Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''స్వరరాగ గంగా ప్రవాహమే'' అని జేసుదాసు పాడితే పరవశించిపోయిన ఈ దేశంలో ఇప్పుడు శవగంగా ప్రవాహం చూశావా రాజా అని ప్రశ్నించే విషాదాన్ని సృష్టించినవారెవరు? పరవశాన శిరసూగంగా తలకు జారెనా శివగంగ అని శంకరశాస్త్రి గానం చేసిన శివగంగను శవగంగగా మార్చిన వారెవరు? సెకండ్ వేవ్ అనే కరోనా మలిదెబ్బకు కుటుంబాలకు కుటుంబాలే బలైపోతుంటే ప్రాణవాయువును అందించలేని ఘోర దురవస్థకు కారకులెవరు? కోవిడ్‌పై పోరాటంలో విశ్వగురువులమంటూ వీరంగం తొక్కిన విపరీతకాండ ఎక్కడీ ప్రపంచానికే వాక్సిన్ అందించే ఔషద రాజధానిగా దేశాన్ని మార్చామని గొప్పలు పోయిన చోట వ్యాక్సిన్ కేంద్రాల మూత ఎందుకు జరుగుతున్నది? ప్రభుత్వాసుపత్రులు చాలక, ప్రయివేటు వైద్యం ఖరీదు అందక, మందులు చిక్కక వేలమంది ప్రాణాలు వదిలే పరిణామం ఎందుకొచ్చింది?
రాజా వినిపిస్తున్నదా?
ప్రశ్నలు.. ప్రశ్నలు.. ప్రత్యర్థులు కాదు. ప్రజలడుగుతున్న ప్రశ్నలు. మిమ్మల్ని అభిమానించి ఆరాధించిన అనుయాయులు అడుగుతున్న ప్రశ్నలు. గుజరాతీ కవయిత్రి పరుల్ కక్కర్ అక్షరాలా సంఫ్‌ుపరివార్ భాగస్వామి. ఆమెను కవయిత్రిగా వారే ప్రచారంలో పెట్టారు. రాధాకృష్ణుల శృంగారాన్ని భక్తిని గానం చేసిన భక్తురాలు. మోడీకి బీజేపీకి కూడా భక్తురాలే. కాని భయానకంగా మారిన కోవిడ్ విషాదం చూడలేక చలించిపోయింది. ''రాజా, శవాలు మాట్లాడుతున్నాయి వినిపిస్తుందా''అని కవిత రాసింది. ''అంతా శ్మశానమై పోయింది.. ఓ రాజా బతికించే వాళ్లు లేరు, శవాలను మోసే వాళ్లు లేరు, అంతా కోల్పోయిన దు:ఖితులు మాత్రం మిగిలారు/ మాటలు లేక బరువెక్కిన మా హృదయాలు శోకగీతాలైనాయి/ ప్రతి ఇంట్లో మృత్యుదేవత తాండవమాడుతోంది/ ఓ రాజా నీ రామరాజ్యంలో గంగశవమయమై శవగంగా ప్రవాహమైంది/ ఆచ్చాదన లేని దిగంబర రాజును అంతా చూస్తున్నారు/ కోపానల జ్వాలలు ఆకాశాన్నితాకుతున్నాయి...'' పరుల్ కక్కర్ కవితలో ప్రజ్వరిల్లిన ఈ ఆగ్రహావేదనలు వాస్తవానికి భారతదేశంలో వికటాట్టహాసం చేస్తున్న మృత్యునృత్య ప్రతిబింబాలే. అసహాయంగా ఆరిపోతున్న ఆత్మీయులను చూడలేక అభాగ్య ప్రజానీకం వినిపిస్తున్న ఆర్తనాదాలే. కానీ ఏలినవారికి అందులోనూ దేశమేలే రాజుగారికి ఇవి బొత్తిగా మింగుడు పడటం లేదు. వారికి వంధిమాగధ కీర్తనలు తప్ప వాస్తవ వేదనలు బొత్తిగా గిట్టవు. అందుకే ఆయన కనుసైగతో సంఫ్‌ుపరివార్ ఆమెపై దాడి చేసింది. నిన్న సంప్రదాయమూర్తిగా గోచరించిన ఆ మహిళే ఈ రోజు మహమ్మారి అయినట్టు ప్రాణమానాలు హరిస్తామని బెదిరింపులకు దిగారు. వెకిలి మాటలతో వేటకొడవళ్లతో వెంటాడటం మొదలుపెట్టారు. దేశాధినేత మూలపీఠమైన గుజరాత్లో ఆయన శిబిరానికి చెందిన వనితకే ఇంత భయానక స్థితి ఎదురైతే ఇతరుల గురించి ఏం చెప్పాలి?
నూటముప్పై కోట్ల బకరాలా
జగ్‌సూర్య ప్రముఖ వ్యంగ్యరచయిత. సీనియర్ కాలమిస్టు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆయన పదునైన వ్యంగ్య బాణాలు ప్రసిద్ధం. మహాప్రభువులు, మహా వంత(సుప్రీంలీడర్, సూపర్ సైడ్‌కిక్) కలసి మాట్లాడుకున్నట్టు ఆయన ఒక వ్యంగ్యాస్త్ర్రం సంధించారు. నిన్నటిదాకా మనను పొగిడిన వారే ఇప్పుడు తిట్టిపోస్తున్నారేమిటని మహా ప్రభువు ప్రశ్నిస్తాడు. మనం భజనలు తప్ప విమర్శలు పట్టించుకోము గదా అని మహావంత సర్దుబాటు చేయబోతాడు. కాదు వంతా ఈసారి అలా కుదిరేట్టులేదని వాపోతాడు మహాప్రభువు. చేతులు కడుక్కోమని చెప్పాం కదా అంటే ఈ విమర్శల నుంచి చేతులు కడుక్కోవాలంటాడు. భౌతిక దూరం పాటించాలన్నాం కదా అంటే సరైన విధానాల నుంచి బౌతికదూరం పాటించామంటాడు. చివరకు దీనంతటినీ మోపడానికి ఎవరో ఒక బలిపశువును(స్పేప్‌గోట్)ను చూద్దామని మహావంత అంటే బలిపశువు కాదు, తప్పించేవారు(ఎస్పేప్‌గోట్) కావాలంటాడు. దాందేముంది? ఇప్పటికే ఈ దేశంలో నూటముప్పై కోట్ల ప్రజలను బకరాలను చేశాం కదా అంటాడు వంత. ఈవ్యంగ్య రచన టైమ్స్ వెబ్ ఎడిషన్‌లో వచ్చింది గాని తీరా పత్రిక అచ్చయి వచ్చేసరికి లేదు. కేంద్రం ఒత్తిడి మేరకు దాన్ని తీసేయించారు. వైర్ పత్రిక ఆ పాఠాన్ని ప్రచురించింది గనక మనకు దొరికింది.
అస్మదీయులలోనే అలజడి
అయితే ఈ అవకాశం కూడా బీజేపీకి ఉండకుండా పోతున్నది. ఆ పార్టీ నేతలే మోడీ విధానాల వైఫల్యాన్ని తూర్పార పడుతున్నారు. బీజేపీకి అత్యధిక స్థానాలున్న యూపీలో ఇప్పటికి నలుగురు ఎంఎల్ఎలు, ఇద్దరు మంత్రులు మరణించారు. బుధవారం కూడా రెవెన్యూ మంత్రి విజరు కశ్యప్ కరోనాతో చనిపోయారు. పశ్చిమ లక్నో ఎంఎల్ఎ సురేష్ శ్రీవాత్సవ, రారు బరేలి ఎంఎల్ఎ దల్‌బహుదూర్ కోరి, అరూలియా ఎంఎల్ఎ రమేష్ దినకర్, బరైలీ ఎంఎల్ఎ కేర్‌సింగ్ ఇలా వరుసపెట్టి కోవిడ్‌కు బలైపోయారు. ఇక సామాన్యుల సంగతి ఏం చెప్పడం? తనే పాజిటివ్‌కు గురైన ఫిరోజాబాద్ ఎంఎల్ఎ పప్పులోధి భార్యను చేర్పించాలంటే ఆస్పత్రి దొరక్క మూడు గంటలు నిరీక్షించవలసి వచ్చిందట. వీరంతా ఎందుకు? కేంద్ర మంత్రి సంతోష్ గ్యాంగ్వర్ తన నియోజకవర్గమైన బరైలీలో కోవిడ్ సదుపాయాలే లేవని ముఖ్యమంత్రి యోగికి లేఖ రాయాల్సి వచ్చింది. రాష్ట్ర మంత్రులు కూడా ఇలాగే మొరపెట్టుకున్నారు. బీహార్‌లో బీజేపీ ఐటిసెల్ కన్వీనర్ అనుష్‌ఠాగూర్ వాక్సిన్ కొరతపై తానే ఫేస్బుక్ పోస్టు పెట్టాల్సివచ్చింది. ఇంత ధైర్యంలేని బీజేపీ ఖైరాబాద్ ఎంఎల్ఎ రాకేశ్ రాథోర్ మీ నియోజకవర్గంలో కోవిడ్ ఆస్పత్రి ఏమైంది అని మీడియా అడిగితే ఇప్పుడు మాట్లాడితే రాజద్రోహ మవుంతుందని చేతులెత్తేయడం దేశంలో పరిస్థితికి అద్దం పడుతున్నది. వీరంతా ఏమిటి? సాక్షాత్తూ బీజేపీ గ్రేట్ లిటిగెంట్ సుబ్రహ్మణ్యస్వామి కూడా ఈ దారుణ పరిస్థితికి తట్టుకోలేక ప్రభుత్వంపై విరుచుకుపడాల్చి వచ్చింది. కోవిడ్ కేసులు కాస్త తగ్గగానే మాదే ఘనతన్నారు కదా ఇప్పుడు ఇంతగా విజృంభిస్తే మీ బాధ్యత ఉండదా? అని ట్విటర్లో ప్రశ్నించారు.
నిజంగానే అన్లిమిటెడ్
ఈ నేపథ్యంలోనే ఆరెస్సెస్ అధినేతలు రంగప్రవేశంచేసి మోడీ ఇమేజి డామేజిని సరిచేయడానికి పాజిటివిటీ అన్లిమిటెడ్ పేరిట కప్పిపూత ప్రహసనం ఒకటి ప్రారంభించారు. అజిత్ ప్రేమ్‌జీ, శ్రీశ్రీశ్రీ రవిశంకర్, సద్గురు జగ్గీవాసుదేవ్ వంటివారిని పిలిపించి నాలుగు మంచి మాటలు చెప్పించి మోడీని కాపాడేందుకు రంగప్రవేశం చేశారు. (ఆ సభలోనూ స్వయంగా మోహన్ భగవత్ ప్రజలూ ప్రభుత్వమూ నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇంతటి దుస్థితి ఎదురైందని చెప్పక తప్పలేదు.) మరోవైపున ఎంజె అక్బర్, అనురాగ్‌ఠాగూర్ తదితరులు సోషల్ మీడియాలో మోడీపై కట్టలుతెంచు కుంటున్న ఆగ్రహాన్ని ఎలా అదుపు చేయాలని అల్లాడిపోతున్నారు. ఎన్ని తంటాలు పడితేనేం? మోడీ తప్పుకో అనే హ్యాష్ ట్యాగ్‌కు కోట్లాది లైక్‌లు! ప్రత్యక్ష ఆదేశాలతోనో పరోక్ష ఒత్తిడితోనో దాన్ని తొలగించిన ఫేస్బుక్ యాజమాన్యం తర్వాత పునరుద్ధరించక తప్పనిస్థితి. కోవిడ్‌లోనూ మత విభేదాలు ప్రచారంలో పెడుతున్న ఆరెస్సెస్ తీరుపై విమర్శనాత్మక పోస్టును తొలగించేందుకు నిరాకరించవలసిన స్థితి. గతసారి నిజాముద్దిన్ మర్కజ్ తబ్లిగే జమాయిత్ వల్లనే కోవిడ్ వ్యాపించందన్నట్టు ప్రచారం చేసిన పరివారం కుంభమేళాలో ఆదిగురువులే అసహాయంగా రాలిపోతుంటే సమర్థించుకోలేక ఆఖరిఘట్టంలో ఏదో కంటితుడుపు చర్యలతో సరిపెట్టే యత్నాల విఫలం. అటు కుంభమేళాతోనూ ఇటు బెంగాల్ ఎనిమిది దశల ఎన్నికల సభలతోనూ స్వయంగా మోడీ అమిత్‌షాలే కరోనా వ్యాప్తికి కారకులైనారనే కఠోరసత్యం కండ్లముందు నిలిచిన చిత్రం.
మహామానవా బహుపరాక్
అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా ఇంకా ప్రధానిని ప్రసన్నం చేసుకోవ డానికి పాకులాడే కేంద్రమంత్రుల భజన బృందం వినోదపర్వం. మహామానవుడు గనకే ఆయన దేశ ప్రజలందరిబాధ తనదిగా చేసుకున్నాడని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రశంసలు. ఆక్సీజన్‌నుంచి వాక్సిన్ వరకూ ప్రతిదీ అందించారని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా పొగడ్తలు. మోడీ మార్గనిర్దేశంలో దేశం స్థయిర్యవంతమైందని విదేశాంగ మంత్రి జైశంకర్ కీర్తనలు. క్లిష్టసమయంలో దేశాన్ని ఒక్కతాటిపై నిలిపారని రవిశంకర్ ప్రసాద్ భజనలు. ఇవన్నీ నెలకిందటి సంగతులే సుమా! వారెంతగా స్తుతిస్తేనేం? మొత్తం నేనేనన్న మోడీజీ కోవిడ్ విధానం ఘోరంగా విఫలమైంది. రోజుకు నాలుగులక్షలు దాటిన పాజిటివ్‌లు నాలుగు వేలకు పైన చావులు ప్రపంచంలోనే ఘోరమైన దేశంగా చేశాయి. వాక్సిన్ వచ్చేసిందని వరుసలు నిలబెట్టి చేతులెత్తేసిన బాధ్యతా దేశప్రజలను కుపితులను చేసింది. వరుసగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యాక్సిన్ ఆక్సిజన్ కోసం కేంద్రానికి లేఖలు కురిపించాల్సి వచ్చింది. పార్టీలూ మీడియా ప్రజా వైద్య బృందాల సంగతి అటుంచి సుప్రీం కోర్టు, హైకోర్టులు తాముగా జోక్యం చేసుకోవలసి వచ్చింది. నిపుణుల కమిటీని నియమిస్తామన్నాయి. అయోధ్య వివాదం కోసం కోర్టు వెంటపడిన అధినేతలు ఆరోగ్యవిషయంలో జోక్యం చేసుకోవద్దన్నారు. ఈ దేశాన్ని దేవుడే కాపాడాలని యూపీ హైకోర్టు వంటివి వ్యాఖ్యానించాయి. దీనంతటికీ పరాకాష్ట శాస్త్రవేత్తల నిరసనాత్మక నిష్క్రమణ. కోవిడ్‌ను అద్యయనం చేయడానికి ఏర్పాటైన జీనోమ్ కన్సార్టియం(ఇన్సాకోగ్) అధినేత ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్ ప్రభుత్వం ఎలాంటి సలహాలు వినిపించుకోవడం లేదంటూ రాజీనామా చేశారు. కోవిడ్ 19 బెడద బ్లాక్ ఫంగస్ ముప్పుగా మారి దేశ ప్రజలు చూపు కోల్పోతున్నా ఇప్పటికీ కండ్లు తెరవని కేంద్ర సర్కారు ఏవో సంప్రదింపులు సమీక్షలు అంటూ సరిపెడుతున్నది. గతంలో వలె దీపాలు చప్పట్ల చిట్కాలు పనిచేయవు గనక కొత్తవాటికోసం వెతుకుతున్నారు.
చెప్పడం కాదు, వినండి!
ఏమైనా కోవిడ్19 సెకండ్ వేవ్ విషాదంతో విషయం విదితమైంది. ''గంగపారుచుండు కదలని గతితోడు మురికివాగు పారు మోత తోడ'' అని అన్నట్టు ఎన్ని మాటలుచెప్పినా బ్రాండ్ మోడీ బాడ్ బాడ్ అని ప్రజలు తేల్చుకున్నారు. ఎన్నికల్లో ఏమాత్రం ఆవకాశమున్నా ఓడించిపంపుతున్నారు. సోషల్ మీడియా సోపానంగా వచ్చిన గుజరాతీ బాస్‌కు ఇప్పుడు డిస్లైక్లే పెరిగిపోతున్నాయి. మన్కీబాత్లు వినడంమానేసి మొదట చెప్పుకున్న గుజరాతీ కవయిత్రి పరుల్ కక్కర్లా శవాల మాటలు వినిపిస్తున్నాయా, శవగంగ కనిపిస్తున్నదా అని ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రుల నుంచి శ్మశానాల దాకా ప్రతిచోటా ఆసేతుశీతాచలం అదే సవాలు... రాజా వినిపిస్తున్నదా?
- తెలకపల్లి రవి