Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది తొలి కార్మికవర్గ రాజ్యం . యుగ యుగాల దోపిడీని శాశ్వతంగా అంతం చేయగల శక్తి విప్లవ కార్మిక వర్గానికే ఉంటుందని కేవలం 72రోజుల పాలనలో నిరూపించిన పొలికేక అది. 1871లోనే కాదు, 150 సంవత్సరాల తరువాత కూడా పారిస్ కమ్యూన్ ఆరని విప్లవజ్వాలే. ప్రముఖ చరిత్రకారుడు ఎరిక్ హాబ ్బమ్ అన్నట్టు ''పారిస్ కమ్యూన్ అంతర్జాతీయ (దోపిడీ) పాలకులకు, భయభ్రాంతులైన మధ్యతరగతి వారికి మూర్ఛలు తెప్పించింది.'' 1871 మార్చి 18తో ప్రారంభమైన కార్మిక విప్లవ ప్రభుత్వ పాలన మే 28న రక్తపుమడుగుల్లో అంతం అయ్యింది. కాదు! అతి క్రూరంగా అంతం చేయబడింది. కానీ ''పారిస్ కమ్యూన్ యొక్క మూల సూత్రాలు యావత్తు కార్మికవర్గం విముక్తి చెందేవరకు మరల మరల ముందుకు వస్తూనే ఉంటాయి. పారిస్ కమ్యూన్ రానున్న నూతన సమాజానికి మహత్తరమైన దూతగా కొనియాడబడుతూనే ఉంటుంది'' అని మార్క్స్ మహాశయుడు ప్రకటించాడు. నిజం! ఇప్పుడు ఫ్రాన్స్‌లో అదే జరుగుతున్నది.
ఫ్రాన్స్ దేశంలో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగనున్నాయి. గత ఎన్నికలలాగానే ఈ ఎన్నికలలో కూడా ఉదారవాద ప్రజాస్వామ్య శక్తులు, పచ్చి మితవాదులు, సోషలిస్టులు, కమ్యూనిస్టుల మధ్య పోటీ గట్టిగానే ఉంటుందంటున్నారు. గత సంవత్సర కాలంగా కార్మికుల పోరాటాలు, ఎల్లోషర్ట్ పేరిట పెట్టుబడిదారీ పాలనపై ప్రజాపోరాటాలు ఎడతెరపి లేకుండా సాగుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, అందునుంచి బయటపడలేక కొట్టుమిట్టాడుతున్న పాలకవర్గాల పాలనే ఈ మొత్తం పరిస్థితులకి పూర్వరంగం. ఈ నేపథ్యంలో ''పారిస్ కమ్యూన్'' 150వ వార్షికోత్సవం వచ్చింది. దీంతో ఫ్రెంచి రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి. ఫ్రాన్స్‌లోని సోషలిస్టులు, కమ్యూనిస్టులు పారిస్ కమ్యూన్ వార్షికోత్సవాలు పెద్దయెత్తున నిర్వహిస్తున్నారు. మరో ప్రక్క పచ్చి మితవాదులు గంగవెర్రులెత్తుతున్నారు. ఒక మితవాద జాతీయ నాయకుడు ''ఆ కమ్యూన్ గురించి సమీక్షిస్తూ ఒక్క మాటలో చెప్పవచ్చు. అదేమంటే హింస. అంతకుమించి ఏమీలేదు'' అని ప్రకటించాడు. మరొకరు, ''కమ్యూనిస్టులు ఇప్పటికీ నాటి కమ్యూనాను హీరోలుగా చిత్రిస్తున్నారు. కాని వాస్తవానికి వారందరూ హంతకులు'' అని ప్రకటించాడు. మరో పక్క కమ్యూనిస్టులు ఉదారవాద ప్రజాస్వామ్య వాదిగా చెప్పుకుంటున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యానుయేల్ మాక్రాన్ క్రమంగా పచ్చి మితవాదిగా మారాడు. ఈ రెండింటి మధ్య తేడా సన్నగిల్లి పోయిందని, అందువలన పారిస్ కమ్యూన్ వీరోచిత చరిత్రని నేటి యువతరానికి ఖచ్చితంగా చెప్పాలని, అందుకే ఈ సన్నాహాలు చేస్తున్నామని ప్రకటిస్తున్నారు. ఆ రకంగా 150సంవత్సరాల తరువాత పారిస్ కమ్యూన్ ఫ్రాన్స్‌ను మళ్లీ రెండు ముక్కలు చేస్తున్నది అంటున్నారు. నిజానికి ఇది ఫ్రాన్స్ లో పరిస్థితి మాత్రమే కాదు. అమెరికాలో, ప్రత్యేకించి ఐరోపా ఖండంలోని అనేక దేశాలలో ఈ పరిస్థితి కనపడుతున్నది.
స్వర్గధామాలను కుదిపిన కార్మిక వర్గం
ఇవి ఎవరో అన్న మాటలు కాదు. స్వయానా కార్ల్ మార్క్స్ పారిస్ కమ్యూన్ గురించి చెప్పిన మాటలు. మొదటి ఇంటర్నేషనల్‌లో (1870 సెప్టెంబర్) పారిస్ కార్మిక వర్గానికి తొందరపడొద్దు అని హెచ్చరించిన ఆయన తోసుకొచ్చిన భౌతిక పరిస్థితుల దృష్ట్యా పారిస్ కార్మికవర్గం విప్లవాన్ని లేపిన రోజున పారిస్ కార్మికులు స్వర్గధామాన్ని కుదిపేశారని ప్రశంసించాడు. ఎందుకంటే నాటికి ప్రపంచం పెట్టుబడిదారీ వర్గం వైపు ఆశగా చూస్తున్న కాలం. 19వ శతాబ్దం చివరి నాటికి ఐరోపా ఖండంలోని అనేక దేశాలలో, అలాగే అమెరికాలో పెట్టుబడిదారీ వ్యవస్థ బలంగా అభివద్ధి చెందుతున్నది. భూస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నది. పెట్టుబడిదారీ విప్లవాలు హౌరెత్తుతున్నాయి. ముఖ్యంగా 1789లో ఫ్రాన్స్‌లో సాగిన పెట్టుబడిదారీ విప్లవం (పారిశ్రామిక విప్లవం) మానవజాతి చరిత్రనే సంపూర్ణంగా మార్చేసిందని ఇప్పటికీ పెట్టుబడిదారీ పాలకులు, వారి సిద్దాంతకారులు కోడై కూస్తూ ఉంటారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నినాదాల చుట్టూ జోరీగల్లా తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలోనే భూకంపంలా పారిస్ కమ్యూన్ ఏర్పడింది. పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క క్రూరత్వాన్ని, దాని మాటల్లోని, వాగ్దానాల్లోని మోసకారితనాన్ని బట్టబయలు చేసింది. 80సంవత్సరాలు ఫ్రెంచి పెట్టుబడిదారీ విప్లవం చేయలేని పనులను కేవలం 72 రోజుల్లో పారిస్ కార్మిక రాజ్యం, కమ్యూన్ చేసి చూపించింది. హతాశులైన ఫ్రెంచి పెట్టుబడిదారులు తమ దేశాన్ని ఆక్రమించుకున్న ప్రష్యన్ రాజుతో కుమ్మక్కై తొలి కార్మిక రాజ్యాన్ని రక్తసిక్తం చేసి అణచివేశారు. పైశాచికమైన రాచరిక పాలనకి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యవాదంతో ఏలుతామని అధికారంలోకి వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్థకు ఏ మాత్రం తేడా లేదని ఫ్రెంచి పాలకవర్గం నిరూపించింది. తన అంతర్గత శత్రువైన విప్లవ కార్మిక వర్గాన్ని అణచివేయడానికి తన దేశం పైన దాడి చేస్తున్న పరాయి పాలకులతో కుమ్మక్కవడానికి కూడా వెనుకాడలేదు.
కార్మిక వర్గంపై అసాధారణ కక్ష
పైకి ఎన్ని మెత్తని మాటలు చెప్పినా సోషలిస్టు చైతన్యం పొందుతున్న కార్మికులంటే (అందుకు కారణమైన కమ్యూనిస్టులంటే) పెట్టుబడిదారీ వర్గానికి పట్టలేనంత కోపం. ఓ పక్కన పారిస్ కమ్యూన్‌ని ధ్వంసంచేస్తూ కమ్యూనాళ్ రక్తం ఏరులై పారుతుంటే మరో ప్రక్కన ఫ్రాన్స్ దేశాధిపతి అయిన జ్యూలియస్ ఫెవర్ ఐరోపా దేశాల ప్రభుత్వాలకు కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ సభ్యులను వేటాడి సంహరించమని పిలుపు యిస్తూ సర్క్యులర్ పంపాడు. ''పారిస్ కమ్యూన్ మొదటి ఇంటర్నేషనల్ పన్నిన కుట్ర'' అని అమెరికా, ఐరోపా దేశాలలోని పాలకులు సైతం ప్రచారం సాగించారు. మొదటి ఇంటర్నేషనల్ ధ్వంసం అయితేనే పారిస్ కమ్యూన్ వంటివి తలెత్తవని వారందరి గట్టి అభిప్రాయం. అందువలనే 1871 మే 21 నుంచి 28 వరకు సాగిన నరమేధం (రక్తసిక్త వారం) గురించి పెట్టుబడిదారీ పత్రికలు కనీసం మాటయినా లేకుండా నిశ్శబ్దాన్ని, కొంతకాలం దానివలన నష్టం జరుగుతున్నదని అర్థం చేసుకుని పచ్చి బూటకపు ప్రచారాన్ని సాగించాయి. ఈ నరమేధం 4నెలలపాటు సాగింది. 20వేల మంది కమ్యూనాని కాల్చి చంపారు. 1.25 లక్షల మందిని జైళ్లలో పెట్టడం గాని, ప్రవాసం పంపటంగాని జరిగింది. మొదటి ఇంటర్నేషనల్ పైన, మార్క్స్, ఏంగెల్స్‌ల పైనా విషప్రచారం సాగించారు. మార్క్స్ ఏంగెల్స్‌లు పారిస్ కమ్యూన్ పతనమైన క్షణం నుంచి అలుపెరగకుండా పారిస్ కమ్యూన్‌పై సాగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, ఇతర దేశాలలో తలదాచుకుంటున్న కమ్యూనార్డ్స్కి ఆర్థిక సహాయం కోసం నిధులు సేకరించడం, వారి కేసులను వాదించడానికి లాయర్లను సమకూర్చడం, అన్ని దేశాలలో పారిస్ కమ్యూన్ విధ్వంసానికి వ్యతిరేకంగా కార్మికవర్గాన్ని కూడగట్టడం అలుపెరగకుండా నిర్వహించారు.
ఏ నాటికైనా పారిస్ కమ్యూనే ఆదర్శం
నేడు యావత్ ప్రపంచం (సోషలిస్టు దేశాలని మినహాయిస్తే) పెట్టుబడిదారీ పాలనలో ఉంది. సోషలిస్టు రష్యా కూలిపోయిన తరువాత సామ్రాజ్యవాదం దేశదేశాల మార్కెట్లను కొల్లగొడుతున్నది. జాతీయ ప్రభుత్వాలను తమ దళారులుగా మారుస్తున్నది. అయినప్పటికీ దశాబ్దంపైగా తనని చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేక, బయటపడే శక్తి కానరాక కునారిల్లుతున్నదని అనేకమంది పెట్టుబడిదారీ ఆర్ధిక శాస్త్ర పండితులే వాపోతున్నారు. ఈ పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి, ముఖ్యంగా నేటి యువత దృష్టి ప్రత్యామ్నాయం వైపు మల్లుతున్నది. అది సోషలిస్టు ప్రత్యామ్నాయం వైపు దారి తీస్తుందేమోనన్న భయం ఈ రోజు ప్రపంచ వ్యాపితంగానే పెట్టుబడిదారీ వ్యవస్థలను కలవరపెడుతున్నది. ఈ పరిస్థితులలో పారిస్ కమ్యూన్ పై చర్చ అంటేనే పెట్టుబడిదారీ వ్యవస్థ ఉలిక్కిపడుతున్నది. ఎందుచేతనంటే పెట్టుబడిదారీ వర్గం తన అవసరాల నిమిత్తం భూస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసే క్రమంలో చేసిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సార్వత్రిక ఎన్నికలు, లౌకికతత్వం వంటి అనేక వాగ్దానాలను అధికార పీఠం ఎక్కంగానే గాలికొదిలేసింది. దీనికి భిన్నంగా 1871 మార్చి 18న పారిస్ నగరం నుంచి బూర్జువా వర్గాన్ని పారద్రోలి కార్మికవర్గం అధికారం చేజిక్కించుకున్న వెనువెంటనే ఎన్నికలు నిర్వహించింది. మార్చి 28న కార్మిక ప్రభుత్వం (కమ్యూన్) ఏర్పాటు చేసింది. పారిస్ కమ్యూన్‌పై మార్క్స్, ఏంగెల్స్‌లు స్థాపించిన మొదటి ఇంటర్నేషనల్ ప్రభావం ఎంతగానో ఉండింది. మార్క్స్, ఏంగెల్స్ కూడా ఆ తొలి కార్మికవర్గ ప్రభుత్వానికి అనుక్షణం వెన్నుదన్నుగా ఉండి అనేక సూచనలు అందించారు. అందువలనే మొదటి ఇంటర్నేషనల్ అంటే నాటి పాలకులకు కన్నెర్ర. అధికారంలోకి వచ్చిన తొలి రోజునుండే ఏ మాత్రం ఆలస్యం లేకుండా కార్మికవర్గ ప్రభుత్వం అనేక ప్రజానుకూల విధానాలను అమలు చేయడం ప్రారంభించింది.
మతాన్ని రాజ్యం నుంచి వేరు చేయడం, మతం నుంచి విద్యను వేరుచేయడం కమ్యూన్ చేసిన కీలక చర్య. స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం, గరిష్ట వేతనం నాటికి 6 వేల ఫ్రాంకులకు మించి ఉండరాదని, ప్రజాప్రతినిధుల వేతనం కార్మికులకు ఇచ్చే కనీస వేతనంతో సమానంగా ఉండాలని ప్రకటించారు. అలాగే న్యాయస్థానాలకు, ప్రభుత్వ అధికారాలకు ఓటింగ్ ద్వారానే ఎన్నిక, తిరిగి వారిని వెనక్కి రప్పించే హక్కు ప్రజలకు యిస్తూ ఆదేశాలు జారీచేశారు. అలాగే వేశ్యావృత్తిలో ఉన్నవారిని ఉద్యోగాలలోకి తీసుకోవడం, వారికి ఇతర మహిళలకున్న హక్కులన్నీ అందించడం జరిగింది. కమ్యూన్ కార్మికవర్గ అంతర్జాతీయతకు కట్టుబడి ఉండటం వలన ఫ్రాన్స్‌లో అప్పటికే విదేశాలనుండి వచ్చి తలదాచుకుంటున్న దాదాపు లక్షమందిని అక్కున చేర్చుకోవడమే కాకుండా వారినుంచి తమ మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. ఫ్రాన్స్‌లో రాజ్యమేలుతున్న జాతి దురహంకారానికి ఇది పెద్ద చెంపపెట్టు. అలాగే యుద్ధోన్మాదాన్ని తిరస్కరిస్తూ నాటికి రాజు ఏర్పాటుచేసిన అధికారయుత సైన్యాన్ని, పోలీసు వ్యవస్థను రద్దుచేసి, వాటి స్థానంలో ప్రజలనుండే సైన్యాన్ని, పోలీసుని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. పారిస్ కార్మికరాజ్య పాలనా ప్రకంపనలు ఐరోపా ఖండాన్ని చుట్టుముట్టాయి. జర్మన్ పార్లమెంటులో కార్మిక నాయకుడు బెబెల్ తన ఉ పన్యాసాన్ని ముగిస్తూ (25.5.1871) ''పారిస్ కార్మిక వర్గం యొక్క మహత్తర నినాదమైన రాజప్రాసాదాలపై యుద్ధం - గుడిశెలకు శాంతి, సోమరితనానికి, పేదరికానికి మరణం అన్నది ఇక మొత్తం ఐరోపా కార్మికవర్గ రణ నినాదంగా మారింది'' అన్న మాటలు అక్షర సత్యాలు.
సోషలిజమే నిజమైన ప్రత్యామ్నాయం
తమ పారిస్ కమ్యూన్ బూటకపు రిపబ్లిక్ కాదు. అది సోషలిస్టు రిపబ్లిక్ అని కార్మికులు ప్రకటించారు. ఆ సోషలిస్టు రిపబ్లిక్‌ను ధ్వంసం చేశామని దోపిడీదారుల ప్రపంచం చంకలు గుద్దుకోవడం ఆరంభించిన కొద్ది సంవత్సరాలకే రష్యాలో విప్లవాలు (1905, 1912, 1917) చెలరేగి 1917లో సోవియట్ లో కార్మికవర్గ రాజ్యం, సోషలిస్టు వ్యవస్థ ఆవిర్భవించింది. కామ్రేడ్ లెనిన్ చెప్పినట్లు నూతన యుగం, సోషలిస్టు విప్లవాల యుగం ఆరంభం అయ్యింది. ఎన్ని వడిదుడుకులు వచ్చినా ఆ క్రమం, వరవడి సాగుతూనే ఉంది. తిరుగులేదు, అసలు ప్రత్యామ్నాయమే లేదని విర్రవీగిన పెట్టుబడిదారీ వ్యవస్థ నడ్డివిరిగి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకు పోయింది. 2020లో దాపురించిన కరోనా మహమ్మారి పెట్టుబడిదారీ వ్యవస్థ అసమర్ధతని పూర్తిగా బట్టబయలు చేసింది. ఇంత ఉపద్రవంలో కూడా పెట్టుబడిదారుల లాభాలకే ప్రాధాన్యం, ప్రజల గురించి పట్టించు కోలేమన్న రీతిగా మన దేశంతో సహా పాలన సాగుతున్నది. కానీ మరోపక్క పారిస్ కమ్యూన్ అడుగుజాడల్లో నడుస్తున్న సోషలిస్టు దేశాలు ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో, అందుకు ప్రజారోగ్యాన్ని, ప్రభుత్వ వైద్యాన్ని ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుని పనిచేస్తున్నాయి. ప్రజా బాహుళ్యాన్ని చైతన్యపూరితంగా కదిలించడం మూలాన అప్రతిహతంగా ముందుకు సాగుతున్నాయి.
పారిస్ కమ్యూన్ వర్థిల్లాలి ! కార్మికవర్గ అంతర్జాతీయత వర్థిల్లాలి !! సోషలిజం వర్థిల్లాలి !!!
- ఆర్. రఘు