదు సంస్కరణవాదాన్ని. విడివిడి సంస్కరణలను ఒకదాని తర్వాత ఒకటని చేసుకుంటూ పోతే వ్యవస్థనే సంపూర్ణంగా మార్చడం సాధ్యమవుతుందన్న రాజకీయ భావన సంస్కరణవాదం. ఇది సరైనదికాదు. విప్లవోద్యమాన్ని కుంటుపర్చడానికి ప్రజలలో తాత్కాలిక భ్రమలను సృష్టించడానికిది వినియోగపడుతుంది. ఇటువంటి రాజకీయ భావనపై నిరంతరం సైద్థాంతిక పోరాటం నిర్వహించాలి. అయితే సంస్కరణవాదంపై పోరాటాన్ని సంస్కరణల కృషి అవసరాన్ని గందరగోళపర్చకూడదు. సంస్కరణ విప్లవం యొక్క ఉపఉత్పత్తి అన్న మార్క్సిస్టు నానుడిని సంస్కరణలకు మార్క్సిజం వ్యతిరేకమనే భావంగా కొందరు అర్ధం చేసుకుంటారు. విప్లవోద్యమం, పోరాటాలు సంస్కరణలను ముందుకు నెడతాయి, అనివార్యం జేస్తాయి అనేది దాని అర్థం.
మన అనుభవంలో ఇటువంటి పరిణామాలను ఎన్నో చూస్తుంటాం. కార్మిక సమ్మెలు జరిగినప్పుడు కుల, మత, ప్రాంత, భాషా భేదాలను మరిచి ఐక్యంగా పోరాడడం మనం చూస్తాం. సహకరించుకోవడం, సహాయం చేసుకోవడం అప్పటి వరకు ఉన్న అడ్డుగోడలను సాంఘిక అసమానత్వ భావాలను పక్కన పెట్టి భుజం భుజం కలిపి పోరాడడం చూస్తాం. తమను విభజించే పద్ధతులను, ఆచారాలను, సంప్రదాయాలను పక్కకు నెట్టి కొత్త ఒరవడికి మారడం మనం చూస్తాం. ప్రస్తుతం జరుగుతున్న రైతు పోరాటంలో మతం, కులం, ప్రాంతాన్ని పక్కనపెట్టి రైతులు ఐక్యంగా పోరాడడం చూస్తున్నాం. పాలకులు చీలికలు సృష్టించాలన్న ప్రయత్నాలను వమ్ము చేసి రైతులు తమ పోరాటాన్ని ఏవిధంగా సాగిస్తున్నారో రోజూ చూస్తున్నాం. విప్లవానికి సంస్కరణలు ఉప ఉత్పత్తులు అంటే ఇదే. పోరాటంతో నిమిత్తం లేని సంస్కరణలు విప్లవాన్ని సాధించలేవు. విప్లవ పోరాటాలు, ఉద్యమాలు సంస్కరణలను కూడా సాధించుకుంటూ ముందుకుపోతాయి.
పై వివరణ సంపూర్ణం కావాలంటే మరో విషయాన్ని గమనించాలి. పోరాటాలు, ఉద్యమాలు జరుగుతూ ఉంటే వాటంతటవే సంస్కరణలు సంభవించవు. పోరాటాలు చేస్తున్న ప్రజలే సంస్కరణలను ముందకు తెస్తారు. అవి సద్యోజనితంగా వాటంతటవే జరగవు. ఒకసారి మొగ్గ దొడిగిన సంస్కరణలు వెనక పట్టు పట్టకుండా అలాగే స్థిరపడి ముందుకు పోతాయనుకోకూడదు. అభ్యుదయ సంస్కరణలను స్థిరపర్చి ముందుకు తీసుకుపోవడం అవసరం. పోరాటాలు, ఉద్యమాలు ఆటు పోట్లు ఎదుర్కొన్నప్పుడు, వాటి ఉధృతి తగ్గి స్తబ్దత ఏర్పడినప్పుడు సంస్కరణలు వెనకపట్టు పట్టకుండా బలపర్చుకోవడం ప్రజా ఉద్యమ అవసరం. అప్పుడే ముందు కాలంలో ప్రజా ఉద్యమం మరింత ఉధృత స్థాయిలో ముందుకు రావడం సాధ్యమవుతుంది.
లేని యెడల ఉద్యమం దెబ్బతిన్నప్పుడు, స్తబ్దతలో ఉన్నప్పుడు పాలకవర్గాలు సంస్కరణలను వమ్ము చేసి పాత పద్ధతులను భావాలను కొత్త రూపాలలో పునరుద్ధరించి విప్లవ, ప్రజాఐక్యతను దెబ్బతీయగల్గుతారు. ప్రజలు కూడా ఉద్యమ సందర్భంలో స్వీకరించిన కొత్త పద్ధతులను, భావాలను పాత వ్యవస్థలో రోజువారి జీవితంలో పడి అనంతరం కోల్పోతారు. ఇది జరగకుండా వర్గ, ప్రజాఐక్యతకు అవసరమైన సంస్కరణలను నిరంతరం ముఖ్యంగా ఉద్యమ స్తబ్దత కాలంలో మరింత ఎక్కువగా సాగించాల్సి ఉంటుంది. సోషలిస్టు వ్యవస్ధ ఆవిర్భావం తర్వాత దోపిడీ వర్గపాలన అంతమయిన తర్వాత కూడా వివిధ రకాల అసమాన భావనలు (ఆడ-మగ, భాష, జాతి, రంగు మన లాంటి దేశాలలో కుల భావనలు, వాటి మీద ఆధారపడ్డ పద్ధతులు) కొనసాగుతాయని వాటిపై సుదీర్ఘకాలం పోరాటం అవసరమని చెబుతుంటాం. సంస్కరణోద్యమం విప్లవం అనంతరం కూడా అవసరం అన్న మాట. విప్లవం దానంతటదే ఈ పెడధోరణులను నిర్మూలిస్తుంది అనుకుంటే ఏం జరుగుతుందో మాజీ సోషలిస్టు దేశాల వైఫల్యాలు మనకు నేర్పుతాయి.
పోరాట కృషి సంస్కరణ కృషి ఎలా మిళితం అయిపోవాలో సుందరయ్య జీవితం మనకు నేర్పుతుంది. స్త్రీ పురుష సమానత్వం, కుల వివక్ష నిర్మూలన, మూఢ నమ్మకాల స్థానంలో శాస్త్రీయ అవగాహన కల్పన, కులాంతర ఆదర్శ వివాహాల వ్యాప్తి, అందరికీ ఆరోగ్యం, విద్యా వ్యాప్తి వంటి వాటిలో ఆయన చేసిన విశేష కృషి ఆయన విప్లవ కార్యకలాపాలతో ఎలా అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయో తెల్పుతాయి.
సమాజంలో ఆయా వర్గాలకు చెందిన వ్యక్తులు ఆర్థికపరమైన పార్శ్వంలో ఒకే విధంగా స్పందించవచ్చు. కానీ, సామాజికంగా ఒకే మూసగా ఉంటారని చెప్పలేం. ముఖ్యంగా పాత వలస దేశాలలో ఇది మరింత యదార్థం. ఈ దేశాలను సుదీర్ఘ కాలం పాలించిన వలస పాలకులు అనంతరం అధికారానికి వచ్చిన దేశీయ పాలకులు కూడా కుల, మత, ప్రాంత, భావ, తెగ, రంగు తదితర సామాజిక వ్యత్యాసాలను తమ రాజకీయ ఆధిపత్యాన్ని, ఆర్థిక దోపిడీని కాపాడుకోవడానికి వాడుకున్నారు. సామాజిక అసమానతలను అధిగమించి పీడిత వర్గాల సంపూర్ణమైన ఐక్యతను సాధించకుండా చూసుకోవడం ఈ పాలకుల అవసరం. సామాజిక అసమానతలను అధిగమించడం పీడిత వర్గాలకు రెండు రకాలుగా అవసరం. పాలకుల 'చీల్చి పాలించు' రాజకీయాన్ని ఎదుర్కోవడం, సామాజిక వ్యత్యాసాలకు అతీతంగా శిలా సదృశ్య ఐక్యతను సాధించడం. ఇందుకు సంస్కరణోద్యమాన్ని పోరాటాలలో భాగంగా కొనసాగింపుగా నిర్వహించడం తప్ప మరో మార్గం లేదు పీడిత వర్గ ప్రజలలో ఉండే సామాజిక అంతరాలను, అసమానతలను నిర్మూలించడానికి దోపిడీ వర్గాలపై అనుసరించే పోరాట పద్ధతులను అనుసరించలేం. ఒకే వర్గ ప్రజల మధ్య శత్రుపూరితంగా సంఘర్షించుకునే పద్ధతులను అనుసరించలేం. అంతరాలను పెంచడానికి పాలక వర్గాలు అనుసరించే పద్ధతి అది సామాజిక అంతరాల ఉనికిని విస్మరించకుండా ఒకే వర్గ ప్రజలు వాటిని అధిగమించేందుకు నచ్చజెప్పే, ఒప్పించే పద్ధతులను సాధ్యమయినంతవరకు ఎంచుకోవాలి. అందుకు సంస్కరణోద్యమం ఒక ముఖ్య సాధనం. కార్మికవర్గం, పీడితవర్గాలు తమ వర్గ ఐక్యతను సాధించుకోవడానికి కూడా సంస్కరణోద్యమం అవసరం. దాన్ని విస్మరిస్తే, వర్గ పోరాటానికి హానిజేస్తున్నట్టే. పాలక వర్గాల 'చీల్చి పాలించు' ఎత్తులకు చిత్తు అయినట్టే.
సుందరయ్య జీవితంలో మనకు కన్పించే మరో ముఖ్యమైన అంశం ప్రజా సేవా కార్యకలాపాల ప్రాధాన్యత. బాల్యంలో స్వంత ఊర్లో అంగడి పెట్టి వివక్షకు, మోసానికి తావు లేకుండా పేదలకు సరుకులు అందించడం ఆధునిక వైద్య పద్ధతులలో శిక్షణ పొంది పురుళ్లు పోయడం, వేలాదిమంది రైతులను కదిలించి బందరు కాల్వ పూడికను తియ్యడం, ధరలు ఆకాశానికంటుతున్న తరుణంలో రైతుల నుంచి ధాన్యం గిట్టుబాటు ధరకు సేకరించి కేజి బియ్యాన్ని రూపాయికి పేదలకు అమ్మించడం, కరువులో ఆకలి మంటలకు గురయిన పేదలకు గంజి కేంద్రాలను నిర్వహించడం, రాయలసీమకు దాపురించిన కరువులో ప్రజలను ఆదుకోవడం, బెంగాల్ కరువు బారిన పడిన ప్రజలకు వైద్య, వస్తు సహాయాన్ని పంపించడం, దివి తాలూకా ఉప్పెనలో సర్వం కోల్పోయిన ప్రజలకు సహాయ కార్యక్రమాలను ప్రారంభించడం... ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో ఆయన ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ఉంది. సేవా కార్యక్రమాలు కష్టాల్లో ఉన్న ప్రజలకు తక్షణం ఊరట కల్పించడానికి తోడ్పడతాయి. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలపై నైతిక ఒత్తిడి పెంచుతాయి. వాటి వైఫల్యాలను బట్టబయలు చేస్తాయి. విప్లవోద్యమం ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఉద్యమాలు స్తబ్దతలో ఉన్నప్పుడు నిర్భందం తీవ్రంగా ఉన్నప్పుడు ఉద్యమం రాజకీయంగా ఆత్మరక్షణలో ఉన్నప్పుడు ప్రజలతో సంబంధాలు ఆగిపోకుండా కాపాడుకోవడానికి తోడ్పడతాయి. ఇటువంటి కార్యకలాపాలు కూడా లేకపోతే పాలక వర్గాలు విప్లవోద్యమాన్ని సుళువుగా ప్రజల నుంచి వేరుచేసి దెబ్బ తీయగల్గుతాయి. కమ్యునిస్టు ఉద్యమంలో అనేక సందర్భాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
కొంతమందికి సేవా కార్యక్రమాల పట్ల చిన్న చూపు ఉన్నది. ఇవి పోరాటాలకు ఆటంకమని భావిస్తారు. విప్లవవోద్యమం యొక్క సమయాన్ని వృధా చేస్తాయి అనుకుంటారు. ప్రజా అవసరాలను ప్రభుత్వాలు పాలకులు తీర్చాలని పోరాటంజెయ్యాలే, విప్లవోద్యమం పోరాట కార్యక్రమాలను నిర్వహించడమే మేలని అంటారు. సీపీ(ఐ)ఎం నిర్వహిస్తున్న ఐసొలేషన్ కేంద్రాలను దృష్టిలో వుంచుకుని సోషల్ మీడియాలో ఇటువంటి వాదనలు చేసిన వారున్నారు. ప్రజా ఉద్యమాలకు సంబంధం లేకుండా సేవాకార్యక్రమమే పరమార్థంగా జరిగితే అటువంటి కార్యకలాపాలకు పై విమర్శ కొంత వర్తిస్తుంది.
సేవా కార్యక్రమాలను అనేక రకాల వారు నిర్వహిస్తుంటారు. కొంతమంది దయార్ద్ర హృదయులైన ధనవంతులు, వ్యక్తులు నిర్వహిస్తుంటారు. కొన్ని స్వచ్చంధ సంస్ధలు (రోటరీ క్లబ్ వంటివి), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో పెట్టుబడిదారీ సంస్థలు నడుపుతుంటాయి. సేవే పరమార్థం, సామాజిక బాధ్యతగా ఇవి చేస్తున్నామని అంతకుమించి ఎటువంటి రాజకీయ లక్ష్యం లేదని చెబుతున్నా ఈ కార్యకలాపాలు స్టాటస్కోను రక్షించేవాడికే తోడ్పడతాయి. ఆర్.ఎస్.ఎస్ కూడా సంఘసేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. వాటిని చూపి తాను స్వచ్ఛమైన సంఘసేవా సంస్థగా ప్రచారం చేసుకుంటుంది. ఆర్.ఎస్.ఎస్ లక్ష్యం ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థను మార్చడం కాదు. దానికి అదనంగా మతాధార రాజ్యాన్ని జోడించాలన్నదే దాని కోర్కె. దీని సేవా కార్యక్రమాలు ప్రస్తుత వ్యవస్థపై నమ్మకం చెడకుండా చేయడానికి ఇంకొంత ప్రమాదకర స్థితికి తీసుకుపోవడానికి ప్రజల చైతన్యాన్ని వ్యక్తీకరించడానికి పనికొస్తాయి.
సేవా కార్యక్రమాలు దోపిడీ వ్యవస్థపై అసంతృప్తిని పరిమితం చేసుకునే సాధనాలుగా పాలకవర్గాలకు ఉపయోగ పడకుండా ఉండాలంటే కార్మికుల విప్లవోద్యమం ఏం చేయాలి? వాటిని నిర్వహించకుండా వాటి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడమా? లేదా సేవా కార్యక్రమాల స్పేస్‌ను పాలక వర్గ వ్యక్తుల, బృందాలకు వదిలివేయకుండా జోక్యం చేసుకోవడమా? దూరంగా ఉండకుండా చురుకుగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజలలో వ్యవస్థ పట్ల భ్రమలు వ్యాపించకుండా అడ్డుకోగలం. మనం ఈ కార్యక్రమాలను వదిలెయ్యడమంటే పాలకవర్గాల ప్రభావానికి వారిని వదిలెయ్యడమే అవుతుంది. అలాగే వ్యవస్థ మారిందాకా ప్రభుత్వాలు పరిష్కరించేదాకా ప్రజలు ఎదురు చూడరు. ఈ లోపు కొంతైనా ఉపశమనం కల్గించే చర్యలతో ఎవరైనా ముందుకొస్తే అటువైపు ఆకర్షించబడతారు. కార్మికోద్యమం, విప్లవోద్యమం ఈ అవసరాన్ని తీర్చడం తన బాధ్యతగా భావించాలి. అది ఉద్యమాలతో, పోరాటాలతో అనుబంధం కలిగి ఉండాలి. ప్రజల ప్రమేయంతో వారి పరస్పర సహకారంతో వాటిని నిర్వహించాలి. దోపిడీ వ్యవస్థ స్వభావాన్ని అర్థంచేసుకోవడానికి తోడ్పడేట్టుగా ఉండాలి.
నేడు ప్రపంచం, దేశం, రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్న కరోనా విపత్తును ఎదుర్కోవడంలో పోరాటం, సంఘ సంస్కరణ, ప్రజా సేవలను కార్మికోద్యమం ఎలా మేళవించగలదో చూడవచ్చు. కరోనా విపత్తును కూడా తమ లాభం కోసం పెట్టుబడిదారులు ఎలా వినియోగించుకుంటున్నారో, ప్రజల ఆస్తులను ఎలా కొల్లగొడుతున్నారో, మోడీ నాయకత్వాన బీజేపీ...ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడడం కన్నా పాలక వర్గాల లాభాలకు ఎలా అండగా నిలుస్తోందో మనం చూస్తున్నాం. కరోనా విపత్తు నుంచి కాపాడేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి పరిస్థితులకు అనుగుణమైన రూపాలలో పోరాటం నిర్వహిస్తున్నాం. కరోనా విపత్తు సామాజిక జీవనాన్ని కకావికలంచేసి పుట్టుక, పెళ్లి, చావు, కుటుంబం అన్ని రంగాలలో వేళ్లూనుకుని ఉన్న భావాలను సంప్రదాయాలను, ఆచారాలను ప్రశ్నార్థకం చేసింది. కొన్ని చాదస్తాలు, మూఢాచారాలు, కట్టుబాట్లు పటాపంచలవుతుంటే, మరికొన్ని కొత్త మూఢత్వాలు తలెత్తుతున్నాయి. కొత్త సంస్కరణలకు, పోకడలకు రంగం సిద్ధం అవుతున్నది. ఈ తరుణంలో వాస్తవానికి శక్తివంతంగా జోక్యం చేసుకొని అభ్యుదయకర సంస్కరణలను తీసుకువచ్చే కృషి ఎంతో జరగాల్సి ఉంది. ఆ మేరకు చేయలేకపోతున్నాం. ఉపశమన చర్యల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే శక్తి మేరకు సేవా కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు ఉద్యమం తోడ్పడుతుంది. రాష్ట్రంలో నిర్వహించబడుతున్న ఐసొలేషన్ సెంటర్లు ఈ ప్రయత్నంలో ఒక భాగం.
దేశాన్ని కరోనా, ఆర్థికమాంద్యం కుదిపేస్తున్న ఈ తరుణంలో మతోన్మాద బీజేపీ సమాజాన్ని తిరోగమనంలోకి నెడుతున్న సమయంలో సుందరయ్య ఆదర్శంగా మనం పోరాటాలను, సంస్కరణలను, సేవా కార్యక్రమాలను పెనవేసి ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం.
- బి.వి.రాఘవులు