Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటికి తెలంగాణ ప్రభుత్వానికి ఏడేండ్లు. సబ్బండ వర్గాల అండదండలతో, సకల జనుల సమ్మెతో, 1200 మంది యువజన, విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ సాకారమైంది. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ చేసిన వాగ్దానాలు, హామీలకే ప్రజలు ఓట్లు వేశారు. 2014-18లో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్నే అధికారంలోకి తెచ్చారు. గడచిన ఏడేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వాగ్ధానాలెన్ని..? అందులో తీర్చినివెన్ని..? ఇచ్చిన కొలువులెన్ని..? పంచిన భూములెన్ని..? పారిన నీళ్లెన్ని? పాలన ఎలావుంది? ప్రజలు ఎలా ఉన్నారు..? ఆత్మగౌరవం ఎక్కడ ఉన్నది..? వీటన్నింటికీ ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలి.
మొట్టమొదటిగా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అయిండు. తొలి వాగ్దాన భంగం ఇక్కడే జరిగింది. దళితులకు మూడెకరాల భూమి అన్నారు.. ఎన్ని ఎకరాలు పంచారు..? ఇది రెండవ వాగ్దాన భంగం. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం అన్నారు. ఏడేండ్లలో 60వేలకు మించి ప్రభుత్వం కొలువులు ఇయ్యలేదు! ముఖ్యమంత్రి అధికారంలోకొచ్చిన నాడు లక్షా 7వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇన్నేండ్లయినా వాటిని ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాలి. ఐదేండ్లకోసారి ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తానన్నారు. ఊరించి ఊరించి చంపిండ్రు? 2018 జూన్ నుంచి రావాల్సిన పీఆర్సీ 2021 ఏప్రిల్‌లో ప్రకటించి అది కూడా ఫిట్మెంట్ 30శాతమే ఇచ్చి రెండేండ్ల ఏరియర్స్‌కు పంగనామాలు పెట్టిండ్రు. కరోనా పేరుతో అయిన కాడికి కత్తిరించిండ్రు. మేలో ఇస్తానన్న పీఆర్సీ నగదు వాయిదా వేసింది ప్రభుత్వం. ఈనాటికీ ఉత్తర్వులు జారీ కాలేదు. ఉద్యమ సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారు. వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యారంగంలో వేల సంఖ్యలో ఖాళీల భర్తీ జరగలేదు. స్వయంగా పీఆర్సీపై వేసిన బిశ్వాల్ త్రిసభ్య కమిటీ ప్రభుత్వంలో లక్షా 90వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని వెల్లడించింది. దాన్ని మసిపూసి మారేడు కాయ చేస్తూ ఇంకా వాగ్దానభంగ పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికలు, ఎమ్మెల్యేల కొనుగోలు, పార్టీ ఫిరాయింపులు... వీటిపైనే దృష్టి పెట్టింది. ప్రజల సంక్షేమం, సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఎన్నికలు వచ్చినప్పుడు కొత్త పథకాలు పెట్టడం, ఎన్నికలు అయిపోగానే మర్చిపోవడం అలవాటుగా మారింది.
''తెలంగాణ పచ్చని కోనసీమ కావాలే'' అన్నాడు మన ముఖ్యమంత్రి. ఇది బాగానే ఉంది. నేటి వరకూ కృష్ణా నదీజలాల వాటాను తేల్చింది లేదు. కృష్ణానదిపై ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది లేదు. లక్షల ఎకరాల భూములకు గ్రావిటీ ద్వారా సాగులోకి వచ్చే ఎస్సెల్బీసీ సొరంగ మార్గం పథకం నేటికీ కుంటుకుంటూ కొనసాగుతూనే ఉంది. తగిన నిధులు విడుదల చేసింది లేదు. ప్రాజెక్టు పూర్తిఅయ్యేది లేదు. పూర్తయ్యే ప్రాజెక్టులకు నిధులు కేటాయింపుల్లేవు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి తక్కువ ప్రయోజనాలు పొందే ప్రాజెక్టులకు నిధులకు కరువు లేదు. రీ టెండర్లు డిజైనింగ్ పేర్లతో వేలకు వేల కోట్లు మంజూరు చేస్తున్నారు. దీని వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయి..? దీని వెనుక ఉన్న కాంట్రాక్టర్లు ఎవరు అన్నది బహిరంగ రహస్యమే.
ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంలో ప్రభుత్వం వివక్ష చూపడం, నిధుల కేటాయింపులో ఎక్కువ తక్కువల కేటాయింపులు ఆరోగ్యకరం కాదు. 2010లో శ్రీశైలం ఎడమగట్టు 44 కిలోమీటర్లు సొరంగమార్గం పూర్తి కావాల్సి ఉంది. 33 కిలోమీటర్ల వరకూ సొరంగమార్గం ఇవ్వడం జరిగింది. మరో పది కిలోమీటర్లు సొరంగం పూర్తిచేస్తే నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ మొదలగు ప్రాంతాలు కూడా సస్యశ్యామలం కాగలవు. దాదాపు నాలుగు లక్షల ఎకరాలు పైసా ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా నీటి పారుదల ఉంటుంది. రూ.80 వేల కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఇటువంటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించడం సమంజసం కాదు. దక్షిణ తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్నప్రాజెక్టులు పూర్తి చేయాలి. పోతిరెడ్డిపాడు వాటాలను మించి జలాలను తరలించే అక్రమ ప్రాజెక్టులకు అడ్డుకట్ట వేయాలి. నీటి వాటా తేలినతర్వాత అనుమతించే విధంగా కేంద్ర ప్రభుత్వంతో త్వరితంగా చర్చలు జరపాలి. తెలంగాణ నీటి వాటాను రాబట్టాలి. కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పుకోవడం కాదు. పెండింగ్‌లోనున్న ప్రాజెక్టులను పూర్తి చేయడం ముఖ్యం. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు, ఎన్ని కోట్లు వ్యయం చేశారు...? ఎన్ని ఎకరాలకు నీళ్లు అందించారో మాటలు, ఉపన్యాసాలు కాకుండా శ్వేతపత్రం విడుదల చేయాలి. లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్న శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల, పోచంపాడు భారీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచాలి. బడ్జెట్ కేటాయింపులకు, వ్యయాలకు పొంతన ఉండటం లేదు.
తెలంగాణ రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. సన్న వడ్లు పండించమని చెప్పిన ప్రభుత్వం మాటలు నమ్మి పంట పండిస్తే కొనే దిక్కులేక నిలువునా నష్టపోయారు. కౌలు రైతులకు రైతుబంధు పథకం అమలు చేయలేదు. కౌలుదార్లు తీవ్రంగా నష్టపోయారు.
ధరణి పోర్టల్ తెచ్చి రైతులను అష్టకష్టాలు పెడుతున్నారు. కరోనా కష్టకాలంలో భూములను అమ్మి ఆపద తీర్చుకుందామంటే అనేక అడ్డంకులు. 2006 పోడు భూముల చట్టం ద్వారా భూములపై హక్కులు పొందిన గిరిజన రైతులను హరితవనాలు, పర్యావరణం, ఫారెస్ట్ భూముల పేరుతో భూములపై లేకుండా చేస్తున్నారు. పాస్బుక్లివ్వకుండా రైతుబంధు పథకానికి ఎగనామం పెడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గ్రామాల్లో కంటికి కనపడుతలేవు. అక్కడక్కడ నగరాల్లో, పట్టణాల్లో కొన్ని ఇండ్లు నిర్మించి అంతటా ఉన్నట్టు భ్రమ కలిగిస్తున్నారు. ఏడాదులు గడిచిపోతున్నా... పేదలకు ఇండ్లు అలాట్ చేయడం లేదు. మిషన్ భగీరథ రూ.50 వేల కోట్లతో అట్టహాసంగా ప్రారంభించారు. ట్యాంకులు చూపిస్తున్నారు. ఎన్నో గ్రామాలు నేటికీ మిషన్ భగీరథకు దూరంగానే ఉన్నాయి. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య కాగితాలకే పరిమితమైంది. ఎల్కేజీ నుంచి విశ్వవిద్యాలయాల వరకూ విద్య కార్పొరేట్ల పరమైంది. విద్య, వైద్యాన్ని కార్పొరేట్లకు అప్పగించి బ్రహ్మాండంగా ఉన్నదని అంటున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు నిధుల్లేక చతికలపడుతున్నాయి. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. రాష్ట్రాన్ని ప్రభుత్వం 34 జిల్లాలు చేసింది. మండలాలను విస్తరించింది. గ్రామపంచాయతీలను పెంచింది. మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేసింది. నిర్వహణ సిబ్బంది నియామకాలు మాత్రం విస్మరించింది.
కరోనా ఆపత్కాలంలో వందల కోట్ల విలువైన సచివాలయ భవనాలు ప్రజల వైద్యారోగ్యానికి ఐసోలేషన్ సెంటర్‌గా ఎంతగానో ఉపయోగపడేవి. వాస్తు ప్రకారం తన నమ్మకాలకు, విశ్వాసాలకు అనుకూలంగా లేవని పట్టుదలకు పోయిన ముఖ్యమంత్రి నిట్టనిలువునా నేలమట్టం చేశారు. ఒకవైపు ఖజానాలో పైసలులేవు అంటారు. అనవసర ఆర్భాటాలకు వందల, వేల కోట్లు ఖర్చు పెడతారు! మంత్రుల మాటలకు విలువ లేదు. శాసనసభ్యులకు దర్శనం లబించదు. సమస్యలపైన ప్రతిపక్షాలతో చర్చలు ఉండవు. ఇదీ ఈ ఏడేండ్లుగా పాలనాతీరు.
ప్రశ్నించే గొంతులను, ఉద్యమాలను, కార్మికోద్యోగ సమ్మెలను అణచివేయడం పరిపాటిగా మారింది. అప్రజాస్వామిక, నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ప్రశ్నించే గొంతుల ద్వారా, ఉద్యమాల ద్వారానే సాధ్యమైందన్న సంగతి విస్మరించరాదు. ఎక్కడైతే అణిచివేత పెరుగుతుందో తిరుగుబాటు అక్కడే మొదలవుతోంది. ప్రశ్నించే గొంతులు పెరుగుతాయి, ఉద్యమాలు లేస్తాయి. అధికారం, పదవులు ఎప్పుడూ శాశ్వతం కాదు. ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించిన ప్రగతి, సంక్షేమమే పదికాలాలపాటు నిలిచిపోతుంది. కేంద్ర వ్యవసాయ వ్యతిరేక చట్టాలను సమర్థించడం, కార్మిక చట్టాలను హరించి వేస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు అనుకూలంగా ఉన్నంత కాలం ఇది సుపరిపాలన కాబోదు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు అధికారం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక పాలనను తిరస్కరించారు. ప్రజాస్వామ్యానికి పట్టం గట్టారు. ప్రజల పక్షాన నిలిచే పార్టీలను ప్రభుత్వాలనే గెలిపించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇది గమనించాలి.
- జూలకంటి రంగారెడ్డి