Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిట్లర్, రెండవ ప్రపంచ యుద్ధంలో ఓటమిపాలై అవమానం భరించలేక ఆత్మ హత్యకు పాల్పడి దిక్కులేని చావు చచ్చి ప్రపంచమంతా ద్వేషించిన జర్మన్ నాజీ పాలకుడు. నరేంద్రమోడీ, దేశ రాజకీయ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించి గద్దెనెక్కి ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఏలిక.
మార్టిన్ నియోములర్, లూథరన్ క్రైస్తవ పూజారి, తొలి రోజుల్లో హిట్లర్ అభిమాని- కమ్యూనిస్టు వ్యతిరేకి.హిట్లర్ నిజస్వరూపం తెలుసుకొని వ్యతిరేకించినందుకు జైలు పాలైన వారిలో ఒకడు.పారుల్ ఖక్కర్, నరేంద్రమోడీ అభిమాని, భవిష్యత్‌లో గుజరాతీ కవులకు ప్రతీకగా మారతారని సంఫ్‌ుపరివార్ ప్రశంసలు పొందిన కవయిత్రి. మోడీ పాలనా తీరును భరించలేక కవిత రాసినందుకు అదే పరివార్ బూతులతో అవమానాల పాలైన బాధిత మహిళ.
తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు... అనే పదాలతో ప్రారంభించి నాజీల తీరు తెన్నులు-సమాజ స్పందనను వర్ణించి దాదాపు ప్రపంచంలోని అన్ని భాషల్లో అనువాదమైన కవితను జైలు గోడల మధ్య రాసిన రచయిత నియోములర్. హిట్లర్‌ను బలపరిచినందుకు పశ్చాత్తాప పడుతూ భవిష్యత్ తరాలను హెచ్చరిస్తూ చేసిన రచన అది.
అన్ని దేశాలలో, భాషలలో చెప్పుకొనే దిగంబర రాజు కథలో రాజుకు బట్టలు లేవంటూ అమాయకత్వం తప్ప అభం శుభం తెలియని ఒక పిల్లవాడు నిజం చెబుతాడు. గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయాలతో సంబంధంలేని భక్తి గీతాలు, భావ కవితలు రాసే అలవాటున్న ఖక్కర్ నరేంద్రమోడీ పాలన తీరు తెన్నులు చూసి భరించలేని పసిపిల్ల మాదిరి ఆవేదనతో అల్లిన కవిత శవ వాహిని గంగ. ఇప్పుడు దేశవ్యాపితంగా అన్ని భాషల్లో అనువాదమై వైరల్ అవుతోంది. కవిత రాసి ఫేస్బుక్లో పోస్టు చేసినందుకు పారుల్‌ను నోరుబట్టని బూతులతో బీజేపీ సంస్కృ(తి)త పండితులు నిందిస్తున్నారు. వారు నిత్యం ప్రవచించే ఏకత, శీలం, సంస్కారానికి అర్థం ఇదా అని జనం విస్తుపోతున్నారు.
తన కవిత మీద తీవ్ర దుమారం, బెదిరింపులు, దూషణలు వెల్లడైనప్పటికీ తన రచనను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం లేదని తానెలాంటి తప్పు చేయలేదని పారుల్ ఖక్కర్ చెప్పారు. నరేంద్రమోడీని ఆయన అంతరంగం అమిత్ షాను విమర్శించిన వారికి ఏ గతి పడుతుందో తెలియనంత ఎడారిలో, అడవిలో ఆమె లేరు. అందుకే ఒకే ఒక్కడు అన్నట్టుగా గుజరాత్లో మోడీని తప్పు పట్టిన ఆమెను ఒకే ఒక్కతె అనవచ్చు. కేవలం పద్నాలుగు పంక్తుల కవితతో విశ్వగురువు పీఠాన్ని, పరివారాన్ని గడగడలాడించిన ఆ రచనలోని ఆవేదనను అర్థం చేసుకొని మరింతగా ప్రచారంలోకి తేవటమే ఆమెకు మనమిచ్చే ఘనమైన గౌరవం. మే పదకొండవ తేదీ వరకు కేవలం గుజరాత్‌కే తెలిసిన ఆమె నేడు దేశ వ్యాపితంగా ప్రాచుర్యం పొందారు. అన్నింటికీ మించి హమ్మయ్య చివరికి గుజరాత్లో కూడా స్పందించే వారు ఉన్నారంటూ అనేక మందికి ప్రాణం లేచి వచ్చేట్టు చేశారు.
ఎందరో పేరు ప్రఖ్యాతులున్న కవులు, కవయిత్రులు ఉన్నారు. కరోనాతో నిమిత్తం లేకుండానే గత కొన్నేండ్లుగా దేశంలో ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ పరి(దు)స్థితిని చూసి మన కెందుకులే అని కలాలను, గళాలను మూసుకున్నవారే ఎక్కువ. ఆరోగ్యానికి హానికరం అని తెలిసీ దురలవాట్లను మానుకోని వారి మాదిరి వారంతా చెవులు కొరికే లక్షణంతో బాధపడుతున్నారన్నది స్పష్టం. గుడ్డికన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే. ఎక్కడైనా ఒకటో అరా విమర్శనాత్మక రచన చేసినా, గళం విప్పినా, శిరమెత్తినా వాటికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో పుంఖాను పుంఖాలుగా వెలువడుతున్న బూతు పురాణాలను చూసి సభ్య సమాజం సిగ్గుపడుతోంది. ఖక్కర్ కవితకు గుజరాత్‌లోని ప్రముఖ కవులు, కళాకారుల నుంచి మద్దతు రాలేదు. అయితే గుజారాతీ లేఖక్ మండల్ అనే సంస్థ మాత్రం మద్దతు ప్రకటించింది. ఆమెను నిందించే బీజేపీ మరుగుజ్జులను ఖండించింది.
గుజరాతీ రచయిత్రి, సినిమా దర్శకురాలు మెహుల్ దేవకళ పారుల్ ఖక్కర్ గురించి, తన అనుభవాన్ని వివరిస్తూ రాసిన వ్యాసాన్ని కొన్ని ఆంగ్ల మీడియా సంస్థలు ప్రచురించాయి. దాని సారం ఇలా ఉంది. ''నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాత తొలిసారిగా ఆయన మాతృభాష గుజరాతీలో మోడీని విమర్శించటమే గాక కరోనా రెండవ తరంగం గురించి సామాన్యుల ఆవేదనను వ్యక్త పరిచిన కవిత బహుశా ఇదేనేమో. శవవాహిని గంగ పేరుతో రాసిన కవిత దావాలనంలా వ్యాపించింది. గుజరాతీ సాహిత్యకారులు మొద్దుబారి పోయారు. ఎలా స్పందించకూడదో వారికి తెలుసు. అయితే సాహిత్యంతో పనిలేని సామాన్య గుజరాతీలు ఆ కవితలో తమ మనోభావాలు ప్రతిబింబించినట్టు భావించారు. విస్కృతంగా పంచుకున్నారు. యాభై ఒక్క సంవత్సరాల ఖక్కర్ భావ గీతాల కవయిత్రిగా పరిచయం. అమె గతంలో రాజకీయ అంశాలను సృజించలేదు. వివాహమై, పిల్లలు పుట్టి స్థిరపడిన తరువాత ఆలస్యంగా అమె సాహితీ ప్రయాణం ప్రారంభించారు. త్వరలోనే సాహితీ బృందాలలో ఒక స్థానం సంపాదించుకున్నారు. గృహిణిగానే ఉన్న ఆమెతో కలసి నేను అనేక సాహితీ సమావేశాలలో కవితా గానాలు చేశాను. ఆమె రాసిన తాజా కవిత మితవాద శక్తులకు పిడుగు పాటు వంటిది. ఆమె ఎన్నడూ ప్రభుత్వ వ్యతిరేకిగా లేరు,.అలాంటి కవితలు ఆమె రాస్తారని అనుకోరు. అయితే ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులు, ప్రభుత్వ ఘోరవైఫల్యం ఆమెను అందుకు పురికొల్పాయి. నేను ఫోనులో మాట్లాడి ఫేస్బుక్ నుంచి కవితను తొలగించనందుకు ఆమెను అభినందించినప్పుడు ''నేనెందుకు దాన్ని తొలగించాలి, నేను చెప్పిన దానిలో తప్పేముంది'' అంటూ సన్నగా నవ్వుతూనే ధృడంగా చెప్పారు.
ఆమెను దీర్ఘకాలంగా అభిమానిస్తున్నవారు ముఖం చాటేశారు. దూరం జరిగారు. తరువాత ఖక్కర్‌కు ఏమి జరుగుతుందో నేను చెప్పగలను. దేశంలో అసహన సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఒక లేఖ రాయాలని 2015 అక్టోబరులో నేను నిర్ణయించుకున్నాను. గుజరాత్‌లోని అనేక మంది ప్రముఖ సాహితీ వేత్తలు, కళాకారులను కలసి దాని మీద సంతకం చేయాలని కోరాను. నైతికంగా మద్దతు తెలిపారు తప్ప సంతకాలు చేసేందుకు తిరస్కరించారు. నిజం చెబితే వచ్చే ముప్పును స్వీకరించేందుకు సిద్దపడలేదు. భయంతో గుసగులాడుకోవటాన్ని అలవాటు చేసుకున్నారు. నా లేఖపై సంతకాలు చేయని గుజరాతీ సాహిత్యకారుల గురించి మొద్దుబారిపోయారని ఒక జాతీయ పత్రిక మొదటి పేజీలో వ్యాఖ్యానించింది. ఆ లేఖ తరువాత సాహితీ సమావేశాల్లో, అవార్డులకు సిఫార్సుల్లో నా పేరును తొలగించారు. ఖక్కర్ కవిత తరువాత ప్రభుత్వ అనుకూల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఒక ప్రముఖ మహిళా కాలమిస్టు తన వ్యాసం మొత్తాన్ని ఖక్కర్‌కు కేటాయించి కవిత ఉద్దేశ్యాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శించటం ఒక ఫ్యాషనై పోయింది అని ఆగ్రహించారు. కొందరు బిల్లా-రంగా, ఫిడేలు వంటి పదాలను ఉపయోగించటం ఏమిటని ప్రశ్నించారు. మరికొందరు కవితాత్మకంగా సమాధానాలిచ్చారు. మరొక రచయిత ఎవరూ ఖక్కర్‌ను అనుసరించి అలాంటి విమర్శనాత్మక కవితలు రాయకూడదన్నది వారి స్పష్టమైన ఉద్దేశ్యం. అనేక మంది రచయితలు, వ్యాసకర్తలు సామాజిక మాధ్యమంలో ప్రభుత్వానికి అనుకూల వాదనలతో రంగంలోకి దిగారు. ఎక్కువ మంది గుజరాతీ కవులు మౌనం దాల్చారు. అదే సందర్భంలో ఇప్పటి వరకూ పారుల్ఖక్కర్ పేరు విననివారు కూడా ఆమె కవితకు మద్దతు ఇస్తున్నారు. అది ఇప్పుడు భాషా సరిహద్దులు దాటిపోయింది. చివరికి రచయిత్రితో సహా ఎవరూ కూడా దాని ప్రయాణాన్ని ఆపలేరు.'' అని దేవకళ పేర్కొన్నారు.
- సత్య