Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 'ద హిందూ' దినపత్రికకు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు....
ప్రశ్న: కరోనా మహమ్మారి , మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించి గత సంవత్సరం డిసెంబర్ నుంచి ప్రతిపక్ష పార్టీలు నాలుగు ఉమ్మడి ప్రకటనలు విడుదల చేశాయి. అందరినీ ఒకే తాటి మీదకు తేవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలను గూర్చి తెలియ చేస్తారా?
జవాబు: మొదటి వేవ్ వ్యాప్తి సమయంలో, 21పార్టీలు ఆన్లైన్ సమావేశం నిర్వహించి, ప్రభుత్వం అత్యవసరంగా తీసుకోవలసిన చర్యలను గూర్చి సూచిస్తూ ఉమ్మడి వినతిపత్రం సమర్పించాం. ఆ వినతి పత్రంలో నగదు బదిలీలు, అవసరమున్న వారికి ఉచితంగా ఆహారాన్ని అందించే చర్యలు చేపట్టాలని కోరాం. అయితే మేము ఉమ్మడిగా గాని, వ్యక్తిగతంగా గాని రాసిన ఉత్తరాలకు ప్రభుత్వం సహజంగానే ఏమాత్రం స్పందించలేదనుకోండి! గత సంవత్సరం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం వల్ల దాని మూల్యాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో వారి జీవనోపాధిని మెరుగుపరిచే విషయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య సమిష్టి అవగాహన ఉంది. మహమ్మారి వ్యాప్తి సమయంలో భౌతికంగా సంప్రదించటం సాధ్యం కాదు కాబట్టి, ఆన్లైన్ సమావేశాల ద్వారా గాని, ఫోన్ల ద్వారా గాని అందరినీ సంప్రదించడం లో కొంత జాప్యం జరిగింది. నా ఉద్దేశ్యంలో, ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడానికి పార్టీలన్నీ మినహాయింపులు లేకుండా ఒకే వేదిక పైకి ఖచ్చితంగా రావడం అనేది అత్యంత ఆవశ్యకమని నా అభిప్రాయం.
ప్రశ్న: మే2వ తేదీన మెడికల్ సంబంధిత ఆక్సిజన్ సరఫరాను క్రమబద్ధం చేయాలని ప్రతిపక్షాలు ఉమ్మడిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పుడు బీఎస్పీ సంతకం చేసింది.కానీ తరువాత రెండు సార్లు బీఎస్పీ భాగస్వామి కాలేదు. దీనిని బట్టి మొత్తం మీద ఉమ్మడి ప్రతిపక్షాల ప్రయత్నాలలో వారు భాగస్వాములు కావడానికి విముఖంగా ఉన్నట్లు ఉంటున్నారు. మరోవైపు ఆప్ విషయాని కొస్తే ఈ ప్రయత్నాలు వేటిలో తాను ఏనాడూ భాగస్వామి కాలేదు. ఇది ఆప్, బీఎస్పీ అయిష్టతా లేక వారిని ఉమ్మడి భాగస్వామ్యం లోనికి తీసుకురావడంలో మిగతా ప్రతిపక్షాల అయిష్టతా?
జవాబు:ఈ ప్రశ్నకు సంబంధించి బీఎస్పీ, ఆప్ మాత్రమే సమాధానం చెప్పాలి. బీఎస్పీ మే2న రాసిన లెటర్‌పై సంతకం చేసింది. ఈ లోపులో యూపీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. తదుపరి రెండు లెటర్స్పై సంతకంచేయలేదు. వారెందుకు దూరంగా ఉన్నారో వారే సమాధాన మివ్వాలి. ఆప్‌కు కూడా ఇది వర్తిస్తుంది. వాస్తవానికి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరూ ఈ ప్రయత్నాలలో ఏనాడూ భాగస్వాములు కాలేదు. ప్రధానంగా ఈ కోవిడ్ విపత్తు సమయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. మహమ్మారికి ముందే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందని మనం గుర్తించాలి. మహమ్మారి విజంభణ తర్వాత ప్రజల జీవనోపాధి విషయంలో విపరీతమైన కొరత ఏర్పడింది. దీనిని అధిగమించడానికి, ప్రపంచంలో అనేక దేశాలు అనుసరిస్తున్నట్టుగా నేరుగా నగదు బదిలీ చేయడం, ఉచితంగా, భోజనవసతి కల్పించడం లాంటి చర్యలు, చేపట్టవలసి ఉంటుంది.
ప్రశ్న: ఈ ప్రయత్నాలు ఉమ్మడి విన్నపాలకే పరిమితం అవుతాయా? రాబోయే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి అవగాహన ఉంటుందా?
జవాబు: యూపీ ఎన్నికలకు ఇంకా కొంత సమయం ఉంది. ఈ లోపు ఎన్నికల కంటే ముందే గంగలో చాలా నీరు ప్రవహిస్తుంది. దురదృష్టవశాత్తు కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో యోగీ ఆదిత్యానాథ్ అధికార దుర్వినియోగం వల్ల గంగలో శవాలు తేలియాడుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి గుణపాఠాలు తీసుకొనవలసి ఉంది. అసోం విషయంలో తప్ప, బీజేపీకి, లౌకిక పార్టీలకు మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వైఫల్యం చెందింది. యూపీ, గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమయ్యేది ఏమంటే బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులు ఐక్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ప్రశ్న:పార్టీ విధాన నిర్ణయం ప్రకారమే పినరయి విజయన్ మొదటి మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరినీ మార్చామని చెప్తున్నారు. మాజీ ఆరోగ్య మంత్రి కె.కె శైలజ విషయంలో పార్టీ మినహాయింపు ఇవ్వలేక పోయిందా?
జవాబు: కాబినెట్లో ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని మినహాయించాలనేది రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తుంది. అది సమిష్టి నిర్ణయం. మహమ్మారిని నివారించడంలో కె.కె శైలజ చేసిన కృషి సర్వత్రా అంగీకరించడబడడమే కాక, కేరళలో, దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందింది. గత క్యాబినెట్లో ఆమె కూడా మొదటి సారి మంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండు కారణాల వల్ల మినహాయింపు సాధ్యపడదు. మొదటిది తిరిగి తీసుకోవడం సరైనది కాదు. రెండవది అది ఆచరణసాధ్యం కానిది. ఒకవేళ శైలజకు మినహాయింపు ఇచ్చినట్టయితే, అలాంటప్పుడు ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ సంగతి ఏమిటి? ఆయన కూడా ఎంతో విజయవంతంగా ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాకు బాధ్యత వహించారు. అదే విధంగా పీడబ్ల్యూడీ మంత్రి వి.సుధాకరన్ కూడా వారితోపాటు అంతే సామర్థ్యం కలవాడు. అలాంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. నాకు సంబంధించిన విషయంలో కూడా, అనేక అభ్యర్థనలు వచ్చినా రాజ్య సభకు రెండుసార్లే అనే నిబంధనకు కట్టుబడి ఉన్నాం. ఒక్కసారి మనం మినహాయింపు ఇచ్చినట్టయితే అదే నియమంగా మారుతుంది. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించే విషయానికొస్తే, గత క్యాబినెట్లో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. ఈ సారి ముగ్గురు మంత్రులున్నారు.
ప్రశ్న: ప్రత్యేక గుర్తింపున్న పినరయి విజయన్ సీపీయంలో అందరికన్నా ఉన్నతునిగా ఉంటూ పార్టీ ప్రాధాన్యతను తగ్గిస్తారనే భయం ఉంది.దీనికి మీరేమంటారు?
జవాబు: ఇలాంటి ఆలోచనలన్నీ కేవలం తమ అధిష్టానం ఆదేశాలను అంగీకరించే పార్టీల నుండే ఉద్భవిస్తాయి. అనేక రాజకీయ పార్టీల విషయంలో ఇది వాస్తవం. సీపీఐ(ఎం) దీనికి భిన్నమైన శైలిని, పద్ధతిని కలిగి ఉంటుంది. మా పార్టీ బలమైన అంతర్గత ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ. మాకు సంబంధించినంతవరకు వ్యక్తి కంటే సమిష్టితత్వమే పైచేయిగా ఉంటుంది. సమిష్టి నిర్ణయాన్ని అమలు చేయడం కోసం, అనేక సందర్భాలలో పార్టీ ప్రధాన కార్యదర్శి అభిప్రాయాలను తిరస్కరించడం జరిగింది. అది కేవలం నా విషయంలోనే కాదు, ఇలాంటివి అనేక సందర్భాలు ఉన్నాయి. దానిలో ప్రధానమైనది, తరచూచర్చనీయాం శమవుతున్న దానికి ఉదాహరణ ఏమంటే, ఆనాటి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సూర్జిత్ మద్దతు ఉన్నప్పటికీ కామ్రేడ్ జ్యోతీబాసు ప్రధాన మంత్రి కాలేక పోవడం. ఎందువల్లనంటే పార్టీ సమిష్టిగా అది పొరపాటు నిర్ణయమని భావించింది. పార్టీ ఏవిధంగా పని చేస్తుందో తెలియని వారు మాత్రమే మాత్రమే ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తుతారు.
ప్రశ్న: పశ్చిమ బెంగాల్లో పూర్తిగా బలహీనపడిన తరువాత పార్టీకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది?
జవాబు: బెంగాల్ ఓటర్లది బీజేపీని ఓడించాలనే ప్రబలమైన ఆకాంక్ష. ఎందువల్లనంటే, బీజేపీ ప్రచారం, బెంగాల్ ప్రజల ప్రవృత్తికి, సంస్కృతికి విరుద్ధమైనది. బీజేపీని ఎవరు ఓడిస్తారనేదే బెంగాల్ ప్రజల ముందున్న ప్రధాన సమస్య. ఈ సెంటిమెంట్ కేవలం బెంగాల్ కే పరిమితం కాలేదు. తమిళనాడు, కేరళ ప్రజలు కూడా బీజేపీని అధికారంలోనికి రాకుండా అడ్డుకొన్నారు. కేరళలో బీజేపీకి ఉన్న ఒక్క సీటును కూడా కోల్పోయింది. బెంగాల్ విషయానికి వచ్చేసరికి టీయంసీకి అనుకూలమైన ఓట్లకంటే, బీజేపీ వ్యతిరేక ఓట్లు ఎక్కువ వచ్చాయి. అధిక ఓట్లు వచ్చిన వారే గెలిచినట్టుగా ప్రకటించే పద్ధతిని బ్రిటిష్ వారి నుంచి మనం వారసత్వంగా తీసు కున్నాం. రెండు పక్షాల మధ్య పోటీలో మూడవ ప్రత్యామ్నాయం కనుమరుగైపోయింది. అసలైన రాజకీయ సమరం ఇప్పుడే ప్రారంభమయింది. సీపీఐ(ఎం) కొత్త తరానికి చోటు కల్పించి, రంగంలోకి దింపింది. పార్టీలోనికి కొత్త రక్తాన్ని నింపింది. భవిష్యత్తులో వారే నాయకత్వం వహిస్తారు.
ప్రశ్న:ఫర్ ఫురాషేక్ క్లరిక్ అబ్బాస్ సిద్ధికి నాయకత్వంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌తో కూటమి కట్టడం ఘోరమైన తప్పు కదా! పార్టీ తన నిర్ణయంపై సమీక్ష చేసుకుంటుందా?
జవాబు: కేవలం బెంగాలే కాక అన్ని రాష్ట్రాల సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమీక్షల ద్వారా స్పష్టమైన అవగాహనకు రాగలుగుతాము. బెంగాల్లో మా లక్ష్యం లౌకిక శక్తులన్నింటినీ ఐక్యం చేయడమే. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ గతంలో ఒకవ్యక్తి చేత నిర్వహించ బడుతున్నప్పటికీ, వారి నాయకత్వంలో అట్టడుగు వర్గాలు, దళితులు, గిరిజనులు ఉన్నారు. పార్టీ నిర్దేశించిన పద్ధతినే అమలు చేస్తాం. ('ద హిందూ' సౌజన్యంతో)
అనువాదం:మల్లెంపాటి వీరభద్రరావు,
- సీతారాం ఏచూరి
సెల్:9490300111