Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బుద్ధిని, ప్రకృతిని, సంఘాన్ని - వాటి మధ్య గల సంబంధాన్నీ మొదట గుర్తించినవాడు బుద్ధుడు. సాధారణ యుగానికి రెండున్నర వేలకు ముందు (బీసీఈ) జీవించిన బుద్ధుడు, కేవలం ప్రకృతి పరిశీలనల వల్ల, నాటి సమాజ స్థితిగతుల వల్ల, తన వివేకం వల్ల, వివేచన వల్ల కొన్ని విషయాలు గ్రహించగలిగాడు. ఆనాటికి ప్రపంచం దృష్టి పెట్టని ఎన్నో అంశాల మీద దృష్టిపెట్టగలిగాడు. కొత్త విషయాలు వెలికి తీయగలిగాడు. అందరు చూస్తున్న విషయాలనే ఒక కవి సృజనాత్మకంగా వర్ణించి చెప్పి, విస్మయ చకితుల్ని చేసినట్టు - బుద్ధుడు మహాకవులకే మహాకవి అయ్యాడు. ఎందుకంటే మానవ జీవితంలోంచి ఎన్నో అంశాల్ని సృజనాత్మకంగా వెలికితీసి కళాత్మకంగా ఆవిష్కరించాడు గనక! కాలానికి ఎదురీది శతాబ్దాలు గడిచినా నిత్యనూతనంగా తన ఆలోచనలతో విరాజిల్లుతున్నాడు గనక! ప్రపంచ మతాలనన్నింటినీ ప్రభావితం చేయగలిగాడు గనక! ప్రభావితం కాకపోతే, ఆయా మతాలు ఆయన బోధనల్లోంచి ఎన్నెన్నో అంశాల్ని ఎందుకు స్వీకరించినట్టూ? పురాణాల్లోని కట్టుకథల్లో లాగా ఏదో శక్తి ప్రత్యక్షమై బుద్ధుడికి జ్ఞానబోధ చేయలేదు. ముక్తిమార్గం చూపలేదు. కేవలం తన అంత: చేతనతోనే, బుద్ధి బలంతోనే, ఆత్మవిశ్వాసంలోనే ప్రపంచానికి ఓ కొత్తదారిని చూపించగలిగాడు. ఓ కొత్త వెలుగును ప్రసరించగలిగాడు.
మంచి ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దాన్ని స్వీకరించడం మంచిదే. కానీ, దాని మూల రూపాన్ని మార్చి, అర్థాన్ని మార్చి, పెడర్థాలు రాసుకుని, అది తమదిగా ప్రచారం చేసుకోవడమంటే అది నైతికంగా దిగజారడమే కదా? అన్ని మతాల, అన్ని పవిత్ర గ్రంథాల సారాంశం ఒకసారి గమనించండి. ఎక్కడైనా 'మనిషే ప్రధానం' అనిఉందా? ప్రకృతి ధర్మాన్ని గుర్తించడం ఉందా? ప్రకృతి ధర్మాన్ని స్వీకరించాలని ఉందా? అసలు సృష్టికర్త లేడని, విశ్వంలో జరుగుతున్న పరిణామాలన్నింటికీ కార్యకారణ సంబంధం ఉందని, గతంలోనూ, ఇప్పుడూ ఏ ధర్మ ప్రభోదకుడైనా చెప్పే సాహసం చేయగలిగాడా? చార్వాకులూ, బుద్ధుడు తప్ప, వాస్తవంలోంచి విషయాన్ని వివరించిందెవరూ? ఏ ప్రాణి అయినా సరే మరణించాక లేచి రావడం అంటూ శతాబ్దాల చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదు కదా? మరి ఎందుకు ఆ విషయానికి ప్రాముఖ్యమిస్తున్నారూ? అది ఏసుక్రీస్తు విషయమైనా కానీయండి. ఇటీవల మదనపల్లెలో తల్లిదండ్రులు ఇద్దరు కూతుర్లను చంపిన కేసే కానివ్వండి. ఒకవైపు అత్యాధునిక వైజ్ఞానిక యుగంలోకి పోతూ మరోవైపు అవాస్తవాల మీద, గతకాలపు మూఢత్వంలో కూరుకుపోవడం న్యాయమా? ఎవరికి వారు ఆలోచించుకుని, తమను తాము మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
ధర్మ చక్కవవత్తనా సుత్తంలో బుద్ధుడు 'సంస్కారం' గురించి ఇలా చెప్పాడు. అజ్ఞానం అంటే సంస్కారం ఎలా ఏర్పడిందో తెలుసుకోలేకపోవడం
- సంస్కారమే స్పృహకు, చేతనకు మూలం.
- స్పృహ, చేతన ఏమిటీ? అంటే, అది... జీవం యొక్క అంకురం.
- జీవం యొక్క అంకురం వల్లనే మనసు - శరీరం ఏర్పడుతున్నాయి.
- శరీరం, దానికో మనసు ఏర్పడినందువల్ల మరో ఆరు ఇంద్రియాలు ఏర్పడుతున్నాయి.
- ఇంద్రియాల వల్లనే స్పర్శ ఏర్పడుతూ ఉంది.
- స్పర్శ వల్లనే సంవేదనలు కలుగుతున్నాయి.
- సంవేదనల వల్ల కోరికలు కలుగుతున్నాయి - అంటే తృష్ణ!
- తృష్ణవల్ల ఆసక్తి (దీన్ని ఉపాదానం అన్నారు)
- ఆ ఆసక్తి (ఉపాదానం) కారణంగా స్థిరత్వం లేకపోవడం. స్థిరత్వం లేకపోవడమే భవం... భవ చక్రం వల్ల జన్మ కలుగుతూ ఉంది.
- జన్మ వల్లనే రుజాగ్రతస్తులవడం (ముసలితనం రావడం) మరణించడం జరుగుతూ ఉంది.
- ముసలితనం - మరణం ఉండడం వల్లనే దు:ఖం-రోగం వంటివి కలుగుతున్నాయి.
భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం అనే ఐదు ధాతువుల మిశ్రమం ఈ శరీరం. ఈ శరీరాన్ని రూపస్కందం అని అన్నాడు బుద్ధుడు. దీన్ని మళ్ళి నాలుగు స్కందాలుగా విభజించాడు. 1. విజ్ఞానం 2. సంజ్ఞ 3. వేదన 4. సంఖారా. ఇందులో చేతన / ప్రాణశక్తి అనేది విజ్ఞానం. దీని ద్వారానే ఆరు ఇంద్రియాలు ఉత్తేజింపబడుతున్నాయి.
బుద్ధి అనేది సంజ్ఞ. ఉత్తేజింప బడిన ఇంద్రియాల నుంచి దీనికి సంకేతాలు అందుతాయి. ఆ సంకేతాల ద్వారానే ఏదైనా బాగున్నదనో-బాగులేదనో తీర్పు వెలువడుతుంది. ఆ తీర్పు వెలువడుతుందీ అంటే - మనిషిలో నిక్షిప్తమైన అతని పాత జ్ఞాపకాల ఆధారంగా ఆ తీర్పు వెలువడుతుంది.
మనిషిలో వేదనా స్కందం అనేది ఒకటుందని ప్రకృతి బుద్ధుడికిచ్చిన ఒక ముఖ్యమైన జ్ఞానం! ఆయన పొందిన జ్ఞాన పరంపరకు ఇదే భూమిక. ఈ వేదనా స్కందం మూడు రకాలుగా ఉంటుంది. 1. సుఖవేదనలు (బాగుంది అని) 2. దు:ఖ వేదనలు (బాగులేదని) సుఖ-దు:ఖ వేదనలు రెండూ కానివి 3. తటస్థ వేదనలు. సుఖ వేదనలు కలిగినప్పుడు - 'ఇంకా కావాలి' అనిపిస్తుంది. దు:ఖ వేదనలు కలిగినప్పుడు - 'ఇక వద్దు' అని అనిపిస్తుంది. ఇలాంటి ప్రతి క్రియల్నే 'సంఖారా' అని అంటారు. ఇలాంటి సంఖారా (ప్రతిక్రియల) వల్లనే మనిషిలో రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి.
మనిషి తనలో సంస్కారాలు ఎలా ఏర్పడుతున్నాయో తెలుసుకునే జ్ఞానం.. స్వయంగా అనుభూతిచెంది, లేదా అనుభవించి తెలుసుకున్నదే - ఇది ఏదో కోర్సు చేసి, చదువు వల్ల సంపాదించే జ్ఞానం కాదు. దానికి భిన్నంగా ఉండి సంపాదించే జ్ఞానం. దీన్నే ప్రజ్ఞ అన్నారు. ప్రజ్ఞ కేవలం ఒక మనిషికి మాత్రమే స్వంతం. యూనివర్సిటీలో చాలా మంది చదివి డిగ్రీలు తీసుకుంటారు. ఈ ప్రజ్ఞ అలాంటిది కాదు. అది కేవలం వ్యక్తిగతం. అంతటి ప్రజ్ఞను ఎవరికి వారే సాధించుకోవాల్సి ఉంటుంది.
బుద్ధుడు చెప్పిన నిర్వాణ స్థితి ఇలాంటిదే! నిర్వాణ స్థితికి ఎవరికి వారే చేరుకోవాల్సి ఉంటుంది. దాన్ని మాటల్లో వర్ణించి ఎవరూ ఎవరికీ చెప్పలేరు. అనుభూతి ఎవరికి వారు పొందాల్సిందే కదా? ఇదీ అలాంటిదే. మీరు జీవితంలో ఎప్పుడూ తినని ఒక విదేశీ ఫలం రుచి చూశారని అనుకుందాం. అది మీకు చాలా చాలా నచ్చింది. ఆ అనుభూతి కేవలం మీకే స్వంతం. దాన్ని ఇతరులకు వ్యక్తీకరించడానికి మీరు మాటలు వెతుక్కుని చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ, సంపూర్ణంగా వ్యక్తీకరించలేరు. ఇతరులకు కూడా మీరు ఆ అనుభూతిని పంచాలంటే.. మీరు వారికి ఆ ఫలం అందించి తినిపించాల్సిందే! అయితే, వారు పొందే అనుభూతి మీ అనుభూతికన్నా కొంత భిన్నంగా ఉండొచ్చు. అందువల్ల ప్రజ్ఞ / అనుభూతి / నిర్వాణ స్థితి - అన్నీ వ్యక్తిగతమే! 'నిర్వాణ స్థితి' ఎవరికి వారు సాధించుకోవాల్సిందే!
మనిషికి ఆకలి అయ్యింది. అన్నం తిన్నాడు - అని అనుకుందాం. ఇదే మామూలు భాషలో చెప్పుకుంటే మనిషి కర్త. తినడం క్రియ. బుద్ధుని ప్రకారం మనిషి కర్తకాదు. ఆకలి కావడం కర్త. తినడం క్రియ. ఇక్కడ ఆకలి ఎవరికైతే వారు తింటారు. జంతువుకు ఆకలి అయితే జంతువు తింటుంది. మనిషికి ఆకలి అయితే మనిషి తింటాడు. అంటే ఆకలి-కర్త, తినడం-క్రియ. ఇదే సృష్టికి అన్వయించి చెప్పాడు బుద్ధుడు. కార్యకారణ సంబంధం వల్ల సృష్టి ఏర్పడిందే కానీ, ఎవరో ఒక కర్త-ఉండి ఈ విశ్వాన్ని సృష్టించలేదు.
బుద్ధుడు తన ఆలోచనల్ని ఎంతో ఆత్మ విశ్వాసంతో ప్రపంచానికి తెలియజేసినా, తనే ఒక ప్రత్యామ్నాయం లేని శక్తి అని ఎప్పుడూ భావించలేదు. చాలా వినయంగా తన స్థాయి ఎంత సాధారణమైందో తనే వివరించుకున్నాడు. ''నాకంటే ముందు ఎంతోమంది బుద్ధులయ్యారు. అలాగే, నా తర్వాత కూడా కొందరు బుద్ధులవుతారు'' - అని చెప్పాడు. అయితే అందరూ తనలాగే ప్రకృతి నియతిని ఒప్పుకోవాల్సిందేనని అన్నాడు - దాన్ని మార్చడం ఎవరివవల్లా కాదని కూడా చెప్పాడు. పాళీ భాషలో బుద్ధుడు వాడిన పదం 'సతి'. దాన్ని మనం తెలుగులో ఎరుక / స్పృహ / మెలకువ అని చెప్పుకోవచ్చు. 'పశ్శన'- అంటే చూడటం. ఈ చూడటం / గమనించడం అనే విషయం మీద బుద్ధుడు అతి సున్నితమైన, సూక్ష్మమైన అంశాలెన్నో చెప్పాడు. కాయాను పశ్శన (శరీరాన్ని గమనించడం) వేదనాను పశ్శన (వేదనల్ని గమనించడం) చిత్తాను పశ్శన (చిత్తాన్ని / మనసును గమించడం) ధమ్మాను పశ్శన (ధర్మం పట్ల అవగాహన కలిగి ఉండటం) గురించి బుద్ధుడు చాలా విషయాలు చెప్పాడు. ధర్మబద్ధమైన జీవితం గడపడానికి ఆయన కొన్ని మార్గాల్ని బోధించాడు. అవి 1. అష్టాంగమార్గం 2. ఏడు బోధి అంగాలు 3. పది పారమితలు - శీలాన్ని వృద్ధి చేసుకుంటే సమాధి సాధ్యమన్నాడు. సమాధి పెరిగితేనే ప్రజ్ఞ సాధ్యమన్నాడు... దేహంలో స్థిరమైనదేమీ లేదు. అంతా మారిపోయేదేనన్నాడు.
బుద్ధుడి కాలం నాటికి ప్రపంచంలో ఎక్కడా వైజ్ఞానిక పరిశోధనలు మొదలు కాలేదు. శరీరంలోని కణాల గురించి గానీ, పనిచేస్తున్న జీవ వ్యవస్థల గురించి గానీ ఎవరికీ ఏమీ తెలియని రోజులవి! అయినా, బుద్ధుడు ప్రకృతి నుంచి ఎన్నో విషయాలు గ్రహించాడు. తన చుట్టూ ఉన్న వారి జీవితాల్లోంచి ఎంతో గ్రహించాడు. దు:ఖానికి కారణమేమిటో కనుక్కున్నాడు. గ్రహించిన విషయాలన్నింటితో ఒక చింతనా పరుడయ్యాడు. అర్థం చేసుకున్న విషయాల్ని సునిశితంగా పరిశీలిస్తే, ఆయనలో ఒక మనోవైజ్ఞానిక నిపుణుడు కనిపిస్తాడు. ఒక పర్యావరణ వేత్త కనిపిస్తాడు. ఒక సామాజిక శాస్త్రవేత్త - సంస్కర్త కనిపిస్తాడు. తత్త్వవేత్త సరే సరి! ప్రతి వైజ్ఞానికుడూ తనుజీవిస్తున్న కాలం కంటే ముందుంటే గానీ, ఈ ప్రపంచానికి కొత్త విషయాలు చెప్పలేడు. ఆ రకంగా బుద్ధుడు, తన కాలానికంటే వేల ఏళ్ళు ముందున్న విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది.
_ డాక్టర్ దేవరాజు మహారాజు