Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలోని మామూలు జనమైనా, సమాజాన్ని అజమాయిషీ చేసే సంస్థలైనా, ప్రభుత్వాలైనా అనాగరిక విధానాలు ఆచరిస్తూ ఉంటే వారిని / వాటిని అనాగరికమైనవిగానే పరిగణిస్తాం. అత్యాధునిక యుగంలో బతుకుతూ నిరూపణలు లేని మూఢ విశ్వాసాలనే నమ్ముతూ ఉంటే వారిని అనాగరికులుగానే భావిస్తాం. జనాన్ని అంధ విశ్వాసాల సంప్రదాయాల్లోకి లాక్కెళ్ళి, అక్రమంగా ఓట్లు సంపాదించి, మంద బలాన్ని కూడగట్టుకుని, దేశాన్ని అనాగరికతలోకి లాక్కుపోతున్న నేటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఏమందాం? గొప్ప నాగరిక ప్రభుత్వమందామా? ఇంగిత జ్ఞానం లేని, సాధు సన్యాసులకు, యోగులకు అధికారం కట్టబెట్టి.. దేశాన్ని కొన్ని శతాబ్దాల వెనక్కి తీసుకువెళ్ళే మోడీ పరిపాలన అద్భుత: అని అందామా? ప్రపంచ మీడియా భారత కేంద్ర ప్రభుత్వ తప్పులన్నీ ఏకరువు పెట్టి ఛీ కొట్టింది కదా..!?
జాతి విశాల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై నిర్భయంగా నిజాయితీగా మాట్లాడకుండా ఉండడమంటే, విద్యుక్త ధర్మ నిర్వహణను ఉపేక్షించడమే! అందుకే ''సనాతన ఆచారాలు, సంప్రదాయాలు కూడా ప్రమాదకర శత్రువులే. విప్లవపురోగమనాన్ని అవి అంతర్లీనంగా అడ్డుకుంటాయి. మనం వాటిని పూర్తిగా అణచివేయలేం గానీ, సుదీర్ఘకాలంలో, అత్యంత జాగరూకతతో, పట్టుదలతో సరిచేయాల్సి ఉంటుంది''.. అని అంటారు వియాత్నాం విప్లవసారథి హౌచ్మిన్. కొన్నేళ్ళ క్రితం హేతువాది నరేంద్ర దబోల్కర్ తన స్వస్థలం పూణేలో మార్నింగ్ వాక్ చేస్తుండగా దుండగులు కాల్చి చంపారు. ఈ కేసును మొదట మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేశారు. తర్వాత సీబీఐకి అప్పగించారు. ఇన్నేండ్లు గడిచినా, ఇంకా ఆ దుండగుల ఆచూకీ తెలియలేదు. నరేంద్ర దబోల్కర్ సెలబ్రిటీ కాదు.. గనక, ప్రైమ్ టైం చర్చలు, ఆగ్రహావేశాలు లేవు. నిజంగా విషాదం. హత్యకు గురైనవాడు నరేంద్ర, దర్యాప్తు చేయించాల్సినవాడూ నరేంద్రే, కానీ, ఏం లాభం? ఈ ఒక్క ఉదాహరణను బట్టి ఏం అర్థమవుతోంది? మేథావుల్ని, హేతువాదుల్ని, సైన్సు కార్యకర్తల్ని చిదిమేయడంలో ఈ ప్రభుత్వం గొప్పగా రాణిస్తోందని కదా?
సమాజ పరివర్తనకు, దారిద్య్ర నిర్మూలనకు, ఆకలిని అంతం చేయడానికి విద్య - ఒక విప్లవాత్మకమైన సాధనం. అదే విధంగా విద్య - మనిషి వ్యక్తిత్వ వికాసాన్ని, వ్యక్తి సామర్థ్యాలను పెంచేసాధనం కావాలి- అని అన్నాడు అమెరికన్ విద్యావేత్త పాలో ఫెర్రీ. నిజమే- కానీ, ఈ దేశంలో విద్యావంతులేం చేస్తున్నారూ? ''ఈ దేశం గురించి ఆలోచించే దేశ ప్రజలందరూ ఒకప్పుడు 1947లో దేశ స్వాతంత్య్రం కోసం ఎదురు చూశారు. ఇప్పుడు మళ్ళీ 2024 కోసం ఎదురు చూస్తున్నారు'' అని అన్నారు కౌశిక్ బసు. ఈ ప్రపంచ బ్యాంకు మాజీ ఆర్థిక వేత్త ప్రధానిని, ప్రధాని విధానాల్ని తీవ్ర పదజాలంతో ఘాటుగా విమర్శించారు. ''పేదవాడు ఆకలితో ఆహార పదార్థాలను దొంగిలిస్తే అతనికి చావు ఎదురవుతుంది. అదే ఓ ధనవంతుడు బ్యాంకును దోపిడీ చేస్తే అతణ్ణి ఎవరూ ముట్టుకోరు. ఇండియా అంటే ఇదేనా?'' అని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయి అన్నారు. అంతే కాదు, 'సేవ్ ఇండియా ఫ్రం సేల్ ఇండియా' అని కూడా వ్యాఖ్యానించారు.
''నేను సమాజ దు:ఖాన్ని స్వీకరిస్తాను. అనుభవిస్తాను. అది నా నుంచి, సమాజం నుంచి శాశ్వతంగా పోవడం కోసం రాస్తాను'' అని సాహిత్య నోబెల్ గ్రహీత మారియా వర్గాస్ ల్లోసా మాత్రమే కాదు, సమాజం పట్ల బాధ్యతగల ఏ రచయితలైనా అలాగే అంటారు. అలాగే అనుకుంటారు. నేనూ అంతే - అలాగే అనుకుంటాను. నేను పెట్టుకున్న అద్దాల్లోంచి నాకేమి కనిపిస్తూ ఉందో.. నేను అదే రాయగలను. మరొకరు పెట్టుకున్న అద్దాల్లోంచి ఏం కనిపిస్తూ ఉందో, ఎలా కనిపిస్తూ ఉందో నాకు ఎలా తెలుస్తుందీ? అందువల్ల ఎవరి అభిప్రాయాలు ఎలా ఉంటే వారు అలా రాస్తారు. అంతే కాని, అందుకు విరుద్ధంగా నిజాయితీ లేని రాతలు ఎలా రాయగలరు? అభిప్రాయ బేధాలుంటే గౌరవంగా వ్యక్తపరచాలి గానీ, ఊరికే బూతులు తిట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. పైగా వారు, వారి స్థాయిని మరింత దిగజార్చుకున్నట్టు అవుతుంది. అయితే ఇక్కడ మరొక ముఖ్య విషయముంది. కేవలం సాహిత్యంతోనే సమాజంలో మార్పు సాధ్యం కాదు. దానికి కార్యాచరణ తోడు నిలవాలి. మార్పుకోరే వారందరూ సాహిత్యాన్ని, కార్యాచరణను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సిందే! అయితే అందుకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయని విశ్వకవి రవీంధ్రనాథ్ టాగూర్ ఏనాడో హెచ్చరించారు. ''సంప్రదాయాలను ధిక్కరించి ముందుకు పోవడానికి ద్వారాలు అనేకం అడ్డుగా ఉన్నాయి. ఆ ద్వారాల దగ్గర ఎంతోమంది కాపలాదార్లు పహారా కాస్తున్నారు'' అని అన్నారు. సమాజం మతం మత్తులో పడకుండా ఉండాలంటే ఒకవైపు విద్యావిధానంలో మార్పు రావాలి. మరొక వైపు పిల్లలకు మత సంబంధమైన విషయాలేవీ అసలే బోధించగూడదు. పాఠ్యప్రణాళికలో మార్పు తేవాలి. వైజ్ఞానిక దృక్పథం పెంపొందించే విధంగా దాన్ని తీర్చిదిద్దాలి - అని మానవ వాదులంతా తపన పడుతున్నారు. ఈ దేశంలో అది అంత సులభమైంది కాదు, కానీ ప్రయత్నించి సాధించక తప్పదు-
ఈ దేశంలో 20వేల మంది రోహింగ్యా ముస్లింలు హత్యకు గురయ్యారు. 18వేలమంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 35వేల మందిని అగ్నికి ఆహుతి చేశారు. 45వేల మంది తుపాకి కాల్పులకు గురయ్యారు, గాయపడ్డారు. ఈ మారణ హౌమాన్ని తట్టుకున్న 10లక్షల మంది, ఇప్పటికీ భద్రత, పౌరసత్వం, న్యాయం లభించకుండా తల్లడిల్లిపోతున్నారు. ఇదేనా నాగరిక ప్రపంచం? ఇదేనా మానవీయ విలువల్ని కాపాడడం? ఆధునికత సంతరించుకున్న భారతావనిని రాతియుగంలోకి విసిరేసిందెవరు? నాటు పరిపాలన, మోటు పరిపాలన సాగిస్తున్నదెవరు? మాల్యా తొమ్మిది వేల కోట్లు ఎగ్గొడితే, నీరవ్ మోడీ ఏడున్నర వేల కోట్లు ఎగ్గొట్టాడు. అనిల్ అంబానీ వీరిద్దరి కంటే పదిరెట్లు ఎక్కువగా దాదాపు ఎనభై ఆరువేల నూట ఎనభై ఎనిమిది కోట్లకు పైగా ఎగ్గొట్టాడు. ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనా కాలలో సాధించిన ప్రగతి సామాన్యుడికి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గాడిద పేడ, రంపపు పొట్టు, విష రసాయనాలు, ఏసిడ్లతో మసాలా పొడులు తయారు చేసి దేశ వ్యాప్తంగా పంపిణీ చేసి, వ్యాపారంలో లాభాలార్జించిన దేశభక్తుడు అనూప్ వర్షనే. ఈయన హిందూ యువ వాహిని నేత. అంతకన్నా ముఖ్యమైంది ఏమిటంటే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రియ శిష్యుడు. బహుశా ఇది కూడా దేశం కోసం - ధర్మం కోసమే అని చెవిలో కమలం పువ్వు పెడతారు కాబోలు.
భారత రత్న - కొట్టేసి, తర్వాత పార్లమెంటు మెంబరై ఏనాడూ పార్లమెంట్‌కు పోని మహా క్రీడాకారుడు అసలు ఒక బాధ్యత గల పౌరుడేనా? కోట్ల రూపాయల ప్రయిజ్ మనీ కొట్టేసి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం చేజిక్కుంచుకుని, ఇంటి స్థలం కూడా అప్పనంగా లాగేసి, అది సరిపోదన్నట్టు మరికొన్ని గజాల స్థలం కావాలని అర్జీ పెట్టుకుంది ఓ మహా క్రీడాకారిణి. వీరి వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏమిటి? ప్రజలకు మాత్రం 60గజాల ఇంటి స్థలం ఇవ్వలేరు. మరో హైదరాబాద్ క్రీడాకారిణికి కోట్లలో ప్రజాధనం గుమ్మరించి, 'తెలంగాణ ఎంబాసిడర్'గా ప్రకటించారే? జరిగిన లాభం ఏమిటీ? ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిటీ? ''పదవి పొగరును కాదు, బాధ్యతను పెంచాలన్నట్టు'' అస్సోం పోలీస్‌శాఖలో డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న హిమాదాస్, ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడలిస్ట్, జూనియర్ వరల్డ్ ఛాంపియన్.. మట్టిలో మాణిక్యంలా భాసిల్లుతోంది. అందుకే గుర్రాల్ని, గాడిదల్ని ఒకే రకంగా చూడగూడదు. కష్టపడుతున్నదెవరు - కష్టపెడుతున్నదెవరు స్పష్టంగా చూడగలగాలి. అడ్డదిడ్డంగా ఎవరు ఏ అందలమెక్కి ఏ వివిఐపి అయిపోయారో గమనించాలి. అర్హతలేని వాళ్ళకు విలువ ఇవ్వకుండా ఉండడం నేర్చుకోవాలి. వాళ్ళు చేసుకునే ప్రచారాలు చూసి మోసపోగూడదు.
హిమాలయాల్లో స్వర్గం ఉందని, దేవతలంతా అక్కడే ఉంటారని యాత్రలు చేసే సనాతన అహేతుకవాదులైన సూపర్స్టార్లకు ఎన్ని పద్మాలిచ్చినా, ఎన్ని దాదా ఫాల్కేలిచ్చినా వృధానే. అధికారంలో ఎవరుంటే వారి చుట్టూ తిరిగి, అడ్వర్టైజ్మెంట్ డబ్బులకు దాసోహమనే నటులు ఎంతటి స్టార్లయితే ఏమిటీ? అంతా డొల్ల. ఆపత్కాలంలో ప్రజల కోసం ఒక చిన్నపాటి సోనూ సూద్‌లు కాలేకపోయారే? ఉత్తర భారతదేశానికి చెందిన ఓ నటి అధికార పార్టీకి రామ్ భజన చేస్తూ ఉత్తమనటి కావడం ఈ కాలపు విడ్డూరం!
మరోవైపు కేవలం ప్రశ్నించినందుకే ఎన్.ఐ.ఎ.రంగంలోకి దిగి కవుల రచయితల, కళాకారుల ఇండ్లు సోదాలు చేస్తుంది. కేసులు పెడుతుంది. వయసు కూడా చూడకుండా జెయిల్లో పెడుతుంది. బెయిలు కూడా ఇవ్వదు. అందుకే వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ క్రిస్టలినా జార్జివ ఏమన్నారో చూడండి... ''భారతదేశం ఇక ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం ఏ మాత్రం కాదు. మరింత మరింత పేద దేశంగా మారిపోతూ ఉంది. పక్కన ఉన్న చిన్న దేశం బంగ్లాదేశ్ కన్నా 2025 నాటికి మరింత పేద దేశంగా మిగిలిపోనుంది.'' మన దేశ నాయకులకు చీమలు కూడా కుట్టడం లేదే? చీమూ నెత్తురూ లేకుండా పోయారే?
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు