Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సాహితీ ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితో పాటు భౌతిక దక్పథాన్ని పరిచయం చేసిన సాహిత్యమే అభ్యుదయ సాహిత్యం. అలాంటి అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీమూర్తులలో ఆరుద్ర ఒకరు. ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి . ఆయన వివిధ రంగాల్లోనే కాక వివిధ సాహితీ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఆయన అక్షరరూపం ఇచ్చిన మహాకావ్యం ''త్వమేవాహం''.1949 లో ప్రచురించబడిన ఆ కావ్యం చదివి ఆరుద్ర మేనమామ అయిన శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) ఇక నేను పద్యాలు రాకపోయినా పర్వాలేదు అని ఆరుద్ర కు కితాబు ఇచ్చారు. మహాకవి శ్రీశ్రీప్రశంసలందుకున్న కావ్యంగా త్వమేవాహం నిలిచిపోవడమే కాదు, ఒక మహౌన్నత పోరాటాన్ని చరిత్రగా రికార్డు చేసింది. ఆరుద్ర ఒక అభ్యుదయ కవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, సినీ కవి, విమర్శకుడు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి ఆరుద్ర ఎన్నో రచనలు చేశారు. వాటిలో ముఖ్యమైనవి సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు, వంటి అనేక కావ్యాలతో పాటు వెన్నెల- వేసవి, దక్షిణ వేదం, జైలు గీతాలు, వంటి అనువాద రచనలు కూడా చేశారు. రాదారి బంగళా శ్రీకష్ణదేవరాయ, కాటమరాజు కథ వంటి అనేక అనువాద రచనలు చేశారు. ఆయన ఎన్నో కథలను, నవలలను కూడా రాశారు. ఆరుద్ర భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.
ఆరుద్ర సాహితీ పరిశోధనా దృష్టికి పరాకాష్ట సమగ్ర ఆంధ్ర సాహిత్యం. 14 సంపుటాలుగా వచ్చిన ఈ పరిశోధనాత్మక గ్రంథం కోసం ఆరుద్ర తన మేధస్సునే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఖర్చు పెట్టారు. వేదన, మన వేమన, వ్యాసపీఠం, గురజాడ గురుపీఠం, ప్రజాకళలలు - ప్రగతి వాదులు, వంటి రచనలు ఆరుద్ర అందించిన మరికొన్ని అద్భుత పరిశోధనా గ్రంథాలు. రాముడికి సీత ఏమవుతుంది, గుడిలో సెక్స్ వంటి రచనలు ఆరుద్ర సమగ్ర పరిశీలన దృష్టికి అద్దం పడతాయి. సంగీతం, నాట్యం మీద రచించిన అనేక వ్యాసాలు ఇతర లలిత కళలలో ఆరుద్ర అభినివేశాన్ని పట్టి చూపిస్తాయి. చదరంగం ఆటపై కొన్ని దశాబ్దాలకు పూర్వమే ఒక గ్రంథాన్ని రాయడం ఆరుద్రలోని మరో ప్రత్యేకత. ఇలా నిరంతర పరిశోధకుడిగా నవ్యత కోసం పరితపించిన నిత్య సత్య శోధకుడు, హేతువాది, సౌమ్యవాది ఆరుద్ర. తెలుగు సాహిత్య చరిత్రపై చెరగని సంతకంగా ఆయన నిత్యస్ఫూర్తి.
- బిండారు రామ్మోహనరావు
సెల్ 9866074027