Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడేండ్ల తెలంగాణ ప్రస్థానంలో విజయాలూ, వైఫల్యాలను నెమరవేసుకోవాల్సిన సందర్భం ఇది. అధికారపార్టీ 'అన్నీ సాధించామ'ని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలు 'అన్నీ వైఫల్యాలే' అని కొట్టిపారేయవచ్చు. ఈ రెండు ధోరణులూ ప్రజల జీవితాలలో మార్పు సాధించేందుకు తోడ్పడవు.
రాష్ట్రం గత రెండు మూడేండ్లుగా పచ్చని పంట పొలాలతో తొణికిస లాడుతున్నది. పంటల దిగుబడి తెలంగాణ ఏర్పడిన నాటితో పోల్చితే రెట్టింపయ్యింది. సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసి 20లక్షల ఎకరాలకు అదనంగా నీరందించామని ప్రభుత్వం చెబుతున్నది. దీనికి తోడు 45వేల చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భజలమట్టం పెరిగిందని చెప్పింది. 24 గంటలు కరెంటు తోడై సాగుభూమి 70లక్షల ఎకరాలు అదనంగా పెరిగిందని ప్రభుత్వ వాదన. 20లక్షల ఎకరాలు నిజం కాదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏమైనా పాలమూరు ప్రాంతంలో జలకళ నిజం. ఎంత విస్తీర్ణానికి అదనపు సాగునీరు అందిందన్నది వివాదాస్పదం. కానీ వేగంగా పూర్తి చేసానని ప్రభుత్వం చెప్పుకుంటున్న ఈ ప్రాజెక్టులు తెలంగాణ ఏర్పడకముందే నిర్మాణం చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రభుత్వం చేసిన పని తుది మెరుగులు దిద్దటమే! చెరువుల పునరుద్ధరణ గురించి ప్రభుత్వం చెప్పుకున్నదంతా నిజం కాకపోయినా... అసలేమీ జరగలేదని ఎవ్వరూ చెప్పజాలరు. సాగునీటి విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒక భాగం పూర్తయ్యిందని చెబుతున్నది. కానీ ఆ ప్రాజెక్టు నుంచి నీరందించిన కొత్త ఆయకట్టు వివరాలు చెప్పగల స్థితిలో ప్రభుత్వం లేదు. సాగువిస్తీర్ణం, దిగుబడి పెరుగుదలకు ప్రధాన కారణం గత రెండేండ్లుగా పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని చిన్న ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావటం, చెరువులు నింపటం తోడై భూగర్భజలమట్టం పెరిగింది. 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల బోరుబావులు బాగా నడిచాయి. కాలం కలిసి రావటంతోపాటు ప్రభుత్వం కృషి కూడా తోడైంది. కానీ సాగునీటి విషయంలో జబ్బలు చరుచుకోగల్గినంత లేదు. అనేక గ్రామాలలో రక్షిత మంచినీటి పథకం ముందునుంచే ఉన్నది. మిషన్ భగీరథతో మిగిలిన గ్రామాలకు కూడా సౌకర్యం విస్తరించి, తాగునీటి సరఫరా గ్యారంటీ అయింది. ఆమేరకు మంచిదే. కానీ ఇప్పటికీ అనేక గ్రామాలలో మిషన్ భగీరథ నీరు అందటం లేదన్నది కూడా నిజం. గత సంవత్సరం రైతు పండించిన ధాన్యం అత్యధిక భాగం ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతు బంధు కూడా తోడైంది. భూప్రక్షాళన పేరుతో కొన్ని కొత్త సమస్యలు వచ్చినప్పటికీ, ఎంతో కాలంగా రైతులను వేధిస్తున్న అనేక వివాదాలు పరిష్కారం కావటం ఊరటనిచ్చింది.
గొర్రెల పంపకం, చెరువుల్లో చేపలు వేయటం, బతుకమ్మ చీరలు, గురుకులాల విద్యార్థుల యూనీఫారం, సొసైటీలకు సబ్సిడీతో కూడిన అప్పులు, వాహనాలు తదితర రూపాల్లో వృత్తిదారులకు సహాయం అందుతున్నది. వీటికి తోడు అనేక పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల పేరుతో పేదల చేతికి ఎంతో కొంత ఆసరా అందుతున్నది.
మంచి ఆదాయం ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదాయపు వనరుగా ఎదిగిన హైదరాబాద్ మహానగరం అదే పాత్ర పోషిస్తున్నది. రియల్ఎస్టేట్ రంగం నిర్మాణరంగం ఊపు భాగ్యనగరం కేంద్రంగా కొనసాగుతున్నది. భౌగోళికంగా హైదరాబాద్ స్థానం రీత్యాగానీ, దేశంలో ఇతర ప్రాంతాలతో ఉన్న అనుసంధానం రీత్యాగానీ ఈ అవకాశాలేమీ తగ్గలేదు. ఐటీ ఉద్యోగులు, మధ్యతరగతి ఉద్యోగులు, ఫార్మారంగం ఆదాయాలు ఈ రంగం కళకళలాడటానికి ప్రధాన కారణం. దేశంలో విస్తరించిన రహదారులలో భాగంగా తెలంగాణలో కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన జిల్లాల విభజన కూడా తోడైంది. ఫలితంగా గ్రామీణప్రాంతాలకు రియల్ఎస్టేట్ రంగం కొంత విస్తరించింది. 24గంటల కరెంటు వ్యవసాయరంగంలోనే కాకుండా పారిశ్రామిక రంగంలో కూడా మంచి ప్రభావం చూపింది. ఐటీ రంగం అభివృద్ధి కూడా తెలంగాణకు కలిసొచ్చింది. అంతర్జాతీయ పరిణామాల ఫలితంగా ఐటీ రంగం భారత్ వైపు చూడటం పెరిగింది. ఇప్పటికే బెంగుళూరు తర్వాత స్థానంలో ఉన్న హైదరాబాద్‌కు కలిసివచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిపేరుతో సాగుతున్న గందరగోళం కూడా హైదరాబాద్‌కు కలిసివచ్చిందన్నది నిజం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చిన ఈ పరిణామాలన్నీ ప్రభుత్వం ఆదాయం పెంచేవే! రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీలేదని ఎవరన్నా పొరపాటే. కానీ కాలం కలిసొస్తే నడిచివచ్చే కొడుకు పుడతాడని సామెత!
నియామకాల విషయంతో తీవ్ర వైఫల్యమే కనిపిస్తుంది. రాష్ట్ర తొలి శాసనసభ సమావేశాలలోనే ప్రభుత్వశాఖల్లోని లక్షా ఏడువేల ఖాళీపోస్టులు ఏడాదిలో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆచరణలో 40వేలు కూడా భర్తీ చేయలేదు. ఈ ఏడేండ్లలో రిటైరైన ఉద్యోగుల ఖాళీలు కలుపుకుంటే రెండు లక్షలకు పైగానే ఉన్నాయి. కాంట్రాక్టు నియామకాల విధానం రద్దు చేస్తామన్నారు. ఇప్పుడన్నీ కాంట్రాక్టు పద్ధతుల్లోనే నియమిస్తున్నారు. యువత మోసపోయామని భావిస్తున్నారు.
సాగునీటి విషయంలో సమతుల్యా భివృద్ధి పాటించలేదు. నిధులన్నీ ఒకే ప్రాజెక్టుకు తరలించారు. కేజీ నుంచి పీజీ ఉచిత విద్య వాగ్దానం వదిలేసారు. వైద్యరంగంలో కార్పొరేట్ రంగం ఆధిపత్యం కొనసాగుతున్నది. కుటుంబాదాయంలో సగం విద్యా వైద్య ఖర్చులకే పోతున్నాయి. రైతులకు ఊరట కలిగించే ప్రయత్నమే తప్ప జీవితంలో భరోసా ఇచ్చే గిట్టుబాటు ధర విషయం దాటవేస్తున్నారు. బ్యాంకులు, సహకార సంస్థల ద్వారా అప్పుల సౌకర్యం గ్యారంటీ చేసేందుకు సిద్ధంగా లేరు. పైగా విడతల వారీ రుణమాఫీ వల్ల బ్యాంకులు ఇప్పటిదాకా ఇస్తున్న పరిమిత అప్పులు కూడా ఆపేసాయి. ప్రయివేటు వడ్డీ వ్యాపారులకిది వరప్రసాదంగా మారింది. ఈ ఏడేండ్లలో ఒక్కరంగంలో కూడా కార్మికుల కనీస వేతనాలు సవరించలేదు. వృత్తిదారుల కుటుంబాల్లో చదువుకున్న యువత కులవృత్తులు చేయడానికి సిద్ధంగాలేరు. వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించ లేకపోయారు. నిరుద్యోగ భృతి వాగ్దానం అమలు చేయలేదు. ఆదివాసీలకు భూమి పట్టాలు, ఎస్సీలకు మూడెకరాల భూమి ఆటకెక్కింది. డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిందే పరిమితం. అవి కూడా కేటాయింపునకు నోచుకోలేదు. ఇవన్నీ ప్రజల జీవితాల మీద దీర్ఘకాలిక ప్రభావం చూపే చర్యలు. వీటిమీద దృష్టి సారించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. తక్షణం ఓట్లు సమకూర్చిపెట్టే ఓట్ల పథకాలకే ప్రాధాన్యత. కుల దురహంకార దాడులూ, మహిళలమీద లైంగిక దాడులపైనా మౌనం దాల్చింది.
పాలకులు చాలా స్పష్టతతో ఉన్నారు. కంపెనీల స్థాపనను సులభతరం చేస్తూ టీఎస్ ఐపాస్ చట్టం చేసారు. కార్మిక చట్టాలు అమలు చేయబోమని పెట్టుబడిదారులకు భరోసా కల్పించారు. కార్మికశాఖను ఆచరణలో యజమానుల శాఖగా మార్చారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ఖర్చును ఎక్కువ చూపించారు. రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి కాంట్రాక్టర్ల బొజ్జలు నింపుతున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో కూడా ఇదే జరిగింది. ధరణి వెబ్‌సైట్‌తో రియల్ఎస్టేట్ వ్యాపారుల భూముల రిజిస్ట్రేషన్లు సులభతరమైనాయి. హైదరాబాద్‌లో ఉన్నా, అమెరికాలో ఉన్నా వారి పని జరిగిపోతున్నది. రైతు బంధుతో లాభపడుతున్న రైతుల సంఖ్య పెద్దగా కనిపిస్తుంది. కానీ ఈ పేరుతో ఇస్తున్న డబ్బులో సింహభాగం ఫామ్ హౌస్ యజమానులకూ, భూస్వాములకూ, ధనిక రైతులకూ, సాగుతో సంబంధం లేనివారి జేబుల్లోనే చేరుతున్నది. భూమి పంపకం నినాదం వదిలేసారు. కౌలుదార్లు, వ్యవసాయ కూలీల హక్కులు హరించటం ద్వారా భూస్వాములు, ధనిక రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేసారు. అప్పులూ, నిల్వ సౌకర్యాలూ వీరికే! అవినీతి పరులకు ఆశ్రయం కల్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని వెనుకబడిన తరగతులకు చెందిన జనాధిక్య కులాలలో క్రీమీలేయర్‌ను సృష్టిస్తున్నారు. ఉన్నత వర్గాల ప్రయోజనాలు కాపాడటమే కీలకం. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెసు, తెలుగుదేశం బాటలోనే టీఆర్ఎస్ నాయకత్వం కూడా నడుస్తున్నది.
ప్రజలలో క్రమంగా అసంతృప్తి పెరుగుతున్నది. ఉద్యమాలకు దారితీయటం సహజం. కానీ పాలకులలో అప్రజాస్వామిక పోకడలు బలపడుతున్నాయి. ప్రజల కదలికల మీద నిఘా పెంచారు. దేశంలో ఉన్న మొత్తం సీసీ కెమెరాలలో 65శాతం తెలంగాణలోనే ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారు. బడా బాబులకు భరోసా ఇస్తున్నారు. పోలీసు శాఖను సంఖ్యరీత్యానూ, సౌకర్యాల రీత్యానూ, సాంకేతిక పరికరాల విషయంలోనూ బలోపేతం చేసారు. ధర్నాలు, బహిరంగ సభలు, ప్రదర్శనలను సహించలేక పోతున్నారు. ప్రజా సంఘాల పట్ల నిరంకుశ ధోరణి ప్రదర్శస్తున్నారు. రాజకీయరంగంలో ప్రతిపక్షంలోనే కాదు, స్వపక్షంలోనూ ప్రశ్నించే తత్వాన్ని సహించలేకపోతున్నారు.
ప్రజల అసంతృప్తిని బీజేపీ నాయకత్వం సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఉన్నది. అదే జరిగితే ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టే. ఈ పరిణామాన్ని గుర్తించడానికి టీఆర్ఎస్ నాయకత్వం సిద్ధంగాలేదు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తున్నది. కేంద్రంలో మోడీ ప్రభుత్వంతో లాలూచీ కుస్తీ కొనసాగిస్తున్నది. జీఎస్టీ, పెద్దనోట్లరద్దు, కార్మిక చట్టాల రద్దు వంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ సమర్థించింది. రైతు వ్యతిరేక వ్యవసాయచట్టాలు, విద్యుత్తు సవరణ బిల్లు మాటవరసకు వ్యతిరేకించి తలవంచుతున్నది. కరోనా నిధుల కోసం కూడా కేంద్రం మీద గట్టిగా మాట్లాడలేకపోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా సాధించుకోవాలన్న స్పృహలేదు. 'ఒకే దేశం ఒకే ఎన్నిక' స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా మార్చడాన్నీ ప్రశ్నించలేక పోతున్నది. రాఫెల్ కుంభకోణం విషయంలో మౌనం వహించింది. రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రం మీద వత్తిడి చేయడానికి సిద్ధంగా లేదు. ప్రజలలో మతపరమైన విభజన సృష్టించే బీజేపీ ప్రయత్నాల పట్ల మెతకవైఖరి ప్రదర్శిస్తున్నది. కేంద్ర ప్రభుత్వంతో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అవకాశవాద ధోరణి తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు తీవ్ర హాని కలిగిస్తుంది. ఇప్పుడైనా టీఆర్ఎస్ నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల మీద పోరాడేందుకు సిద్ధపడాలి.
- ఎస్. వీరయ్య