Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ ఉప్పెన దేశాన్ని అతలాకుతలం చేయటంతో భారత ఆర్థిక వ్యవస్థకు వాతలు పడ్డాయి. ప్రత్యేకించి కాంట్రాక్టు కార్మికులపై ఆధారపడిన రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రపంచం, భారత ఆర్థిక చరిత్రలో కనివినీ ఎరుగని స్థాయిలో ఉపాధి అవకాశాలు కోవిడ్ దెబ్బకు ఆవిరయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా ఉండాల్సిన గిరాకీ (కొనుగోలు సామర్ధ్యం) గత ఆర్థిక సంవత్సరంలో 8.8శాతం పడిపోయింది. 1980-81 తర్వాత ప్రజల కొనుగోలు సామర్ధ్యం ఈ స్థాయిలో పడిపోవటం ఇదే ప్రథమం. ప్రయివేటు వ్యయం పతనమవుతున్నప్పడు ఆర్థిక వ్యవస్థ గమనాన్ని గ్యారంటీ చేసే మరో మూలస్థంభం ప్రభుత్వ వ్యయం. కానీ ఈ ప్రభుత్వ వ్యయం కూడా 2019-20లో 7.9శాతంగా ఉంటే 2020-21లో కేవలం 2.9కి పడిపోయింది. వ్యక్తుల కొనుగొలు సామర్ధ్యం అలా ఉంటే ఇక కంపెనీలు తమ వార్షిక వ్యయంలో 34శాతం తగ్గించుకోవటం ద్వారా ఈ కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించ లేకపోయినా తట్టుకుని నిలబడ్డాయి. ఇవన్నీ 2020-21 సంవత్సరం వార్షిక నివేదికలో భారత రిజర్వు బ్యాంకు చెప్పిన కఠోర వాస్తవాలు. రిజర్వు బ్యాంకు మాటల్లోనే భారత ఆర్థిక వ్యవస్థ గత 40ఏండ్లల్లో ఎన్నడూ ఎదుర్కోనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇవన్నీ పరిశీలిస్తే అదిగో నవలోకం అని పాడుకోవటానికి బదులు ఇదిగో పాతాళం అని గోడు వెళ్లబోసుకునే దుస్థితికి దేశం నెట్టబడిందని అర్థమవుతుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఈ సంవత్సరం ఆర్థికాభివృద్ధి 10 శాతానికి పైగా ఉంటుందని పార్లమెంట్లో బల్ల గుద్ది మరీ చెప్పారు. కానీ కోవిడ్ రెండ తరంగం ఆశించినదానికంటే ఎక్కువ కాలమే కొనసాగటంతో ఈ సంవత్సరం కూడా ఆర్థికాభివృద్ధి ఆవిరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు ఎనిమిది శాతం వృద్ధి రేటు ఉన్నప్పుడు పగ్గాలు చేపట్టిన ప్రధాని మోడీ పాలనలో 2019-20 నాటికి వృద్ధి రేటు నాలుగు శాతానికి పడిపోయింది. కోవిడ్ విజృంభించిన 2020-21లో ఈ వృద్ధి రేటు కాస్తా -8శాతంగా నమోదైంది. ఈ లెక్కన కనీసం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో మూడు శాతం వృద్ధి సాధించాలన్నా దేశం రెండంకెల వృద్ధి మార్క్ ను అధిగమించాలి. కానీ ఈ సంవత్సరం కూడా దేశానికి కల్తీ యోగుల పాలనలో అటువంటి యోగం కనిపించటం లేదు.
ఇప్పటికే అనేక రాష్ట్రాలు పాక్షికంగా గానీ, పూర్తిస్థాయిలో గానీ లాక్డౌన్లో ఉన్నాయి. కనీసం మొదటి దఫా కరోనాపై పోరాటంలో ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులగురించి కొంతైనా చర్చ జరిగింది. కోల్పోయిన ఉద్యోగ అవకాశాలు, వరదలా రోడ్డెక్కిన వలస కార్మికుల గురించిన చర్చ జనం ముందుకొచ్చింది. కానీ ఈ సారి అటువంటి చర్చ ఏదీ జరగటం లేదు. ఆర్థిక మంత్రి మౌనముద్రలో ఉన్నారు. ఆర్థిక శాఖ సహాయమంత్రి రానున్న హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సీటు ఖాయం చేసుకోవటానికి పాట్లుపడుతున్నారు. దేశం ప్రభుత్వ ప్రేరిత క్షామాన్ని చూస్తోంది. జేపీ మోర్గాన్ సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఏప్రిల్ - జూన్ త్రైమాసంలో ఆర్థికాభివృద్ధి ఏడు శాతాన్ని మించే అవకాశం కకనిపించటంలేదని అంచనా వేసింది.
గత సంవత్సరం కోవిడ్ గురించిన చర్చలు, విధాన జోక్యాలు పరిశీలించిన ఎట్టకేలకు దేశం కోవిడ్ ముప్పును అధిగమించామన్న ధీమాతో ఆర్థిక వ్యవస్థ వడివడిగా అడుగులేసింది. కానీ ఈ సారి అటువంటి ధీమా కనిపించటం లేదు. హెచ్ఎస్బీసీ అధ్యయనం కూడా కోవిడ్ రెండో తరంగం ప్రభావంతో తలెత్తిన అనిశ్చితి ఆర్థిక వ్యవస్థను గందరగోళంలో పడేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అనిశ్చితికి నాలుగు కారణాలున్నాయని ఆర్థిక పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొదటిది రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న లాక్డౌన్ ప్రభావం ఎలా ఉంటుందో మదింపు చేయగల ప్రమాణాలు లేకపోవటం, లాక్డౌన్ కాల వ్యవధి గురించిన నిర్దిష్టత లేకపోవటం మొదటి కారణం కాగా మొదటి దఫా కోవిడ్ కష్టాలను తేలికగా అధిగమించగలిగిన మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి రెండవ దఫా కోవిడ్ ఉప్పెనలో ఎక్కువగా నష్టపోతున్నారు. రెండో దఫా కోవిడ్ ఉప్పెన గ్రామీణ ప్రాంతాలను ముంచెత్తుతోంది. దీంతో అటు పట్టణ ప్రాంతంలోనూ, ఇటు గ్రామీణ ప్రాంతంలోనూ ప్రజల కొనుగోలు శక్తి మీద తీవ్రమైన ప్రభావం చూపించటం మూడో అంశంగాఉంది. చివరిగా పెరుగుతున్న ధరలు ఉత్పత్తిదారుల లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజాగా భారత రిజర్వు బ్యాంకు వెల్లడించిన వివరాలు ఈ ఆందోళనను మరింత పెంచేవిగా ఉన్నాయి. మార్చి 2020 నాటికి 6.4 శాతంగా ఉన్న వార్షిక బ్యాంకు రుణాల వృద్ధి రేటు మార్చి 2021 నాటికి 5.6 శాతానికి పడిపోయింది. దేశంలో అన్ని బ్యాంకులు ఇచ్చే వివిధ రకాల అప్పుల్లో 45శాతం అప్పులు మహా ముంబయి, కొల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీల్లోను పంపిణీ అవుతుంటాయి. కోవిడ్ కాలంలో ఈ ఆరు మహానగరాల్లో ఇచ్చిన బ్యాంకింగ్ రుణాలు తగ్గిపోయాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఇండియన్ బ్యాంకర్ల సంఘం కోవిడ్ చికిత్సకు కూడా రుణాలు మంజూరు చేసేందుకు సిద్ధమైందని వార్తలు వచ్చాయి. బ్యాంకులకు అప్పు తీసుకునేవాడు లేనిదే లాభం లేదు. వ్యాపారం లేదు. అందుకే చివరకు పతనమవుతున్న పరపతిని పెంచటానికి ఈ దుస్థితికి పాల్పిడిందని మనం అర్థం చేసుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యమైన అనిశ్చితి కారణం వాక్సినేషన్. దేశ ప్రజలకు వాక్సినేషన్ వేయటం ఎంత ఆలస్యమైతే అంతగా దేశానికి మూడో ఉప్పెన ముసరులో చిక్కుకునే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బార్క్లేస్ సంస్థ భారతదేశంలో వాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ సమస్యల నెదుర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు వీలైన వాక్సినేషన్ షెడ్యూల్స్ ఖరారు చేసుకోవటానికి కేంద్రం వెసులుబాటు ఇచ్చినా వాక్సిన్ సరఫరా మాత్రం అక్టోబరు వరకు మెరుగుపడే పరిస్థితులు కనిపించటం లేదు.
కోవిడ్ మొదటి దఫా ముట్టడి కారణంగా వేతన నష్టాన్ని చవిచూసిన కుటుంబాలు అంతవరకూ దాచుకున్న పొదుపు మొత్తాలతో కుటుంబం వెళ్లదీస్తూ వచ్చారు. అనుమానించినట్లే రెండో ఉప్పెన కూడా వచ్చింది. మూడో ఉప్పెన గురించిన ఆందోళనలు, అనుమానాలు తలెత్తు తున్నాయి. భయపడినట్లు మూడో ఉప్పెన ముంచెత్తితే ఇక ఎగువ, దిగువ అన్న తేడా లేకుండా మధ్యతరగతి యావత్తూ అప్పులపై ఆధారపడి బతకాలి. అమెరికాలాగా ఇంకా క్రెడిట్ కార్డులతో భారతీయుల జీవితాల బంధం అంత గట్టిగా ముడేసుకోలేదు. అలా అని అమెరికా తరహాలోనో ఐరోపా దేశాల తరహాలోనో లక్షల కోట్ల డాలర్లు ప్రజలకు చేర్చి వాళ్ల కొనుగోలు శక్తిని కాపాడి ఉంచే సామర్ధ్యం భారత ఆర్థిక వ్యవస్థకు లేదు. పైగా ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో కూడా కుటుంబాలు దివాళా తీసే పరిస్థితులు ముందుకొస్తున్నాయి. ఈ జంటదాడికి తోడు ప్రభుత్వ చేతకానితనానికి 130 కోట్లమంది భారతీయుల భవిష్యత్తు బలికానుంది.
- కొండూరి వీరయ్య
సెల్:8971794037