Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కల్లోల అలల తాకిడికి విశ్వ మానవాళి గజగజ వణుకుతోంది. కరోనా అడుగిడని దేశం లేదు, భయపడని మనిషి లేడు. శ్వాస కోసం, ఔషధాల వేట కోసం పరిగెత్తే బాధిత కుటుంబ సభ్యుల ఉరుకులకు విశ్రాంతి లేదు. కరోనా విజంభనతో ప్రపంచంలోనే 50శాతం కేసులు, కోవిడ్-19 కారణంగా 30శాతం మరణాలు ఇండియాలోనే నమోదు కావడం అత్యంత విచారకరం. ఆసుపత్రులు, పడకలు, వెంటిలేటర్లు, ఐసీయూలు, ఔషధాలు, టీకాలు, ఆక్సీజన్ సిలిండర్ల కొరతతో రోగులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వైద్యం కోసం కాళ్ల చెప్పులు అరిగేలా తిరగడం ఊహకందని ఆవేదన. ఆసుపత్రి పడకల నుంచి ఔషధాల లభ్యత వరకు అక్రమార్కులు తమ చేతి వాటం చూపిస్తూ, శవాలపై పేలాలు ఏరుకునే దుర్మార్గాలకు ఒడిగట్టడం అతి దారుణం. ఆసుపత్రి పడకలను కూడా ఐశ్వర్యవంతులు ముందస్తుగా బుక్ చేసుకోవడం అతి విచిత్రంగా ఉంది. ప్రాణాలను కాపాడుకోవాలనే రోగులకు సకాలంలో సరైన వైద్యం అందక ప్రాణాలు గాల్లో కలవడం మన కండ్లతోనే చూడగలుగుతున్నాం. రెమిడెసివిర్ పంపిణీ రాష్ట్రాల చేతుల్లో, ఆక్సీజన్ పంపిణి కేంద్ర ప్రభుత్వ అదీనంలో ఉండటం చూశాం. కోవిడ్-19 రోగులకు సకాలంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ స్పందించక పోవడంతో రోగులకు దిక్కులేక ప్రయివేట్ ఆసుపత్రుల మాయాజాలంలో పడి నలిగిపోతున్నారు. దేశ వైద్య వ్యవస్థ అలిసి పోయింది. ఫ్రంట్‌లైన్ వారియర్స్ పని భారంతోనే విధులు నిర్వహిస్తున్నారు. కోవిడ్-19 అత్యవసర వనరులకు కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్మార్కెట్లో చీకటి తలుపులు తెరిచి అనేక రెట్లు అధిక ధరలతో అమ్ముకోవడం అత్యంత దారుణం. కరోనా కాలంలో అనేక ఔషధ కంపెనీలు హద్దు మీరి ప్రచారం చేస్తూ తమ సాధారణ ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముకోవడానికి వెనకాడడం లేదు.
మెడికల్ ఆక్సిజన్, రెమిడెసివిర్, టోసిలిజుమాబ్ ఔషధాల కృత్రిమ కొరతతో నల్ల బజారు వ్యాపారాల నిపుణుల అనైతిక ప్రబుద్ధులు అడుగడుగునా కనిపిస్తున్న అకాలమిది. సెప్టెంబర్-2020లో 10లక్షల ఆక్టివ్ కేసులు ఉండగా ఫిబ్రవరి-2021లో కేసుల సంఖ్య 1.3లక్షలకు పడి పోవడంతో రెమిడెసివిర్ ఔషధాల ఉత్పత్తిని ఆయా కంపెనీలు తగ్గించడం జరిగింది. కాని రెండవ అల సునామీలా విజృంభించడంతో మార్చి-2021 నుంచి రెమిడెసివిర్‌కు డిమాండ్ విపరీతంగా పెరగడం ప్రారంభమైంది. రోజుకు 60,000 రెమిడెసివిర్ సూది మందులు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు మే 9 వరకు రోజుకు 2లక్షలు తయూరు చేయడం ప్రారంభించగా, నేడు 4లక్షల రెమిడెసివిర్ సూది మందులు తయారు చేసేందుకు ఏడు కంపెనీలతో పాటు ఏప్రిల్-2021 చివరి వారంలో మరో 25కంపెనీలకు కొత్తగా అనుమతులు పొందడం, ఇండియాలోనే తయారు చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. ముంబారు, ఢిల్లీ మహానగరాల్లో రెమిడెసివిర్ ఔషధాలను (అసలు ధర రూ.3,490) రూ.35,000 నుండి 50,000 వరకు చీకటి బజారులో అధిక ధరలకు అమ్మిన ఉదంతాలు బాధ కలిగిస్తున్నాయి. ఢిల్లీ ఆసుపత్రుల్లోని పారామెడికల్ సిబ్బంది ఔషధాలను బ్లాక్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలతో 7 మే 2021 వరకు 303 యఫ్ఐఆర్ కేసులు నమోదైనాయి. ఆక్సీజన్ సిలిండర్ ధర చీకటి బజారులో రూ.40,000ల వరకు పలకడం జరుగుతున్నది. యూపీలో ఆక్సీజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ అక్రమ వ్యాపారం బయట పడింది. ఒక సిలిండర్ అసలు ధర రూ.10,000 ఉండగా, బ్లాక్‌లో లక్ష వరకు ధర పలకడం జరిగింది.
ప్రభుత్వ యంత్రాంగం అదుపు చేయలేని విపరీత పరిస్థితుల్లో గుణాత్మక, పరిమాణాత్మక విస్తరణలతో సకారాత్మక మార్పులు రావలసి ఉంది. మన దేశంలో అసంఖ్యాక స్వచ్ఛంధ సంస్థలు ప్రభుత్వంతో చేయి కలిపి సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంధ సేవకులకు అవసర శిక్షణను ఇచ్చి, వారి సేవలను వినియోగించి ఉండాల్సింది. నకిలీ మందులు, కృత్రిమ కొరతలు, నకిలీ రోగులు, అక్రమ వ్యాపారాలు, దొంగతనాలు చేసే ఆసుపత్రి సిబ్బంది అమానవీయ వ్యాపారాలతో రోగుల పాలిట యమ భటులుగా మారడం అనైతికం, అతి విచారకరం. కోవిడ్-19 రెండవ వేవ్ మహా విపత్తులో రోగులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి తాపత్రయ పడుతుంటే, సందెట్లో సడేమియా అన్నట్టు అనైతిక అక్రమార్కులు తమ వంకర బుద్దిని ప్రదర్శించి బ్లాక్ మార్కెట్ చీకటి తలుపులు తెరవడం ఖండించాల్సిందే కాదు దండనీయం కూడా.
- డా||బి.ఎం.రెడ్డి
సెల్: 9949700037