Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి. పార్టీలో 'కామ్రేడ్ పి.ఎస్'గా పిలుచుకునే సుందరయ్య పేరు తెలియని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదు. అంతగా ప్రజల్లో పెనవేసుకుపోయిన ప్రజానాయకు డాయన. 1919 మే 1న జన్మించిన సుందరయ్య 1985 మే 19న మరణించారు. నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సుందరయ్య చిన్ననాటి నుండే ప్రజాస్వామ్య, సమానత్వ భావాలను పుణికిపుచ్చుకున్నారు. గాంధీ నాయకత్వంలో సాగుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనటానికి 17 సంవత్సరాల వయస్సులోనే స్కూల్‌ను వదిలేసాడు. అరెస్టు అయ్యి రాజమండ్రిలోని బోస్టన్ స్కూల్‌కు పంపబడ్డాడు. అక్కడే ఆయన కమ్యూనిస్టులు, దళిత నాయకులను కలిసాడు. విడుదలయిన వెంటనే తన స్వంత గ్రామం అలగానిపాడులో వ్యవసాయ కార్మికులను కూడగట్టి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, కూలిరేట్లు తదితర హక్కులకోసం పోరాటాలు చేసాడు. తరువాత అమిర్ హైదర్‌ఖాన్ మార్గదర్శకత్వంలో ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేదం విధించినప్పుడు అనేకమంది కమ్యూనిస్టు నాయకులు కాంగ్రెస్సోషలిస్టు పార్టీలో చేరి పనిచేయటం ప్రారంభించారు. సుందరయ్య ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. అమీర్ హైదర్‌ఖాన్ అరెస్ట్ తరువాత దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ బాధ్యతను కామ్రేడ్ సుందరయ్య తీసుకున్నారు. ఆయన కృషితోనే అప్పటికే కేరళ కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నాయకులుగా ఉన్న ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్, కృష్టపిళ్లె లాంటి ప్రముఖులంతా కమ్యూనిస్టులుగా మారారు.
1946-51కాలంలో 5సంవత్సరాల పాటు సాగిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ సాయుధ పోరాటానికి కామ్రేడ్ సుందరయ్య ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. సాయుద దళాలను నడిపించారు. ఆనాటి తెలంగాణలోని ఫ్యూడల్దోపిడీని, పోరాటానికి దారితీసిన పరిస్థితులు, నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన వీరోచిత పోరాటాన్ని, ఆ పోరాటంలో పొడసూపిన పెడధోరణులు, కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన విభేదాలు, వాటి మూలాలను సవివరంగా పేర్కొంటూ సుందరయ్య 'తెలంగాణ సాయుధపోరాటం - గుణపాఠాలు' అనే మహాగ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కమ్యూనిస్టులందరూ తప్పక చదవాల్సిన గ్రంథమిది.
పార్టీలో తలెత్తిన రివిజనిస్టు ధోరణులపైన కామ్రేడ్ సుందరయ్య ఎంతో నిశితంగా, సైద్ధాంతిక స్పష్టతతో పోరాడారు. సుమారు 15సంవత్సరాల పాటు పార్టీలో ఐక్యతను కాపాడటానికీ, సరైన మార్క్సిస్టు పంథాను అంగీకరింపజేయటానికి సుందరయ్య నాయకత్వంలో విఫలయత్నం జరిగింది. అనివార్యపరిస్థితిలో 1964 నవంబర్‌లో పార్టీ చీలి సీపీఐ(ఎం) ఏర్పడింది. పార్టీ స్థాపకుల్లో సుందరయ్య ముఖ్యుడు. ఆయనే మొదటి కార్యదర్శిగా ఎన్నికై 1976దాకా కొనసాగారు. ఆ తరువాత నంబూద్రిపాద్ కార్యదర్శి అయ్యారు.
1952లో మద్రాస్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుందరయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్లమెంట్లో కమ్యూనిస్టు పార్టీయే అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా సుందరయ్య పనిజేసారు.1955లో గన్నవరం నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికై 1967వరకు కొనసాగారు. అఖిల భారత పార్టీ కార్యదర్శిగా వైదొలిగి తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యాక, 1978లో గన్నవరం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లోనూ, అసెబ్లీలోనూ సుందరయ్య ప్రసంగాలను సభల్లోని యితర సభ్యులు, ప్రభుత్వమూ ఎంతో ఆసక్తిగా చెవులు రిక్కించి మరీ వినేవాళ్లు. ఆయన ఎంతో లోతైన, నిర్థిష్ట అధ్యయనంతో అపార పరిజ్ఞానంతో విషయాలను విశ్లేషిస్తూ మాట్లాడేవారు. 1981లో సుందరయ్య 'ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర నీటి పథకం' అనే పుస్తకం రాసారు. ఈ పుస్తకంలో ఆయన రాష్ట్రంలో నీటివనరులను సక్రమంగా, సమానంగా ఎలా వాడుకోవాలో వివరించారు. తెలుగు ప్రజల సమగ్రాభివృద్దికోసం ప్రణాళికను వివరిస్తూ 1944లోనే 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అనే పుస్తకం రాసారు. 1936లో భూసంభందాలను అధ్యయనం చేసి, రైతు ఉద్యమాన్ని అభివృద్ది చేయటానికి ఆయన ఒక నివేదిక రూపొందించారు. 1977లో గుంటూరు జిల్లా, కాజ, అనంతవరం గ్రామాల్లో లోతైన సర్వే చేసి 'భూసమస్య'పైన ఆయన ఒక పుస్తకం రాసారు.
సుందరయ్య కార్యకర్తలను అమితంగా ప్రేమించేవాడు. వాళ్ల యోగక్షేమాలతోబాటు, సైంద్ధాంతిక అభివృద్దిని బాగ పట్టించుకునేవారు. రాజకీయ పాఠశాలలు నిరంతరం జరగాలని పట్టుబట్టేవారు. కామ్రేడ్ సుందరయ్యలో మనం నేర్చుకోవల్సిన చాలా గొప్ప గుణాలున్నాయి. దేశభక్తి, మానవత్వం, నిరాడంబరత, నిస్వార్థతత్వం, నిజాయితీ, త్యాగం, సూత్రబద్ద విధానం, నమ్రత, శ్రమపట్ల గౌరవం, కష్టపడి పనిజేయటం, సమిష్టితత్వం, క్రమశిక్షణ, సమయపాలన ఇంకా ఎనెన్నో అద్బుత లక్షణాలున్న ఆదర్శమూర్తి ఆయన. వ్యక్తిగతంగా అజాతశత్రువులాంటి సుందరయ్య సైద్ధాంతికంగా తను తప్పుగా భావించిన అంశాలపై మాత్రం చాలా నిశితంగా వ్యవహరించేవాడు. కార్యకర్తలను అమితంగా ప్రేమించి, అత్యంత శ్రద్దవహించే లక్షణంతోపాటు పార్టీ నిర్మాణానికి, క్రమశిక్షణకు నష్టంకలిగించే ధోరణులు ఎంతటి ప్రముఖుల నుంచి వ్యక్తమైనా సహించకపోయేవారు. ఈ సద్గుణాలను ఆయన నుంచి నేర్చుకోవటానికి, అమలు జరపటానికి నిరంతరం ప్రయత్నించటమే కామ్రేడ్ సుందరయ్యకు మనం అర్పించే నిజమైన నివాళి అవుతుంది.
సుందరయ్యకు ఇష్టమైన పనుల్లో సేవాకార్యక్రమాలు, కష్టకాలంలో ప్రజలకు చేయూతనందించటం చాలా ముఖ్యమైనవి. 'ప్రజలకు ఇది చేయలేదు, అది చేయలేదు అని ప్రభుత్వాలను విమర్శించటం' తోనే మన బాధ్యత పూర్తి కాదు. మన శక్తిమేరకు ప్రజలకు సహాయం చేయాలి. సేవలందించాలి. ప్రజా పోరాటాలు నిర్మించటంతోబాటు, ప్రజలకు కష్టకాలంలో సహాయం చేయటం, సేవలందించటం అనేది వ్యక్తిగత గుణానికి సంబంధించిన అంశం మాత్రమే కాక, అది మార్క్సిస్టు అవగాహనలో ఒక ముఖ్యమైన భాగంగా మనం గుర్తించాలి. వివిధ దేశాలలో ప్రజాపోరాటాలు ఉధృతంగాలేని కాలంలో మార్క్సిస్టు మహౌపాధ్యాయులంతా ఈ విధమైన కృషిపైనే ప్రధానంగా కేంద్రీకరించి ప్రజలతో కలిసిపోయారనే విషయం మనకు చరిత్రలో కనపడుతుంది. తన జీవిత కాలంలో సుందరయ్య ఆవిధంగా అనేకం చేసారు. చేయించారు. కాలువలు తీయటం, రోడ్లు వేయటం, తుపాన్ బాధితుల సహాయాలు, వైద్య సహాయాలు లాంటి ఎన్నో కార్యక్రమాలలో స్వయంగా పాల్గొన్నాడు. వివిధ సందర్బాలలో పార్టీని ఆ విధంగా పనిజేయించారు.
వాస్తవంగా ప్రజలకు సేవ చేసేందుకు, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకే రాజకీయాలు తప్ప, ఎన్నికల్లో రాజకీయ ఫలితాలకోసం ప్రజాసేవ కాదు గదా! కానీ నేటి రాజకీయాల్లో ఆ సూత్రం తిరగబడుతోంది. ప్రజలకు ఏదైనా సహాయం చేయటం అంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాల్చుకోవటం అనే దృష్టితో సేవాకార్యక్రమాలు నడిచే కాలం వచ్చింది. వ్యక్తులపేర కటౌట్ సేవలు, రాజకీయంగా తమ అనుకూలురకే ప్రభుత్వ సేవలు ఈ కోవకే చెందుతాయి. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలకోసం జనసేవను పక్కనబెట్టే ఉదాహరణలూ మనముందున్నాయి. ''రోమ్ తగలడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు, ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు మరణిస్తుంటే, వందలాది శవాలు గంగానదిలో తేలుతుంటే ప్రధాని మోడీ 'పార్లమెంట్ సెంట్రల్ విస్టా' నిర్మాణంలో తరిస్తున్న దుస్థితి, దేశమంతా కోవిడ్ రెండో 'అల'తో కొట్టుమిట్టాడుతుంటే వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకోసం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి వచ్చింది. ప్రారంభంలో ''అన్నీనేనే అని విశ్వరూపం చూపిన విశ్వగురు'' ఇప్పుడు లక్షల మంది వైద్యం అందక, కనీసం ఆక్సిజన్ సరఫరా లేక మరణాల పాలవుతుంటే మౌనవ్రతం పాటిస్తున్న 'అమానవీయత' ఆవిష్కృతమైంది. మరి తెలంగాణాలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడినపుడు అక్కడ ఎన్నికల రాజ్యం లేదుగదా? తుపాకి పట్టి సాయుధపోరాటం సాగిస్తూ నేలకొరిగిన 4వేల మంది కమ్యూనిస్టు యోధులు ఏ ఎన్నికల ఫలితాలనాశించి ఆ పోరాటం సాగించారు? 170సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఏ ఎన్నికలూ, ప్రజాస్వామ్యమూ లేని అనేక దేశాలలో కమ్యూనిస్టులు సాగించిన పోరాటాలు, ప్రాణత్యాగాలూ ఏ పదవులకోసం? ప్రజల మేలుకోసం ప్రాణాలు సయితం లెక్కచేయని కమ్యూనిస్టుల ఆదర్శానికీ, తమ రాజకీయ ప్రయోజనాలకోసం వేల మంది ప్రజల ప్రాణాలను బలిపెట్టే బూర్జువా రాజకీయాల భ్రష్టత్వానికీ పోలికేముంటుంది? ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు, దోపిడీ, పీడన, అన్యాయాలకు గురౌతున్నప్పుడు వాటిని అడ్డుకున్నవాడు, శక్తికొలదీ పోరాడినవాడు, ప్రజలకు నిత్యజీవితంలో సహాయపడగలిగినవాడే సరైన కమ్యూనిస్టు. ఈ క్రమంలో ఏదైనా దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్యం ఉంటే ఆ ఎన్నికలు ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడే స్వభావం ఉంటే వాటిని కూడా ప్రజల సేవకోసం ఉపయోగించుకోవటం అనేది కమ్యూనిస్టుల పనిలో ఒక చిన్న భాగమే తప్ప అదే సర్వస్వం కాదు. ఎప్పటికీ కాబోదు. ఇదే మార్క్సిజం మనకు నేర్పిన మాట. ఇదే సుందరయ్య మనకు చూపిన బాట.
నేటి పరిస్థితిలో ప్రపంచాన్ని కోవిడ్ రూపంలో ఆరోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఆవరించి ఉన్నాయి. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఈ సంక్షోభాల సమయంలో ప్రజలకు సహాయకారి పాత్ర నిర్వహిస్తున్నారు. మన దేశంలో మోడీ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం, కార్పొరేట్ ఎజండా అమలు ఫలితంగా కోవిడ్ మహమ్మారి రెండోసారి విజృంభిస్తున్నది. మొదటి దఫా కరోనా ప్రభలినప్పుడే పేద, మధ్యతరగతి ప్రజలు ఎన్నో కష్టాల పాలయ్యారు. అనేక కుటుంబాలకు ఉన్నదంతా ఊడ్చుకుపోయి అప్పుల పాలయ్యారు. ఇక ఈ రెండో దఫా ఉధృతిలో ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారనున్నాయి. ఈ పరిస్థితిలో ప్రజలకు సహాయం, వైద్యసేవలు అందించే పనిలో మనం నిమగం కావాలి. ఇప్పటికే హైదరాబాద్‌లో 'సుందరయ్య విజ్ఞాన కేంద్రం', ఖమ్మంలో 'బోడేపూడి విజ్ఞాన కేంద్రం' మేడ్చల్ జిల్లా ప్రగతినగర్‌లో కోవిడ్ రోగులకోసం ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటుజేసి వైద్యసేవలందించటం జరుగుతోంది. ఇంకా అన్ని జిల్లా కేంద్రాలు, చాలా మండల కేంద్రాలలో కోవిడ్ సహాయ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కృషిలో పాల్గొంటున్న కార్యకర్తలందరికీ అభినందనలు. ఈ కృషి మరింతగా పెరగాలి. సుందరయ్య స్ఫూర్తితో మనం మరింతగా జనంలోకి వెళ్లాలి.
'కామ్రేడ్ పి.ఎస్... నీ బాటలో నడుస్తాం. మన ఆశయాలు సాధిస్తాం. మీకు మా జోహార్లు. లాల్ సలాం.'
- తమ్మినేని వీరభద్రం