Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల సమస్య అనేక రాష్ట్రాల్లో పెద్ద ఆందోళనకరంగా మారింది. కరోనా విపత్తు నేపథ్యంలో అది మరింత తీవ్రమైంది. స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాల చట్టాల్లో కొన్ని న్యాయస్థానాల్లో వ్యాజ్యాల పాలైనా నిలదొక్కుకొని ఏదో మేరకు అమలు జరుగుతున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో ఫీజుల భారాన్ని తగ్గించడం కోసం ఇచ్చిన ఉత్తర్వులను తెలుగు రాష్ట్రాల్లోని ప్రయివేటు యాజమాన్యాలు ఖాతరు చేయక పోవడం తెలిసిందే. ఉత్తర్వులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా అమలు చేయడానికి వత్తిడి చేసిన రాష్ట్రాల్లో యాజమాన్యాలు న్యాయస్థానాల్లో సవాల్ చేస్తున్నవి. వాటిలో రాజస్థాన్ కేసులో మే 3న సుప్రీంకోర్టు యిచ్చిన తీర్పు ఫీజుల సమస్యకు కొంత ఉపశమనం కలిగించే విధంగా ఉన్నది. అది అన్ని రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణకు తోడ్పడే అవకాశం ఉంది.. ఆ తీర్పులో రెండు అంశాలు ఉన్నవి. ఒకటి, ప్రయివేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించే అధికారం రాజ్యాంగబద్ధమే. రెండు, విపత్తు సమయంలో ఆదాయ వ్యయాల లెక్కలతో నిమిత్తం లేకుండా మానవతా దృష్ట్యా అయినా ఫీజులను ఎంతోకొంత తగ్గించాలి.
''రాజస్థాన్ స్కూల్స్ (రెగ్యులేషన్ ఆఫ్ ఫీ) యాక్ట్, 2016''లోని 3,4,6 - 11, 15,16 సెక్షన్లు, 'రాజస్థాన్ స్కూల్స్ (రెగ్యులేషన్ ఆఫ్ ఫీ) రూల్స్, 2017' లోని 3,4,6 - 8, 11 రూల్స్ ''భారత దేశ పౌరులందరికీ, ఏదైనా వృత్తి చేపట్టడానికి, లేదా ఏదైనా ఉప జీవిక, వ్యాపారం లేదా వర్తకంను కొనసాగించడానికి హక్కు కల్పించిన ఆర్టికల్ 19(1)(జి)''కి భంగం కలిగిస్తున్నాయి అని రాజస్థాన్ ప్రయివేటు పాఠశాలల యజమానులు సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. ఫీజు నిర్ణయించే అధికారాన్ని 'స్కూల్ లెవెల్ ఫీ కమిటీ'కి అప్పగించి యాజమాన్యాల స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీయడం జరిగిందని వాదించారు. స్కూల్ లెవెల్ ఫీ కమిటీలో ఉండే (సగం) ఐదుగురు తల్లిదండ్రుల ప్రతినిధులకు నాణ్యమైన విద్య కోసం పాఠశాలను అభివృద్ధి చేసే విషయం పట్ల అవగాహన ఉండదని వాపోయారు. విద్యాహక్కు చట్టంలో క్యాపిటేషన్ ఫీజుపై నిషేధం విధించబడిందే తప్ప యితర ఫీజులు గురించి ఏమీ చెప్పలేదు అని సూచించారు. ఫీజుల నిర్ణయంతో సహా అన్ని విషయాల్లోనూ విద్యాసంస్థలకు గరిష్ట అటానమస్ యివ్వాలని టీ.ఎమ్.ఏ. పారు ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్నాటక కేసులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును యాజమాన్యాలు గుర్తు చేశాయి. తల్లిదండ్రుల తరఫు వాదనలు, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ వివరణలు విన్న తర్వాత జస్టిస్ ఏ.ఎం. ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది.
''సంక్షేమ రాజ్యంలో ప్రాధాన్యత గల విద్యాభివృద్ధి బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రయివేటు సంస్థలపైనా వున్నది. విద్యా వ్యాప్తి కోసం ప్రయివేట్ సంస్థలు చేస్తున్న కృషిని అభినందించాల్సిందే. నాణ్యమైన విద్యను అందించడానికి తగిన ఫీజును నిర్ణయించే హక్కు పాఠశాలల యాజమాన్యాలకు ఉంటుందనే వాదన సరైనదే. కానీ దానిని లాభార్జనకు, వ్యాపారానికి దోహదం చేయకుండా నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అది ఆర్టికల్ 19(1)(జీ) కి విరుద్ధం కానేకాదు. అధిక ఫీజులను అరికట్టే అధికారం రాజ్యాంగబద్ధమే. రాజ్యాంగ ఆదేశం ప్రకారం ఉచితంగా అందించాల్సిన విద్య కోసం ఫీజుల భారాన్ని మోపే హక్కు యాజమాన్యాలకు లేదు. విద్యతో లాభార్జన, వ్యాపారం చేయడానికి వీల్లేదని వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తించాలి. ప్రయివేట్ పరిశ్రమలకు, సర్వీస్ సంస్థలకు (టెలికాం, ఇన్సూరెన్స్, విద్యుత్ వగైరా) రెగ్యులేషన్ ఉండగా భావి తారలను తీర్చిదిద్దాల్సిన విద్యా సంస్థలకు రెగ్యులేషన్ చట్టం వద్దని సవాల్ చేయడం సరైంది కాదు. రాజస్థాన్ చట్టం 2016 ప్రకారం అభివృద్ధికి అవసరమైన రెవెన్యూ మిగులుతో సహా పాఠశాల నిర్వహణకు అయిన వాస్తవ ఖర్చుల ఆధారంగా యాజమాన్యం ఫీజు ప్రతిపాదన చేయాలి. అది సహేతుకంగా ఉంటే 'స్కూల్ లెవెల్ ఫీ కమిటీ' ఆమోదిస్తుంది, లేకపోతే తగ్గించాలని తిరస్కరించవచ్చు. కమిటీ చెప్పినా ఫీజు తగ్గించదల్చుకోని యాజమాన్యం 'డివిజనల్ ఫీ రెగ్యులేషన్ కమిటీ (డిఎఫ్ఆర్సీ)కి, ఆ పైన 'రివిజన్ కమిటీ'కి అప్పీల్ చేసుకోవచ్చు. అవి చేసే నిర్ణయాలను మాత్రం అమలు చేయాలి. ఎస్ఎల్ఎఫ్సీ, డిఎఫ్ఆర్సీ, రివిజన్ కమిటీ అన్నీ చట్టబద్దమైన సంస్థలే అనే విషయాన్ని యాజమాన్యాలు గుర్తించాలి. కనుక రాజస్థాన్ చట్టంలోని పాఠశాలల ఫీజులను నిర్ణయించిన నిబంధనలు, నియమాలను వ్యతిరేకించడం చెల్లదు. కేంద్రం చేసిన విద్యా హక్కు చట్టం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయకూడదనే అభ్యంతరం సరైంది కాదు.'' అని కోర్టు తీర్పునిచ్చింది. ప్రయివేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించే చట్టాన్ని, దానిని సమర్థించిన రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలనే యాజమాన్యాల అప్పీల్ ని సుప్రీం ధర్మాసనం కొట్టేసింది.
ఇక, కరోనా విపత్తు నేపథ్యంలో ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల భారం సమస్య పైన కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం సహేతుకమైన తీర్పే చెప్పింది. రాజస్థాన్‌లో లాక్డౌన్ వలన 2020 మార్చి నుండి మూడు నెలలు పాఠశాలలు పని చేయని కాలానికి ప్రభుత్వ ఆదేశాలతో చెల్లించని ఫీజులను, పాఠశాలలు తెరిచిన తర్వాత మూడు వాయిదాల్లో చెల్లించాలని చెప్పింది. ''ఆన్లైన్ క్లాసులకు సీబీఎస్ఈ సిలబస్‌ను 70శాతానికి పరిమితం చేసినందున ఆ పాఠశాలల్లో ఫీజులు కూడా 70శాతం తీసుకోవాలి మరియు రాష్ట్ర పాఠశాలల్లో సిలబస్‌ను 60శాతానికే నిర్ణయించినందున ఫీజులు కూడా ఆ మేరకే తీసుకోవాలి'' అని రాజస్థాన్ పాఠశాల విద్యాశాఖ 2020 అక్టోబర్ 28న ఇచ్చిన ఉత్తర్వులను కొంత సవరించాలని చెప్పింది. ఆన్లైన్ క్లాసుల రోజుల్లో లైబ్రరీ, లేబోరేటరీ, కో-కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ తదితర వసతులను విద్యార్థులు వినియోగించుకొనే అవకాశం లేనందున వాటికి అయ్యే ఖర్చులతో పాటు బోర్డింగ్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు మున్నగునవి తీసుకోకూడదు. ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలి. అందువలన 2019-20 విద్యా సంవత్సరానికి 'స్కూల్ లెవెల్ ఫీ కమిటీ'లు నిర్ణయించిన ట్యూషన్ ఫీజుల్లో 15 శాతం చొప్పున తగ్గించి 2020-21 విద్యా సంవత్సరానికి తీసుకోవాలి. వాస్తవంగా తగ్గిన ఖర్చుల మేరకు స్కూల్ లెవెల్ ఫీ కమిటీలే ఫీజులను తిరిగి నిర్ణయించాలని ఆదేశించాల్సి ఉంది. కానీ కరోనా సమస్య కొనసాగుతున్న పరిస్థితుల్లో పాఠశాలల ఎకౌంట్స్ పరిశీలించి ఫీజులు పునర్ నిర్ణయించడానికి చాలా రోజులు పడుతుంది. అందువలన మధ్యేమార్గంగా అన్ని పాఠశాలలకు ఒకే విధంగా 15శాతం చొప్పున తగ్గిస్తే సరిపోతుందని చెప్పారు. ఫీజులు చెల్లించలేని వారి అభ్యర్థనలను 'పేరెంట్-టీచర్స్ అసోసియేషన్' ద్వారా ఓ కమిటీ వేసి పరిశీలన చేయించి అవసరమైన వారికి మినహాయింపు ఇవ్వాలి. ఫీజు కట్టలేదనే కారణంగా ఏ ఒక్క విద్యార్థికీ పరీక్షలు అనుమతించకపోవడం, టీసీలు ఇవ్వకపోవడం వంటి చర్యలకు పాల్పడవద్దని యాజమాన్యాలను సుప్రీంకోర్టు హెచ్చరించింది.
ప్రయివేటు పాఠశాలల ఫీజుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిందే అయినా, ఏ రాష్ట్రంలో అయినా ఫీజుల నియంత్రణకు చేపట్టే చర్యలకు ఉపయోగపడుతుంది. ఫీజుల నియంత్రణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని యాజమాన్యాలు చేసే వాదనలను నిరోధించడానికి తోడ్పడుతుంది. అధిక ఫీజులు అరికట్టాలని తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉద్యమాలకు ఉత్సాహాన్నిస్తుంది. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలనే ప్రయత్నాలకు ఊతమిస్తుంది. ప్రభుత్వం నేరుగా ఫీజులను నిర్ణయించకుండా 'స్కూల్ లెవెల్ ఫీ కమిటీ'ల చేత నిర్ణయింపచేసే ప్రజాస్వామిక పద్ధతి గల రాజస్థాన్ చట్టం ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా నిలుస్తుంది. డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం మేరకు కరోనా కష్టకాలంలో స్కూల్ ఫీజుల భారాన్ని తగ్గించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని ఈ తీర్పులో వివరించడం మరింత ఉపయోగకరంగా వున్నది. ఛారిటీ సంస్థలుగా ఉండాల్సిన ప్రయివేట్ విద్యాలయాలు ఫీజుల విషయంలో ముఖ్యంగా ఉచితంగా అందించాల్సిన పాఠశాల విద్య ఫీజుల విషయంలో ఉదారంగా ప్రవర్తించాలని, తల్లిదండ్రుల పట్ల సానుభూతిగా వ్యహరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన సూచన చాలా బాగుంది.
- ఎన్. నారాయణ
సెల్: 9490300577