Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమావేశపు హాలు ప్రతినిధులతో కిక్కిరిసిపోయింది. సీట్లు దొరక్క ఆలస్యంగా వచ్చిన ప్రతినిధులు, ఎక్కడ జాగా దొరికితే అక్కడే వాలిపోతున్నారు. వేదిక మీద ఎక్కువ కుర్చీలు లేవు! కేవలం మూడంటే మూడు మాత్రమే ఉన్నాయి. సమయం 10.00 అవుతోంది. అదే సమావేశం ప్రారంభం కావల్సినసమయం. ఇంతకూ ఈ సమావేశం ఎవరిది అనే అనుమానం వస్తోంది కదూ! అది అఖిల భారత కరోనా సర్వప్రతినిధుల జనరల్ మొట్టమొదటి సభ. అనుకున్నట్టే సరిగ్గా సమయానికి సభ ప్రారంభం అయ్యింది. కరోనా-1, కరోనా-2 వేదికను అలంకరించాయి.
ముందుగా కరోనా-1 లేచింది ''బంధువులారా! మన సమావేశం ప్రారంభించుకుందాం! ఈ సమావేశానికి ఒక విశిష్ట అతిధిని ఆహ్వానించాం! ఆ విశిష్ట అతిథి వేరెవరో కాదు! 'బ్లాక్ ఫంగస్' అని ప్రకటించింది. ప్రతినిధులంతా ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. నల్లటి సూట్లో బ్లాక్ ఫంగస్ దర్జాగా వచ్చి కుర్చిలో కూర్చుంది.
''ఇది అన్యాయం! మన యొక్క ప్రాణాల విలువ గుర్తించి, మనకూ బతికే హక్కు ఉందని ప్రకటించిన మహానుభావుడు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్. అంతటి మహనీయుడిని స్మరించకుండా మన సభ జరపటం ఘోరాతి ఘోరం! మన జాతి సదాస్మరించుకోదగ్గ త్రివేంద్రసింగ్ రావత్గారి నిలువెత్తు ఫొటోను వేదికమీద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాను'' అని తీవ్రస్వరంతో పలికింది ఉత్తరాఖండ్ కరోనా.
ఆఘమేఘాల మీద రావత్ గారి ఫొటో తెప్పించి, వేదికపై ఏర్పాటు చేశారు.
కరోనా 1 తన ఉపన్యాసం ప్రారంభించింది. ''బంధువులారా! ఈ పవిత్ర భారతదేశంలో మన దండయాత్ర ప్రారంభించి సంవత్సర కాలంపైగా గడిచింది. ఇంతవరకూ మనం ఎప్పుడూ సమావేశం జరుపుకోలేకపోయాం. నిజానికి మనం చాలా బిజీగా ఉన్నాం. అదీ ఒక ముఖ్యకారణం. దాంతో పాటు మరో ముఖ్యకారణం కూడా ఉంది. ఈ దేశ పాలకులు మన దండయాత్రను అడ్డుకునేందుకు, మన శత్రువులైన వైరాలజిస్టులూ, ఎపిడమాలజిస్టులూ, వ్యాక్సిన్ తయారీదార్లతో చర్చించటానికి సమావేశం జరిపి, మనను దెబ్బతీసే ప్రణాళికలు సిద్ధం చేస్తారని భావించాం. ఆ సమావేశ నిర్ణయాలకు, ప్రతిగా మన సమావేశం జరుపుకోవాలని అనుకున్నాము. కాని పాలకులు ఇప్పటిదాకా అలాంటి సమావేశం జరపలేదు. అందువల్ల ఇప్పుడు ఆలస్యంగానైనా మన దండయాత్రను సమీక్షించుకునేందుకు సమావేశం జరుపుతున్నాము. మీ బాధ్యతల్లో మీరు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ సమావేశానికి హాజరైనందున అభినందనలు. నా తర్వాత చక్కటి మ్యుటేషన్లతో శక్తివంతుడై మన శత్రువులకు ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనా-2కు అభినందనలు తెలుపుతూ, మాట్లాడాలని కోరుతున్నాను'' అంటూ ముగించింది!
కరోనా-2 తన ఉపన్యాసం ప్రారంభించింది. ''ముందుగా పెద్దలైన కరోనా 1కు నా కృతజ్ఞతలు. వారి దారిలోనే నడుస్తూ, నేను మ్యుటేషన్లు, శక్తి సంపాదించుకున్నాను. అయితే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతాను. మీరు ఆమోదించా లని కోరుతున్నాను'' అన్నది కరోనా-2.
కరోనా-1 అంగీకరించుతూ కొమ్ములు ఆడించింది.
''మన పెద్దలైన కరోనా-1 ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు ''నమస్తే ట్రంప్'' కార్యక్రమంతో పాటు మధ్యప్రదేశ్ ఎన్నికల మీద శ్రద్ధపెట్టి ప్రభుత్వం వారు మనకు ఎంతో సహకరించారు. ఆ తర్వాత కరోనా-1 నాకు బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత నేను మ్యుటేషన్లు పొంది, శక్తి సామర్థ్యాలు సంపాదిస్తానని, శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు. అయినా సరే! పాలకులు ఆ హెచ్చరికను పట్టించుకోకుండా, రకరకాల ఎన్నికలు జరపటమే కాకుండా, ఒక సంవత్సరం ముందుగానే హరిద్వార్‌లో కుంభమేళాను నిర్వహించి, లక్షలాది మంది సాధువులను చేరుకునేందుకు మనకు ఈ ప్రభుత్వం ఎంతగానో సహకరించింది. అందుకు మన జాతి తరఫున ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాదు, మన దాడి నుంచి కాపాడే కవచాలే మాస్కులు. ఈ మాస్కులు లేకుండా వచ్చిన లక్షలాది మందిని చూసి మన ప్రధాని ఆనందంతో కన్నీరు కార్చారు. మాస్కులు లేని లక్షలాది మంది ప్రజలను ప్రధానిని చూసి, మనకూ ఆనందంతో కన్నీరు ఆగలేదన్న విషయం మీకు గుర్తుచేస్తూ ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నాను'' అంటూ ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టింది కరోనా-2.
''మన సమావేశం ప్రధాని నిర్వహించే సమావేశంలా కాదు. అందరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తాము. మీరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ తీర్మానంపై అందరూ మాట్లాడండి!'' అంది కరోనా-1.
''మన మీద పోరాడి, విజయం సాధించేవి వ్యాక్సిన్లు మాత్రమే! అలాంటి వ్యాక్సిన్లను తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇవ్వకుండా, తన గొప్పతనం ప్రదర్శించుకునేందుకు ఇతర దేశాలకు సరఫరా చేసి, మనకు ఎంతో సహాయపడిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపే అంశం ఇందులో చేర్చాలి'' అంది ఢిల్లీ నుంచి వచ్చిన కరోనా.
''మన దాడికి గురైన ప్రజలు ఆక్సిజన్ అందక అల్లాడుతున్నారు. అలాంటి ప్రజలకు ఆక్సిజన్ అందుబాటులో ఉంచేందుకు ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఆవుల నుంచి ఆక్సిజన్ వస్తుందని విస్తృత ప్రచారం చేసింది. ఈ ప్రచారం మనదాడికి ఎంతో తోడ్పడిందనే అంశం తీర్మానంలో చేర్చాలి'' అంది చత్తీస్గడ్ కరోనా.
''మా ఉత్తరప్రదేశ్‌లో మన దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలను అంత్యక్రియలు చేసే పరిస్థితులు కూడా లేక శవాలను క్యూలో పెట్టాల్సి వచ్చింది! ఈ స్థితికి కారణమైన మనశక్తి ఎంతటిదో ప్రపంచం గుర్తించేలా చేసిన యోగి ప్రభుత్వానికి కూడా ఈ తీర్మానంలోనే ధన్యవాదాలు తెలపాలి'' అన్నది ఉత్తరప్రదేశ్ కరోనా!
''అవును! అంత్యక్రియలకు నోచుకోని అభాగ్యుల శవాలను గంగానదిలో విసిరేశారు. గంగానదిలో నది ఒడ్డునా శవాల గుట్టలే కన్పిస్తున్నాయి. దీనివల్ల గంగానది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలిసింది. అందువల్ల ఈ విషయాన్ని ప్రత్యేకంగా తీర్మానంలో చేర్చి ''మా గంగాకి బేటాకు'' ధన్యవాదాలు తెలపాలని కోరుతున్నాను'' అన్నది గంగానది పరీవాహక వైరస్.
''మన సత్తా ఏమిటో తెలిసిన తర్వాత కూడా, మనను ఎదుర్కొనేందుకు ఆసుపత్రులు కట్టకుండా, వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీలకు ఆర్థిక సహాయం చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. అంతే కాకుండా మనపై విజయం సాధిస్తున్నామంటూ ఆరోగ్యశాఖ మంత్రే ప్రకటన చేసి, ప్రజలను దారి మళ్లించాడు. అందుకే ఆయనకూ ధన్యవాదాలు తెలపాలి'' అన్నది కర్నాటక కరోనా!
అందరూ ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. సవరణలు చెబుతున్నారు. కాని ఒక్క ప్రతినిధే నీరసంగా ఉన్నాడు. పక్కవాళ్ళంతా ఒత్తిడి చేస్తే లేచి నీరసంగా మాట్లాడాడు. ''నేను కేరళ నుంచి వచ్చాను. అక్కడ మన బంధువులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. కాని కేరళలో మన ప్రయత్నాలు సాగటం లేదు. ఎంత చేసినా అక్కడి ప్రజలను చంపలేకపోతున్నాము. అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిద్ధం చేసుకున్నారు. కేంద్రం వ్యాక్సిన్ సప్లయి చేయకపోతే అక్కడి ప్రజలే డబ్బులు ప్రభుత్వానికి ఇచ్చి వ్యాక్సిన్ ఛాలెంజిలో గెలిచారు. అంతసేవ చేస్తున్నందునే కేరళ ప్రజలు చరిత్రలో లేనివిధంగా రెండవసారి వరుసగా కమ్యూనిస్టులను గెలిపించారు'' అని మూలుగుతూ కూర్చుంది కేరళ నుంచి వచ్చిన వైరస్.
''మనం ఫీల్డులో పెద్ద ఎత్తున దండయాత్రలు చేస్తున్నాము. అయితే మన విజయానికి పరోక్షంగా తోడ్పడుతున్న కనబడని మిత్రులు ఉన్నారు. వారే వాట్సప్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు! ప్రజలు మన గురించి చైతన్య పడకుండా చైనా పేరు చెప్పి, ముస్లింలను బూచిగా చూపెట్టి, నైట్రోజన్ సిలిండర్లు తీసుకెళుతున్న సేవకుల ఫొటోలు పెట్టి, లేని హాస్పిటల్స్ కట్టినట్టు చూపి, అంతులేని అబద్ధాలను, అచ్చమైన నిజాలవలె మార్ఫింగ్ చేసి, ప్రజలను మభ్యపెడుతూ, మనకు పరోక్షంగా సహాయపడుతున్న వాట్సప్ యూనివర్సిటీ ప్రొఫెసర్లకూ ఈ తీర్మానంలో ధన్యవాదాలు తెలపాలి'' అన్నది గుజరాత్ వైరస్.
''మనను దెబ్బతీసే రకరకాల మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు మొదలైన వాటిపై జీఎస్టీ వేసి ఆర్థికమంత్రి యథాశక్తి వాటిని అడ్డుకుంటున్నారు. ఒకపక్క ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తున్నారు. మరోపక్క ఐసీఎంఆర్, డీఆర్డీఓ కనిపెట్టిన వ్యాక్సిన్, మందులను ప్రయివేటు కంపెనీలైన భారత్ బయోటెక్, రెడ్డిల్యాబ్స్కి అప్పగించి, వాటి రేట్లు పెరగటానికి తోడ్పడ్డారు. అందుకు ఆర్థికమంత్రికీ ధన్యవాదాలు తెలపాలి'' అన్నది బాంబే వైరస్.
కరోనా-2 లేచింది. ''నా తీర్మానానికి మీరంతా మంచి సవరణలు చేశారు. వాటిని చేర్చుతూ మొత్తంగా మన వీర వీహారానికి ఎంతో తోడ్పాటునందిస్తున్న ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుదాము. ఇలాంటి ప్రభుత్వాలు మనకెంతో అవసరం! అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం మళ్ళీ గెలవటానికి అన్ని రకాల సహాయ సహకారాలు మనమంతా అందచేయాలని ప్రతిజ్ఞ చేద్దాం!'' ఇప్పుడు మన ముఖ్య అతిథిని ప్రసంగించాలని కోరుతున్నాను అన్నది.
బ్లాక్ ఫంగస్ లేచింది! ''బంధువులారా! మనందరిదీ అవినాభావ సంబంధం! పెద్దలు కరోనా-1 ఎంట్రీ ఇచ్చినప్పుడు పాలకులు ఇలాంటి సమావేశం జరిపి శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని, వాటిని అమలు చకేసి ఉంటే మనకే అవకాశంకలిగేది కాదు. అయితే పాలకులకు సైన్సు అన్నా శాస్త్రవిజ్ఞానం అన్నా గిట్టదు. ప్రజలు అజ్ఞానాంధకారంలో మగ్గిపోవాలని కోరుకుంటారు. అందుకే ఆక్సిజన్, ఆసుపత్రులు, వ్యాక్సిన్లు, ఔషధాలు మొదలైన వాటిని పట్టించుకోకుండా, గోమూత్రం, ఆవుపేట, అప్పడాలు అంటూ కాలక్షేపం చేశారు! కొందరు మీ పేరిట యజ్ఞయాగాదులు చేశారు. మీకు గుడులు కట్టారు! ఇలాంటి చర్యల వల్ల మీకు మాకు ఎంతో మేలు జరిగిందన్నది వాస్తవం! ఈ పరిపాలన వర్థిల్లినంత కాలం మనకే ఢోకా లేదని హామీ ఇస్తూ నా సందేశాన్ని ముగిస్తున్నా'' అన్నది.
సమావేశం ముగిస్తూ అధ్యక్షులు ప్రకటించిందే తడవుగా కర్తవ్య నిర్వహణకై తమ తమ ప్రాంతాలకు కరోనాలు బయలుదేరాయి.
- ఉషా కిరణ్