Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రధానమంత్రిగా నేటితో మోడీ ఏడేండ్ల పాలన పూర్తవుతుంది. ఎన్నికల ముందు ఆయన చేసిన వాగ్దానాలు, ఉపన్యాసాలను ప్రజలు విశ్వసించారు. మోడీ వస్తే పేదల కష్టాలు తీరుతాయని కాషాయ దళాలు, కాషాయ సోషల్ మీడియా వర్గాలు ఊదరగొట్టాయి. అరచేతిలో వైకుంఠం చూపించాయి. కాంగ్రెస్ పాలనలో విదేశాలకు తరలించిన నల్లధనాన్ని రప్పిస్తామన్నారు. దేశంలో ఇక నల్లధనం కనిపించిందని చెప్పారు. విదేశాల నుంచి రప్పించిన నల్లధనం ప్రతి పేదవాడికీ జనధన్ ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని, ఇక బ్యాంకుల్లో ఖాతాలు తెరచుకోవడమే ఆలస్యం అని ఆశలు చూపించారు. మోడీ పాలన భూతల స్వర్గమని చెప్పారు. అవినీతికి తావు ఉండదని, పేద ప్రజల కోసమే ప్రభుత్వం పని చేస్తుందని, కాంగ్రెస్ పాలనకు భిన్నంగా ఉంటుందని టక్కుటమార గారడీ విద్యలెన్నో ప్రదర్శించారు. ప్రజలను మాయమాటలతో మోసగించారు. అధికారంలోకొచ్చారు. గద్దెనెక్కారు.
మొదటి ఐదేండ్ల పాలనలో మోడీ సాగించిన సంస్కరణలతో పేద ప్రజల జీవితాలు ఛిద్రమయ్యాయి. మధ్యతరగతి జీవుల బతుకులు అతుకులుగా మారాయి. ఉపాధి భద్రత లేదు. ఉద్యోగ భద్రత లేదు. చివరకు జీవించే హక్కుకే భద్రత లేకుండా పోయింది. ఉపన్యాసాలతో కాలం వెల్లదీయడం ప్రధానమంత్రికి ఓ అలవాటుగా మారింది. అశాస్త్రీయమైన విధానాలతో, అసంబద్ధమైన సంస్కరణలతో ఆయన అనుసరించిన విధానాలు ప్రజల సాధారణ జీవితాలను తారుమారు చేశాయి.
దేశానికి ప్రజలకు కావాల్సింది కాకుండా ఆయన తనకు తోచింది చేసుకుంటూ పోతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఏడేండ్ల పాలన ఏడు దశాబ్దాల ప్రగతిని, అభివృద్ధిని వెనక్కి తీసుకుపోయింది. నేడు దేశంలో ఎటు చూసినా కరోనా విజృంభిస్తూతో లక్షల మరణాలు సష్టిస్తున్నది. భయభ్రాంతులను కలిగిస్తున్నది. గత సంవత్సరకాలంగా కరోనాను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైంది మోడీ ప్రభుత్వం. కరోనాను అరికట్టడానికి ఒక శాస్త్రీయమైన విధానాలతో కాకుండా అశాస్త్రీయ విధానాలను అనుసరించింది. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల పలితంగా ప్రపంచంలో భారతదేశం రోజువారీ పాజిటివ్ కేసుల నమోదులో అగ్ర స్థానానికి చేరుకున్నది. ప్రతిరోజూ మూడు లక్షల పాజిటివ్ కేసులు, 4 వేల మరణాలకు పైగా రికార్డు సృష్టిస్తున్నది. అంతర్జాతీయ పత్రికలు మోడీ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. నిన్నటి వరకూ మోడీ.. మోడీ అన్న యువత నేడు మోడీ పీచేముడ్ అంటున్నది. కరోనాను అరికట్టడానికి కావాల్సిన వాక్సిన్, వెంటిలేటర్స్, వ్యాధి నిర్ధారణకు సంబంధించిన కిట్స్, మందుల కిట్స్ అందించడంలో, రాష్ట్రాలకు సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కరోనా వ్యాక్సిన్ విదేశాలకు సరఫరా చేసి ఛాతీ విరుచుకున్న మోడీ, నేడు విదేశాల వైపు చేతులు చాచి వ్యాక్సిన్ కోసం అర్థిస్తున్నాడు. ప్రమాదం ముంచుకొస్తుందని ప్రపంచ మేథావులు, ఆరోగ్య సంస్థలు ముందుగానే రెండవ వేవ్ గురించి హెచ్చరించారు. అయినా పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కించడం ఈ వ్యాధి విస్తరణకు మూలం. అన్నింటిలో విపలమైనట్టుగానే కరోనా కట్టడిలోనూ పూర్తిగా విఫలమైంది కేంద్ర ప్రభుత్వం. మెడికల్ ఎమర్జెన్సీ విధించకపోవడం, వైద్య రంగానికి తక్షణంగా కావాల్సినంత బడ్జెట్ విడుదల చేయకపోవడం, వైద్య సదుపాయాలు కల్పించకపోవడం, వైద్యానికి సంబంధించిన మానవ సేవల నియామకం చేయకపోవడం వంటి అనేక వైఫల్యాలను మోడీ ప్రభుత్వం మూటగట్టుకున్నది. కనీసం తగినంత ఆక్సిజన్ సరఫరా చేయకపోవడంతో ఊపిరి అందక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోవడం జరిగింది. అదుపు లేని దోపిడీకి కార్పొరేట్ వైద్యం తలుపులు తెరిచింది. పేదవాడికి వైద్యం దూరమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు, అందరికీ వైద్యం అందించే పరిస్థితి లేదు. వైద్య పరీక్షలకు కూడా నోచుకోని దౌర్భాగ్యస్థితి నెలకొంది. నేడు గంగ శవాల దిబ్బగా మారింది. శ్మశానాలలోనూ చోటు లేక రోడ్లపైనే శవాలను కాల్చడం ఎంతటి దయనీయ స్థితో తెలియజేస్తోంది.
ప్రజలు కరోనాతో విపత్కర పరిస్థితుల్లో ఉంటే ఈ కొద్ది కాలంలోనే కేంద్రం 13సార్లు పెట్రోల్, ఇంధన, గ్యాస్ ధరలను పెంచింది. నిత్యావసర ధరలు అగ్గిలాగా మండిపోవటానికి కారణమైంది.
ఈ ఏడేండ్ల కాలంలో మోడీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు నెరవేర్చడంలో సంపూర్ణంగా విఫలమైంది. కోట్ల ఉద్యోగాలు చూపడం, ధరలను నియంత్రించడం, పరిశ్రమలు అభివృద్ధి పరచడం, ఉపాధి కల్పించడం దేశ ప్రజలకు భరోసానివ్వడం వంటి ప్రతి అంశంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. పేద ప్రజల కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని కాషాయ ప్రభువులు చెప్పిన మాటలు కల్లలని తేలిపోయింది. మోడీ ప్రభుత్వం ఆదానీ, అంబానీ లాంటి స్వదేశీ, విదేశీ కుబేరుల కోసమని కరోనా కాలంలో తేలిపోయింది. పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు కుదేలైన ఈ పరిస్థితులలో ఈ దేశ కుబేరుల సంపద పెరిగిపోవడం అందుకు నిదర్శనం. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతాంగం సాగిస్తున్న ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నప్పటికీ రైతులు మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని సాగిస్తూనే ఉన్నారు. రైతుకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు, రుణ సౌకర్యం కల్పించలేని కేంద్ర ప్రభుత్వం వాళ్ల మీద దాడిని కొనసాగిస్తున్నది. రైతాంగ ఉద్యమాలను అణచివేయాలని అదనుకోసం ఎదురుచూస్తుంది. ప్రశ్నించే గొంతులను, పౌర హక్కులను అణచివేస్తున్నది. నిర్బంధాలు ఉపయోగిస్తున్నది. రాజద్రోహం, దేశద్రోహం కేసులు నమోదు చేస్తున్నది. రాజ్యాంగంలో జీవించే హక్కును కాలరాస్తుంది.
దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కారుచౌకగా విదేశీ, స్వదేశీ బడా పెట్టుబడిదారులకు కట్టపెడుతున్నది. విదేశీ పెట్టుబడులను 40శాతం నుంచి 70శాతం వరకూ పెంచి బ్యాంకింగ్, ఎల్ఐసీ, రక్షణ, రైల్వే, విమానయాన, తదితర భారీ సంస్థలను ప్రయివేటుకు అప్పగించేందుకు పూనుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కూడా కేంద్రం చూపు పడింది. రూ.2లక్షల కోట్ల ఇస్పాత్ నిగంను కేవలం రూ.5వేల కోట్లకే నష్టాల పేరుతో వందిమాగదులకు అప్పజెప్పాలని చూస్తున్నది. ఏడాదికి కోటి ఉద్యోగాల మాటే లేదు. విద్య, వైద్యాన్ని ప్రజలకు దూరం చేస్తున్నది. పరిశ్రమలను మూత వేస్తున్నది. కార్మిక సంక్షేమం పేరుతో చట్టాలను సవరించి కార్మికుల హక్కులను యాజమాన్యాల చేతుల్లో పెడుతున్నది. నోట్లరద్దు చేసి చిన్నవ్యాపారుల ప్రజల బతుకులను బజారు పాలు చేసింది.
జీడీపీ రేటు పడిపోతున్నది. ద్రవ్యోల్బణం ఎగబాకుతున్నది. నిరుద్యోగిత రేటు తీవ్రస్థాయికి చేరుకుంది. ఇంతటి సంక్షోభ సమయంలోనూ కేంద్ర ప్రభుత్వం మోడీ క్యాబినెట్ తీసుకున్ననిర్ణయాలు ప్రజలకు ఆశ్చర్యాన్నికలిగిస్తున్నాయి. రూ.20వేల కోట్లతో సెంట్రల్ విస్టా నిర్మాణం, రూ.1,100కోట్లతో రామ్ మందిర్ నిర్మాణం, రూ.200 కోట్లతో గుజరాత్లో స్టేడియం, రూ.3వేల కోట్లతో పటేల్ విగ్రహం... ఇవన్నీ చరిత్ర పురుషుడుగా నిలిచిపోవాలన్న మోడీ ప్రయత్నాలలో భాగమే. ప్రజల సంక్షేమం చూడని ఏ ప్రభుత్వం కూడా విగ్రహాలలో, కట్టడాలతో నిలబడదు. చరిత్రను ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పని చేయాలి. ప్రజలకు ఆపద సమయంలో భరోసానివ్వాలి. ప్రజల విశ్వాసం చూరగొనాలి. ఈ ఏడేండ్లలో మోడీ అధికారంలోకొచ్చిన తర్వాత చేసిన సంస్కరణలు, అనుసరించిన విధానాలు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. దేశ ప్రగతికి బాటలు వేయలేదు. దేశం అప్పుల ఊబిలోకి పోయింది. మోడీ నిర్ణయాలు ప్రజలకు పెనుభారాలుగా మారాయి. ఏడేండ్ల కాలంలో మోడీ పరిపాలన భారతదేశాన్ని ఏడు దశాబ్దాల వెనక్కి తీసుకుపోయింది.
- జూలకంటి రంగారెడ్డి