Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రధాని కాదు... ముఖ్యమంత్రీ కాదు... అయినా ఆయన పేరు చిరస్మరణీయం..!
తెలుగు ప్రజల చరిత్రమీద ఆయన పేరు చెరగని ముద్ర
ఆయనే పుచ్చలపల్లి సుందరయ్య. మంచి కమ్యూనిస్టుకు మారుపేరు మన సుందరయ్య!
మైనారిటీకూడా తీరకముందే జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. 1930లోనే జైలుకు వెళ్ళారు. శారీరకంగా, ఆరోగ్యంగా బలంగా ఉండాలనీ, ఎలాంటి కష్టాన్నైనా భరించడానికి సిద్ధంగా ఉండాలనీ అప్పటికే నిర్ణయించుకున్నారు. ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథం కలిగి ఉండాలనీ, నిరాడంబర జీవితం గడపాలనే లక్షణాలు నూనూగు మీసాల వయస్సులోనే సంతరించుకున్నారు. శరీర దారుఢ్యం, సైకిల్ ప్రయాణం, కొండలు ఎక్కే అలవాటు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బాగా ఉపయోగపడ్డాయని తానే చెప్పారు. స్వగ్రామంలో ప్రజల కోసం రాత్రి పాఠశాల నిర్వహించారు. పేదలకు ప్రథమ చికిత్స చేసి ఉచితంగా మందులు సేకరించి సహాయపడ్డారు. తానే కాదు, తన తమ్ముడు రామ్‌ను కూడా ఇంజనీరింగ్ చదువుకోకుండా వైద్యవృత్తి వైపు ప్రోత్సహించారు. వైద్యవృత్తి ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసేందుకు ఉపయోగపడుతుందని భావించారు. నిత్య జీవితావసర సరుకులు సరసమైన ధరలకు చవక దుకాణం ద్వారా సరఫరా చేసారు. పట్టణం నుంచి తాను సైకిల్‌మీద సరుకులు తెచ్చి, లాభనష్టాలు లేకుండా ప్రజలకు అందించారు. ''ప్రజలు కలసికట్టుగా నిలబడితే, సమాజం సంపూర్ణంగా మారేదాకా వేచి ఉండకుండానే కొంత వరకు సాధించుకోగలమని ప్రజలకు తెలియజేసేందుకే ఈ సహకార దుకాణం'' అన్నారాయన. 1935 నాటికే తాను అస్పృశ్యతకు వ్యతిరేకంగా నిలబడ్డారు. స్వయంగా తన పేరులో 'రెడ్డి' అనే పదం తొలగించుకున్నారు. తన కుటుంబంలో మహిళల పరిస్థితి గమనించి మహిళల హక్కుల కోసం పోరాటం ప్రాధాన్యతను గుర్తించానని చెప్పడానికి సుందరయ్య వెనుకాడలేదు. అంతే కాదు, తాను చేయాలనుకున్న పనులు ముందుగా తన కుటుంబం, తన గ్రామం నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడాయన. ఛాందసవాదం, మూఢనమ్మకాలు, ఫ్యూడల్ ధోరణులపట్ల తన తిరుగుబాటు ధోరణి కుటుంబంలోనూ, గ్రామంలోనూ ప్రదర్శించారు. తన లగేజీ తానే మోసుకోవటం ఒక అలవాటుగానే ఆచరించారు.
తన పనులు తానే చేసుకున్నారు. సేవకులుండాలని కోరుకోలేదు. తను కూర్చున్న చోటుకు అన్నీ సమకూర్చాలనీ, తను తిన్న పళ్ళెం కడిగిపెట్టాలనీ, తన బట్టలు ఉతికి పెట్టాలనీ కోరుకోలేదు. దర్పం ప్రదర్శించలేదు. ఇవన్నీ తాను నాయకుడు కాబట్టి ఆదర్శం కోసం చేయలేదు. ప్రజల కోసం ఇవన్నీ చేయడం ద్వారా ఆదర్శ నాయకుడయ్యారు. ప్రజా ప్రతినిధిగా పోటీ చేసేందుకో.. నాయకుడుగా గుర్తింపు పొందేందుకో చేసిన పనులు కావివి. నమూనాల కోసం చేసిన పనులు అసలే కాదు. ప్రజల కోసం అంకిత భావంతో చేసిన కృషి. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసిన తీరువల్లనే, ప్రజలకు సేవచేయటం ఒక అలవాటుగా ఉన్నందువల్లనే సుందరయ్య జీవితమే ఒక నమూనా అయ్యింది. భావితరాలకు ఆదర్శమైంది. గొప్పనాయకుడై చెప్పిన సిద్ధాంతాలు కాదు. ఆచరించటం ద్వారానే గొప్ప నాయకుడయ్యాడు. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా కొట్టిపడేసే కాలంలో మనం ఉన్నాం. ఎందుకీ పరిస్థితులు వచ్చాయో కూడా మనం పరిశీలించాలి.
జైలు నుంచి విడుదల కాగానే సుందరయ్య ఇంటికి పోలేదు. సరాసరి కేంద్ర కమిటీ సమావేశాలకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఈశాన్య భారతంలో ఉన్న తేజ్‌పూర్ పట్టణానికి బయలుదేరారు. దారిలో పార్టీ సానుభూతిపరుల నుంచి దారి ఖర్చులకు డబ్బు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడున్నట్టు ఆనాడు జైలు ముందు చేరి స్వాగతం పలికేవారు లేరు. పత్రికా విలేకరులూ, ఫొటోగ్రాఫర్లూ, టీవీ చానళ్ళూ లేవు. కనీసం పార్టీ ఆఫీసులూ, బ్యాంకులో డబ్బులూ లేవు. తానే నేత, తానే కార్యకర్త. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని విమానంలో ప్రయాణించే అవకాశాలున్న కాలం కాదు.
ప్రజాసేవకూ, ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలకే ప్రాధాన్యత నిచ్చారు. ప్రజా ఉద్యమ యోధులకే ప్రాముఖ్యత నిచ్చిన నేత సుందరయ్య. 1963లో జైలునుంచి రాగానే సరాసరి కామ్రేడ్ డి.వి. సుబ్బారావు ఇంటికి వెళ్ళారు. ఇది ఆనాటి పార్టీ కార్యదర్శి నీలం రాజశేఖర్‌రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. క్రమశిక్షణ చర్య తీసుకోబోతున్న కామ్రేడ్ ఇంటికి ఎందుకు వెళ్ళారని సుందరయ్యను అడిగారు. అందుకు సుందరయ్య ''మరి ఎక్కడి కెళ్తాననుకున్నావు? పోలీసులు అరెస్టు చేయగానే కాళ్ళు చల్లబడి, ఏ చిత్రహింసలకు గురికాకుండానే బహిరంగ ప్రకటనలు చేసిన వారి దగ్గరకా? 1948 నుంచి పార్టీలో ఉంటూ తీవ్రమైన చిత్రహింసలకు గురై కూడా శత్రువుకు ఏ రహస్యమూ చెప్పని కామ్రేడ్ సుబ్బారావు దగ్గరకా? ఎక్కడ నేను ఉండవల్సిన చోటు? కావాలనే వెళ్ళాను.'' ఇదీ సుందరయ్య జవాబు. పని విభజనలో కూడా ప్రజాపోరాట బాధ్యతలు కోరుకున్నాడు. తెలంగాణ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించే బాధ్యత కోరి తీసుకున్నాడు. సుందరయ్య జీవితమంతా పదవులకు కాకుండా, ప్రజా ఉద్యమానికీ, సైద్ధాంతిక పోరాటానికే ప్రాధాన్యత నిచ్చారు. ఉమ్మడి పార్టీలో మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు పొలిట్‌బ్యూరోలో ఉండగా, సుందరయ్య కేంద్ర కమిటీ సభ్యుడుగా పనిచేసారు. సీపీఐ(ఎం) ఆవిర్భవించినప్పుడు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. ఎమర్జెన్సీ కాలంలో సైద్ధాంతిక విభేదాలతో ప్రధాన కార్యదర్శి బాధ్యతలకు, పొలిట్‌బ్యూరోకు రాజీనామా చేసిన సుందరయ్య, కేంద్ర కమిటీ సభ్యుడుగా కొనసాగుతూ, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసారు. తాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగితే వద్దన్నవారు లేరు. కానీ తానే కొనసాగదల్చుకోలేదు.
ప్రజా పునాది గురించి మనం ఇప్పుడు ఆందోళన చెందుతున్నాం. సుందరయ్య మరణించే నాటికి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో ప్రజాపునాది బలంగానే ఉన్నది. ప్రజా ప్రతినిధులుగా కమ్యూనిస్టులు గెలిచింది ఎక్కువ భాగం అక్కడి నుంచే. ఈ పునాది ఆషామాషీగా వచ్చింది కాదు. ఇతర పార్టీల భిక్షకాదు. ఎన్నికల పొత్తులతో దక్కిందీ కాదు. సమరశీల పోరాటాల ఫలితం. త్యాగాల ఫలం. సుందరయ్య తన ఆత్మకథలో అదే చెప్పారు. ''రెండు సంవత్సరాల పాటు లక్షలాదిమంది ప్రజానీకం, తాము స్వాధీనం చేసుకున్న భూమి తామే సాగు చేసుకున్నారు. తమ శ్రమ ఫలితాన్ని తామే అనుభవించగలిగారు. ఇది అత్యంత ప్రధానమైన విషయం. దానితో పాటు, వర్గ పోరాటం తీవ్రస్థాయిలో జరిగినందువల్ల నేటికీ ఆ ప్రాంతంలో ప్రజా పునాది అలాగే నిలబడి ఉన్నది.'' అంతే కాదు, ఆ పోరాట స్థాయి గురించి సుందరయ్య ఒక్క వాక్యంలో చెప్పారు. ''నెహ్రూ సైన్యాలు వచ్చి మూడేండ్లయ్యింది... పోరాటాన్ని కేవలం సాయుధ బలగాలతోనే అణచటం యూనియన్ ప్రభుత్వానికి సాధ్యం కాలేదు.'' అదీ ఆనాడు ఏర్పడిన ప్రజా పునాది స్వభావం, దాని శక్తీ. వైద్యం కోసం రష్యా వెళ్ళిన పిఎస్ తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో ఆగి, ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసారు. తెలంగాణ రైతాంగ పోరాట యోధులను జైలునుంచి విడుదల చేయాలని కోరారు. ఆ సందర్భంలో ప్రధాని నివాసంలో ఇందిరాగాంధీకి చీటీ పంపించారు. కలవడానికి అభ్యంతరం లేదనీ, సుందరయ్యగారికి ఎప్పుడు వీలవుతుందో తెలుసుకుని చెప్పమనీ ఆమె అన్నారు. వచ్చింది సుందరయ్యేనని తెలియటంతో ఆమె మరుక్షణమే వచ్చి తొడ్కొని వెళ్లారు. సుందరయ్యకు ఇంతటి గౌరవం ఎందుకు దక్కింది? సీపీఐ(ఎం) ఆనాడు కాంగ్రెసుకు బద్ధ శత్రువు. ఆయన వెనుక ఉన్న ప్రజాపునాది, సాయుధ రైతాంగ పోరాట నాయకత్వ పాత్ర ఆ గుర్తింపునకు కారణం. ఈ రోజు మనకు దక్కుతున్న గౌరవం కూడా ఆ ఫలితమే. కారణాలేమైనప్పటికీ, మనతరం, ఉన్న పునాదిని కాపాడుకోలేకపోయాం. మన పార్టీ ప్రతిష్ట పునాదుల మీద మనం పనిచేస్తున్నాం. నీళ్ళలో చేపల్లాగా ప్రజా ఉద్యమంతో మమేకమైన యోధులను కాపాడుకునేందుకు ప్రజలు తమ ప్రాణాలు పణంగా పెట్టారు. పోరాట కాలంలో ఒక ఇంట్లో సుందరయ్య బస చేసారు. ఆ రాత్రి ఆయన బాగా నిద్రపోయారు. ఆ ఇంటి ఇల్లాలు మాత్రం రాత్రంతా ఇంటిచుట్టూ కోడిపెట్ట కోసం వెతుకుతున్నట్టుగా తిరిగింది. ఆమె నిండు గర్భిణి. అయినా.. శత్రు సంచారం పసిగట్టేందుకు, తమ నాయకుడిని కాపాడుకునేందుకు ఆమె గస్తీ తిరిగింది. ప్రజల కోసం అంకితమై పనిచేసే నాయకులు, కార్యకర్తల కోసం ప్రజలు ప్రాణాలైనా ఇస్తారు. బూర్జువా పార్టీలకూ, కమ్యూనిస్టులకూ తేడా లేదనుకుంటే ఇది సాధ్యమా? ఇదీ కమ్యూనిస్టుల ప్రత్యేకత, ప్రజాఉద్యమం ప్రాధాన్యత. పార్టీ బలోపేతం కావటమంటే నాలుగు సీట్లు గెలవటమా లేక ప్రజలు రాజకీయంగా మనతో ఉండటమా! సుందరయ్య వర్థంతి సందర్భంగా ప్రతి కమ్యూనిస్టు వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. అందుకే సుందరయ్య జీవితమే ఒక నమూనా అయ్యింది. ఆదర్శప్రాయమైంది.
విప్లవోద్యమ నమూనాలను ధ్వంసం చేస్తున్న కాలంలో ఉన్నాం. సోవియట్ యూనియన్ కుప్పగూలినప్పుడు, విప్లవోద్యమ చిహ్నాలను బహిరంగంగానే ధ్వంసం చేసారు. సరళీకృత ఆర్థిక విధానాలు రాజ్యమేలుతున్నాయి. ప్రజా ఉద్యమ నమూనాల స్థానంలో మార్కెట్ నమూనాలను ముందుకు తెస్తున్నాయి. ఒకవైపు కాలం చెల్లిన భూస్వామ్య భావజాలం, మరోవైపు పెట్టుబడిదారీ విలువలు విప్లవస్ఫూర్తి చిహ్నాలను నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నాయి. నిరాడంబరత మార్కెట్‌కు పనికిరాదు. ఆడంబరాలు కావాలి, దర్పం ప్రదర్శించాలి, సౌకర్యాల కోసం వెంపర్లాడాలి. ఇవన్నీ ఖర్చుపెట్టిస్తాయి. సరుకులకు మార్కెట్ సృష్టిస్తాయి. ఇంకోవైపు ఫ్యూడల్ భావజాలమూ బలంగా ఉన్న దేశం మనది.
'అంతా నేనే' అనిపిస్తుంది. ప్రజలకన్నా పైన కనిపించాలనిపిస్తుంది. భజనపరులకు ప్రాధాన్యత పెరుగుతుంది. దీనికి తోడు, ఉదారవాద విధానాల ఫలితంగానే మధ్యతరగతి బాగా విస్తరించింది. 'సమిష్టి' స్థానంలో స్వార్థం పెరుగుతున్నది. ప్రతిదీ గుర్తింపు సాధనంగానే కనిపిస్తుంది. ప్రజా పునాది స్థానంలో వ్యక్తిగత గుర్తింపు లక్ష్యం వెన్నాడుతూ ఉంటుంది. సరుకుల అమ్మకాలూ, లాభాపేక్ష ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ కదా! అందుకే మార్కెట్ నమూనాలకే ప్రాధాన్యత. ప్రజా ఉద్యమ నమూనాలైన త్యాగాలు, నిరాడంబరత, సూత్రబద్ధ వైఖరి పట్ల చులకన భావం వ్యాపిస్తున్నది. 'ప్రజలపట్ల నిబద్ధత' అంటే హాస్యాస్పదంగా కనిపిస్తున్నది. సుందరయ్య ఆదర్శాలు గత స్మృతులుగా కనిపిస్తాయి. 'ఇప్పుడయ్యే పని కాదు' అనిపిస్తుంది. ప్రజా ఉద్యమ నమూనాలను ధ్వంసం చేయడమంటే ఇదే! మార్కెట్ నమూనాను ధ్వంసం చేయకుండా వర్గపోరాటం ముందుకు సాగదు. ప్రజా ఉద్యమ నమూనాలను కాపాడుకోవాల్సింది కమ్యూనిస్టు చైతన్యమే. ఫ్యూడల్ భావజాలం మీదా, పెట్టుబడిదారీ విలువల మీదా పోరాటంతోనే అది సాధ్యం.
- ఎస్. వీరయ్య