Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేట్ విద్యాసంస్థలు ఎన్ని తప్పిదాలు చేసినా వాటిపైన ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు మన కనుచూపు మేరలో లేవు. అడ్మిషన్ల ప్రక్రియలో గాని, ఫీజుల విషయంలో గాని, సెలవుల విషయంలో గాని కళాశాల సమయపాలన విషయంలోగాని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నిబంధనలు అతిక్రమించి డబ్బులు దండుకోవడంలో, విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ఆరితేరాయి. కరోనా కష్టకాలంలో వాటిలో పని చేస్తున్న అధ్యాపకులను అన్యాయంగా తొలగించి వారికి కనీసం వేతనాలు కూడా ఇవ్వకుండా రోడ్డున పడేశాయి. అయినా ప్రభుత్వం వాటిపైన ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నదని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. కరోనా సమయంలో ఆన్లైన్లో గాని ఆఫ్లైన్లో గాని ప్రవేశాలు చేపట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చినా వాటిని బేఖాతరు చేస్తున్నాయి. యధేచ్ఛగా 2021-22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేయడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కార్పొరేట్ మాయాజాలం మూలంగా విద్యార్థులకు, అందులో పని చేస్తున్నటువంటి అధ్యాపకులకు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వాటిని కట్టడి చేయాలి.
నాన్ కార్పొరేట్ విద్యా సంస్థలను కాపాడాలి
రాష్ట్రంలో గత ఏడేండ్లలో సుమారు 1,350 ప్రయివేటు జూనియర్ కళాశాలలు మూతపడ్డాయి. అందులో పనిచేస్తున్న సుమారు 40 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది రోడ్డున పడ్డారు. వారు అటు ప్రభుత్వ నియామకాలకు వయో పరిమితి దాటిపోయి ఇతర వృత్తులకు పోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అందులో కొందరు 15 ఏండ్లు, మరికొందరు 20 ఏండ్ల నుంచి కళాశాలలను ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాలలో విద్యను అందించారు. ఇప్పుడు ఆ కాలేజీలను నడపలేక అప్పుల పాలై ఉన్న ఆస్తులను అమ్ముకునే పరిస్థితి దాపురించింది. ఆ కళాశాలల్లో చదివే విద్యార్థులకు స్కాలర్షిప్లు, ట్యూషన్ ఫీజులు సరైన సమయంలో అందించకపోవడం, ఖర్చులకు అనుగుణంగా ఫీజులను పెంచకపోవడమే ప్రధాన కారణం. నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్న విద్యాసంస్థలను కాపాడుకోవాలి. కార్పొరేట్ సంస్థలు ఏనాడూ నిబంధనలు పాటించలేదు. విద్యార్థులు, తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని వేల కోట్ల రూపాయలను కార్పొరేట్ విద్యాసంస్థలు దండుకుంటున్నాయి. స్వరాష్ట్రంలోనైనా కట్టడి అవుతాయని ఆశించాం. రాష్ట్రం వస్తే కార్పొరేట్ విద్యాసంస్థలను తరిమి కొడతాం, తెలంగాణ నిరుద్యోగ పట్టభద్రుల కాలేజీలను కాపాడుతామని ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు ప్రకటించారు. రాష్ట్రంలో 2,860 జూనియర్ కళాశాలలు ఉండేవి. కానీ ప్రస్తుతం 960 నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్న జూనియర్ కళాశాలలు నిర్వహించబడుతున్నాయి. వాటికి ప్రభుత్వం ట్యూషన్ ఫీజులను సకాలంలో విడుదల చేయడం లేదు. జీవో నెంబర్ 112 ప్రకారం ఇంటర్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు ఏడేండ్లుగా పెంచలేదు. 1985లో అప్పటి ప్రభుత్వాలు పది రూపాయలతో ప్రారంభించిన ట్యూషన్ ఫీజు ప్రస్తుతం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు రూ.1,760, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రూ.1,940 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏటా 10శాతం ట్యూషన్ ఫీజు పెంచుతామన్న హామీ అటకెక్కింది.
ప్రయివేటు కాలేజీల్లోని సిబ్బందిని ఆదుకోవాలి
ప్రయివేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి నెలకు రూ.2 వేలు ఆర్థిక సహాయం, 25 కిలోల బియ్యం ప్రభుత్వం అందిస్తున్నది. ఇది మంచి నిర్ణయం. కరోనా ఉధృతిని తగ్గించడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. విద్యాసంస్థలు మూతపడడంతో వారికి వేతనాల్లేక ఉపాధి కూలీలుగా మారుతున్నారు. కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మానవీయ కోణంతో ఆలోచన చేసి కళాశాలలో పనిచేస్తున్న వారందరికీ కరోనా భృతి నెలకు రూ.5 వేలు, 50 కిలోల బియ్యం అందించాలి. జూనియర్ కళాశాలకు అనుబంధ గుర్తింపు తప్పనిసరి. ఇంటర్ బోర్డు 2017-18 విద్యాసంవత్సరంలో ఒక్కసారిగా గుర్తింపు ఫీజు, తనిఖీ ఫీజు 200 శాతం పెంచడం జరిగింది. దీంతో జూనియర్ కళాశాలల యాజమాన్యాలపై మోయలేని ఆర్థిక భారం పడింది. నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్న వందల జూనియర్ కళాశాలలు మూతపడ్డాయి. విద్యార్థులకు ఇవ్వాల్సిన ట్యూషన్ ఫీజు పెంచకుండా గుర్తింపు, తనిఖీ ఫీజులు పెంచడం ఎంత వరకు సమంజసం. ఎలాంటి రుసుం లేకుండా అనుబంధ గుర్తింపును ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రయివేటు కాలేజీలు రూ.10 వేల నుంచి రూ.20 వేల ఫీజులు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. అదే కార్పొరేట్ కళాశాలలు కరోనా సమయంలోనూ రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికనా కండ్లు తెరవాలి. కార్పొరేట్ దోపిడీని అరికట్టాలి. రోడ్డునపడ్డ సిబ్బందిని ఆదుకోవాలి.
- గౌరీ సతీష్
సెల్: 9989021453