Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నీకు తెలియనిదేముంది బాబూ! లోకములో ఏమి శాశ్వతము! ఇవ్వాళ ఉన్నది రేపు ఉండదు. అంతా మిథ్య, మాయ, అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోనాయినా! మానాభిమానాలన్నీ, కీర్తులపకీర్తులన్నీ కేవలము ధనము వల్లే కలుగుతాయి. డబ్బు మీదే అంతా ఆధారపడివుంది.'' అని శరత్ ప్రసిద్ధనవల 'చరిత్ర హీనులు'లో ప్రధాన పాత్ర ఉపేంద్రుని తండ్రి శివప్రసాద్ బాధలో ఉన్న కొడుకుకు జ్ఞానబోధ చేస్తుంటాడు. అచ్చం అలాగే మన నాయకునికీ బోధేదో జరిగినట్టే ఉంది. అందుకే ఆందోళనలన్నిటికీ దూరంగా జ్ఞానయోగిలా అంతా మాయ అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఎంత ఆదరమూ, గౌరవమూ, రేటింగ్ పడిపోయినా తిరిగి డబ్బుంటే సమకూర్చుకోవచ్చనే ధీమా కూడా ఉండి ఉండవచ్చు. సంక్షోభాలను కూడా తమకనుకూలంగా ఎలా మలచుకోవాలో యోచిస్తూ కూడా ఉండవచ్చు.
దేశంలో విపత్తు మంటలు ఎగిసిపడుతుంటే, నింపాదిగా సమీక్షల స్థాయికి మాత్రమే పూనుకోవడం, యుద్ధ ప్రాతిపదికన చర్యలకు సిద్ధ కాకపోవడం స్వపక్షీయులనే సంధిగ్దంలోకి నెట్టివేస్తున్నది. ఇది వారి మేథో బలహీనతకు, వ్యూహాలలేమితనానికి సంబంధించిన సమస్య కాదు. ఎందుకంటే ఎన్నికలలో ఎన్నెన్నో వ్యూహాలను రచించగలదిట్టలు వాళ్ళు. మొత్తం ప్రజలను మేనేజ్ చేయగలిగిన సమర్థులు. కోట్లాది ఓటరు మహాశయులకు తమ సందేశాలను పంపగలిగినవాళ్ళు, ప్రజలను ఎలా తమవైపునకు తిప్పుకోవాలో, ఏరకమైన హామీలను ఇవ్వాలో మొదలైన మర్మాలన్నీ తెలిసనవాళ్ళు. శత్రువుల స్థావరాలు తెలుసుకుని సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి వీర విజయ విహారం చేయగలిగిన వాళ్ళు. ఏ నినాదాలు, పిలుపులు ఇస్తే ప్రజలు ప్రభావితం అవుతారో ఎరిగినవారు. తమ తమ తెలివితేటలతో ప్రత్యర్థుల పార్టీలలోని బలహీనతలను తెలుసుకుని ప్రభుత్వాలనే మార్చగలగినవారు. ఏ విద్వేషానికి ఎక్కువ స్పందన వస్తుందో వాళ్ళకంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు? అట్లాంటి మహా వ్యూహచతురులు, జ్ఞానవంతులు వాళ్ళు!! ప్రజలను కాపాడటానికి, వ్యాక్సిన్ అందించటానికి, వైద్యం చేయడానికి, ఆక్సిజన్ ఏర్పాటు చేయటానికి, ఆసుపత్రులలో పడకలు సరిపడా ఉంచడానికి ఏవేవి ఎన్నెన్ని కావలసి వస్తాయో లెక్కలు వేయలేని, వేయటం తెలవని అజ్ఞానులా వాళ్ళు! అన్నీ తెలుసు. అన్నీ తెలిసి చేస్తున్న దుర్మార్గం ఇది. బతుకునిచ్చే బాధ్యత వాళ్ళది కాదని తేటతెల్లపరిచారు. బతికున్న వారిపై ఆధిపత్యం వహించడమే వాళ్ళు చేయగిలిగినది. అది కూడా లాభాల కార్పొరేటు శక్తుల కొరకు మాత్రమే ఈ మేనేజ్మెంట్లన్నీ అని ఇంకా ఎంత స్పష్టంగా చెబుతారు! కానీ కరోనాది ప్రయివేటు వ్యక్తివాదం కాదు. సమూహతత్వం కలది. సామ్యవాది కూడా. దీన్ని ఎదుర్కోవడమూ సామ్యవాదులకు, సామూహికత కలిగిన ప్రజా ప్రభుత్వాలకు మాత్రమే సాధ్యమని ఎవరూ చెప్పలేనంత స్పష్టంగా బలంగా చెప్పింది కరోనా. కరోనా ఇన్ని విషయాలను ఎరుక పరిచేలా చేస్తుందని పాపం వాళ్ళు ఊహించలేదు. అందుకనే వాళ్ళిప్పుడు ఆ చర్చ రాకుండా పక్కదారి పట్టించే ప్రణాళికలు వేస్తున్నారు.
ఎవరు అండగా ఉన్నారు
ప్రభుత్వ సంస్థలను, వ్యవస్థలను విమర్శించే వాళ్ళు, పోటీవుంటే నాణ్యమైన సేవలు పొందవచ్చునని, తేలికగా సక్రమంగా సేవలందుతాయని మురికిపట్టిన చిలుము పట్టిన మేథస్సునంతా కుమ్మరించేవాళ్ళు ఇప్పటికయినా గుర్తించి ఉండాలి. మన మధ్యతరగతి సాధారణ ప్రజలు కూడా ఆ భ్రమాత్మక ఆలోచనలే చాలా వరకు కలిగివున్నారు. వాళ్ళందరికీ అర్థమయి ఉండాలి. స్ట్రేచర్పై శ్వాసరాని రోగిని పట్టుకుని డబ్బు చేతపట్టుకుని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా, లోపలికి రానివ్వని ధైన్యాన్ని రోజూ చూస్తున్నాం. రోజుకు రెండు లక్షల చొప్పున వసూళ్ళుచేసి చివరికి శవాన్ని అందిస్తున్నప్పుడైనా అర్థం కావాలి. రెండు వేలకు దొరికే 'రెమిడిసివిర్' అరవైవేలు, లక్షకు కూడా అమ్మబడిన ప్రయివేటు వ్యాపార దుర్మార్గ లాభాల దుష్టత్వాన్ని రుచిచూసైనా అవగాహన కలగాలి.
అయినవాళ్ళే దూరంగా జరుగుతున్న తరుణంలో, ప్రభుత్వ వైద్యులు, వైద్యశాలలు, నర్సులు, ఆయాలు చేసిన, చేస్తున్న బాధ్యతాయుత సేవలను చూసయినా ప్రభుత్వ వ్యవస్థ మాత్రమే ప్రజలకు బాధ్యత వహించగలదని తెలిసిరావాలి. కండ్ల ముందు కనపడుతున్న సత్యం ఇది. కేవలం వైద్య సిబ్బందే కాదు, ప్రభుత్వం అందజేసే ప్రతి పథకాన్ని ప్రజల వద్దకు తీసుకుపోతున్న వాళ్ళందరూ ప్రభుత్వ సిబ్బందే. చివరికి పరిశుభ్రతను అందిస్తున్న పారిశుధ్య కార్మికులూ ప్రభుత్వ సేవకులే. ఆఖరికి ఇటీవలనే ప్రయివేటుకు అమ్మేస్తామని చెప్పిన వైజాగ్ స్టీల్ పరిశ్రమే ఆపదలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసి అందించి ప్రజలను ఆదుకుంది.
కానీ ప్రభుత్వం ఈ విపత్తు కాలంలోనే అన్ని సంస్థలనూ... విమానాలు, రైల్వేలు, టెలిఫోన్లు, విద్యుత్తు, బొగ్గుగనులు, జీవితభీమా, వ్యవసాయం, గనులు, వనరులు అన్నీ ప్రయివేటుకు అందించేశాక ప్రజలిక అనాథలుగా మిగలరా! ఇది సామాన్యులకు సేవలను దూరం చేయటం కాదా! ప్రజలసొమ్ముతోనే వ్యాక్సిను పరిశోధన చేసిన ప్రయివేటు సంస్థలు బాహాటంగానే వ్యాక్సిను వ్యాపారం చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఇదీ ప్రభుత్వాల ప్రయివేటు సేవ. కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న వ్యవస్థ లక్షణం ఇప్పటికయినా మనకు అర్థం కావాలి.
మూఢత్వాన్ని పెంచుతున్నదెవరు?
ప్రాణాలు పోతున్న ప్రజలకు స్థయిర్యాన్ని ఆసరాను ఇవ్వకపోగా మూఢత్వాన్ని, అశాస్త్రీయతను వెదజల్లడమనేది సహించరాని నేరం. ఇది ఎవరైనా చేస్తుంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలు, అవే ప్రచారానికి దిగడం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ఎంపీలు స్వయంగా ఈ చర్యలకు పూనుకోవడం అనాగరిక చర్యగా చెప్పుకోవాలి. రాందేవ్ బాబా 'కరోనిల్' మందును ప్రమోట్ చేసి ప్రజలను మోసం చేశారు. ఆవు మూత్రం, పేడవైద్యం, బురద తెరపీ ప్రచారాలు చేస్తుంటే, ఒక్క రోజైనా అవి అశాస్త్రీయమైనవని, వాటిని నమ్మి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని చెప్పారా? ఇంత విపత్తు కాలంలోనూ అధికార పార్లమెంటు సభ్యుడొకరు ఆసుపత్రిలో డాక్టర్ల మతాన్ని అడిగి తెలుసుకోవడం, మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ఎంతహీనమెంత నీచం! అవన్నీ మూఢ విశ్వాసాలని, వాటికి కరోనా పోదని చెప్పిన వాళ్ళపై దేశద్రోహం కేసులు మోపడమెంత దుర్మార్గం!
సంప్రదాయం మాటున
భారతదేశపు సంస్కృతీ సంప్రదాయాలను గురించి ఘనంగా చెబుతాము. మన ఘనమైన సంస్కృతికి ప్రతీకగా నిలిచే గంగానది నిండా వేలాది శవాలు ప్రవహిస్తున్నా చలించని, స్పందించని సంప్రదాయం ఎక్కడిది! శవాలకు తుది సంస్కారానికి కూడా అవకాశాన్ని కల్పించలేని దీనమైన పాలనకు సిగ్గుపడాల్సింది పోయి, కూర్చొని తలదించుకుని ఏడ్వాల్సింది పోయి, ఈ పరిస్థితిని కండ్లకుకట్టిన గుజరాత్ కవయిత్రిపై ట్రోలింగ్ చేస్తూ, హతమారుస్తామని, దాడులు చేస్తామని బెదిరించడం ఏ సంస్కృతీ సంప్రదాయం! హిందువుల గురించి, వాళ్ళ యోగక్షేమాల గురించి, సంప్రదాయ సంస్కృతుల గురించి డాంబికాలు పలికే అధికారపు మహామహులు, ఇప్పుడు శవాలుగా తేలుతున్నదీ, ప్రాణవాయువులేక విలపిస్తున్నది తొంభైశాతం హిందువులేనన్న వాస్తవాన్ని గ్రహిస్తున్నారా! లేదు. వాళ్ళకు హిందువులనే పేరుతో వచ్చే అధికారం ఆధిపత్యాలు ముఖ్యం కానీ హిందువులుకాదు అనేది అర్థం చేసుకోవాలి.
ఎదుర్కొనే వ్యూహం ఏదీ?
ఇది మానవజాతికి వచ్చిన మహా ప్రమాదం. మన దేశం మొత్తానికి ఎదురైన ఆపద. సకల పక్షాలూ దీనిపై పోరాడాల్సి ఉంది. ఉమ్మడిగా, సమిష్టిగా ఎదుర్కోవాల్సి ఉంది. ఒక్క ప్రభుత్వం వల్లనే అయ్యే పనీకాదు. అట్లాంటప్పుడు నిజమైన నాయకుడు చేయాల్సిన పనేమిటి? కేరళలో విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రతిపక్షాల నందరినీ పిలిచి సలహాలను తీసుకుని సమిష్టి యుద్ధాన్ని ప్రారంభించింది. మొన్న మొన్ననే అధికారంలోకి వచ్చిన తమిళనాడులోని స్టాలిన్ పదమూడుమంది ప్రతిపక్షీయులతో సమన్వయ కమిటీని వేసి పోరుచేసే ప్రయత్నం మొదలేశాడు. అందరి అభిప్రాయాలను సహకారాన్ని తీసుకుని ముందుకు పోవాలన్న ఈ కనీస జ్ఞానం, ఆలోచన లేకపోవటం వెనకాల అహంకార పూరిత ధోరణి, తానే అధికుడననే ఇగోయిజం నాయకుణ్ణి వెంటాడుతోంది. భారతీయ సమాజపు భిన్నత్వంలోని ఏకత్వాన్ని ఎరుగని తనము, ఫెడరల్ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను గుర్తించని మూర్ఖత్వం దీనికి కారణం. ఐదారు నెలలుగా కనీసం సమీక్ష కూడా జరుపకపోవడం, కరోనాను జయించామని ప్రకటించడం, దేశ ప్రజలందరికీ అందించాల్సిన వ్యాక్సిన్ను డెబ్బయిదేశాలకు తరలించడం మొదలయినవన్నీ నేటి ఉపద్రవానికి కారణమై నిలిచాయి. ఇప్పుడు వ్యాక్సిన్ల కొరతతో దేశం విలవిల్లాడుతున్నది. ఇప్పటికి కూడా రాష్ట్రాలను, రాజకీయ పక్షాలను అందరినీ కలుపుకుని, ప్రజల ప్రాణాలను మింగేస్తున్న మహమ్మారిపై యుద్ధం చేయాలన్న వ్యూహమేలేదు. 'భారతదేశంలో జాతీయవాదం, మతమేళాలు, నిర్లక్యమూ ఈ మూడు ఇంతటి విపత్తుకు, నష్టానికి కారణ'మని అంతర్జాతీయ సంస్థ వ్యాఖ్యానించడం అక్షర సత్యం. కోర్టులు సైతం 'ఏం చేస్తున్నారని' నిలదీసినా మొట్టికాయలు వేసినా ఉలుకూ లేదు, పలుకూలేదు.
రేపటికయినా మేల్కొంటారా?
ఇప్పుడు రెండోతరంగ ఉధృతి కొనసాగుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. నమోదుకానివి రెట్టింపు ఉంటాయి. మరణాలూ అంతే. రేపు మూడోతరంగం వస్తే ఎదుర్కొవడానికి ఏదైనా ప్రణాళిక ఉందా? రాకుండా చేసే మార్గాలేమయినా అన్వేషించారా? ఇప్పుడు జరగాల్సింది ఆసుపత్రుల నిర్మాణాలు, వైద్యుల నియామకాలు, వ్యాక్సిన్ల ఉత్పత్తి. ప్రయివేటు ఆసుపత్రులనూ ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. కానీ చేస్తున్నదేమిటి! వేల కోట్ల రూపాయలతో పార్లమెంటు భవనాలు, మందిరాలు నిర్మించేందుకు పూనుకోవడం అనాలోచిత చర్యే అవుతుంది. ఇక అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు రాష్ట్రాలు కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికయినా కేంద్రం రాష్ట్రాలు సమిష్టిగా అందరినీ కలుపుకుని కనీస మానవీయతతో ముందుకు పోవాలి. లేకుంటే ప్రజల ప్రాణాలకు పెనుముప్పు ఎదురవుతుంది. ఇప్పటికే జనంలో నిరసన ఆరంభమయింది. అంతర్జాతీయ సంస్థలూ, మీడియా దోషులెవరో తేలుస్తూనే ఉన్నాయి. జాతీయ మీడియాకు ఎంతోకాలం మభ్యపెట్టటం సాధ్యం కాదు. అబద్ధాల ప్రచారాలు, అసందర్భ ద్వేషాలు, కుయు ాక్తులతో వేసే వ్యూహాలు అన్నీ పటాపంచలయిపోయే సమయం ఆసన్నమవుతోంది. అప్పుడు ప్రజా వ్యతిరేకతా అల ఉధృతిని తట్టుకోవడం అసాధ్యమవుతుంది. చరిత్ర మిమ్ము హీనచరితులుగా నిలబెడుతుంది.
సెల్: 9948787660
కె. ఆనందాచారి