Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సినీ తెరపై 'సుత్తి' ద్వయం చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఈ పేరిట సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు సిల్వర్ స్క్రీన్‌పై కొన్నేండ్ల పాటు నవ్వుల పువ్వులు పూయించారు. ముఖ్యంగా హాస్యబ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాల్లో వారిద్దరూ మంచి టైమింగ్‌తో, అంతకు మించిన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి... కితకితలు పెట్టారు. వారి కామెడీతోనే అనేక చిత్రాలు నిర్మాతలకు కనకవర్షం కురిపించాయనటంలో అతిశయోక్తి లేదు. అయితే అదే హాస్య ద్వయం... ఒక్కోసారి ప్రేక్షకులకు అదే పనిగా బోర్ కొట్టిస్తున్నామంటూ తమ మీద తామే జోకులు వేసుకుంటూ... 'మాది సుత్తి, పరమ సుత్తి, అరవీరభయంకర సుత్తి...' అంటూ కామెంట్ల విసుర్లు విసురుకునేవారు. అప్పట్లో వారి సుత్తి మాదిరిగానే ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయ పీఆర్వో (ప్రజా సంబంధాల అధికారులు)లు సైతం ఆయన్ను అదే పనిగా స్తుతించే ప్రోగ్రామ్ పెట్టుకుని... మీడియాకు సుత్తి కొడుతుండటం పరిపాటిగా మారింది. అది క్యాబినెట్ మీటింగ్ అయినా లేదంటే ఏదైనా ఉన్నతస్థాయి సమీక్ష అయినా... నిర్ణయాలు, ముఖ్యమైన అంశాలతో కూడిన ప్రకటనను జారీ చేయటం రివాజు. అందుకు భిన్నంగా పుంఖాను పుంఖాలుగా ప్రెస్‌నోట్‌కు బదులు, వ్యాసాలు రాసి పంపిస్తూ తెగ సంబరపడిపోతున్నారు. సీఎంవో స్థాయి కార్యాలయం నుంచి వచ్చే ప్రెస్ నోట్ అంటే.. దానికో హుందాతనం, పద్ధతీ, పాడూ ఉండాలి. నిన్నా, మొన్నా చెప్పిన దానికి భిన్నంగా కొత్త పాయింట్లు, నిర్ణయాలతో సూటిగా, సుత్తి లేకుండా స్పష్టంగా ఉండాలి. ఇలా రాయటం కోసమే నిపుణులైన సీనియర్ పాత్రికేయులను ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు పీఆర్వోలుగా నియమించుకుంటారు. ఆ ఉద్దేశానికి భిన్నంగా సీఎం గారి మీటింగ్ ప్రారంభమైన దగ్గర్నుంచి... ముగిసే వరకూ తూ.చా. తప్పకుండా, మక్కీకి మక్కీ దించితే అది సమావేశపు పూర్తి పాఠం అవుతుంది తప్ప పత్రికా ప్రకటన ఎలా అవుతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆ సుదీర్ఘమైన ప్రహసనాలతో కూడిన ప్రకటనలను కూడా నిర్ణీత సమయంలో కాకుండా రాత్రి పది, పదకొండు గంటలకు పంపటం ద్వారా ఒక రకంగా ముఖ్యమంత్రి కార్యాలయం వార్తలను రాసే పాత్రికేయులకు సదరు పీఆర్వోలు పనిష్మెంట్ ఇవ్వదలిచారా..? అనే చర్చ ఇప్పుడు తెలుగు మీడియాలో కొనసాగుతున్నది. కాకపోతే ఈ విషయాన్ని కొందరు బహిరంగంగా చెబుతుంటే.. మరికొందరు కక్కలేక, మింగలేక మిన్నకుండి పోతున్నారు.
- బి.వి.యన్.పద్మరాజు