Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2020 మార్చి 24న మరో నాలుగు గంటల్లో దేశంమంతటా లాక్డౌన్ అమలు జరగనున్నట్టు నరేంద్రమోడీ ప్రకటించారు. ఆ లాక్డౌన్ మే నెలాఖరు వరకూ కొనసాగింది. ఆ తర్వాత కూడా స్థానికంగా అక్కడక్కడా లాక్డౌన్లు కొనసాగినా, దేశం మొత్తంమీద లాక్డౌన్ మళ్ళీ విధించలేదు. ఆ లాక్డౌన్ పేద శ్రామికులకు ఎక్కడాలేని కష్టాలను తెచ్చిపెట్టింది. వారిలో ముఖ్యంగా వలస కార్మికులు పడిన పాట్లు మొత్తం ప్రపంచం దృష్టిలో సైతం పడ్డాయి. తక్కిన దేశాలలో లాక్డౌన్కి, మన భారతదేశంలో లాక్డౌన్కి ఒక తేడా ఉంది. ట్రంప్ హయాంలోని అమెరికాతో సహా తక్కిన దేశాల్లో లాక్డౌన్ కారణంగా ఆదాయాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇచ్చారు. మన దేశంలో మాత్రం అటువంటిదేమీ లేదు (ఎక్కడో కొద్ది మంది ఎంపిక చేసుకున్నవారికి చాలా స్వల్ప మొత్తాలు ఇచ్చారు. అంతే). లాక్డౌన్ కారణంగా ఏంతోమంది పేద శ్రామికులు ఆదాయాలు కోల్పోయి నిరాధారంగా, ఆకలి బాధతో బతకవలసిన స్థితికి నెట్టబడ్డారు. లాక్డౌన్ ఎత్తివేసి కొన్ని నెలలు గడిచినా, వారాస్థితి నుంచి ఇంకా కోలుకోనేలేదు. కొన్ని పౌర సంస్థలు కలిసి 'హంగర్ వాచ్' అనే పేర ఒక సర్వే నిర్వహించారు. గత అక్టోబర్ నెలలో ఈ సర్వే జరిగింది. ఈ సర్వేలో కలిసిన వారినుంచి ఆదాయాల, వ్యయాల లెక్కలు, గణాంకాలు సేకరించడం కాకుండా వారికి కలిగిన అభిప్రాయాలను యథాతథంగా సేకరించారు.
సర్వేలో వెల్లడైన విషయాలు చేదు వాస్తవాలను బైట పెట్టాయి. సర్వే చేసినవారు దాదాపు 4000 మందిని కలిశారు. వారిలో 53.5శాతం- అంటే సగం కన్నా ఎక్కువమంది- కుటుంబాలు మార్చి 2020లో వాడిన గోధుమలు లేదా బియ్యం కన్నా అక్టోబర్లో వాడినది తగ్గింది. ఇక పప్పుధాన్యాలు, ఆకుకూరలు, గుడ్లు, మాంసం వంటి దినుసుల వినియోగం తగ్గిపోయిన కుటుంబాల శాతం అంతకన్నా ఎక్కువగానే ఉంది. 62శాతం కుటుంబాల ఆదాయం లాక్డౌన్ కన్నా ముందు ఉన్న స్థాయితో పోల్చితే అక్టోబర్ నాటికి తగ్గిపోయింది. లాక్డౌన్కు పూర్వం పనులకు పోయినవారికన్నా ఆ తర్వాత కాలంలో పనులకు పోతున్న వారి సంఖ్య పెరిగింది. కుటుంబ ఆదాయాలు తగ్గిపోతున్నందున, ఎక్కువమంది పనులకు పోవలసిన అగత్యం ఏర్పడింది. సర్వే పరిమితంగానే జరిగి ఉండొచ్చు. కాని జరిగిన మేరకైనా చూసినప్పుడు లాక్డౌన్ కారణంగా కొంతమందికైనా కడుపులు నిండని స్థితి ఏర్పడిందని స్పష్టం అవుతోంది. హంగర్ వాచ్ సర్వే ప్రత్యేకించి బలహీన వర్గాలపైన, తరగతులపైన కేంద్రీకరించిందినదిగా ఇక్కడ గమనంలో ఉండాలి.
గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాలలో ఆహార దినుసుల వినియోగం తగ్గిపోయిన కుటుంబాలు (కరోనా పూర్వపు కాలంతో పోల్చినప్పుడు) ఎక్కువశాతం ఉన్నాయని హంగర్ వాచ్ అధ్యయనంలో తేలిన అంశం మరింత ఆశ్చర్యాన్ని గొలుపుతోంది. ఇది ముందు ఊహించినదానికి భిన్నంగా ఉంది. సాధారణంగా అర్థాకలి పస్తులు, పోషకాహారలేమి వంటివి పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ. పోషకాహారం పొందగలుగుతున్న వారెందరన్న కొలబద్దతో పేదరికాన్ని అంచనా వేసినప్పుడు గ్రామీణ ప్రాంతాలలోనే పేదరికం ఎక్కువగా ఉందని ప్రతిసారీ మన అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. అందుచేత లాక్డౌన్ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో కన్నా పట్టణ ప్రాంతాలలోనే అర్థాకలి పస్తులు పెరిగాయన్న సంగతి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇలా పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. పట్టణ ప్రాంతాల్లో రేషన్ కార్డులు లేనివారి సంఖ్య ఎక్కువగా ఉండటం మొదటి కారణం. అందువలన వారికి ప్రజా పంపిణీ ద్వారా ఆహార దినుసులు అందుబాటులో లేకుండాపోయాయి. ఈ కరోనా కష్టకాలంలో ఉపాధిహామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకాన్ని కొంతవరకూ ఆదుకుంది. అటువంటి పథకం ఏదీ పట్టణ ప్రాంతాలకు లేదు. పట్టణ పేదలను ఈ కష్టకాలంలో ఆదుకునే ప్రత్యామ్నాయం ఏదీ లేకుండా పోయింది. ఇది రెండవ కారణం.
హంగర్ వాచ్ నివేదిక నుంచి కొన్ని ముఖ్యమైన నిర్థారణలకు రావచ్చు. లాక్డౌన్ కాలంలో ఎటువంటి తోడ్పాటూ అందకపోవడం కారణంగా పేదరికం, అర్థాకలి పెరగడం, నిరాధారంగా మిగిలిపోయినవారు పెరగడం సంభవించింది. ఇది అనివార్యం. అయితే, ఈ పరిస్థితి అంతే తీవ్రంగా లాక్డౌన్ అనంతర కాలంలో కూడా కొనసాగడం కొట్టవచ్చినట్టు కనపడే విషయం. సాధారణంగా లాక్డౌన్ కాలంలో ఉత్పత్తి నిలిచిపోతుందని, ఒకసారి లాక్డౌన్ ఎత్తివేశాక ఉత్పత్తి యథాతథంగా తిరిగి ప్రారంభమౌతుందని అందరమూ భావిస్తాం. కాని లాక్డౌన్ కాలంలో శ్రామిక ప్రజలకు ఇతరత్రా ఆర్థిక తోడ్పాటు అందినట్టైతే ఈ విధంగా జరిగే వీలుంటుంది. అదే, మన దేశంలో మాదిరిగా ఎటువంటి ఆర్థిక తోడ్పాటూ అందకుండా ఉన్నట్టైతే యథాతథ స్థితి మొదలుకాదు.
లాక్డౌన్ కాలంలో శ్రామిక ప్రజల ఆదాయాలు పడిపోకుండా నిలబెట్టగలిగితే ఆహార దినుసులను, ఇతర వినిమయ వస్తువులను వారు అదే స్థాయిలో కొనుగోలు చేయగలుగుతారు. అదే విధంగా వారి రుణ భారం అదనంగా పెరిగిపోదు. ఉత్పత్తి లాక్డౌన్ కాలంలో నిలిచిపోతుంది గనుక, శ్రామిక ప్రజల అవసరాలను తీర్చడానికి వ్యాపారులు వారివద్దనుండే సరుకుల నిలవలను కరిగిస్తారు. ఒకసారి లాక్డౌన్ ఎత్తివేశాక ఉత్పత్తి తిరిగి ప్రారంభం అవుతుంది. కార్మికులకు ఆదాయాలు రావడం తిరిగి మొదలవుతుంది. వారి వినిమయం మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. వ్యాపారులు తమ వద్ద నిల్వలను తిరిగి పెంచుకోవలసి ఉంది గనుక మామూలు స్థాయికన్నా ఎక్కువగా ఉత్పత్తిని చేయవలసిన స్థితి వస్తుంది.
అదే లాక్డౌన్ కాలంలో శ్రామికులకు ఎటువంటి ఆర్థిక తోడ్పాటూ అందకపోతే వారి ఆదాయం ఏమీ ఉండదు గనుక వారి వినిమయం బాగా తగ్గుతుంది. అలా తగ్గించుకున్నా, అందుకోసం వారు అప్పులు చేయవలసి వస్తుంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఉత్పత్తి యథాతథంగా పూర్వపు స్థాయిని చేరుకుందనుకున్నా శ్రామిక ప్రజల వినిమయం మాత్రం యథాతథ స్దితికి రాదు. ఎందుకంటే వారు లాక్డౌన్ కాలంలో చేసిన అప్పులు తీర్చడానికి తమకు వచ్చిన ఆదాయాల్లో నుంచి కొంతభాగం కేటాయించవలసి ఉంటుంది. ఆ అప్పులు పూర్తిగా తీరిపోయే వరకూ వారి వినిమయం పూర్వపు స్థాయికి చేరుకోదు.
వినిమయం బట్టి ఉత్పత్తి ఉంటుంది. వినిమయం తగ్గింది గనుక ఉత్పత్తి కూడా పూర్వపు స్థాయికి చేరుకోదు. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, వినిమయం-రెండూ కరోనా పూర్వపు స్థితికి చేరుకోవు. అందుచేత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కూడా అరకొరగానే జరుగుతుంది. అందుచేత ఆర్థిక వ్యవస్థ మామూలు స్థాయికి తిరిగి కోలుకోవాలన్నా, శ్రామిక ప్రజలు దుర్భర దారిద్య్ర పరిస్థితి నుంచి బైట పడాలన్నా వారి ఆదాయాల స్థాయి లాక్డౌన్ కాలంలో పడిపోకుండా ఆర్థిక తోడ్పాటు అందించడం అవసరం. తెలివిమాలిన మోడీ ప్రభుత్వం ఈ పని చేయలేదు. శ్రామిక ప్రజలలో చాలామంది ఆదాయాలను దాదాపు సున్నాకి తీసుకొచ్చింది. దీని పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో హంగర్ వాచ్ వెలుగులోకి తెచ్చింది.
మధ్యంతరంగా సగంలో నిలిచిపోయిన మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్రం ఖర్చు చేయనున్నదని, దానితో ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి కావలసిన ప్రేరణ లభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందుకోసం ఎంత మోతాదులో ఖర్చు చేయనున్నారన్నది అసలు ప్రశ్న. లాక్డౌన్కు మునుపు ఏ స్థాయిలో ఖర్చు చేశారో, అదే స్థాయిలో ఇప్పుడూ చేస్తే, శ్రామిక ప్రజల కొనుగోలు శక్తి ఏమీ అదనంగా పెరగదు. లాక్డౌన్ కాలంలో చేసిన అప్పులకు వాయిదాలు కట్టడానికి కొంత భాగం పోతే తక్కిన భాగంతోటే వారు ఏ కొనుగోలు అయినా చేయగలుగుతారు. అందువల్ల మొత్తం డిమాండ్ లాక్డౌన్ అనంతర కాలంలో కూడా పూర్వపు స్థాయికి తిరిగి చేరుకోదు. అంటే ఆర్థిక వ్యవస్థ మామూలు స్థాయికి తిరిగి కోలుకోవడం జరగదు. అలా కోలుకోవాలంటే మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం పెట్టే ఖర్చు లాక్డౌన్ పూర్వపు కాలంలో చేసిన ఖర్చు కన్నా చాలా ఎక్కువ మోతాదులో పెంచాలి. పడిపోయిన శ్రామిక ప్రజల కొనుగోలుశక్తి వలన డిమాండ్లో ఏర్పడే తరుగుదలను అది భర్తీ చేయగలిగేంతగా ఉండాలి.
ఇలా పరోక్షంగా మౌలిక వసతుల కల్పనపై ఎక్కువ ఖర్చు చేయడం కన్నా నేరుగా ఆ శ్రామిక ప్రజలకు నగదు చెల్లించడం ద్వారా వారి కొనుగోలు శక్తిని నిలబెట్టడమే మెరుగు. లాక్డౌన్ అనంతరం కూడా ఆ విధంగా నగదు చెల్లింపులను కొనసాగించవచ్చు. లాక్డౌన్ అనంతరం కొంత తగ్గిన ఉత్పత్తి స్థాయి, తగ్గిన ఆదాయాల వలన ఏర్పడిక కొరతను భర్తీ చేయగలిగే మేరకు ఈ నగదు చెల్లింపులు జరగాలి. అప్పుడు మాత్రమే పూర్వపు స్థాయికి వినిమయం పెరుగుతుంది. లాక్డౌన్ కాలంలో ఇటువంటి చెల్లింపులేవీ చేయనందున దాని ప్రభావం లాక్డౌన్ అనంతర కాలంలో కూడా పడుతోంది. దానివలన ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కూడా సాధ్యం కావడంలేదు.
నేరుగా శ్రామిక ప్రజలకు నగదు చెల్లింపులు చేస్తే వారి దారిద్య్రం ఉపశమించడమే గాక, వారు ఆ సొమ్ముతో కొనుగోలు చేసే సరుకులన్నీ దేశీయంగా ఉత్పత్తి చేసినవే ఎక్కువగా ఉంటాయి. దిగుమతి చేసుకోవలసినవి పెద్దగా ఉండవు. అందువలన ప్రభుత్వం చేసే ఖర్చు దేశీయ డిమాండ్ ఎక్కువగా పెరగడానికి తోడ్పడుతుంది. అందువలన దేశంలో ఉపాధి అవకాశాలు మరింత పెరగడానికి దోహదం చేస్తుంది.
శ్రామిక ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసే ఆహార ధాన్యాలను ఇక్కడ ప్రభుత్వం చేసే నగదు చెల్లింపులలో భాగంగా పరిగణించకూడదు. ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వడం మంచిది. అవసరం కూడా. కాని దానివలన ఆర్థిక వ్యవస్థ పెరగడానికి ఎటువంటి ప్రేరణా కలగదు. అది కేవలం భారతీయ ఆహార సంస్థ వద్ద పేరుకుపోయిన నిల్వలను కొంత తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దానితోబాటు నేరుగా నగదు చెల్లింపులు చేసినప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి తగిన ఊపు లభిస్తుంది.
ఇప్పుడు ఉపాధి లేని ప్రతీ కుటుంబానికీ నెలకు రూ.6000 కనీసం చెల్లించాలని ప్రధానికి ప్రతిపక్ష నాయకులు లేఖ రాశారు. ఆ విధంగా ప్రతీ ఇంటికీ మూడు నెలలపాటు నగదు చెల్లించినా, అందుకయ్యే ఖర్చు మన జీడీపీలో కేవలం 2 శాతమే. ఆమాత్రం లోటును తేలికగా సర్దుకోవచ్చు.
కాని మోడీ ప్రభుత్వానికి తెలివితక్కువతనంతోబాటు పిరికితనం కూడా ఉంది. అందుకే ప్రజలు ఇంత దుర్భర పేదరికంతో నలిగిపోతున్నా, ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నా ధైర్యం చేయలేకపోతోంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నిర్దేశించిన పరిమితులను దాటుకుని వ్యవహరించలేకపోతోంది. -స్వేచ్ఛానుసరణ
- ప్రభాత్పట్నాయక్