Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెట్టుండి ఎండిపోతే గాలి ఎక్కడీ చల్లని నీడ ఎక్కడీ
ధనముండి దయ లేకపోతే మనిషెక్కడీ మల్లెల మనసు ఎక్కడీ
అక్క మహాదేవి శతాబ్దాల క్రిందటే సంధించిన ఈ ప్రశ్న.. వర్తమాన విషమ స్థితిని కండ్లకు కడుతున్నది.
చెట్టు మనిషిగా పేరుగాంచిన పర్యావరణ కర్మయోగి సుందర్‌లాల్ బహుగుణ (94) ఇటీవలే కరోనాకు బలైపోయిన విషయం విదితమే. 1927 జనవరి 9న ఉత్తరాఖండ్ రాష్ట్రం మరోడా గ్రామంలో బహుగుణ జన్మించాడు. బహుగుణ పూర్వీకులు వనమూలికా వైద్యులు. పొట్టకూటికోసం బెంగాల్ నుంచి ఆ ప్రాంతానికి వలసవచ్చారు. తమ ఆయుర్వేద పరిజ్ఞానంతో గడ్వాల్ రాజుగారి దీర్ఘకాల అనారోగ్యానికి స్వస్థత చేకూర్చడంతో రాజుగారు సంతసించి ఆవన్యప్రాంతాన్ని వారికి కానుకగా ఇచ్చారు.
కంటికి రెప్పలా చెట్టును, మొక్కలను వనాలను కాపాడుకోవాలనే తత్వం బహుగుణ వంశస్థులది. కానీ లాభాల కోసం అడవులు నరికే చరిత్ర సంస్థానాధీశులది. బహుగుణ తాతలకు, సంస్థాన వారసులకు మధ్య తరాలుగా హింసాయుత ఘర్షణలు చెలరేగుతుండేవి. బహుగుణ బాల్యం ఆనేపథ్యంలోనే గడిచింది.
1930లో సంభవించిన ఇలాంటి ఘర్షణలో 17మంది మరణించారు. ఎనభైమంది ఖైదీలయ్యారు. పిన్న వయసుపై కలిగిన ఈ ప్రభావం సహజంగానే బహుగుణను స్వాతంత్య్రోద్యమానికి చేరువచేసింది. గాంధీ సన్నిహిత శిష్యుడు శ్రీదేవ్ సుమన్ బహుగుణకు మార్గదర్శి అయ్యాడు. గాంధీ సర్వోదయ ఉద్యమానికి ఆకర్షితులైన మహిళా మణులు మీరాబెన్, సరళాబెన్లు. సరళాబెన్ శిష్యురాలు విమలాబెన్. ఉద్యమాల్లో మహిళలు మగవారికేమాత్రం తీసిపోరని వీరి సహచర్యంతో బహుగుణ ఆనాడే గ్రహించాడు. అంతేకాదు 1950 దశకంలో వనాలలో పనిచేసే దళిత ఆదివాసీ స్త్రీలకోసం బుదకేదార్లో ఆలయ ప్రవేశ ఉద్యమం చేసి విజయం సాధించిన ఘనత కూడా బహుగుణకు ఉన్నది. అనంతరం బహుగుణ - విమలాబెన్లు ఉద్యమ వివాహం చేసుకున్నారు.
ఇక అసలు విషయం. అది 1974 మార్చి 26. అక్కడ ఉన్న అలకానంద పైభాగంలోని 2,500 చెట్లను ప్రభుత్వం వేలం వేసింది. గెలి అనే కాంట్రాక్టరు తన పరివారంతో చెట్లను నరికేందుకు అక్కడికి వచ్చాడు. గౌరీదేవి అనే వనిత ఇది గమనించి వెన్వెంటనే గ్రామస్థులను చెట్లవద్దకు తరలించింది. ముందు మమ్మల్ని నరికిన తర్వాతనే చెట్ల జోలికి వెళ్ళండి అంటూ తోటి మహిళలను కలుపుకుని చెట్లను కౌగలించుకున్నారు. ఏ చెట్టు నరికేందుకు వెళ్ళినా ప్రజలు అలా పరుగెత్తికెల్ళి ఆలింగనం చేసుకునేవారు. అదే 'చిప్కో' ఉద్యమంగా ప్రాణం పోసుకున్నది. అయితే ఈ చిప్కో ఉద్యమానికి భూమిక బష్ణోరు గిరిజన తెగదనే విషయం మనం మరువరాదు. పూర్వం నుంచి ఆ గిరిజన తెగ తల్లులకు వన్యప్రాణుల సంతతిని కూడా తమస్తన్యం కుడిపే సంప్రదాయం ఉన్నదట. ఆ విధంగా వారు వన జీవనంతో మమేకం అయ్యారు.
పర్యావరణ చిత్తం గల బహుగుణ - విమలా బెన్ల చేరికతో చిప్కో ఉద్యమం అనతికాలంలోనే ఇంతింతై అన్నట్టు ఖండాంతర ఖ్యాతినార్జించింది. 1970వ దశకం అత్యవసర చీకటి కాలంలో సైతం ఈ ఉద్యమం పరవళ్ళు తొక్కుతూ ముందుకే సాగింది. పోలీసులు ఉద్యమ మహిళలపై ఎన్నో అకృత్యాలు చేసినా వెనుకడుగు వేయలేదు. చివరకు ప్రధాని ఇందిర తలవొగ్గి 15ఏండ్లపాటు చెట్లు కొట్టవద్దని నిషేధం విధించక తప్పలేదు.
బహుగుణకు విశేషమైన పాదయాత్ర అనుభవమున్నది. 1960లోనే ఏడు జిల్లాల పాదయాత్ర చేసారు. హిమాలయ ప్రాంత పర్యావరణ పరిరక్షణకు నాడే నడుం కట్టారు. తర్వాత 1973లో 1400 కి.మీ., 1975లో 2800కి.మీ., 1981-83లో కాశ్మీర్ నుంచి కోహిమా వరకు 3870 కి.మీ. పాదయాత్ర చేశారు. ఆ విధంగా పాదయాత్రకు పర్యావరణ పరిరక్షణకు మారుపేరుగా నిలిచారు బహుగుణ. తదనంతర కాలంలో ఈ ఉద్యమం అడవుల సంరక్షణకే కాకుండా భారీ డ్యాంల నిర్మాణానికి వ్యతిరేకంగా కూడా ద్వారాలు తెరిచింది. తెహ్రీ డ్యామ్‌కు వ్యతిరేకంగా సాగిన పోరాటం అందుకు తార్కాణం. డ్యామ్ నిర్మాణం వలన అడవుల విధ్వంసమే కాదు, పెద్ద ఎత్తున ప్రజలు, ప్రాణులు నిర్వాసితుల కావడం భరింపరానిదంటూ 84రోజుల పాటు బహుగుణ ఉపవాస దీక్షలు చేసారు. నిరసనగా 1981లో ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మశ్రీ బిరుదును తిరస్కరించారు. స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన నీరు, పచ్చని ప్రకృతి, పశుపక్షాదులతో కలిసి జీవించడమే మనిషికి ఈనాడున్న ఏకైక మార్గమని నినదించాడు.
ప్రకృతిని సర్వనాశనం చేయడం, జీవవైవిధ్యాన్ని దెబ్బతీయడం, పంచభూతాలను కలుషితం చేయడం, సామాజిక ధర్మాలను విస్మరించడమే. ఫలితంగా జనపధ ధ్వంస వ్యాధులు (కరోనా వంటివి) సంక్రమిస్తాయి. అని చరకుడు వేల సంవత్సరాల క్రితమే హెచ్చరించాడు.
మనం ఇప్పుడు అదే అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా మనకు కనువిప్పు కలగాలి. అందుకే మన కాలపు పర్యావరణవేత్త వందనా శివ అంటారు.. ''జీవవైవిధ్యం అనుభవించే ఓ లాలస వస్తువు కాదు, మనకుగా మనం నిర్మించుకోవాల్సిన రక్షణ కవచం'' అని.. నిజమేగా మరి.
- కె. శాంతారావు
సెల్: 9959745723