Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్-19 మహమ్మారి లక్షలాది ప్రజల జీవనోపాధిని నాశనం చేసింది. భారతదేశంలో పేదరికం పెరగటమే కాకుండా, లేబర్ మార్కెట్‌ని చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా మహిళా కార్మికులు చెప్పలేనంత భారాన్ని మోస్తున్నారు. యావత్ దేశం కరోనాతో యుద్ధం చేస్తున్న తరుణంలో మొదటి దశలో ఏర్పడిన నష్టాల నుంచి పాఠాలను పరిగణనలోకి తీసుకుని రెండవ దశను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగిన విధానాలను రూపొందించాలి.
పెరుగుతున్న వ్యత్యాసం : 2020 నాటికి మన దేశంలో ఉద్యోగ అవకాశాల్లో లింగ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. పని చేసే వయసు గల మహిళల్లో కేవలం 18శాతం మంది మాత్రమే ఉద్యోగం, ఉపాధి కలిగి ఉండగా, పురుషులు 75శాతం మంది ఉన్నారు. సరైన ఉద్యోగావకాశాలు లేకపోవటం, సామాజిక కట్టుబాట్లు, ఇంటి పని భారం మొదలగు అంశాలు దీనికి కారణాలు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా కరోనా మహమ్మారి ఈ పరిస్థితిని మరింత దిగజార్చిందని ఇటీవల వెలువడ్డ ''కోవిడ్-19 నేపథ్యంలో - 2021 భారత దేశం పని పరిస్థితులు'' అనే నివేదిక వెల్లడించింది.
గత సంవత్సరం ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) లెక్కల ప్రకారం 61శాతం మంది పురుషులు లాక్డౌన్ ప్రభావం నుంచి తప్పించుకోగా, కేవలం 19శాతం మంది మహిళలు మాత్రమే కరోనా దుష్ప్రభావానికి దూరంగా ఉన్నారు. 2020లో లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారిలో 17శాతం మంది మహిళలు ఇప్పటికీ ఉపాధి కోసం చూస్తుండగా, ఈ కోవలో పురుషులు 7శాతం మంది మాత్రమే ఉన్నారు.
దీనికి కారణం - ఉద్యోగాలు కోల్పోయిన మగవారు కొంతకాలం తరువాత తక్కువ వేతనాలకి, లేదా ప్రమాదకరమైన వృత్తుల్లో ఏదో ఒక పనిలో కుదురుకుంటున్నారు. గతంలో భద్రత కలిగిన ఉద్యోగం చేసుకుంటూ 2020 లాక్డౌన్లో దానిని కోల్పోయిన మగవారిలో 33శాతం మంది స్వయం ఉపాధి వైపు వెళ్ళగా, 9శాతం మంది రోజు కూలీ పనికి వెళుతున్నారు. దానికి పూర్తి భిన్నంగా మహిళలకు ఉపాధి అవకావాలు చాలా తగ్గిపోయాయి. గతంలో కనీస వేతనాలతో పనిచేసిన ఆడవారిలో 4శాతం మంది స్వయం ఉపాధిపైన, 3శాతం మంది రోజు కూలీలుగా మారారు. నెల జీతాలు, క్యాజువల్, స్వయం ఉపాధి మొదలగు ఏ రకం పని చేసే వారైనా మొత్తంగా శ్రామిక మహిళల్లో సగం మంది కార్మికశక్తి నుండి తొలగించబడ్డారు. వీరితో పోలిస్తే పురుషులు 11శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త ఉద్యోగాల్లో చేరడానికి కూడా పురుషుల కన్నా మహిళలకు అతి తక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఎక్కువ మంది మహిళలు తక్కువ లేదా నామమాత్రపు జీతం దొరికే రోజు కూలీ పనికి వెళ్తుండగా, పురుషులు స్వయం ఉపాధి చూసుకుంటున్నారు. 2020 సెప్టెంబర్, అక్టోబర్ మధ్య పరిస్థితుల్ని పరిశీలించినట్లైతే స్వయం ఉపాధి కార్మికుడు నెలకు సగటున రూ.12,955 ఆదాయం పొందుతుండగా, రోజు కూలీ పనివారు మాత్రం నెలకు కేవలం రూ.7,965 మాత్రమే సంపాదిస్తున్నారు. మొత్తం మీద చూస్తే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ప్రమాదకరమైన, అతి తక్కువ ఆదాయం ఉండే పనులను పొందుతున్నారు.
మహిళలు ఏ రంగంలో, ఏ పరిశ్రమలో పనిచేస్తున్నారనే దానితో నిమిత్తం లేకుండా ఉపాధి కోల్పోతున్నారు. ఉదాహరణకి విద్యారంగాన్నే చూస్తే పని చేస్తున్న వారికన్నా మూడురెట్లు ఎక్కువగా ఉద్యోగాల నుండి తొలగించబడ్డారు. వైద్య ఆరోగ్య రంగంలో కూడా ఇదే పరిస్థితి. స్కూళ్ళు మూసేయటం, కుటుంబ సభ్యులు ఇంటి నుండి పని చేస్తుండటంతో, స్త్రీలకి ఇంటి బాధ్యతలు మరింత పెరిగాయి. వివాహిత మహిళలు, అందునా ఉమ్మడి కుటుంబాలలో లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా ఆడవారు తమ ఉద్యోగాల్లో చేరకపోవటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమే. ఎలాగోలా సర్దుబాటు చేసుకుని ఉద్యోగాల్లో తిరిగి చేరినా అటు ఉద్యోగ బాధ్యతలు, ఇటు ఇంటి చాకిరితో వారికి పని భారం బాగా పెరిగింది. ఇండియా వర్కింగ్ సర్వే 2021 ప్రకారం కరోనా ప్రభావం, లాక్డౌన్ అనంతరం కూడా మగవారి ఉద్యోగ పని గంటలలో పెద్దగా మార్పులేదు. దానికి భిన్నంగా మహిళలు ఇంటి పనికి వెచ్చించే సమయం ఎన్నో రెట్లు పెరిగింది. 2020 ఫిబ్రవరి - మార్చిలో నిర్వహించిన సర్వే ప్రకారం 10-20శాతం మంది మహిళలు తాము 2 నుంచి 4 గంటలు ఇంటి పని కోసం వెచ్చిస్తున్నట్టు తెలిపారు. సెప్టెంబరు నాటికి ఈ పని గంటలలో 50శాతం పెరుగుదల ఉంది. ఇంటి పని సమయం పెరిగినప్పటికీ జీతం కోసం చేసే ఉద్యోగంలో ఏ మాత్రం వెసులుబాటు లేదు.
ఏం చేయాలి? :
కరోనా కారణంగా మహిళలకు ఉద్యోగంలోను, కుటుంబ బాధ్యతల్లోను అసమానంగా పెరుగుతున్న పని భారం నేపథ్యంలో 'భారత ఆర్ధిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం' అనే సుదీర్ఘ చర్చ మళ్లీ ముందుకు వచ్చింది. ప్రభుత్వాలు తక్షణం ఈ క్రింది చర్యల్ని తీసుకోవాలి :
1.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని విస్తరింపజేయాలి. ప్రస్తుత లాక్డౌన్ సడలించిన వెంటనే మహిళలకు ఉపాధి చేకూర్చే విధంగా ఈ పథకాన్ని పట్టణాలు, నగరాలలో కూడా అమలు చేయాలి.
2. రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉపాధి కల్పించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేయాలి. సామూహిక స్కూళ్ళు, అంగన్వాడీ కేంద్రాలను వంటశాలలుగా (కమ్యూనిటీ కిచెన్స్గా) మార్చాలి.
3. స్వయం సహాయక బృందాలకు పీపీఈ కిట్లు ఉత్పత్తి చేసే పనిని అప్పగించాలి. తద్వారా వారికి ఉపాధి దొరకటంతో పాటు ప్రస్తుతం వాటికి ఉన్న కొరతను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
4. దేశంలో సుమారు రెండున్నర లక్షల మంది మహిళలు - ఆశా, అంగన్వాడీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు., వీరందరికీ రాబోయే 6 నెలలకు నెలకు రూ.5,000 చొప్పున కరోనా అలవెన్స్‌ను చెల్లించాలి.
అయితే ఈ చర్యలు మాత్రమే సరిపోవు. ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ ఉపాధి విధానం మహిళలు శ్రమశక్తితో పాల్గొనటానికి ఉన్న ఉపాధి లభ్యత, కుటుంబ బాధ్యతలు మొదలైన అవరోధాలను గుర్తించి, వాటి పరిష్కారం దిశగా కృషి చేయాలి. సామాజిక మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వ నిధులను పెంచాల్సిన ఆవశ్యకతను మహమ్మారి మనకు తెలియజేసింది.
భవిష్యత్తులో సంభవించబోయే మరిన్ని ప్రమాదాలను ధీటుగా ఎదుర్కోవాలంటే మనం మౌలిక సేవా రంగాలలో ఉద్యోగాల భర్తీ గురించి ఆలోచించాలి. ఆరోగ్యం, విద్య, పిల్లలు, వృద్ధుల సంరక్షణ మొదలగు అనేక సామాజిక రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులను విస్తరించడంపై దృష్టి కేంద్రీకరించాలి. అందుకు ఇదే సరైన సమయం.
దీనివల్ల మహిళల ఉపాధి అవకాశాలు పెరగటంతో పాటు వారి ఇంటి పని భారాన్ని కూడా తగ్గించగలుగుతారు. అంతేకాదు, ఇప్పటికే మన దేశం పౌష్టికాహారం, విద్య మొదలగు విషయాలలో ప్రపంచ దేశాలన్నిటిలోకి వెనుకబడి వుంది. పై చర్యలను ప్రణాళికా బద్దంగా అమలు చేసినట్లయితే ఆ సంక్షోభాన్ని కొంతమేరకైనా ఎదుర్కోగలుగుతాము.
- పద్మశ్రీ
సెల్: 9490098687