Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కఠోరమైన మానవ క్రౌర్యానికి అంతలేకుండా పోతున్నది. చరిత్రకూడా ఇదే ఇదే పదే పదే చెపుతున్నది. అందుకే బతుకు పోరు (మనుగడ కోసం పోరాటం) అనివార్యమవుతున్నది.
ఒకవైపు మూడవ ప్రపంచ యుద్ధంలా కమ్ముకొచ్చిన కరోనా మహమ్మారిపై ప్రపంచ మానవాళి ఏకోన్ముఖంగా పోరాటం సాగించాల్సిన తరుణంలో మరోపక్క అత్యంత నాగరికంగా చెప్పుకునే ఇజ్రాయిల్ ప్రభుత్వం పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై బాంబుదలదాడి కురిపించడం ఏమిటి?
ఈ దాడిలో ఇప్పటికే 200మందికిపైగా మరణించారు. అందులో సగం మంది, యుద్ధచర్యలతో ఎలాంటి సంబంధంలేని స్రీలు, పిల్లలు కావడం, విగతజీవులుగా మారడం భరింపరానిది. మానవ అపరాధానికి ఇదో పరాకాష్ట.
అందుకే గాజా బాలిక నదీన్ అబ్దుల్ తయాప్ ఈ విధంగా ప్రశ్నను సంధిస్తున్నది. ''ఏ క్షణమైనా మాపై బాంబులు పడవచ్చు. ఏక్షణమైనా మా ప్రాణాలు పోవచ్చు. ఆప్తులను కోల్పోవచ్చు. ఈ యుద్ధం ఆపలేరా? ప్రపంచాధి నేతలారా.. మీరెక్కెడున్నారు? అకస్మాత్తుగా మీకు అంధత్వం వచ్చిందా..?'' ప్రశ్న వెంట ప్రశ్న ఇలా శతఘ్నుల్లా ఆమెతో పాటు అనేక మంది ఆక్రోశంతో కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నవారు నివ్వెరపోతున్నారు.
పాలస్తీనగా అస్తిత్వం కోసం స్వేచ్ఛకోసం పాలస్తీనా ప్రజలు దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అందులో 'హమాస్' వంటి ఉగ్రవాద సంస్థలూ ఉన్నాయి. ఇజ్రాయిల్ ఏర్పడినప్పటి నుంచి పక్కనున్న పాలస్తీనాను కబళించడానికే కుట్రలు పన్నుతున్నది. దాడులు చేస్తున్నది. పాలస్తీనా జనాభా 50లక్షలుకు పైగా ఉన్నది. పాలస్తీనాను 1988 నుంచి స్వతంత్ర రాజ్యంగా ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు గుర్తించాయి. ప్రపంచంలో 121వ స్థానంలో ఉన్నది.
తూర్పు జెరూసలేం గాజా వెస్ట్ బ్యాంకులో నివసిస్తున్న పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ ఎప్పుడూ కక్షతోనే వ్యవహరిస్తూ మారణహౌమం సృష్టిస్తూ ఉంటుంది. ఈ విషయంలో ఇజ్రాయిల్ ఎవరిమాటను లెక్కచేయదు.
తాజాగా ఈ యుద్ధవాతావరణం నెలకొన్న తరువాత 8వరోజున కాల్పుల విరమణ పాటించమని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పిలుపునిచ్చాడు. ఈజిప్టు ఇతర దేశాలతో కలిసి తాము శత్రువును అడ్డుకునే పనిలో ఉన్నామని బైడెన్ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకు చెప్పారు. అంటే ఇజ్రాయిల్కే కొమ్ముకాస్తున్నారు తప్ప నిస్పక్షపాతంగా వ్యవహరించడం లేదని అర్థమవుతున్నది. అలాగే యుద్ధాలకు, దాడులకు, హింసకు పూర్తిగా స్వస్తి పలకాలన్న ఐక్యరాజ్యసమితి పిలుపును ఇది పూర్వపక్షం చేసింది. అయితే మానవాళి స్పందనను అడ్డడం ఎవరితరం కాదు. ఇజ్రాయిల్ దుర్మార్గాన్ని ఖండిస్తూ, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా జర్మనీలోను, యూరప్లోను పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శనలు చెలరేగుతున్నాయి. బెర్లిన్లో వేలాది మంది పాల్గొన్న ప్రదర్శనపై పోలీసులు లాఠీచార్జితో పాటు పెప్పర్ స్ప్రే వంటివి కూడా ఉపయోగించారు. వందలాది మంది గాయపడ్డారు.
మనదేశంలో కూడా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా కాశ్మీరులో ప్రదర్శనలు జరిగాయి. ఇజ్రాయిల్ సైనిక దాడులను ఖండిస్తూ గోడలపై చిత్రాలు గీసారు. కళాకారులు పాటలు పాడారు. 27ఏండ్ల యువకుడు ముదిసిర్గుల్ 'మేమంతా ఈక్షణం పాలస్తీనియులమే' అని సంఘీభావం తెలిపే చిత్రాన్ని వేసినందుకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు అక్కడితో ఆగక ఆ చిత్రాన్ని నలుపురంగుతో చెరిపేసారు. అతనిపై ఏం అభియోగాలు మోపారో ఇంతవరకు పోలీసులు అతని కుటుంబ సభ్యులకు చెప్పలేదు.
గాజా భూభాగంపై దాదాపు 15లక్షల మంది ప్రజానీకం జీవిస్తున్నారు. పొరుగున ఉన్న ఇజ్రాయిల్ అనేక దఫాలు గాజా ప్రజలకు నీరు, విద్యుత్, నిత్యావసర వస్తువులు, మందులు అందనివ్వకుండా కర్కశంగా అడ్డుకున్నది. నానా ఇబ్బందులతో నరకయాతన పెట్టింది. ఆ ప్రాంత పరిస్థితిని తెలిపేందుకు అంతర్జాతీయ మీడియాను అనుమతించాలన్న న్యాయస్థానాల కనీస ఆదేశాలను కూడా ఇజ్రాయిల్ పాటించలేదు.''కొందరైతే నిరసనల్లో పుట్టి నిరసనల్లో పెరుగుతుంటారు. నిరంతరం వారి జీవితం నిరసనే. ఆ నిరసన మార్గంలోనే ప్రాణాలు విడుస్తారు.
ఆ ఇజ్రాయిల్ సైన్యం మాపై ఎప్పుడూ విషపునీరు చిమ్ముతూనే ఉంటుంది. బహిరంగంగానూ, దొంగచాటుగానూ తెలిసినా, తెలియకపోయినా అవే తాగాలి మేం. మేం బతకాలి. మాకు అంతకంటే దిక్కేలేదు. మాకు తెలుసు. మా భూమి నుంచి మమ్మల్ని తరిమేసేందుకు వారు అలా చేస్తున్నారని. కానీ మేం మా కన్న పేగును మట్టిపేగును తెంచుకోలేం. మా అమ్మ మాకదే చెప్పింది, చేసింది. మేం మా పిల్లలకు ఇప్పుడు అదే చెపుతున్నాం. అదే చేస్తున్నాం. రేపు మా పిల్లలు అంతే. మా అస్థిత్వమే మా ఆత్మగౌరవం. మా ఆత్మగౌరవమే మా పోరాటం అదే మా చిరునామా. అందుకు మేం సదా సిద్ధంగానే ఉన్నాం.'' పాలస్తీనా రచయిత్రి మరియబంబర్ గాటే రాసిన ఈ మాటలు హృదయమున్న ప్రతి ఒక్కరిని నిత్యం తాకుతూనే ఉంటాయి.
సెల్: 9959745723
కె. శాంతారావు