Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలో కరోనా మొదటి వేవ్ కన్నా రెండవ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నది. గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా వైరస్ విజృంభిస్తూ దేశ ప్రజలను ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా కుంగుబాటుకు లోను చేస్తున్న మాట వాస్తవం. కరోనా సోకి సరైన సమయంలో చికిత్స అందక చనిపోతున్నవారు కొందరైతే, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరి లక్షల్లో ఖర్చు పెట్టినా ప్రాణం దక్కుతుందో లేదో తెలియక సతమవుతూ మానసికంగా ఆవేదనకు గురి అవుతూ అప్పులపాలవుతున్నవారు మరికొందరు. ఇదిలా ఉండగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా గత పది రోజులుగా పెట్రో భారం పడుతుండడం ఆందోళన కలిగించే అంశం.
దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలో ఉపఎన్నిక, మునిసిపల్ ఎన్నికలు కరోనా విజృభించడంలో ప్రధాన పాత్ర పోషించాయని విశ్లేషకులు గగ్గోలు పెడుతుండగా, ఫలితాలు వెల్లడైన రెండో రోజు నుండే ప్రజలపై పది సార్లకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ఉందని పేద, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. ఈ సంక్షోభ సమయంలో ఆర్థికంగా చితికిపోయి, ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న ప్రజలకు పాలకులు వెన్నుదన్నుగా ఉండాల్సింది పోయి అదనపు భారం మోపడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే లీటర్ పెట్రోల్ ధర సగటున రూ.100కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్‌పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే అధికం. పశ్చిమబెంగాల్ తొలి దశ ఎన్నికలకు ముందు 5 రోజుల వ్యవధిలో 3 సార్లు చమురు సంస్థలు ఇంధన ధరలు తగ్గించాయి. 18 రోజుల తరువాత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజే పెంచడం విమర్శలకు తావిస్తోంది.
2013 వరకు పెట్రోల్ పై కేంద్రం, రాష్ట్రాలు విధించే పన్నులు దాని అసలు ధరలో 44శాతం వరకూ ఉండేవని, ఇప్పుడు అవి 100 నుంచి 110 శాతం వరకు పెరిగాయని చమురు, గ్యాస్ వ్యవహారాల నిపుణుడు రణ్ వీర్ నయ్యర్ తెలిపారు. మన్మోహన్సింగ్ ప్రభుత్వ సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 120 డాలర్ల వరకు పెరిగింది. కాని ఇప్పుడు 65 నుంచి 70 డాలర్లకే పరిమితమైనా పెట్రోల్ ధర రూ.100ను చేరుకుందని ఆయన అన్నారు. బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ పెట్రోల్‌పై ఇంత భారీగా పన్నులు లేవు. బ్రిటన్‌లో 61శాతం, ఫ్రాన్స్‌లో 59శాతం, అమెరికాలో 21శాతం పన్నులు విధిస్తున్నారని ఆయన తెలిపారు. భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ధనికులపై పెద్దగా లేనప్పటికీ, పేదరికంలో ఉన్న వారిపై, అసలు వాహనాలే లేని వారిపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని ఆయన అన్నారు. ఓ వైపు చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి, మరోవైపు ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ఇంధనంపై భారీగా పన్నులు వేయడం తగదన్నారు. కరోనా సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైన పరిస్థితుల్లో ఇంధన ధరలు పెరగడం దేశం మరింత మాంద్యం వైపు వెళ్లేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ధరల పెరుగుదల గురించి హెచ్చరించింది. జనవరిలో టోకు ధరల సూచీ (డబ్ల్యుపీసీ) రెండు శాతానికి పెరిగింది. డిసెంబరులో ఇది 1.2శాతంగా ఉంది. మరోవైపు చిల్లర ద్రవ్యోల్బణం జనవరిలో పడిపోయి 4.1శాతానికి చేరింది. పేద, మధ్యతరగతి వర్గాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం అధికంగా ఉంటుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల సాధారణ, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించాలనే నెపంతో ప్రభుత్వం ఈ మార్గాన్ని అనుసరించడం సరైంది కాదు. కరోనాతో అప్పులపాలై కష్టంగా బతుకీడ్చుకొస్తున్న సామాన్యుడిపై మరింత భారం మోపడం పాలకులకు తగదు. ఓ వైపు బలవర్థకమైన ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధకశక్తిని పెంచుకోవాలని భరోసా వాక్యాలు పలుకుతూ, మరోవైపు ఇంధన ధరలను పెంచడం ద్వారా పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమవడం సామాన్యుడి జీవనాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతున్నది. ఆర్థిక విధానాలపై ప్రభుత్వ ఆలోచనల్లో స్పష్టత లోపిస్తున్నట్టు కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.
- జి. కరుణాకర్
సెల్:9866899046