Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2014లో ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ తాము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామని, విదేశాల్లో దాచుకున్న 70లక్షల కోట్ల అక్రమ సంపాదనను 100రోజుల్లో దేశానికి రప్పించి జన్ ధన్ ఖాతాల్లో ఒక్కొక్కరికి 15లక్షలు జమ చేస్తామని చెప్పింది. 2022 నాటికి రైతులకు తమ పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వచ్చేలా చేస్తామన్నది. అవినీతిలేని పారదర్శక పాలన అందిస్తామని ఊదరగొట్టింది. 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' అని ప్రజలను మభ్య పెట్టి ఓట్లు దండుకుని 2014 మే 26న నరేంద్రమోడీ ప్రధాని పీఠాన్ని ఎక్కారు. 2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన ఏ ఒక్కటి ఏడు సంతవ్సరాల కాలంలో అమలులోకి రాలేదు. ఫెడరల్ విధానానికి హాని చేసే విధంగా ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నిటిఆయోగ్ ఏర్పాటు చేశారు. ఆశ్రిత పెట్టుబడిదారులు అక్రమ సంపాదనను సక్రమంగా చేసుకోవడానికి పెద్దనోట్ల రద్దు చేసి ప్రజలను బాధించారు. చిన్న పరిశ్రమలు చితికిపోయాయి. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నమైంది. ఆ తర్వాత రాష్ట్రాలను ఆర్థికంగా కుంగదీసి కేంద్రంపై ఆధారపడే విధంగా ఒకే దేశం ఒకే పన్ను అంటూ 'వస్తు సేవల పన్ను విధానా'న్ని తెచ్చారు. మోడీ ప్రభుత్వం 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ప్రమేయం లేకుండా రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. కాశ్మీర్ ప్రజల స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛకు హామీ పడ్డ రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలైన సీబీఐ, ఈడీ, న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం అన్నీ ప్రభుత్వ జేబు సంస్థలుగా మారాయి. అవి తమ స్వతంత్రతను, నిష్పాక్షికతను కోల్పోయాయి. సమాజ వికాసానికి, వ్యక్తి సృజనకు తోడ్పడవలసిన విద్యారంగంలో కేంద్రీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ లక్షణాలుగా నూతన విద్యావిధానాన్ని తెచ్చారు. మైనారిటీల పౌర హక్కులను నిరాకరించే విధంగా పౌరసత్వ చట్టానికి సవరణలు తెచ్చారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి, రైతులను పరాధీనులుగా మార్చే వ్యవసాయ చట్టాలు తెచ్చారు. 100ఏండ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తూ నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు 'కోడ్స్'గా మార్చారు. ఇప్పుడు ప్రభుత్వరంగ సంస్థలను ఆశ్రిత పెట్టుబడి దారులకు కట్ట బెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ చర్యలేవి ప్రజలను ఉద్దరించేవి కావు. ప్రజలను, రైతులను, శ్రామికులను వలస కాలం నాటి బానిస స్థితికి నెట్టే విధంగా మోడీ ప్రభుత్వ చర్యలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014లో మోడీ ప్రధానిగా ప్రమాణం చేసిన సందర్భంలో మాట్లాడుతూ వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి రక్ష అన్నారు. కానీ, గత ఏడేండ్ల కాలంలో, ఆ మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన లేదని నిర్ధారణ అవుతున్నది. మోడీ ప్రభుత్వం గోరక్షణ పేరుతో, లవ్ జిహద్ పేరుతో మైనారిటీలపై, దళితులపై దాడులు చేస్తూనే ఉంది. భిన్నాభిప్రాయాలున్న వారిని, తన కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రశ్నించే వారిని క్రూరమైన నిర్బంధ చట్టాలతో వేధిస్తూనే ఉంది. నేరస్తులను కాపాడుతూ, బాధితులనే వేధిస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వం గురి మీడియా సంస్థల మీదకు విస్తరించింది. ప్రభుత్వ విధానాలను, ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రశ్నించే మీడియా సంస్థల యజమానులు న్యాయ స్థానాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. వాటిని అదిరించి బెదిరించేందుకు ఇన్ కమ్ టాక్స్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్లు ఉపకరిస్తున్నాయి. ఈ పూర్వరంగంలోనే 'అజాద్ కా అమృత్ మహౌత్సవ్' పేరిట దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరపడానికి మోడీ చేస్తున్న ఆర్భాటాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని మోడీ చెప్పడం హాస్యాస్పదం. ''మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సంప్రదాయాలు గర్వ కారణమని, అభివృద్ధి, ఆచరణ, కార్యసిద్ధి, సంకల్పం, ఆలోచనలనే మూల సూత్రాలపై ఆధారపడి మన వ్యవస్థ పాలన ఉందని మోడీ చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించిన సామెతను గుర్తుకు తెస్తున్నది. సమాజ ప్రగతి కాంక్షించే, అసమానతలు, వివక్ష, అశాస్త్రీయ భావాలను వ్యతిరేకించే వారిని నల్ల చట్టాలతో అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తున్నారు. ఉపా కింద నమోదైన కేసుల సంఖ్య 2015తో పోలిస్తే, 2019లో 72శాతం పెరిగిందని పార్లమెంట్లో హౌం మంత్రిత్వశాఖ స్వయంగా తెలిపింది. అంతర్జాతీయ సంస్థ స్వీడన్‌కు చెందిన 'వీ-డెమ్' ఇనిస్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్‌లో ప్రజాస్వామ్యం రోజురోజు దిగజారిపోతున్నది. అదే నివేదికలో భారత్ 'అతిపెద్ద ప్రజాస్వామ్యం' నుంచి ఎన్నికల నియంతృత్వం' స్థాయికి పతనమైందని పేర్కొనడం గమనార్హం. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో మీడియాపై దారుణమైన 'అణచివేత' ఉందని ఆ నివేదిక తెలిపింది. భిన్నాభిప్రాయం, అసమ్మతి దేశద్రోహం కావు. అవి ప్రజాస్వామ్యానికి ఊపిరి అని రాజ్యాంగ సూత్రాలూ, న్యాయస్థానాలూ ఘోషిస్తున్నప్పటికీ దేశంలో రోజు రోజుకీ తీవ్రమవుతున్న అక్రమ నిర్బంధ పరిస్థితినేమనాలి? ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే రాజకీయ వ్యవస్థలు జవాబుదారీతనంతో పనిచేయాలి, రాజ్యాంగ వ్యవస్థలను స్వతంత్రంగా పని చేయనివ్వాలి. ఒకవైపు అడుగడుగునా మనుషుల కదలికల మీదనే కాదు, ఆలోచనల మీద కూడా ఆంక్షలు విధిస్తూ, మరోవైపు 'ఆజాదీకా అమృత్ మహౌత్సవ్' అంటూ 75వ స్వాతంత్య్ర వేడుకలకు పిలుపునివ్వడం తమ కుట్రలకు ముసుగులేయడమే.ఈ ముసుగులు తొలగించి, జాతిని మేల్కొల్పడం ఇప్పుడు దేశం ముందున్న కర్తవ్యం.
సెల్ : 9676407140