Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా దేశ పెజలారా, నేనో భారతీయ మొసలిని. గొప్పలు చెప్పుకోకూడదు కాని నా పొడవు, బరువు అందరినీ బాగా ఆకట్టుకుంటాయి. నేను పది అడుగుల దాకా పొడవు పెరుగుతాను. అవసరమొస్తే నీళ్ళలో కూడ నడుస్తాను. చెబుతున్నా కదా అని నా ఛాతీ కొలతలు మాత్రం అడగొద్దు సుమా.
నా సహ భారతీయులారా ,
నేనో భారతీయ మొసలిని, దోపిడీదారుని, దోచుకోనడానికే పుట్టాను. నేను మీకు ఉత్తరం రాయడానికి కారణమేమంటే నాకు ఈమధ్య చాలా చెడ్డపేరు వస్తున్నది. నన్ను అర్థం చేసుకోకుండా, నావి మొసలి కన్నీరని అంతా అంటున్నారు. అసలు మీకు మొసలి కన్నీరంటే ఏమిటో తెలుసునా? నేను వివరిస్తా వినండి.. 1400లో సర్ జాన్ మాండెవిల్లే సముద్రయానం, ప్రయాణాలు అన్న పుస్తకం ప్రచురించారు. దీనికంతటికీ నిజమైన కారకుడు ఆయనే! శాస్త్రీయం కాని ఇలాంటి అర్థంలేనివన్నీ మొదలుపెట్టింది ఆయనే. ఆ పుస్తకంలో ఆయన ఇలా రాశాడు... ''ఆ దేశంలో మొసళ్ళు అధికం. ఈ జీవులు మనుషులను చంపి ఏడుస్త్తూ తింటాయి''... చూడండి ఇదంతా పచ్చి అబద్దం.
అసలు మాండవిల్లే ఏ దేశం గురించి ఇలా అంటున్నాడో తెలియదు, అది భారతదేశం అయ్యే అవకాశమే లేదు. నేను దోపిడీదారునే. అయినా నాకంటూ ఓ ధర్మం ఉండి ఏడ్చింది. నేను మంచి నీటిలో నివశించే ఉభయచర జీవిని, మొసలిని. నేను పొడుగాటి నోరు కలిగిన బురద మొసలిని. అకారణంగా నా కళ్ళలోంచి నీళ్ళు రావు. మీరంతా కలిసి నన్ను ఎందుకిలా అవమానపరచి నా కన్నీళ్ళ గురించి ప్రచారం చేస్తున్నారు? మరీ ముఖ్యంగా ఏ పనీలేని కొంతమంది మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇంకేదైనా విషయం తీసుకోకూడదా? నాపైన అంత ద్వేషమా? నా మీద ఏడ్చి గీపెడుతున్నాడని పిచ్చి జోకులేసి నాకు నష్టం చేస్తున్నారు. చిన్న పరిశోధన చేస్తే నేనెవరు, నేనేమిటి అన్న వివరాలు మీకు ఇట్టే తెలిసిపోతాయి. నేను పెద్ద వయస్సున్న మగ మొసలిని కదా! అందుకే నా పొడవు, బరువు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. పది అడుగుల పొడవుతో రెండువందల కిలోల బరువు దాకా పెరుగుతాను. నా ఛాతీ కొలత ఎంత మొదలైన పిచ్చి పిచ్చి ప్రశ్నలు మాత్రం వేయకండి. ఒక్కటి మాత్రం అర్థం చేసుకొండి, నాకు సరిపోనివారిని, ఏ శతృవునైనా, ఎంతటి శతృవునైనా బలమైన నా పొడుగాటి తోకతో కొట్టి పడేయగల ప్రమాదకారిని నేను. నేను బెంగాల్ పులుల్ని అది మొగదైనా, ఆడదైనాసరే ఎదుర్కోగలను. వాసన కనిపెట్టే శక్తి, వినికిడి శక్తి, నా చూపు, ఖచ్చితమైన ఎత్తుగడలతో శతృవులను మట్టుపెట్టగలను. మాయం చేయగలను. అత్యవసరమైన పరిస్థితుల్లో నా పొట్టతో పాకి దాక్కుంటే నేనెక్కడున్నానో అస్సలు పసిగట్టలేరు. అవసరమైతే నేను నీటిపై కూడా నడవగలను. నాక్కనక భయమేస్తే, ఏదైనా ప్రమాదముందని అనిపిస్తే ఎవ్వరూ నిలబడలేరు. నా దవడలు ఒక్క సారి తెరిస్తే ఎంత తెలివిగలదైనా, చలాకీదైనా శతృవు నా నోట్లో ఉండాల్సిందే. మా పాకే జీవులు అంటే సరీసృపాలజాతితోనే పోటీ వచ్చినా సరే అవతల కొండచిలువనైనా అలవోకగా నేలకరిపిస్తాను. ఇక కుక్కలు, ఎలుక జాతి జంతువులు, కోతులు ఇవన్నీ నాకు పిల్లాటలే!
పరిశోధకులు మేము విందుచేసేటప్పుడు అరుస్తామనంటారు. ఇది సరియైన వర్ణన. మేమలాగే చేస్తాం. ఏడుస్తూ మొసలి కన్నీరు కార్చడం అంత సులువైన పని కాదు. మా ఆహారాన్ని తినేటప్పుడు ఏడ్వడం వల్ల దాన్ని బాగా చప్పరించే అవకాశం ఉంటుంది . ఇది విన్నాక మీకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది కదూ! కాబట్టి నా పని ఎంత కష్టమైనదో మీకర్థమయే ఉంటుంది. ఎప్పుడైనా కష్టమైన పరిస్థితి వస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేను కంటికి కనపడకుండా మాయమైపోతాను! నేను ఒక బొరియ చేసుకొని అందులో దాగుంటాను. ఎప్పటివరకంటే పరిస్థితి మళ్ళీ నాకు సహకరించేవరకు. ఈ విధంగా మొసళ్ళు బాగుపడి అభివృధ్ధి చెందుతున్నాయి. తిరోగమనంలో క్షేమమైన స్థలంలో దాక్కోవడం, తెలివిగా వేచివుండడం అవసరం. మొసళ్ళు కూడా అనుకోని అవాంతరాలను ఎదుర్కోవలసి వస్తుంది. అనవసరంగా శతృవుల ముందు మనకై మనం ఎందుకు బయట పడతాము చెప్పండి? చేపలు పట్టే వాళ్ళు వేసిన వలల్లో మేమూ చిక్కుకొని అవస్థలు పడతాము. వాటిని ఎలా విడదీయాలన్న గ్రంథంలోని అన్ని ఉపాయాలను ఉపయోగించి బయట పడతాము.
నేను, దోపిడీదారుడిని, మీలోని మూర్ఖుడిని బయటకు తీయడమే నా పని. ప్రజలు బాగా అపార్థం చేసుకొన్న జీవుల్లో ఈ దోపిడీదారులు ఒకరు. ముఖ్యంగా ఈరోజుల్లో. అన్ని మొసళ్ళు ఒకటి కాదని ప్రజలు తెలుసుకోరు. మన మహా గొప్ప ప్రపంచంలో 23 జాతుల మొసళ్ళు ఉన్నాయి. వాటితో, వాటిల్లో కొన్నింటితో ఎలా వ్యవహరించాలో మనం నేర్చుకోవాలి. మామూలు పరిస్థితుల్లో ఇది పెద్ద కష్టమైన పనేం కాదు. కాని ఇప్పుడున్నవి సాధారణ పరిస్థితులు కాదు, చాలా కష్టతరమైనవి. చిరుతలు ఎలాగైతే తమ పైన ఉన్న మచ్చల్ని చెరిపేసుకోలేవో, ఈ మొసళ్ళు కూడా తోటల్లో ఉన్న విషం లేని, ప్రమాదం కాని పాములవలే ప్రవర్తించలేవు, నిశ్శబ్దంగా పాకుతూ పక్కకు పోవు. ఈ విధమైన ప్రవర్తనే మా పేరును చెడగొడుతోంది! మేము భయపడలేదని మేమే నిరూపించాలి, అదే సమయంలో మేము హృదయంలేని జీవాల్లా కూడా ఉండకూడదు. ఒక స్వీయ గౌరవం కలిగిన మొసలిగా, నా వంతు నేను జుర్రుకోవాలంటె, అవతల పనిముట్లు గల మంచివారు నాకు పోటీ కానివాళ్ళు, నా పోటీకి అనర్హులైన వాళ్ళు ఉన్నప్పుడు నా వేటకు బలికావలసిందే.
జాతక కథల్లో, మొసలి వీపుపై పోయి తెలివితో బతికి బయటపడే కోతి కథ ఒకటుంది. సంస్కృతంలో, మొసలిలాంటి పౌరాణిక ప్రాణి ''మకర'' ఒకటుంది. ఈ పురాతన కథల్ని నమ్ముకొని ఉండొద్దు. నా వైపు చూడండి. నేను ఇరవై ఒకటవ శతాబ్దానికి చెందిన మొసలిని! దోపిడీదారులనందరినీ కొట్టే ఘరానా దోపిడీదారుని. గుర్తుంచుకొండి, మొసళ్ళు ఏడుస్తాయి, ఆ మొసలి కన్నీరును చూసి ఈ ప్రాణాంతక సమయంలో నేను ఏదైనా మేలు చేస్తాననుకోకండి. నేను ఓ దోపిడీదారు తన శక్తికొలదీ ఎలా దోచుకుంటాడో అదే చేస్తాను. ఇప్పుడు మీరు చేయవలసింది మీరు చేయండి. అందుకే అందరూ ధారాళంగా, దాతృత్వంతో ''మొసలి కన్నీరు మొసలి సంరక్షణ నిధికి'' విరివిగా విరాళాలివ్వండి.
-''ది ప్రింట్'' సౌజన్యంతో
అనువాదం: జంధ్యాల రఘుబాబు
- శోభాడే