Authorization
Mon Jan 19, 2015 06:51 pm
120 సంవత్సరాల క్రితం ఠాగూర్ మొదట బెంగాలీలో రాసిన 'దీనోదాస్' కవితా సంకలనం 'కహిని'లో ఒక భాగం.
''గుళ్ళో దేవుడు లేడు.'' సాధువు అన్నాడు.
రాజుకు ఆగ్రహం కలిగింది. ''దేవుడు లేడా? ఓ మహాత్మా మీరు నాస్తికుడిలా మాట్లాడటం లేదు కదా? అమూల్యమైన వజ్రవైఢుర్యాలతో పొదగబడిన సంహాసనం పై ఉన్న మెరుస్తున్నటువంటి బంగారు ప్రతిమను చూసి కూడా మీరు దేవుడు లేడంటారా?''
''అది ఖాళీగా లేదు. రాచరికపు గొప్పదనంతో ఆర్భాటంతో అలరారుతోంది కూడా. నిండుగా రాజసం ఉట్టిపడుతోంది మహారాజా. కాని ఈ లోకానికి దేవుడు లెడక్కడ'' సమాధానమిచ్చాడు సాధువు.
రాజు కోపంగా అన్నాడు ''ఇరవై లక్షల బంగారు నాణేలను ధారబోసి ఆకాశాన్ని ముద్దాడుతున్న భారీ కట్టడంలో ఉన్న ప్రతిమ ఇది. అన్ని రకాల ఆచారాలను పాటించిన తరువాతే దీన్ని దేవుళ్ళకు అర్పించాను. మీరేమో ఇంతటి గొప్ప దేవాలయంలో దేవుడే లేడని చెబుతున్నారు?
సాధువు శాంతంగా సమాధానమిచ్చాడు. ''ఇదే సంవత్సరంలో రెండుకోట్ల మంది నీ ప్రజలు ఘోరమైన కరువుతో విలవిలలాడారు. వారు భిక్షకోసం నీ వాకిటి ముందుకువచ్చి సహాయం అడిగారు. వట్టిచేతులతో వెనక్కు పోయారు.
వాళ్ళు బలవంతంగా అడవుల్లో, గుహల్లో, రహదారుల పక్కన వేసిన ఆకుపందిళ్ళలో, నిర్లక్ష్యానికి గురైన దేవాలయాల్లో తలదాచు కున్నారు. అదే సంవత్సరం నీవు ఇరవైలక్షల బంగారు నాణేలు ఖర్చుచేసి నీదైన గొప్ప దేవాలయం నిర్మించావు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు...
''నీలాకాశంలోని నిత్య దీపాలతో నా ఇల్లు వెలుగులు చిమ్ముతుంటుంది. నా ఇంటి పునాదులు సత్యం. అహింస, కరుణ, ప్రేమ అనే విలువల పునాదులతో కట్టబడి ఉన్నాయి. తనవారికి కష్టసమయంలో ఆశ్రయమివ్వని, ఓ లోభి, నాకు ఇల్లు కట్టించానని ఎలా భావిస్తాడు?''
ఆ రోజే దేవుడు నీ మందిరాన్ని వదిలేశాడు. ఒత్తిడిలో రహదారులకు ఇరువైపులా, చెట్ల కింద ఉన్న పేదల వద్దకు పోయాడు. సముద్రపు లోతుల్లో నురుగులో ఉన్న ఖాళీవలె నీ ప్రాపంచికమైన ఈ గుడి బోలుగా ఉంది. అది సంపద, అహంకారాలతో నిండిన ఓ బుడగ మాత్రమే''
కోపంలో ఉన్న రాజు కేకలేశాడు. ''నీవో మోసపూరితమైన తెలివిలేని మనిషివి. తక్షణం నా రాజ్యం వదిలిపో.
సాధువు సాంతంగా సామాధానమిచ్చాడు. ''దేవుడినే బయటకు వెళ్ళగొట్టినవాడవు. దయచేసి భక్తిని కూడా వదిలేరు.''
- రవీంద్రనాథ్ఠాగోర్
అనువాదం: జంధ్యాల రఘుబాబు.