Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరి నిజస్వభావమైనా గమనించాలంటే, ఎదుటివారు కష్టాలలో ఉన్నప్పుడు, వారు వ్యవహరించే తీరునుబట్టి నిర్ధారణకు రావచ్చు. అది ఒక మనిషి గురించైనా అంతే. ఒక ప్రభుత్వం గురించైనా, ఒక వ్యవస్థ గురించైనా అంతే. చాలా సందర్భాలలో వ్యక్తుల గురించి అర్థం అయినంత సులభంగా ప్రభుత్వాల గురించి అర్థం కాదు. ఇక వ్యవస్థల గురించి అర్థం చేసుకోవాలంటే, ప్రపంచ వ్యాపిత పరిణామాలు సంభవించాలి. దురదృష్టకర సందర్భమే అయినా, కరోనా రూపంలో ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది.
ప్రపంచంలో ఐరాస సభ్యదేశాలు 193. గుర్తించిన దేశాలు 2. మొత్తం 195. ఇప్పుడు కరోనా లెక్కల్లో వచ్చే దేశాలు 223. ఐయస్ఓ కోడ్ల ప్రకారం 243. ఈ లెక్కల గందరగోళాలు ఎలా ఉన్నా, కరోనా మహమ్మారి ప్రపంచం అంతా వ్యాపించింది. అన్ని దేశాలలో వచ్చేసిన ఈ కరోనా, వివిధ వ్యవస్థలలో ఎలా ఉంది? దానిని నియంత్రించడంలో, రూపుమాపడంలో ఆయా వ్యవస్థల పనితీరు ఎలా ఉందో పరిశీలిద్దాం.
ముందుగా అభివృద్ది చెందిన దేశాలుగా పేరెన్నికగన్న జి7 దేశాల గురించి చూద్దాం. జి7 దేశాలన్నీ పెట్టుబడిదారీ దేశాలు. 1973లో ఏర్పాటయ్యేనాడు అవన్నీ, సోషలిస్టు వ్యతిరేక ధోరణితోనే ఉన్నాయి. అందుకే సోవియట్ దెబ్బతిన్న తరువాత మాత్రమే జి7ను జి8గా మార్చి, 1994లో రష్యాను సభ్యదేశంగా తీసుకొన్నారు. సోవియట్‌ను కూల్చిన ద్రోహుల్లో ఒకరైన, బోరిస్ ఎల్సిన్‌ను అధ్యక్ష మండలి సమావేశానికి ఆహ్వానించారు. 2014లో మళ్ళీ సస్పెండ్ చేశారు. అందుకే ఇప్పటి చర్చలో జి7నే ప్రాతిపదికగా తీసుకొందాం. అమెరికాతో పాటు, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, జర్మనీ ఇవీ జి7 దేశాలు. ఈ 7దేశాల జనాభా మొత్తం 77కోట్లు. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 10శాతం ప్రజలు ఈ దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచ సంపదలో 58శాతం, ప్రపంచ జీడీపీలో 46శాతం ఈ 7దేశాలలోనే ఉంది.
787కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో ఈరోజుకు (డబ్ల్యూహెచ్ఓ లెక్కలు 31.05.2021 నాటివి) నమోదైన మొత్తం కరోనా కేసులు 17,06,39,887. 77కోట్ల జనాభా ఉన్న ఈ జి7 దేశాలలో కరోనా కేసులు 5,41,86,341. అంటే మొత్తం కేసులలో ఇది 32శాతం. ప్రపంచంలో ఈ నాటికి సంభవించిన మరణాల సంఖ్య 35,48,895. ఈ 7దేశాలలో సంభవించిన మరణాలు 10,99,861. అంటే మొత్తం మరణాలలో ఇది 31శాతం. 10శాతం జనాభా ఉన్న ఈ దేశాలలో కేసుల వాటా 32శాతం ఉంటే, మరణాల వాటా 31శాతం ఉంది.
ఇక సోషలిస్టు వ్యవస్థను పరిశీలిద్దాం. ప్రపంచ దేశాలలో సోషలిస్టు మార్గంలో ప్రయాణం సాగిస్తున్న దేశాలు, అంటే ప్రస్థుతం కమ్యూనిస్టు పార్టీల పరిపాలన క్రింద ఉన్న దేశాలు ఐదు ఉన్నాయి. అవి 1. చైనా 2. వియత్నాం 3. క్యూబా 4. ఉత్తర కొరియా 5. లావోస్. ఈ ఐదు దేశాల జనాభా 158కోట్లు. ప్రపంచ జనాభాలో 20శాతం ప్రజలు ఈ దేశాలలో నివసిస్తున్నారు. ఇందులో ఒకటైన చైనాలోనే 2019 డిసెంబర్లో ఈ కరోనా వైరస్ పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 5దేశాలలో నమోదైన మొత్తం కేసులు 2,39,975. అంటే మొత్తం ప్రపంచంలో నమోదైన కేసులలో ఈ దేశాల వాటా కేవలం 0.16శాతం. ఇక మరణాల గురించి చూస్తే ఈ 5దేశాలలో కలిపి ఇప్పటి వరకు 5,629. అంటే మొత్తం మరణాలలో 0.15శాతం మాత్రమే.
ఇక మనదేశాన్ని చూస్తే, నమోదైన మొత్తం కేసులు 2,78,94,800. మరణాలు 3,25,998. మన జనాభా 139కోట్లు. వివరాలను పోల్చడం కోసం ఒక దగ్గరకు తీసుకు వస్తే, అభివృద్ది చెందినట్టు చెప్పే 7పెట్టుబడిదారీ దేశాలలో 10శాతం జనాభా ఉంటే 31శాతం మరణాలు, 32శాతం కేసులు ఉన్నాయి. 5సోషలిస్టు దేశాలలో 20శాతం జనాభా ఉంటే, కేవలం 0.16శాతం కేసులు, 0.13శాతం మాత్రమే మరణాలు జరిగాయి. ఒక్క అమెరికాలో 4శాతం జనాభా, 20శాతం కేసులు, 17శాతం మరణాలు, మనదేశంలో ప్రపంచ కేసులలో 16శాతం, మరణాలలో 9శాతం నమోదయ్యాయి. ఇప్పుడు జపాన్‌లో ఫోర్తవేవ్ మొదలైందనే వార్తలు, వేలకొద్దీ మరణాల గురించి కూడా వింటున్నాం.
పెట్టుబడిదారీ దేశాలలో ఎక్కువ మంది ఎందుకు చనిపోయారు. సోషలిస్టు దేశాలలో తక్కువ మంది ఎందుకు చనిపోయారు. పెట్టుబడిదారీ దేశాలలో కేసులు ఎందుకు ఎక్కువ శాతం ఉన్నాయి. సోషలిస్టు దేశాలలో ఎందుకు అతి తక్కువ శాతం ఉన్నాయి. ఇది పరిశీలించాలి. ఎందుకున్నాయంటే, కరోనా కూడా వర్గ సమస్యే. కరోనాకు బలై పోతున్నవారిలో అత్యధికమంది పేదలే. అమెరికాలో చనిపోయిన ప్రతి ఏడుగురిలో ఆరుగురు నల్ల జాతివాళ్ళే. బ్రిటన్‌లో ప్రతి ఆరుగురిలో నల్లవాళ్ళు (బేమ్స్. అంటే, బ్లాక్ ఆసియన్ మైగ్రెంట్ ఎథ్నిక్స్) ఐదుగురు చనిపోయారు. భారత్ అయినా, బ్రిటన్ అయినా, జర్మనీ అయినా, జపాన్ అయినా పేదవాళ్ళే వీధిన పడ్డారు. ఉద్యోగం పోయిందీ వాళ్ళకే, ఉపాధి పోయిందీ వాళ్ళకే. ప్రభుత్వం పట్టించుకోందీ వాళ్ళనే.
పెట్టుబడిదారీ దేశాలలోనే మందుల కొరత, ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్ల కొరత, వ్యాక్సిన్ కొరత, లాక్‌డౌన్‌తో ఇంట్లో ఉంటే తిండి కొరత. పేదవాళ్ళకు అన్నీ కొరతలే, కోతలే. పైపెచ్చు ధరలు పెంచి వాతలు కూడా. వైద్యం ఖరీదై పేదవాడికి చాలా దూరంలో ఉంది. అమెరికాలో సాధారణ ఓపీ ఫీజు 480 డాలర్లు. అంటే మన రూపాయలలోకి మారిస్తే రూ.34,848లు. ఇది చెయ్యి పట్టి చూసే వరకే. ఇక హాస్పిటల్లో అడ్మిట్ కావాలంటే సరాసరి లెక్క ప్రకారం 22,543 డాలర్లు. అంటే మన రూపాయలలో రూ.16,23,096. అందుకే అమెరికాలో మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోతే హాస్పటల్ వైపు కూడా చూడటం కష్టం అంటారు. దాదాపు 20శాతం మంది ఇన్సూరెన్స్ కట్టలేని వాళ్ళున్నారు. ఇప్పుడు బలైపోతున్న వారిలో వాళ్ళే ఎక్కువమంది. మన రాష్ట్ర, దేశ రాజధానుల్లో కరోనాతో ప్రయివేటు ఆసుపత్రికి పోతే 5లక్షల బిల్లు అంటే తక్కువే అనుకొనేట్లు తయారైంది వ్యవహారం. చచ్చిపోయిన తరువాత అంత్యక్రియలు కూడా నిర్వహించలేనంతగా లాగేస్తున్నది, పెట్టుబడిదారీ ప్రయివేటు వైద్యం. అందుకే శవాలు గంగపాలవుతున్నాయి.
ఇంత జరుగుతుంటే ప్రభుత్వాలు ఏమి చేస్తున్నట్లు. మార్క్స్ కమ్యూనిస్టు ప్రణాళికలో బూర్జువా వ్యవస్థలో ప్రభుత్వాల గురించి ఒక చక్కటి మాట చెపుతాడు. ఈ ఆధునిక రాజ్యంలో ప్రభుత్వం అనేది బూర్జువా వర్గపు సమిష్టి వ్యవహారాలను చక్కబెట్టే కమిటీ మాత్రమే అని. పెట్టుబడిదారులకు లాభం చేకూర్చడం కోసం పని చేయడమే వాళ్ళకు నిర్దేశించిన విధి. అందుకే అమెరికాలో అయినా, భారత్‌లో అయినా ప్రజలకేమో కరోనా జబ్బు పెరిగింది. పెట్టుబడిదారులకేమో తరిగిపోని సంపద పెరిగింది. అమెజాన్లు, టెస్లాలు, ఇంటెల్లు, క్వాల్కాంలు, గూగుల్‌లు, ఫేస్‌బుక్‌లు, అంబానీలు, అదానీలు వీళ్ళ లాకర్లు నిండటానికి లాక్డౌన్లేమీ అడ్డుకాలేదు. కాకపోగా కరోనాను కూడా వీళ్ళ దోపిడీకి ఉపయోగించుకొన్నారు. ఇప్పటిదాకా వాళ్ళకు ఆటంకంగా ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేయించుకోవడానికీ, ప్రభుత్వ రంగాన్ని కాజేయడానికీ, ప్రజా సంపదను కొట్టేయడానికీ, కరోనానే మంచి సమయంగా ఎంచుకొన్నారు. అందుకే మనం భారత్‌నే చూస్తే, వ్యవసాయ రంగాన్ని అప్పచెప్పటానికి రైతు చట్టాలు తెచ్చారు. రైళ్ళు, రైల్వే స్టేషన్లు, బొగ్గు బావులు, చివరకు అంతరిక్షాన్ని కూడా వదలి పెట్టకుండా కరోనా సమయంలోనే కాజేశారు. వీళ్ళ దోపిడీ వ్యాక్సిన్‌ను కూడా వదలి పెట్టలేదు. నీళ్ళ సీసాధరంతే ఉంటుంది వ్యాక్సిన్ ధర అని, సాక్షాత్తూ తయారు చేసే కంపెనీ యజమాని చెపితే, ప్రభుత్వం మాత్రం రూ.600లు ఇప్పిస్తానంటున్నది. లాభాల కోసం ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ను పంపే అవకాశం ఇచ్చింది. ప్రజలకు 3శాతానికి మించి వ్యాక్సినేషన్ అందించలేక పోయింది. కోట్లమంది జబ్బుబారిన పడి, లక్షల మంది చనిపోతున్నా నివారణ గురించి శ్రద్ద పెట్టలేదు. పెట్టకపోగా అశాస్త్రీయ, అనాగరిక, ఆటవిక ధోరణులతో వ్యవహరించారు. ట్రంప్ మాస్క్ అవసరం లేదన్నాడు. శానిటైజర్ తాపించి పొట్టలో వైరస్‌ను పోగొట్టొచ్చన్నాడు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా వ్యాధిగ్రస్థులకు షేక్‌హ్యాండ్ ఇచ్చినా ఏమీ కాదు అన్నాడు. మాస్క్లేకపోయినా ముప్పేమీ లేదన్నాడు. భారత ప్రధాన మంత్రి చప్పట్లు కొట్టించాడు. దీపాలు పెట్టించాడు. పూలు చల్లించాడు. ఆయన సహచరులు ఆవు మూత్రం తాగితే, ఆంజనేయ స్తోత్రం పఠిస్తే, గంగలో మునిగితే, కుంభమేళాలో పాల్గొంటే కరోనా పోతుందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ నివారణా చర్యలు ఇవే.
ఇక సోషలిస్టు దేశాలు ఈ జబ్బు పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల ఎలా వ్యవహరించాయో పరిశీలిద్దాం. జబ్బు పుట్టిన దేశమైన చైనా, 2019 డిసెంబర్ 31న ఏదో తెలియని వైరస్ కారణంగా న్యుమోనియాతో బాధపడుతున్న 27మంది రోగుల గురించి ప్రపంచానికి తెలియచేసింది. జనవరి 7న చైనా శాస్త్రవేత్తలే దాని జన్యులింక్ను కనిపెట్టారు. జనవరి 11నాటికే డబ్లుహెచ్‌వొ కు చెప్పారు. ఆనాడే అమెరికాకూ చెప్పారు. జనవరి 12నే ఈ వైరస్ జన్యు స్వీక్వెన్సీని బైట పెట్టారు. ఆ స్వీక్వెన్సీని ఆధారం చేసుకొనే ఇప్పుడు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం పోటీపడుతున్నాయి. జనవరి 20కి వూహాన్ లాక్డౌన్ విధించింది. చైనా ఆల్వేస్ ఫర్ పీపుల్స్, పీపుల్స్ ఫస్ట్ అని, తన 17వ పార్టీ కాంగ్రేస్లో ఇచ్చిన మార్గంలో ప్రయాణం మొదలు పెట్టింది. అన్ని సంస్థలను, అన్ని రంగాలను కో-ఆర్డినేట్ చేసింది. 340 మెడికల్ టీంలను, 42,000 మెడికల్ వర్కర్స్‌ను హుబే ప్రావిన్స్‌కు తరలించింది. 5లక్షలమంది యువ కమ్యూనిస్టు సైన్యాన్ని రంగంలోకి దించింది. 20రోజులలో 2500 పడకలతో 2 ప్రత్యేక హాస్పిటల్స్ కట్టించింది. ప్రభుత్వానిదే మొత్తం వైద్యం. ప్రయివేటుది లేదు. వైద్యమంతా ఉచితమే. లాక్డౌన్ కాలంలో ప్రతి ఇంటికీ లక్షరూపాయల కూపన్లు ఇచ్చింది. అవసరమైన సరుకులూ, వస్తువులు అందించడానికి పూర్తి రక్షణ కల్గిన వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. వ్యాధి ఆ రాష్ట్రం దాటకుండా పూర్తి కట్టడి చేసింది.
మిగతా ప్రపంచానికి కూడా తన వంతు సహాయం అందించింది. 170 దేశాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వైద్యానుభవాలు తెలియచేసింది. 250 మిలియన్ పిపిఇ కిట్లను, రెండు బిలియన్ (200 కోట్లు) మాస్క్‌లను వివిధ వెనుకబడిన దేశాలకు సహాయం చేసింది. 26 ఎక్స్పర్ట్ టీంలను 24దేశాలకు పంపింది. ఇవన్నీ తన ప్రజలను కాపాడుకుంటూ, జబ్బు గురించి పరిశోధించుకొంటూ చేసిన కార్యక్రమాలు. అందుకే కరోనా మొదటి స్థానంతో మొదలయ్యి ఈ రోజు 99వ స్థానానికి వెళ్ళింది. ఇంకా ముందుగా తగినంత జాగరూకతతో లేకపోవటం, మా వైపునుండి జరిగిన లోపమని బహిరంగంగా ఆత్మవిమర్శ చేసుకొన్నది. కర్తవ్య దీక్షలో కించిత్ వెనుకంజ లేకుండా ముందుకు సాగుతున్నది.
ఇక మరొక దేశం క్యూబా. 1961లోనే సోషలిజమా, మరణమా దేన్నో ఒకదాన్ని ఎంచుకొందాం. సోషలిజమే ప్రజలను సమస్యలనుంచి విముక్తి చేస్తుంది. అయితే మనకు ఆ మార్గంలో వెళితే వచ్చే నిర్భంధాలున్నాయి. శత్రువులు మనను ఏమైనా చెయ్యొచ్చు. దేనికైనా సిద్దపడదాం. కానీ, ఆ వైపే వెళదామని నిర్ణయించుకొన్న దేశం. అతిపెద్ద అమెరికానుంచి అనేక నిర్భంధాలను, దిగ్భంధాలనూ ఎదుర్కొంటూ సాగుతున్న దేశం. చిన్న దేశమైనా 57దేశాలకు వైద్య బృందాలను పంపించి, ప్రపంచానికి పెద్ద సందేశాన్ని అందించింది. ఆ దేశంలో మొత్తం ప్రభుత్వ వైద్యమే. సగటు జీవితకాలం జి7లోని అన్ని దేశాలకంటే ఎక్కువ. మేము యుద్ధం చేసి మనుషుల ప్రాణాలు తీసే ఆయుధాలు తయారు చెయ్యం. దానికి భిన్నంగా మనుషులకు ప్రాణం పోసే డాక్టర్లను తయారు చేస్తామని ఏనాడో ఫైడల్ కాస్ట్రో చెప్పారు. ఆయన నాయకత్వంలోనే ఆ దేశం డాక్టర్ల ఉత్పత్తి ఫ్యాక్టరీగా మారింది. ప్రతి 1,000మంది జనాభాకు 8మంది డాక్టర్లు. ప్రపంచంలో మరెక్కడా లేరు. ఇప్పుడే కాదు. ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ విపత్తులొచ్చినా, మహమ్మారులొచ్చినా, బాధితులకు వైద్య సహాయానికి ఆ దేశం ప్రపంచంలో అందరికంటే ముందుంటున్నది.
వియత్నాం, ఉత్తర కొరియా, లావోస్‌లు కూడా అంతే శ్రద్ద తీసుకొన్నాయి. ఈనాడు ప్రపంచంలో ఒక్క కేసు కూడా నమోదు కాని దేశం ఉత్తర కొరియా. లావోస్‌లో రెండే మరణాలు. 10కోట్ల జనాభా ఉన్న వియత్నాంలో మరణాలు 47. ఏదో ఒక్కదేశంలో కాకుండా ఐదు దేశాలలోనూ కరోనా కాలు నిలుపలేక పోయిదంటే, అది ఆ వ్యవస్థ యొక్క ప్రత్యేకత కాక ఏమౌతుంది?
ఒక వ్యవస్థ ప్రజలే సర్వస్వం అన్నది. ముందు ప్రజలను కాపాడుకొన్నాక మిగిలిన వ్యవహారం అన్నది. రెండో వ్యవస్థేమో ప్రజలకంటే పెట్టుబడిదారులే ముఖ్యం అన్నది. వాళ్ళ శ్రేయస్సే తన శ్రేయస్సన్నది. వాళ్ళ శ్రేయస్సే ప్రజా శ్రేయస్సంటున్నది. ఒక వ్యవస్థ చేసేది దోపిడీ. కోరేది లాభం. మరొక వ్యవస్థ కోరేది సమసమాజం. చేసేది ఆ మార్గంలో ప్రయాణం.
- పి. సుదర్శన్‌రావు