Authorization
Mon Jan 19, 2015 06:51 pm
"ఒక (కమ్యూనిస్టు) పార్టీ చరిత్రను రాయడమంటే ఆ దేశ సాధారణ చరిత్రను రాయడమే'' నంటాడు ఆంటోనియో గ్రామ్సీ. దీన్ని సిటు (సీఐటీయూ)కు వర్తింపజేస్తే!? సిటు పురుడుపోసుకుంది 1970 మే 30న. అయినా 1870ల్లో జరిగిన నాగపూర్ ఎంప్రెస్ మిల్ కార్మికులు తప్పటడుగులు వేస్తూ చేసిన సమ్మె మొదలు దేశంలో జరిగిన వందేండ్ల పోరాటాల వారసత్వం దానికి సంక్రమించింది. నాడు భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యవాదంపైన తిరుగుబాటు బావుటాలెత్తింది. దేశ కార్మికవర్గమూ ఆ ప్రతి అడుగులోనూ అడుగేసి నడిచింది. సంఘాలు లేవు. రాజకీయ పిలుపులిచ్చేవారు లేరు. కాని సహజ జ్ఞానంతో పోరాడిందని లెనినే గుర్తించేలా 1908లో బొంబాయి కార్మికర్గం చేసింది. బాలగంగాధర తిలక్ అరెస్టు, ఆయనకు ఆరు సంవత్సరాలు దేశాంతర శిక్ష విధించినందుకు సమ్మెలకే కాదు, వీధి పోరాటాలకు సైతం సిద్ధపడింది భారత కార్మికవర్గం. అక్కడినుంచి 1946లో రాయల్ ఇండియన్ నేవి (ఆర్.ఐ.ఎన్) తిరుగుబాటు వరకు ఎన్నో రాజకీయ సమ్మెల్లో పాల్గొన్నది. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది సిటు.
ఎన్నో సంఘాల్లో అదొకటి కాదు
సిటు గుంపులో గోవిందుడు కాదు. అది కుర్చీలాటలోంచి పుట్టిన సంఘం కాదు. వర్గపోరాటమే సిటుకు ఊపిరి. అప్పటికే వేళ్ళూనుకునున్న కేంద్ర కార్మిక సంఘాల నడుమ సిటు పుట్టింది ఏదో బావుకునేందుకు కాదు. కొడిగట్టిపోతున్న వర్గపోరాటాల నెగడులను కదిలించి ప్రజ్వరిల్ల చేసేందుకే! ''భారత కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసమే చీలిపోతున్నామ''ని నాటి ప్రారంభ మహాసభ ఆహ్వాన సంఘాధ్యక్షుడు కామ్రేడ్ జ్యోతిబసు మాటలను అవహేళన చేసింది మీడియా. కాని సాధారణ కార్మికులు మాత్రం ఆ మాటలు నిజమెప్పుడవుతాయా అని తపస్సు చేశారు. ఇటీవలి కాలంలో జరిగిన దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెల ''అనాటమీ''ని పరిశీలిస్తే దేశంలోని నూటికి నూరుశాతం కార్మిక సంఘాలేగాక, దానికి ఎన్నోరెట్లు ఎక్కువగా ఏ సంఘం వెనుకాలేని కార్మికులు పాల్గొంటున్నారు. సిటు కోరుకున్న కార్మిక ఐక్యత ఇదే కదా! ఐక్యత ఐక్యత కోసం కాదు. పాలకవర్గాలపై పోరాడటానికి ఐక్యత. 1970లో 'జ్యోతిబాబు' ప్రవచించిన సిటు స్వప్నం ఐదు దశాబ్దాల సుదీర్ఘ గమనంలో నిజమై నిలువలేదా!? ''యజమానుల, వారి కొమ్ముకాసే ప్రభుత్వాలను వదిలి కార్మిక సంఘాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మనవర్గానికే ద్రోహం చేసినట్టవుతుంద''న్న బి.టి.రణదివే హెచ్చరిక సిటుకు పథ నిర్దేశం చేసింది.
రాజకీయ విషయాలపై స్పష్టత, ప్రభుత్వాల వర్గతత్వం యెడల అప్రమత్తతత, కార్మికవర్గ ఐక్యత యెడల అచంచల విశ్వాసం, సాధించాల్సిన సమసమాజ లక్ష్యంపట్ల చెదరని గురి సిటును ఇతర సంఘాల కంటే ఠీవిగా నిలిపాయి. అడ్డాల్లో పాపగా నున్న దశలో 1974 రైల్వే సమ్మెలో సిటు నిర్వహించిన పాత్ర దాని పోరాట పటిమకు నిదర్శనం. అంతేనా! ఎమర్జెన్సీ రూపాన్ని సంవత్సరం ముందే కండ్లకు కట్టింది. ఎమర్జెన్సీకి వంతపాడి, తాళం వేసిన మరుగుజ్జు కార్మిక సంఘాల నడుమ ఎవరెస్ట్ శిఖరంలా నిలబడ్డది అయిదేండ్ల శిశువు సిటు. ''ఇంతింతై, వటుడింతై, నభోవీధిపైనంతై, తోయగ మండలాగ్రమున అల్లంతై'' అని బమ్మెర పోతనన్నట్టు హస్తలాఘవంతో గాక తన సైద్ధాంతిక బలం, వర్గపోరాట తత్వానికి కట్టుబడి ఉండటం, విప్లవ కార్యాచరణ కలగలిపి సిటు పురోభివృద్ధికి బాటలు పరిచాయి.
ప్రభుత్వాలకు వత్తాసుగా నిలిచి, వంతపాడే కార్మిక సంఘాలు కార్మికోద్యమ ఐక్యతకు మోకాలడ్డేవి. సందర్భోచితంగా, సున్నితంగానో, మొరటుగానో ఆయా సంఘాల విధానాలను విమర్శిస్తూ, కార్మికుల్లో ఎండగడ్తూ ''ఐక్యత - పోరాటం'' నినాదం ఊపిరిగా పురోగమిస్తోంది సిటు. జనతాపార్టీ తెచ్చిన పారిశ్రామిక సంబంధాల బిల్లును, భూతలింగం కమిటిని ప్రతిఘటించింది. అందుకు కార్మికోద్యమాన్ని ఐక్యం చేసింది. 1985లో రాజీవ్‌గాంధీ సర్కార్ ఆమోదించిన డాక్టర్ అర్జున్‌సేన్ గుప్తా నివేదిక ప్రభుత్వ రంగానికి రానున్న ప్రమాదాన్ని గుర్తించింది. యావత్ కార్మికోద్యమాన్ని అప్రమత్తం చేసింది సిటునే. ఆ చొరవే 1986 అక్టోబర్‌లో సి.పి.ఎస్.టి.యు (కమిటి ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ట్రేడ్ యూనియన్స్) ఏర్పాటుకు దారితీసింది.
అయితే దేశంలో మోడీ సర్కార్ ప్రతిష్టాపనతో గుణాత్మక మార్పు మొదలైంది. ఎటువంటి శషభిషలు లేకుండా టోకుగాను, చిల్లరగాను ప్రభుత్వరంగ పరిశ్రమలను అమ్మేస్తున్నది. చాలా కాలం నుంచి కాంగ్రెస్ చేయలేకపోయిన కార్మికచట్టాల సవరణ అన్ని పార్లమెంటరీ సాంప్రదాయాలన్నింటినీ కాలరాసి 4 కోడ్లుగా మార్చిపడేసింది. మతోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని ఒకపక్క రేగ్గొడ్తూ, ఇతర ప్రజలతో పాటు కార్మికుల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకుంటోంది బీజేపీ. వర్గ ఉద్యమాలు బలపడటమే బీజేపీ మతోన్మాదానికి విరుగుడని ఢిల్లీలో సాగుతున్న రైతాంగ ఉద్యమం మన మందుంచిన కర్తవ్యం.
పండగెట్ల చేసుకుందాం?
సిటు పుట్టినరోజు వెన్నంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉరికిరావడం కాకతాళీయమే అయినా ఒక వాస్తవం! బహుశా కోవిడ్ నేపథ్యంలో సంబరాలు అంబరాలంటకపోవచ్చు. వచ్చిన రాష్ట్రం, పోరాడి సాధించుకున్న రాష్ట్రం తమకేమిచ్చిందని కార్మికులు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర సాధనోద్యమంలో 'ని'కారాంతపు డిమాండ్లలో ''నియామకాలు'' కీలకమైంది. 2014 జూన్ 2 నుంచి ఇదిగో, అదిగో అని ఊరించుడే తప్ప ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఖాళీలు నింపింది లేదు. ''టీడీపీ, కాంగ్రెసోల్లు అన్ని రంగాల్ని కాంట్రాక్టు కార్మికులతో నింపేశారు. తెలంగాణ వస్తే కాంట్రాక్టు కార్మికుడే కనపడడు''అని నాటి ఉద్యమనేత చెప్తే కేరింతలు కొట్టిన కాంట్రాక్టు, ఔట్ సౌర్సింగ్ సిబ్బంది అధినేత అధికార పీఠమెక్కడానికి నిచ్చెనమెట్లయినారు. సర్వశిక్ష అభియాన్ మొదలు మిషన్ భగీరథ సైట్ ఇంజనీర్ల వరకు 12శాఖల్లో సుమారు 40వేల మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్టులు రెన్యువల్ చేయలేదీ ప్రభుత్వం. మరో 2లక్షల మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎప్పుడు పర్మినెంట్ అవుతామా అని చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. వీరుగాక ఇతర కార్పొరేషన్లలో 2.8లక్షల మంది కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు.
యాక్ట్ 2/94ను రద్దు చేయకుండా ఏ డిపార్ట్మెంట్లో ఎవరినీ పర్మినెంట్ చేయడం అసాధ్యమనే విషయం పాలబిందెలతో, కేసీఆర్ ఫొటోలముందు సిద్ధంగా ఉన్న కార్మికులకు తెలియకపోయినా పెద్దాయనకు తెలుసు. రాష్ట్రంలో సుమారు 25లక్షల మంది నిరుద్యోగులున్నారు. గ్రూపు-1, గ్రూపు-2 నియమకాల మొదలు ఎన్నో ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నవారున్నారు. ''తాళం వేసితిని, గొళ్ళెం మరిచితిని'' అన్నట్టు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను నియమించినా ఉద్యోగ క్యాలండర్ ప్రకటించలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఎంత నిజాయితీగల అధికారులున్నా ఏం చేయగలగుతారు?
ఇక పనిచేస్తున్నవారి జీతాల సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు పీఆర్సీ ప్రకటించారు. జరగాల్సిన పాలాభిషేకాలైపోయాయి. గెలవాల్సిన శాసన మండలిస్థానాలు గెలిచేశారు. నీళ్ళు మబ్బుల్లోనే ఆగిపోయాయి. ముత్యపు చిప్పలు నోళ్ళు తెరుచుకునే ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులకు ఒకవేజ్ రివిజన్ వెనకపడిపోగా 2021 ఏప్రిల్ నుంచి జరగాల్సిన రెండో దాని గురించి కూడ ప్రభుత్వం చప్పుడు చేయకపోవడం ఆందోళనకరం. నేడు అన్ని ఫ్యాక్టరీల్లో కాంట్రాక్టు కార్మికులు పెరిగిపోయారు. వారి కనీస వేతనాల జీవో 11 మాత్రం 8 సంవత్సరాల పాతది. అంటే కాంగ్రెస్ కాలం నాటిదే. 74 షెడ్యూలు పరిశ్రమల కార్మికుల జీఓలు 12 సంవత్సరాల నుంచి రివిజన్‌కి నోచుకోలేదు. అంటే రాష్ట్ర కార్మికులకు కొత్త జీఓ ఇవ్వడానికి సీఎం సాబ్‌కు మనసొప్పట్లేదేమో! టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్లకు తేడా లేదనిపిస్తే తప్పులేదు కదా!
రాష్ట్రంలోని మొత్తం స్కీమ్ వర్కర్లు సుమారు 3లక్షలు. వీరికి మోడీ సర్కార్ కేటాయింపుల్లో కోత పెడ్తోంది. రాష్ట్రం ఇచ్చే అత్తెసర మొత్తాలు కూడా సక్రమంగా చెల్లించకపోవడం నిత్యకృత్యం. కరోనాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రంట్‌లైన్ వారియర్స్ - ఆశాలు, ఎ.ఎన్.ఎమ్.లు, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది, డాక్టర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు దాదాపు ఒక సంవత్సరం నుంచి సెలవు పెట్టకుండా పనిచేస్తున్నారు. 2020 ఏప్రిల్, మే నెలల్లో మాత్రం ఇన్సెంటీవ్ ఇచ్చి ఆ తర్వాత బంద్ చేశారు. 50లక్షల బీమా అని ఘనంగా ప్రకటించిన మోడీ సర్కార్ 2021 మార్చితో దాన్ని ఉపసంహరించింది. మరి రాష్ట్రం బాధ్యత లేదా?
రాష్ట్ర సాధన మాత్రమే కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు శాశ్వత కీర్తికిరీటాలు తెచ్చిపెట్టవు. ఒకసారి రాష్ట్రం వచ్చేసిన తర్వాత ఆ రాష్ట్ర ప్రజలను, వారి జీవితాలను మెరుగు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందనే విషయం బహుశా కేసీఆర్‌కు తెలియంది కాదు.
సరళీకృత ఆర్థిక విధానాలు ముదిరి పాకాన పడ్డ నేటి సమయంలో, మరీ ముఖ్యంగా ప్రజాభిప్రాయాన్ని ఖాతరుచేయకుండా ఆ విధానాలతో మోడీ సర్కార్ ముందుకు పోతున్న దశలో ఆ విధానాలను ఎదిరిస్తేనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు ఏదిమేలు చేసేదో దాన్నే అమలు చేయడం పాలకుల కర్తవ్యం. అందుకనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తే మరిన్ని పుట్టిన రోజు పండగలు జరుపుకోగలదు. బీజేపీతో లాలూచీ కుస్తీ పట్టిన ఏ ఒక్క ప్రాంతీయ పార్టీని అది బతకనిచ్చింది లేదు. తాను తన కుటుంబ ప్రయోజనం కన్నా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిలవాలనే ధ్యేయంతో కేసీఆర్ సర్కార్ పనిచేస్తుందని ఆశిద్దాం.
దేశంలో, రాష్ట్రంలో కార్మికులకు ఏ ఒక్క సమస్య వచ్చినా సిటు అండగా నిలుస్తున్నది. అది రాజస్థాన్‌లోని డైకిన్ కార్మికులైనా, హర్యానాలోని మారుతి కార్మికులైనా, నాచారంలోని డీ-డై డ్రిచ్ కంపెనీ అయినా, రంగారెడ్డిలోని టాటా ఎయిరోస్పేస్ కార్మికులైనా యూనియన్ కొరకు చేసే పోరాటాలు మొదలు, ఫైనల్ సెటిల్మెంట్కు కృషి చేయడం వరకు సీఐటీయూ కమిటీలు, కార్యకర్తలు కార్మికులకు అండగా నిలుస్తున్నారు. ఆ సందర్భంగా ఎందరో వారి స్వంత సుఖాలను సైతం త్యాగం చేస్తున్నారు. ఈ త్యాగాల సిటు ఇంకా రాసిలో చిన్నదే. విస్తృతిలోనూ చిన్నదే. పై సందర్భాలన్నీ చూసినా సిటు బలపడకుండా కార్మికోద్యమ పటిష్టత అసాధ్యం.
సిటుకు తన శక్తి ఎంతో తెలుసు. శత్రువు బలమూ తెలుసు. చేరాల్సిన గమ్యంపై స్పష్టతుంది. పెట్టుబడి కార్మికులపై యుద్ధం ప్రకటించేసింది. యుద్ధం చెయ్యాలో చేతులెత్తేయ్యాలో తెల్చుకోవాల్సింది కార్మిక సంఘాలే. తెగించి పోరాడటానికి కార్మికులు సిద్ధమేనని ఎన్నో ఉదాహరణలున్నాయి. చేగువేరా చెప్పినట్టు... ''నువ్వు యుద్ధంలో గెలిచావా? ఓడావా? అనే దానికంటే అసలు నువ్వు యుద్ధం చేశావా? లేదా?'' అనేది ముఖ్యం. పెట్టుబడి ఇంత కాలం చెప్పుకున్న విలువల వలువలూడదీసేసి తన లాభాల కోసం తెగబడుతున్నప్పుడు తెగించిన పోరే కార్మికులకు దిక్కు. బలిష్ట సిటునే ఆ పోరుకు ఆలంబన!
- ఆర్. సుధా భాస్కర్