Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరేబియా సముద్రంలో ఆరబోసిన ఆణిముత్యాల్లా ఉండే లక్షద్వీప్ భారత దేశపు దీవుల్లో అందమైనది, ప్రశాంతమైనది. అది 36 చిన్న చిన్న దీవుల సముదాయం. వాటి విస్తీర్ణం 32 చదరపు కిలో మీటర్లు. పది దీవుల్లోనే ప్రజలు నివసిస్తున్నారు. 2011 సెన్సెస్ ప్రకారం జనాభా 64,473 మంది. 94.8శాతం మంది షెడ్యూల్డ్ జాతుల వారే. అత్యధికులు మాట్లాడే భాష మళయాళం. కొంతమంది జస్సెరి, మహి భాషలు మాట్లాడతారు. వారిలో 92శాతం మంది అక్షరాస్యులు. చేపల వేట, కొబ్బరి సాగు ప్రధాన వృత్తులు. కొబ్బరి పీచు తదితర ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని చిన్న పరిశ్రమలు ఉన్నాయి. దక్షిణ తూర్పు ఆసియా దేశాలకు చేపల ఎగుమతి జరుగుతుంది. వాతావరణ కాలుష్యం లేని సుందరమైన ప్రదేశాలు కావడం వలన టూరిస్టులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కేరళ రాష్ట్రం కొచ్చిన్ నుంచి ఓడల ద్వారా, విమానాల ద్వారా ప్రయాణ సదుపాయం ఉన్నది. కేంద్రపాలిత ప్రాంతం అయినందున కేంద్ర ప్రభుత్వం నియమించే అడ్మినిస్ట్రేటర్ ప్రధాన పరిపాలకుడు. లక్షద్వీప్ మొత్తం ఒక జిల్లా హౌదా కలిగి ఉన్నది. ప్రజలు నివసించే పది దీవులకు పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక పార్లమెంట్ స్థానం ఉన్నది. అంతటి ప్రశాంతమైన దీవుల్లో నేడు మోడీ-షా మార్కు అశాంతి పాలన మొదలైంది.
కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లుగా లేదా అడ్మినిస్ట్రేటర్లుగా సివిల్ సర్వెంట్స్ (ఐఏఎస్/ఐపీఎస్)ను నియమించడం ఆనవాయితీ. అందుకు విరుద్ధంగా ప్రఫుల్ ఖోడా పటేల్ అనే బీజేపీ నేతను లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌గా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ 2020 డిసెంబర్ 5న నియమించారు. దేశంలో సమర్థులైన సివిల్ సర్వెంట్స్ లేరన్నట్లు అధికార పార్టీకి చెందిన వివాదాస్పద రాజకీయ నాయకుడిని అడ్మినిస్ట్రేటరుగా నియమించడంలోనే కేంద్ర ప్రభుత్వ స్వార్థ రాజకీయ ప్రయోజనం అర్థమవుతోంది. ఆయన గతంలో గుజరాత్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో హౌమ్ మంత్రిగా పని చేశారు. గుజరాత్‌లోని ఆరెస్సెస్ ప్రముఖుల్లో ఒకరైన ఖోడాభారు పటేల్ కుమారుడు. లక్షద్వీప్ కన్న ముందు ప్రఫుల్ పటేల్ 2017 నుంచి డామన్/డయ్యు, దాదర్/హవేలీ రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు అడ్మినిస్ట్రేటరుగా పని చేస్తున్నారు. ఆ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోసమే విలీనం చేసి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. ఆయన నియంతృత్వ పాలనతో ఆయా దీవుల్లో ప్రజల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయనపై అనేక ఆరోపణలు కేసులు నడుస్తున్నవి. ప్రముఖ ఆదివాసీ నేత, ఏడు సార్లు దాద్రా నాగర్ హవేలీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు మోహన్ దేల్కర్ గత ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్నారు. రూ.25 కోట్ల కోసం వత్తిడి చేస్తూ ప్రఫుల్ పటేల్ చేసిన వేధింపులను తట్టుకోలేకనే దేల్కర్ ఆత్మహత్య చేసుకున్నారని అయన కుమారుడు అభినవ్ కేసు పెట్టారు.
సామాజిక జీవనంలో మైనారిటీ మతాలను అణచివేసే, ఆర్ధిక రంగంలో కార్పొరేట్లకు సేవ చేసే మోడీ-షా మార్కు పరిపాలన కోసమే వారిరువురి ఏజెంట్ అయిన ప్రఫుల్ పటేల్‌కి లక్షద్వీప్ పగ్గాలు అప్పగించడం జరిగింది. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, అక్కడి ప్రజల్లో 96.58శాతం మంది ముస్లిం మతస్థులు కావడం రెండు, ఆ దీవులు టూరిజం వ్యాపారానికి మంచి అనుకూలంగా ఉండటం. ఈ జంట లక్ష్యాల సాధనకే ''లక్షద్వీప్ డెవలప్మెంట్ అధారిటీ రెగ్యులేషన్ 2021'' పథకం పేరుతో కొన్ని సంస్థాగతమైన, పరిపాలనా పరమైన మౌలిక చర్యలకు పటేల్ గిరీ మొదలైంది. వాటిలో భూ యాజమాన్య చట్టాన్ని మార్చడం ముఖ్యమైంది. దీని ద్వారా అభివృద్ధి అవసరాల కోసం ఏ భూమిని అయినా, ఎవరి భూమిని అయినా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. ఆ భూములను మైనింగ్, క్వారీ తవ్వకాలకు, ఇంజనీరింగ్ పనులకు, భవనాల నిర్మాణాలకు వినియోగిస్తారు. అంతేకాదు, నేషనల్ హైవేస్, రింగ్ రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, థియేటర్లు, మ్యూజియమ్స్, ఆట స్థలాలు వగైరాకు ఉపయోగిస్తారు. ఇదంతా టూరిజం కోసమే. సూటిగా చెప్పుకోవాలంటే అంబానీ, అదానీ, జీఎమ్మార్ తదితర కార్పొరేట్ సంస్థలకు అవసరమైన స్టార్ హౌటళ్లు, రిసార్టుల నిర్మాణానికి, టూరిజం వ్యాపారానికి అనువుగా మలుస్తారు. దానికి సపోర్టుగా లక్షద్వీప్‌లో ఎంతో కాలంగా అమల్లో ఉన్న మద్యం అమ్మకాలపై నిషేధాన్ని ఎత్తివేశారు. టూరిస్టులు బాగా తాగి ఎంజారు చేయడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ విధంగా అభివృద్ధి పేరుతో పటేల్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొనే భూముల్లోని స్థానిక ప్రజలు ఏమై పోతారు? నిరాశ్రయులై స్వంత ఉపాధిని కోల్పోయి హౌటళ్లలో, రిసార్టుల్లో, టూరిజం సర్వీసుల్లో కూలీలుగా మారిపోయి పరాన్నజీవులుగా బతకాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. వాతావరణంలో కాలుష్యం చేరి, పర్యావరణ సమతూకం దెబ్బతింటుంది. ఇప్పటికే పటేల్ చేసిన తప్పుడు చర్యల పట్ల స్థానికుల్లో అలజడి రగులుతోంది. అధికార పీఠాన్ని అధిష్టించిన కొద్ది రోజుల్లోనే హైస్కూళ్లలో పనిచేస్తున్న 200మంది కాంట్రాక్ట్ టీచర్లను, మరి కొందరు అంగన్వాడీ టీచర్లను తొలగించారు. ఆ చర్యను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన విద్యార్ధులపై లాఠీచార్జి చేశారు. టూరిజం శాఖలో పనిచేస్తున్న 190 మంది ఉద్యోగులను తీసేశారు. స్థానికుల భాష మలయాళంలో మాట్లాడే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లను తొలగించి గుజరాత్ నుంచి హిందీ మాత్రమే మాట్లాడే అధికారులను తెచ్చిపెట్టారు. జిల్లా పంచాయతీ అధికారాలను కూడా హస్తగతం చేసుకుని తీర ప్రాంతాల రక్షణ పేరుతో చేపల వేటకు ఉపయోగించే వలలు, ఉపకరణాలు దాచుకునే షెడ్డులను ధ్వంసం చేశారు. అలాంటి విధ్వంసక చర్యలకే ఉడికిపోతున్న ప్రజలపై తాజా చర్యలతో మరింత ఆజ్యం పోసినట్లు అయింది.
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండే గ్రామ పంచాయతీ సభ్యులను అనర్హులుగా చేయడం మరొక కవ్వింపు చర్య. ఈ అనర్హత ఇకనుండి పోటీ చేసే వారికే కాదు, ఇప్పుడు సభ్యులుగా ఉన్న వారికి కూడా వర్తింప చేశారు. జనాభా నియంత్రణ కోసం ఈ నిబంధన పెట్టినట్లు చెప్పడం హాస్యాస్పదం. ఎందుకంటే, భారత దేశ సగటు సంతానోత్పత్తి రేటు 2.4కంటే చాలా తక్కువగా లక్షద్వీప్‌లో 1.6మాత్రమే. పటేల్ చట్టం ప్రకారం చట్టసభల్లో కూడా ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు గల వారిని అనర్హులుగా చేస్తే ప్రస్తుత లోక్ సభ సభ్యులలో 149 (31.8శాతం) మంది అనర్హులు అవుతారు. వారిలో అత్యధికంగా 96మంది బీజేపీ వారే ఉంటారు. జంతు సంరక్షణ రెగ్యులేషన్ పేరుతో బీఫ్ అమ్మకూడదు కొనకూడదు అని నిషేధం విధించారు. పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో కూడా మాంసాహారాన్ని తొలగించారు. సామాన్య ప్రజలకు పౌష్టికాహారమైన మాంసాహార వినియోగాన్ని నిషేధించడం అత్యంత నియంతత్వ చర్య. లక్కదీవుల ప్రజల అస్థిత్వాన్ని దెబ్బతీసే దుర్మార్గమైన పటేల్ చర్యల పట్ల సామూహిక నిరసన వెల్లువెత్తుతోంది. కాంగ్రెస్, సీపీఐ(ఎం), ఎన్సీపీ పార్టీలతో పాటు స్థానిక బీజేపీ పార్టీలోని సగం మంది పటేల్ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రతిఘటిస్తున్నారు. మళయాళీల రాజకీయ చైతన్యాన్ని, గిరిజన జాతుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే తప్పుడు చర్యలను ఎవరూ సహించరు. నిరసన ఉద్యమాలను అణచివేయడం కోసం 'ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్' అనే గూండా చట్టాన్ని కూడా ముందే సిద్ధం చేసుకోవడం గమనించాల్సిన విషయం. ప్రఫుల్ పటేల్ చేపట్టిన ప్రజా కంటక చర్యలను సవాల్ చేస్తూ కేరళ హైకోర్టులో వ్యాజ్యం కూడా నడుస్తోంది. పరిస్థితిని అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పటేల్ కుటిల పన్నాగాన్ని నివారిస్తుందా లేదా అనేది చూడాలి.
- ఎన్. నారాయణ
సెల్: 9490300577