Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరో సంవత్సరంలో భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే ఏడాదిపాటు ఇటువంటి ఉత్సవాలు నిర్వహించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఓ సర్క్యులర్ కూడా జారీచేసింది. ఈ దిశగా కొన్ని చెదురుమదురు కార్యక్రమాలు చేపట్టిన తర్వాత పాలకులు సామంత రాజ్యాలను గెల్చుకోవటానికి వెళ్లారు. దాంతో అంత ప్రతిష్టాత్మకమైన స్వాతంత్య్ర అమృతోత్సవాలు కూడా పడకనపడిపోయాయి. ఈలోగా కరోనా రెండో ఉప్పెన మోడీ 2014లో ప్రారంభించిన స్వఛ్చభారత్ (?) అభియాన్‌కు కొత్త రూపాన్ని, సారాన్ని సమకూర్చిపెట్టింది.
స్వఛ్చ భారత్ అభియాన్‌కు మద్దతుగా అస్మదీయులైన సినీరంగ ప్రముఖలను ఆహ్వానించటం, సముద్రతీరంలో ఉదయం పూట వ్యాహ్యాళికి వెళ్లే వాళ్లను రాకుండా చుట్టూ తాళ్లు కట్టి మోడీగారి చేతికి ప్లాస్టిక్ సంచి ఇచ్చి అల్లంతదూరంలో ఉన్న చెత్తకాగితాన్ని జాగ్రత్తగా ఏరి సంచిలోకి వేసే అద్భుతమైన క్షణాన్ని అంతే అద్భుతంగా కెమెరాల్లో బంధించి చిన్న ఆడియో విజువల్ దృశ్యాన్ని రూపొందించి ప్రపంచం మీదికి వదిలింది బీజేపీ. ప్రత్యేకించి మోడీ భక్తబృందం. అటువంటి భక్త బృందానికి నాయకుడు అమిత్ మాలవీయ. సోషల్ మీడియా వేదికగా బీజేపీ గురించి, మోడీ గురించి, ఈ దేశాన్ని హిందూరాష్ట్రగా మార్చాలన్న లక్ష్యం గురించి మాలవీయ చెప్పినన్ని అబద్ధాలు అమెరికా అధ్యక్ష భవనం మీడియా సలహాదారు కూడా చెప్పి ఉండడు. ప్రపంచాన్ని కాపాడటానికే హిట్లర్ క్రూరత్వాన్ని అలవర్చుకున్నట్టు ప్రచారం చేసిన గోబెల్స్ కూడా మోడీ, అమిత్ మాలవీయ ప్రచార వ్యూహాలు చూస్తే ఆత్మహత్య చేసుకునేవాడు.
మోడీ, ఆయన భక్త బృందం, మోడీ ముఖోటాను ముందుకు పెట్టి దేశంలో సగానికి పైగా ఉన్న దళిత, బహుజన ప్రజలను తమ హిందూరాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్న ఆరెస్సెస్‌లు దేశంలో ప్రజలెదుర్కొంటున్న దైనందిన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించటానికి చేయని ప్రయత్నం లేదు. సాగించని తప్పుడు ప్రచారం లేదు. నేడు కూడా దేశంలో కనీసం ప్రాణం నిలుపుకోవటానికి కావల్సిన వనరులు, అవకాశాలకు దూరమైన లక్షలాదిమంది కరోనా వ్యాధికి శవాల గుట్టలవుతున్నారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో లక్షల సంఖ్యలో ఒక దేశ ప్రజలు ప్రాణాలు వదిలింది మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ఇదే మొదటిసారి.
గత ఏడేండ్లుగా దేశంలో జరుగుతున్న అనేక పరిణామాల వాస్తవికత వేరు, అవి ప్రజలకు చేరుతున్న రూపం వేరు. కోణం వేరు. దీన్నే సర్ప రజ్జు భ్రాంతి అంటారు. బహుముఖ వైవిధ్యం, వైరుధ్యాలు, వ్యక్తీకరణ లక్షణాలను స్వంతం చేసుకోవటానికి హిందూమతానికి వేల ఏండ్లు పట్టింది. అటువంటి వైవిధ్యభరితమైన హిందూమతాన్ని కరుడుగట్టిన, ఏకశిలాసదృశ సమానమైన హిందూమతంగా మార్చటానికి దారితీసిన పరిణామాల చరిత్ర మహా అయితే 14 వందల ఏండ్ల చరిత్ర మాత్రమే. ఏకశిలా సదృశంగా మారిన హిందూ మతాన్ని గత వంద సంవత్సరాల చరిత్రలో రాజకీయ అధికార సోపానానికి వాహకంగా మార్చుకున్న హిందూత్వ చరిత్ర కూడా మనకు కనిపిస్తుంది. మన కండ్లముందు కదలాడుతోంది. రకరకాల రూపాలు తీసుకొంటోంది. సాంప్రదాయబద్ధమైన హిందూమతంలో ఉన్నది దశావతారాలే. కానీ హిందూత్వ ప్రజల ముందు ప్రదర్శిస్తోంది వేయిపడగల కాళీయుడిని. ఈ రెండింటి మధ్య తేడాను, ఆ కాళీయుడు వెదజిమ్ముతున్న విషాన్ని అమృతంగానో ఆవుపంచకంగానో చూపిస్తున్నది. అమిత మాలవీయ లాంటి వాళ్లు కోట్లు ఖర్చు పెట్టి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఆధునిక నాదస్వరాలతో ప్రజలను ఏమారుస్తున్నారు.
మనకు తెలిసిన అద్వైత సిద్ధాంతంలో కీలక లక్షణం రజ్జు సర్ప భ్రాంతి. కానీ ఆధునిక హిందూత్వ సిద్ధాంతం మన ముందుంచుతోంది సర్ప రజ్జు భ్రాంతి. అద్వైతంలో రజ్జు సర్ప భ్రాంతికి లోనైనవారు తాడును చూసి పాము అనుకుని భ్రమపడి భయపడి పరిగెత్తుతారు. కానీ ఈ సర్ప రజ్జు భ్రాంతికి లోనైన వారి ప్రవర్తన దీనికి భిన్నంగా ఉంటుంది. అక్కడ ఉన్నదాన్ని (తాడును) చూసి లేనిదాన్ని (పామును) ఊహించుకోవటం జనం చేసే పొరపాటు. కానీ ఇక్కడ ఉన్నదాన్ని కూడా లేనట్టుగా భావించటమే సర్ప రజ్జు భ్రాంతిలో ఉన్న లక్షణం. అంటే కండ్ల ముందు కనిపిస్తున్న శవాలు కూడా గంగానదిలో మంగళ స్నానాలు చేస్తున్నట్లు భావిస్తున్నాం. వైద్య ఆరోగ్య సేవలు, ప్రాణవాయువు అందక తత్కాల్ టిక్కెట్లతో యమపురికి ప్రయాణమవుతున్న వారికి భూమ్మీద నూకలు లేవు కాబట్టే చనిపోతున్నారని సర్దిచెప్పుకుంటున్నాం. దేశమంతా కర్మ సిద్ధాంతంలో మునిగిపోయింది. అచేతనులైన ప్రజలు తాత్కాలిక ఉపశమనం పొందటం కోసం కర్మసిద్ధాంతాన్ని ఆశ్రయించటం సహజం. కానీ ఇక్కడ ఏకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలే అటువంటి కర్మ సిద్ధాంతాన్ని ఆశ్రయించాయి. చంపేది, బతికించేది, కరోనాయే తాను నిమిత్తమాత్రుడనని ప్రధాని భావిస్తున్నాడు. ఎన్నికల్లో ఊపిరాడకుండా తిరిగి రావటానికి సమయం దొరికింది కానీ గాల్లో కలుస్తున్న ప్రాణాలు కాపాడటానికి సమయం లేదు! చట్టబద్ధ కర్తవ్యంగా ఉన్న ప్రభుత్వాలు కర్మ సిద్ధాంతాన్ని ఆశ్రయిస్తే జరిగే నష్టాన్ని వివరించటానికి తెలుగుసాహిత్యంలోని పదజాలం చాలదు. ఘోరకలి అన్నది చాలా చిన్నమాటవుతుంది.
కేంద్ర ప్రభుత్వం సర్పరజ్జు భ్రాంతిలో ఉన్నదని చెప్పటానికి మే8వ తేదీన ఎకనమిక్ టైమ్స్ పత్రికలో ఓ ఇంటర్వూ వచ్చింది. కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి ఇచ్చిన ఇంటర్వూ అది. ఆ ఇంటర్వూలో కరోనా రెండో ఉప్పెన వలన ఆర్థిక వ్యవస్థకు నష్టం జరక్కుండా అన్ని చర్యలూ తీసుకున్నామని చెప్పారు. బహుశా ఆయన కూడా గజం మిథ్య పలాయనం మిథ్య అన్న లోకంలో బతుకుతున్నట్లుంది. ఇక్కడ మూతపడ్డ కార్యాలయాలు, వస్తాయో రావో తెలీని జీతాలు, ఉంటాయే లేదో తెలీని ఉద్యోగాలు, ఆఖరుకు ప్రాణాలు కాపాడే పనిలో నిమగమైన వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బందిని కోవిడ్ మహహ్మారి బలితీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వమే కోవిడ్ కారణంగా పన్నుల ద్వారా రావాల్సిన వేల కోట్ల రూపాయల ఆదాయం ఆవిరైందని ప్రకటించింది. కోవిడ్ ప్రయాణం కాస్త మందగించిందో లేదో కేంద్ర ప్రభుత్వం విజయబావుటాలెగరేసింది. విశ్వగురు అవతారమెత్తింది. ప్రపంచాన్ని ఆదుకోవటంలో తనకు మించిన దేశాధినేత లేడని మోడీ తన 56అంగుళాల ఛాతీ వంక చూసుకుని తానే మురిసిపోయాడు. హైదరాబాద్‌లో తయారైన కోవాక్సిన్ సప్త సముద్రాలు దాటి కెనడా, బ్రెజిల్, ఆఫ్రికా దేశాలు చేరింది. దేశంలో ప్రాణాలు కాపాడే వాక్సిన్ కొరతను కప్పిపెట్టుకోవటానికి మూడు వారాల్లో వేయాల్సిన రెండో డోసు ఎనిమిది వారాల్లో వేస్తామని చెప్పారు. చివరకు ఈ సంవత్సరం డిసెంబరులోగా మీ డోసు మీకు ఎప్పుడైనా రావచ్చంటూ అరుంథతీ నక్షత్రాన్ని చూపిస్తున్నారు.
కరోనా కట్టడి కోసం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ను పని చేయించాలన్న ఇంగితం కూడా ఈ ప్రభుత్వానికి లేకపోయింది. దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి వార్తలు పుంఖానుపుంఖాలుగా రావటం మొదలయ్యాక కూడా వ్యాధి విస్తరణ చిత్రపటం (మాపింగ్) తయారు చేయటానికి ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్న ఆలోచన రాలేదు. ఆక్సిజన్ కొరత, రెమెడిస్విర్ బ్లాక్ మార్కెట్లు మొదలు ఆసుపత్రుల్లో మంచాల బుకింగ్ కూడా బ్లాక్ మార్కెట్‌కు తెరతీసినా ఈ ప్రభుత్వానికీ ఏమీ కనిపించలేదు. చివరకు లక్షలాదిమందితో బహిరంగ సభలు, కోట్ల మందితో కుంభమేళాలు నిర్వహించిన మోడీ, అమిత్‌షాలు దేశంలో రెండో దఫా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారకులని అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు కోడై కూస్తున్నాయి. ఆ వార్తలు సోషల్ మీడియాలో, ట్విటర్లో పోస్ట్ చేసిన వారిపై కేసులు నమోదు చేయటానికి బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. కానీ, వాటిని ప్రసారం చేసిన అంతర్జాతీయ పత్రికలు, టివిలు, వాట్సప్, ఫేస్బుక్ యాజమాన్యాలపై కేసు పెట్టే సత్తా లేక 56 అంగుళాల ఛాతీ బెంబేలెత్తింది.
ఈ కఠోర వాస్తవాలన్నీ శుభసూచకాలుగానే భావించాలని మోడీ, ఆయన భక్తజనబృందం జనానికి ఆదిశంకరాచార్యుడి అద్వైతాన్ని తిరగేసి మరీ సర్పరజ్జు భ్రాంతిలో ఉండి పొమ్మంటోంది. ఇటువంటి వారిపై మానవహక్కుల ఉల్లంఘన అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ ప్రారంభించాలి.
_ కొండూరి వీరయ్య