Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2021 జూన్ 2తో తెలంగాణలో టీఆర్ఎస్ పాలనకు ఏడేండ్లు పూర్తవుతుంది. ''నీళ్ళు, నిధులు, నియమకాలు'' పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏడేండ్లలో నీటి వినియోగానికి ప్రాజెక్టులకు రూ.1.10 లక్షల కోట్లు, మిషన్ భగీరథకు రూ.42 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.3500 కోట్లు ఖర్చు చేశారు. ఐనప్పటికీ ఏ ప్రాజెక్టూ పూర్తి కాలేదు. సాగునీటి ప్రాజెక్టులకు రీ-డిజైన్ల పేరుతో ఖర్చును మూడు రెట్లు పెంచారు. పనులలో నాణ్యత లేకపోవడం వల్ల కాళేశ్వరం టన్నెల్ కూలిపోవడం, మిడ్ మానేరు తెగిపోవడం ఆందోళన కలిగించింది. అలాగే మిషన్ భగీరథ పైపులు పగిలిపోవడం, మిషన్ కాకతీయ చెరువుల మరమ్మతులలో నాణ్యత లోపించిందని అనేక ఆరోపణలు రావడం చూశాం. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటి వనరులు కల్పిస్తామని (ప్రతి నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు అదనంగా సాగునీటి వనరుల కల్పన) ముఖ్యమంత్రి ప్రకటించారు. అసలు వాస్తవాలేమిటి?
కాళేశ్వరం ప్రాజెక్ట్
గోదావరి నదిపై రూ.38,500 కోట్లతో అమలు జరుగుతున్న ప్రాణహిత-చెవేళ్ళ పథకాన్ని రిడిజైన్ చేశారు. 18.25 లక్షల ఎకరాలతోపాటు స్థిరీకరణ అయకట్టుతో 37 లక్షల ఎకరాలకు సాగునీటి వనరులు కల్పిస్తామని రూ.75,000 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించారు. ఈ పథకానికి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మార్చి 2020 నాటికి రూ.63,541 కోట్లు వ్యయం జరగగా అందులో రూ.23,902 కోట్లు ప్రభుత్వ బడ్జెట్ నుండి రూ.39,640 కోట్లు కార్పొరేషన్ రుణాల ద్వారా ఖర్చు చేశారు. ఇంతవరకు లక్ష ఎకరాలకు కూడా నీటి సౌకర్యం కల్పించలేదు. కాకతీయ కాలువ, వరద కాలువకు స్థిరీకరణ కింద 2 లక్షల అయకట్టుకు కాళేశ్వరం లిప్ట్‌ల ద్వారా మాత్రమే నీటి సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ అంచనా రూ.1,05,790.72 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు మరో 50వేల కోట్లు ఖర్చు చేయాలి.
సీతారామసాగర్ ప్రాజెక్ట్
గోదావరిపై దేవాదుల ప్రాజెక్ట్ దిగువన గత రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌లను రిడిజైన్ చేసి సీతారామసాగర్ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. గత పాజెక్ట్‌ల కింద అయకట్టు 4లక్షల ఎకరాలు కాగా, సీతారామసాగర్ కింద 6,74,387 లక్షల ఎకరాలకు పెంచారు. ఈ ప్రాజెక్ట్ కింద 2021-22 బడ్జెట్‌తో సహా రూ.4,779 కోట్లు కేటాయించి, నేటికి రూ.4000 కోట్లు వ్యయం చేశారు. దీని అంచనా బడ్జెట్ రూ.10,630 కోట్లుగా 2019-20లో నిర్ణయించారు. ఇప్పడాబడ్జెట్ మరో 20శాతం పెరిగి ఉంది. కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో డోర్నకల్, గార్ల ప్రాంతాలలో కొత్తగా 3,28,853 ఎకరాలకు మరియు స్థిరీకరణ 3,45,534 ఎకరాలకు కల్పించడానికి ప్రణాళిక రూపొందించారు. 4,566 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉండగా, 1500 ఎకరాలు సేకరించారు. 1531 ఎకరాల అటవీ భూమి సేకరించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాడానికి దశాబ్థకాలం పడుతుంది.
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్
ఈ ప్రాజెక్టు ద్వారా జూరాల నుంచి కోయిల్కోండ వరకు లిప్ట్ పథకం రూపొందించాలని నిర్ణయించగా టీఆర్ఎస్ ప్రభుత్వం రీ-డిజైన్ చేసి జూరాల నుంచి నిర్ణయించిన లిప్ట్ను శ్రీశైలంకు మార్చారు. కల్వకుర్తి ఎత్తిపోతల లిప్ట్ పాయింట్ నుండే పాలమూరు ఎత్తిపోతల ప్రారంభించబడుతుంది. రీ-డిజైన్ నాటి అంచనా వ్యయం రూ.36,000 కోట్లుగా నిర్ణయించారు. 2021 మార్చి నాటికి రూ.5,732 కోట్లు వ్యయం చేశారు. 2021-22 బడ్జెట్లో రూ.960 కోట్లు కేటాయించారు. భూసేకరణే పూర్తికాలేదు. దీని పూర్తికి రూ.80,000 కోట్లు వ్యయం అవుతుందని తాజాగా అంచనా వేశారు. ఈ ప్రాజెక్ట్ కింద మహబూబ్‌నగర్-రంగారెడ్డి జిల్లాలు కలిపి 12.30లక్షల ఎకరాలకు, హైదరాబాద్ తాగునీటికి 30టిఎంసిలు కేటాయించారు. ఇది ఏనాటికి పూర్తి అయ్యేనో ఏలినవారికే తెలియాలి.
2014 -21 వరకు బడ్జెట్లో మెజర్ ఇరిగేషన్ శాఖకు రూ.3,24,631కోట్లు కేటాయించి రూ.1,10,643కోట్లు మాత్రమే వ్యయం చేశారు ఇందులో రూ.39,640కోట్లు రుణాలున్నాయి. మైనర్ ఇరిగేషన్‌కు రూ.14,546కోట్లు కేటాయించి రూ.8,161కోట్లు మాత్రమే వ్యయం చేశారు. 2021-22 బడ్జెట్లో భారీ ప్రాజెక్ట్‌లకు రూ.15,686 కోట్లు, మైనర్ ఇరిగేషన్‌కు రూ.1220 కోట్లు కేటాయించారు. ఇందులో ఏంత వ్యయం చేస్తారో ప్రభుత్వానికే తెలియదు. మధ్యతరహా, మైనర్ ప్రాజెక్ట్‌లలో దశాబ్ధాల తరబడి నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. ఆధిలాబాద్లోని 20 మధ్య తరహా ప్రాజెక్ట్‌లకు రూ.2000కోట్లు కేటాయిస్తే ఒకే సంవత్సరంలో పూర్తవుతాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్ట్‌లు పూర్తిచేసినా కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్ ప్రాజెక్ట్‌లకు బ్రాంచ్ కెనాల్స్, పంట కాలువలు లేకపోవడం వలన నీరు వృధా అవుతున్నది. ఈ ప్రభుత్వం వచ్చిన 7సంత్సరాలలో 4,64,200 ఎకరాల కొత్త ఆయకట్టుకు, 12 వేల ఎకరాల స్థిరీకరణకు సాగునీటి వనరులు కల్పించారు. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న ప్రభుత్వం చతికిల పడింది. కాళేశ్వరం, పాలమూరు, సీతారామసాగర్ మూడు రీ-డిజైన్ ప్రాజెక్ట్‌ల కింద కొత్త ఆయుకట్టుకు నీరు ఇవ్వలేదు. చివరకు శ్రీరాంసాగర్ వరద కాలువను రీ-డిజైన్ చేసి కరీంనగర్ వరకే కుదించారు. 2.20లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాల్సిన వరద కాలువ ఆయకట్టును 1.30 లక్షల ఎకరాలకు తగ్గించారు. ప్రస్తుతం ఏతా-వాతా ఈ ఏడేండ్లలో 5లక్షల ఎకరాలకు మించి నీరు ఇవ్వలేదని రుజువవుతున్నది.
తెలంగాణలో సాగు భూమి 1.63 కోట్ల ఎకరాలుంది. ఇందులో 48 లక్షల ఎకరాలు బీళ్లుగా (రియల్ ఎస్టేట్, పడావ్, ప్రాజెక్టులకు కేటాయింపులు చేసినా పని ప్రారంభించకపోవడం) మారింది. ప్రస్తుతం 1.15కోట్ల ఎకరాలు సాగవుతున్నది. రెండు పంటలు పండే భూములు 75 లక్షల ఎకరాలు ఉన్నాయి. రెండు పంటలను కలిపి లెక్క చెప్పడం ద్వారా 'గ్రాస్' నిర్ణయిస్తారు. ఒకే పంట లెక్క గుర్తించినపుడు 'నెట్'గా పరిగణిస్తారు. టీఆర్ఎస్. ప్రభుత్వం మెత్తం సాగునీటి ఆయకట్టును గ్రాస్‌గా 75లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినట్లు ప్రచారం చేస్తుంది. తెలంగాణలో 24 లక్షల బావుల క్రింద 48లక్షల ఎకరాలకు కలిగిన నీళ్ల సౌకర్యం కూడా టీఆర్ఎస్ తన ఖాతాలోనే వేసుకుంది.(24 గంటల కరెంటు ఇస్తున్నందున)
మిషన్ కాకతీయ
మిషన్ కాకతీయ కింద 46,531 చెరువులను రిపేర్లు చేస్తామని ప్రణాళిక రూపొందించారు. చెరువులలో పూడికలు తీయడం, చెరువు కట్టలు ఎత్తు పెంచడం, మత్తడి రీపెర్లు, కాల్వల బాగుచేత, చెరువులో నీటి మట్టం పెంచడం లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. చెరువుల కిందా 16.50 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగు కావాలి. కాని నేటికి 7, 8 లక్షల ఎకరాలే సాగవుతున్నది. 46,531 చెరువులను 5 భాగాలుగా విభజించి ఒక్కోబాగానికి 9,305 నుంచి 9400 చెరువులు కేటాయించారు. పని మొదలు పెట్టిన చెరువులు 25,803కాగా, పూర్తియినవి 13,491 మాత్రమే. ఇంతటితోనే ప్రణాళిక పూర్తియినదని ఎత్తివేశారు. ఈ కాంట్రాక్ట్ పనులన్ని టిఆర్ఎస్ నాయకులే చేపట్టారు. పనుల నాణ్యత లోపభూయిష్టంగా ఉందని అనేక ఫిర్యాదులు వచ్చాయి. తమ పార్టీవారే చేయడం వలన ఫిర్యాదులపై ఏలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విధంగా మిషన్ కాకతీయ ప్రణాళికను హస్యస్పదంగా మార్చివేశారు.
మిషన్ భగీరధ
2.08.2016న మిషన్ భగీరధ ప్రణాళికను ప్రారంభించారు. 2014-15 ఎస్ఆర్ఆర్ ప్రకారం రూ.43,791 కోట్లు అంచనా వేయగా, 2018-19 నాటికి ఈ అంచనా వ్యయం రూ.44,979 కోట్లకు పెరిగింది. 1.697 లక్షల కిలోమీటర్లు పైప్‌లైన్ వేయాలి. 78 టిఎంసిలు వినియోగించి 2.72 కోట్ల జనాభాకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలి. 55.59 లక్షల ఇండ్లకు కనెక్షన్లు ఇవ్వాలి. 2020 మార్చి 7 నాటికి రూ.41,000 కోట్ల వ్యయం జరిగింది. 18,000 ట్యాంకులకు తోడు 19,000 కొత్త ట్యాంకులు నిర్మించారు. 8,800 గ్రామాల నుండి మాత్రమే తాగునీరు వచ్చినట్లు తీర్మానాలు వచ్చాయి. 80శాతం నిధులు 18 బ్యాంకుల నుండి అప్పు తెచ్చారు. 20శాతం రాష్ట్ర బడ్జెట్ నుండి కేటాయించారు. 2015లో ''తాగునీటి సరఫరా కార్పొరేషన్ '' ఏర్పాటు చేసి దాని ద్వారా 23,560 కోట్లు వడ్డిలకు తెచ్చారు. ఇంతవరకు రూ.2,500 కోట్ల వడ్డి చెల్లించారు. యూనియన్ బ్యాంక్ వడ్డి 8-13శాతంగా ఉంది. ఇంత వ్యయం చేసినా ఎక్కడో ఒక చోట లీకేజీలు అవుతునే ఉన్నాయి. ఇప్పటికి 20శాతం కుటుంబాలకు తాగునీటి సౌకర్యం కల్పించబడలేదు. పట్టణాలలో ఒక రూపాయికే కనెక్షన్ ఇస్తామని చేసిన ప్రకటన కాగితాల వరకే ఉంది. త్రాగునీరు ఉచితంగా ఇవ్వడానికి రెషన్కార్డుకు తోడు ఆధార్ కార్డు జత చేసిన వారికి ఉచితంగా నీటి సరఫరా చేస్తున్నారు. తెలియని వారు బిల్లులు వేలలో చెల్లిస్తున్నారు.
ఇరిగేషన్ డవలప్మెంట్ కార్పొరేషన్
1971లో ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్ ద్వారా దళిత, గిరిజన, బలహీనవర్గాలకు 31.05.2014 నాటికి (టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు నాటికి) 767 లిప్ట్ పథకాల కింద 4.44లక్షల ఎకరాలకు సాగునీటి వనరులు కల్పించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో 9 లిప్ట్ పథకాలు ఈ సంస్థ నిర్వహించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నిధులు లేక లిప్ట్ పథకాలు దాదాపు మూలపడుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో 1.జఠప్రోలు-1, 2. జఠప్రోలు-11, కోండూరు, గోపాలపురం, చెల్పాడు, చిన్నమరూ, బొడబండా, గూడెం, బెక్కెం పథకాల కింద 18,000 ఎకరాలు సాగు జరిగేది నిలిచిపోయింది. ఈ సంస్థ 10 ఎకరాల భూమిలో దళిత, గిరిజన, బిసీలు ఉన్నచో ఉచితంగా బోరుబావి వేసి పంటపై మెట్టకు రూ.75, మాగాణికి రూ.125 శిస్తు వసూళ్ళు చేసేవారు. తెలంగాణలో 15 వేల బావులను వీరు నిరాటకంగా నిర్వహించారు. వేల మంది బలహీన వర్గాల వారికి ఆధాయం పెరిగింది. కానీ ప్రభుత్వం ఈ వ్యవస్థకు నిధులు కేటాయించకపోవడం వలన ఇంతకాలం నిర్వహించిన లక్షల ఎకరాల భూములు సాగులేకుండా ఉంటున్నాయి. ఈ వ్యవస్థ వలన ఐటిఐ వారికి వందల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. ఈ సంస్థకు ఇచ్చిన పెట్టుబడి తిరిగి ప్రభుత్వానికి శిస్తుల ద్వారా వస్తుంది. ఇందులో పని చేసేవారి వేతనాలు కూడా శిస్తు నుంచి చెల్లించవచ్చు. (ఉదా.. మార్కెట్ శిస్తు నుండి ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగానే) ప్రభుత్వంపై భారం పడదు. ఈ లిప్ట్ పథకాల వలన భూగర్భజలాలు పెరుగుతాయి. మైక్రోఇరిగేషన్ ద్వారా ఎక్కువ భూమికి పంటలు పండించవచ్చు. కానీ ప్రభుత్వానికి ఆ సోయిలేదు.
మేజర్ ఇరిగేషన్ నుండి ఐడీసీ వరకు ప్రణాళిక బద్దంగా నిర్వహిస్తే ప్రతి ఎకరా సస్యశ్యామలమౌతుంది. ఏడేండ్లు గడిచినా, లక్షల కోట్లు వ్యయం జరిగినా వచ్చిన లాభం అతితక్కువ. 7 సంవత్సరాలకు 7లక్షల ఎకరాల భూమిని మాత్రమే సాగులోతెచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. నీటి సౌకర్యన్ని కల్పిస్తామనీ, ప్రాజెక్ట్‌లు పూర్తిచేసి, పంటకాల్వలు తీయకుండా వృధాగా పోతున్న నీటితో కొన్ని చెరువులు నింపడం జరుగుతుంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాపితంగా 600 చెరువులను మాత్రమే నింపారు. దీనికే విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రణాళిక బద్దంగా ప్రాజెక్ట్‌లు, చెరువు కుంటలు, ఐడీసీ నిర్వహణను అమలు చేయడం ద్వారా అధిక ఉత్పత్తికి అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం సమీక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
నేటికి రాష్ట్రంలో సాగునీటి వనరుల కల్పన - నిధుల ఖర్చుల వివరాలు
క్ర.సం. సంవత్సరం ఆయకట్టు స్థిరీకరణ నిధుల ఖర్చు (కోట్లలో)
1 1956నాటికి 3,49,993 - -
2 1956-2004 20,89,022 - 17,000
3 2004-2014 6,60,598 92,584 92,000
4 2014-2021 4,75,856 2,12,300 1,10,000
మొత్తం 35,75,469 3,04,884 2,19,000
- ఎస్. మల్లారెడ్డి
సెల్:9490098666