Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చితులు చింతిస్తున్నాయి
చితులు దు:ఖిస్తున్నాయి
చితులు కన్నీళ్లు పెడుతున్నాయి
జనం జ్వర పీడితం
దేశం ఇప్పుడు 'పెద్ద' ఆసుపత్రి
మందులు కరువు మాత్రలు బరువు
వెంటిలేటర్లు లేవు, బెడ్లు లేవు
అంతటా అలుముకున్న నైరాశ్యం
నిశ్శబ్దం ఒక పెద్ద ఆర్తనాదం
కార్పొరేట్ ఆసుపత్రి కన్నా
కాటికి వెళ్ళటం నయం
ఒక్క గంట బతుక్కోసం వేలమైళ్ళు పరుగు
అయినవాళ్లకోసం ఆప్తులకోసం
ఆశల కొనఊపిరితో
బతుక్కి చావుకి మధ్య మనిషి
మందిరాలు మసీదులు
గుళ్ళూ గోపురాలు వదిలి
ఆసుపత్రి గేట్ల ముందు దేవిరింపులు
సిబ్బంది చీదరింపులు
'అయ్యా నా భర్త! అమ్మా నా కొడుకు!!
అయ్యా నా తల్లి!
అయ్యా! డాక్టర్ అయ్యా, అమ్మా నరసమ్మ ...
కాపాడండి కాపాడండి..
అయ్యయ్యో దేవుడా!
ఎట్లా కాపాడుకోవాలి?
అయ్యా పాలకులు!!
మాకు అన్నపానీయాలు వద్దు
మాకింత ప్రాణవాయువును ప్రసాదించండి
కాసిన్ని మండే కట్టెలు..
కాసింత ఆరని నిప్పుని అందించండి
కాస్తంత శ్మశానం కావాలి
మమ్మల్ని తగలేసుకోవాలి!
మా వాళ్ళ శవాల్ని తగలబెట్టాలి
దేశం మొత్తం కన్నీళ్ల కమురు కొడుతుంది
మనిషి మరణపు అంచున వేలాడే ఆఖరిపాట
ప్రపంచం అంతా విలయమూర్తిలా విషాదం
ప్రతి మనిషి వొక అంటరాని అనాధగీతం
- లోసారి సుధాకర్
సెల్: 99499 46991