Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో కరోనా రెండవ వేవ్‌ను అదుపు చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలం చెందిందని వచ్చిన విమర్శలను, ప్రభుత్వం తప్పు అని చెప్పే ప్రయత్నాలు చేసింది. వాటిలో భాగంగా ప్రభుత్వం తన అధికారాలను ఉపయోగించి, తిరుగులేని మార్గదర్శకాలను సోషల్ మీడియా వేదికలకు జారీ చేసింది. మీడియా సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలకు కూడా తన అభ్యంతరాలను తెల్పింది. భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన 50కి పైగా పోస్టులను తొలగించాలని ట్విట్టర్‌ను ఆదేశించింది. ఈ ట్వీట్లన్నీ దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు, నాయకులు, జర్నలిస్టులు, నటులు, సినీ నిర్మాతలు చేసినవి. యూకేకు చెందిన 'ద సండే టైమ్స్'లో ప్రచురితమైన ఒక వ్యాసం ''భారత ప్రధాని, మోడీ దేశాన్ని లాక్డౌన్ నుంచి బయటకు తెచ్చి, వేగంగా వినాశనంలోకి నెట్టివేశాడని, అహంభావం, తీవ్ర జాతీయతాభావం, అసమర్థ ఉద్యోగస్వామ్యాలు కలిసి సంక్షోభాన్ని సృష్టిస్తే, ప్రజలంతా ఆక్సిజన్ కొరతతో ఊపిరాడక చనిపోతుంటే, జనసమూహాన్ని ప్రేమించే ప్రధాని వేదికపై హాయిగా కొలువు తీరాడని'' పేర్కొంది.
వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్, భారత్‌ను ప్రపంచ దేశాల మధ్యన నిలబెట్టడానికి దేశ ప్రతిష్టను సమర్థించాలని అన్నాడు. ప్రపంచంలో ఇటువంటి మహమ్మారి విజృంభించిన సమయంలో తమ నాయకుడైన మోడీని, భారతదేశాన్ని మానవ రక్షకులుగా కొలుస్తున్నారని, ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేసినందుకు 'నోబెల్ శాంతి బహుమతి' పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అది రాకుండా కుట్రలు జరుగుతున్నాయని, వాటిని బయట పెట్టి, ఆ చర్యలను ఖండిస్తామని అన్నాడు. ఉత్తరభారత దేశంలో బాగా పెరిగిన మహమ్మారి వ్యాప్తిని, మందులను అందుబాటులో ఉంచడంలో జరుగుతున్న లోపాలను, ఆసుపత్రులలో పడకల కొరత, చనిపోయిన వారి అంతిమ సంస్కారాలకు దొరకని స్థలాల గురించి వచ్చే వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని గిరిరాజ్ సింగ్‌తో పాటు యూపీ బీజేపీ, ఆరెస్సెస్, సంఫ్‌ుపరివార్ సభ్యులు అంటున్నారు. సంఫ్‌ుపరివార్ సభ్యుల ఆంతరంగిక చర్చల్లో, అంతర్జాతీయంగా మోడీ, ఆయన ప్రభుత్వ ప్రతిష్టను పెంచి, 2020లో రిపోర్టర్స్ సాన్స్ ఫ్రంటియర్స్ (ఆర్ఎస్ఎఫ్) ప్రకటించిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్‌లో భారతదేశం సాధించిన తక్కువ స్థాయి ర్యాంకును మార్చాలనే ప్రయత్నాలు చేసినప్పటికీ, గత సంవత్సరం 180దేశాల్లో భారతదేశం 142వ ర్యాంకు పొందింది. ఆర్ఎస్ఎఫ్ నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని 2019లో రద్దు చేసిన తర్వాత అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసిన కారణంగానే భారత దేశం, ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్‌లో ఆ స్థాయిలో ఉంది.
2021లో కూడా మన దేశం అదే ర్యాంకును పొందింది. ఆర్ఎస్ఎఫ్ నివేదికలో ''తమ పని తాము చేసుకుంటున్న జర్నలిస్టుల విషయంలో, ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యంత ప్రమాదకరమైన దేశమని, వారిపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయని, రిపోర్టర్స్‌కు వ్యతిరేకంగా పోలీసులు, రాజకీయ కార్యకర్తలు దాడులు చేస్తారని, నేరపూరిత గుంపులు ప్రతీకార చర్యలకు పాల్పడతారని'' పేర్కొన్నారు.
''2019 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ, హిందూ జాతీయవాద ప్రభుత్వం చెప్పినట్టు చేయాలని మీడియాపైన ఒత్తిడి పెంచింది. హిందూత్వవాద కార్యకర్తలకు కోపం వచ్చే రీతిలో ధైర్యం చేసి మాట్లాడి, రాస్తున్న జర్నలిస్టులకు వ్యతిరేకంగా ద్వేషభావంతో, చంపుతామని బెదిరిస్తూ ఫోన్లు చేస్తున్నారు. మహిళా జర్నలిస్టులు లక్ష్యంగా ఉన్నప్పుడు ద్వేషపూరిత చర్యలు మరింత హింసాయుతంగా ఉంటాయని, అధికారులకు ఇబ్బంది కలిగించే జర్నలిస్టుల నోళ్ళు మూయించడానికి, జీవిత ఖైదు విధించే 'దేశద్రోహం'చట్టం 124(ఏ) మోపుతారు'' అంటూ ఆర్ ఎస్ ఎఫ్ వెబ్సైట్లో ఉంచిన ఫిబ్రవరి, మార్చి నెలల్లో తయారైన భారత్‌కు చెందిన నాలుగు నివేదికలూ స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీ న్యూస్ వెబ్సైట్ 'న్యూస్ క్లిక్'పై బహిరంగంగా దాడులు చేశారని'' కూడా ఆ నివేదికలు పేర్కొన్నాయి.
142వ ర్యాంకుతో నిరుత్సాహానికి గురై, దానిని మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వం ''ఇండెక్స్ మానిటరింగ్ సెల్'' పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందుకు సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కాకుండా కేంద్ర ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి నుంచి ప్రత్యక్షంగా సూచనలు పంపారు. 13మంది సభ్యులున్న ఈ కమిటీలో ఇద్దరు జర్నలిస్టులు మినహా మిగిలిన వారంతా వివిధ శాఖలకు చెందిన అధికారులు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఆజ్ఞానుసారం ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ ఐఎంసీ పనితీరు 2020 చివరి నాటికి నిలిచిపోయింది. డిసెంబర్ 7 నుంచి కమిటీ సమావేశం జరగలేదు. బహిరంగంగా గుర్తించనప్పటికీ, కమిటీలో ఉన్న ఇద్దరు జర్నలిస్టు సభ్యులలో ఒకరైన పాలగుమ్మి సాయినాథ్ భిన్నాభిప్రాయాలతో కూడిన తన సూచనలు పంపడమే స్తబ్దతకు కారణంగా కనిపిస్తోంది. ఆయన తన నివేదికలో పేర్కొన్న సూచనలు, స్వతంత్రమైన సూచనలుగా స్వీకరించాలని, ప్రభుత్వం కోరుకున్న విధంగా తాము నివేదిక ఇవ్వలేక పోయామని ఆయన మిగిలిన సభ్యులకు తెలిపారు.
భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వ అదుపులో తయారైన నివేదికపై మాట్లాడుతూ, గత మార్చిలో మీడియావి ''అత్యవసర సేవలు''గా ప్రధాని మోడీ ప్రకటించిన తర్వాత ప్రభుత్వమే జర్నలిస్టులపై దాడులు, అరెస్ట్‌లు చేసి, భయపెట్టి, వేధింపులతో వారిని హింసకు గురిచేస్తున్నది. భారత దేశంలో మీడియాపై 52రకాల చట్టాలను ప్రయోగిస్తున్నారు. అందుకే అమాయకులైన వ్యక్తులపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులను చట్టపరంగా శిక్షించేందుకు ఒక చట్టం అవసరమని సాయినాథ్ డిమాండ్ చేశాడు.
న్యూస్ క్లిక్ లాంటి స్వతంత్ర సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ అధికారులచే సెర్చ్ వారెంట్ లేకుండా దాడులు చేయించడం, 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' అనే ప్రముఖ మానవ హక్కుల సంస్థపై కూడా ఇదే విధంగా దాడులు చేయించి, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరుపకుండా వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయించి చిన్న స్వతంత్ర సంస్థలను దివాళా తీయించడం ప్రభుత్వ వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నది. ఆర్నబ్ గోస్వామికి వ్యతిరేకంగా నేరం మోపినప్పుడు కేంద్ర మంత్రులు బహిరంగంగా ఖండించారు. కానీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే జర్నలిస్టులకు మాత్రం రక్షణ లేదు. గత ఏడాది లాక్డౌన్ ప్రకటించిన మరుసటి రోజు యూపీ ముఖ్యమంత్రి ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యాడని ట్వీట్ చేసినందుకు 'ద వైర్' సంస్థాపక ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్‌పై కేసు నమోదు చేశారు. ఈ అసమానతలు ప్రభుత్వ హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకొని పోయేందుకు ఉపయోగపడు తున్నాయి. స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నవారి హక్కులను ప్రభుత్వం కుదిస్తుంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేసిన నిరసనలు, ప్రతిఘటనను అణచివేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అంతర్జాతీయంగా విమర్శలకు గురయ్యాయి. ఫిబ్రవరి 2వ తేదీన నిరసనలలో సంభవించిన మరణాల గురించి నివేదికలు సమర్పించిన 8మంది సీనియర్ జర్నలిస్టుల పైన, మత సామరస్యానికి విఘాతం కలిగించారని నేరా రోపణ చేస్తూ దేశద్రోహం కేసులు నమోదు చేశారు.
దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ తీవ్ర సంక్షోభంలో ఉంది. మీడియా ముఖ్యంగా స్వతంత్ర జర్నలిస్టులపై అప్రకటిత ఎమర్జెన్సీని దేశంలోని నేటి పరిస్థితులు రుజువు చేస్తున్నాయి. గడచిన సంవత్సరం కాలం పైగా జర్నలిస్టులపై నమోదైన కేసులను ఉపసంహరించాలని, కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్ధికి కప్పన్పై మోపిన యూఏపీఏ లాంటి దారుణమైన చట్టాలను ప్రయోగించి నిర్బంధంలో ఉంచిన జర్నలిస్టులందరినీ విడుదల చేయాలని సాయినాథ్ డిమాండ్ చేశారు. చట్టబద్ధమైన మాటలను, భిన్నాభిప్రాయాలను నేరంగా పరిగణించి, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులపై క్రిమినల్, టెర్రరిస్టు వ్యతిరేక చట్టాల కింద నేరాలు ఆరోపించి కేసులు నమోదు చేసి, విమర్శలను అదుపు చేయడమే ప్రభుత్వ వ్యూహంగా కనపడుతుంది. భారతదేశంలో జర్నలిజం ఒక ప్రమాదకరమైన వృత్తిగా మిగిలి పోయింది. జర్నలిస్టులను హత్యలు చేసిన హంతకులు స్వేచ్ఛగా విహరిస్తున్న దేశాల్లో మనదేశం 13వ ర్యాంకు సాధించింది. కనుక జర్నలిస్ట్‌ల రక్షణ కొరకు న్యాయపరంగా ఉచితంగా వాదించే ఒక 'లీగల్ బాడీ'ని ఏర్పాటు చేయాలని సాయినాథ్ సిఫార్సు చేశాడు.
జర్నలిస్టుల స్వతంత్రతకు, వారి హక్కుల పరిరక్షణ కోసం జర్నలిస్టు యూనియన్లు, అసోసియేషన్లు, వృత్తిపరమైన కమిటీలు అవసరం. 'వర్కింగ్ జర్నలిస్టు చట్టం' ఉల్లంఘనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ప్రజాస్వామ్యానికి ఉన్న నాలుగు మూల స్తంభాలలో, ప్రజా వాణిని వినిపించడం ద్వారా మిగిలిన మూడు స్తంభాలను అదుపు చేసే నాలుగో స్తంభమైన మీడియా (మాధ్యమాలు) కూలిపోతుంది.
- బోడపట్ల రవీందర్
సెల్:9848412451