Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ రాజధానిలో జరుగుతున్న రైతాంగ పోరాటాలు ఆరు మాసాలు పూర్తిచేసుకుని ఏడవ మాసంలోకి అడుగు పెట్టాయి. ప్రపంచ చరిత్రలో రైతులు నిరాఘాటంగా ఇంతకాలం పోరాటం జరిపిన దాఖలాలు లేవు. స్వాతంత్య్రానంతరం ఇంత సుదీర్ఘ పోరాటం జరగడం ఇదే ప్రథమం. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, రైతుల రుణాల రద్దుకు, కనీస మద్దతు ధరల నిర్ణయానికి పార్లమెంట్లో చట్టాలు చేయాలని, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని రైతు ఉద్యమం కోరుతున్నది. ఇందులో ఏ ఒక్కటి కేంద్రం అంగీకరించకున్నా ఉద్యమం కొనసాగుతుందని రైతు సంఘాల సమన్వయ కమిటీ స్పష్టంగానే కేంద్రానికి తెలిపింది. 11 తడవలుగా చర్చల పేరుతో కాలయాపన చేసి 9 సవరణలు ప్రకటించి వాటిని చట్టంగా రూపొందించకుండా నోటిమాటగా హామీ ఇస్తానని కేంద్రం చెప్పింది. చివరకు సుఫ్రీంకోర్టు ఈ చట్టాలను అమలు కాకుండా ప్రస్తుతం స్టే విధించి కొనసాగిస్తున్నది. అయినప్పటికీ కేంద్రం ఈ మూడు రైతు వ్యతిరేక చట్టాల అమలుకు ఏదోఒక రూపంలో ప్రయత్నిస్తూనే ఉన్నది. నిత్యావసర సరుకుల చట్టం ప్రకటించగానే ఆహార ధాన్యాల ధరలు రెట్టింపయ్యాయి. ఇంతవరకూ తగ్గుముఖంలేదు. ప్రస్తుతం ప్రకటించిన కనీస మద్దతు ధరలు అమలు కావడంలేదు. మార్కెట్లలో గుత్త కొనుగోలుదారుల నిర్ణయం ప్రకారం కనీస మద్దతు ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దేశంలో రైతులు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలలో 3లక్షల కోట్లు నష్టపోతునట్లు ఆర్థికవేత్తలు చేబుతున్నారు. కేంద్రం రైతులతో సంప్రదించి ఆందోళనలను విరమింపజేయడానికి ఏలాంటి చర్యలు తీసుకోవడంలేదు. దీనికి కారణాలు ఏమిటీ? కేంద్రం ఏవరికి లొంగి ఈ అక్రమ చట్టాలను కొనసాగించ బూనుకున్నది? వాస్తవాలేమిటి?
ప్రధాని మోడి డబ్ల్యూటిఓ ఒత్తిడికి లొంగి, బహుళ వ్యాపార ఒప్పందాలకు లొంగి వాటిని అమలు చేయడానికి ఉత్సహం చూపుతునట్లు డైరెక్టర్ జనరల్ అజివెదో ప్రశంసించారు. 2018 మార్చి 19న డబ్ల్యూటిఓ మంత్రుల స్థాయి సమావేశం ఇన్ఫార్మల్గా డిల్లీలో జరిగింది. అందులో బహుముఖ వ్యాపారానికి మోడి అత్యంత విశ్వస పాత్రుడని మంత్రుల స్థాయి సమావేశం శ్లాఘించింది. అమెరికా వ్యవసాయ రంగానికి 61,286 డాలర్లు, యూరోపియన్ యూనియన్ వ్యవసాయానికి 8,582 డాలర్లు 2019లో సబ్సిడీగా ఇవ్వడానికి డబ్ల్యూటిఓ అంగీకరించింది. కానీ భారత్‌కు సబ్సిడీలు తగ్గించాలని అంబర్‌బాక్స్ పేర 282 డాలర్లకు మాత్రమే అవకాశం కల్పించింది. వ్యవసాయ సబ్సిడీలకు ధనిక దేశాలకు గ్రీన్ బాక్స్ పేర అవకాశాలు కల్పించిన డబ్ల్యూటిఓ డైరెక్టర్ జనరల్ భారత దేశానికి అంబర్ బాక్స్ పేర సబ్సిడీలు తగ్గిస్తూ అవకాశం ఇచ్చారు. 2021 మార్చి 1న డబ్ల్యూటిఓకు ఎన్నికైన నగోజి ఓకన్జో లెవాలా, డైరెక్టర్ జనరల్ కూడా మోడీ వ్యవసాయ రంగంలో తెస్తున్న మార్పులకు మద్దతు తెలిపింది. అంతేకాక ఏ పరిస్థితులలోను వెనక్కు తగ్గకూడదని వత్తాసు పలికింది. డైరెక్టర్ జనరల్ ప్రకటనను ధనిక దేశాలు బలపరుస్తున్నాయి. దీనికి తోడు దేశీయంగావున్న గుత్త సంస్థలు, ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో చేరి లాభాలు సంపాదిస్తున్న టాటా, బిర్లా, అదాని, రిలయన్స్, ఐటిసి, బేయర్ లాంటి సంస్థలు మోడీ ప్రభుత్వం చట్టాల రద్దు విషయంలో వెనక్కు తగ్గకుండా ఒత్తిడి తెస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలకు, స్థానిక గుత్త సంస్థలకు లొంగిపోయిన ప్రధాని మోడి ప్రభుత్వం వెనక్కు రావడానికి సుముఖంగాలేదు. ఇప్పటికే 500మంది ప్రాణాలు కొల్పోయారు.
భారత దేశంలో 86శాతం రైతులు 5ఎకరాలకు లోపు ఉన్నవారు కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఉత్తమమని, తిరిగి పాత జమీందారి విధానంలోని భూ ఎకీకరణకు, కార్పొరేట్ సంస్థలకు అవకాశం కల్పించాలని డబ్ల్యూటిఓ ఆదేశించింది. అగ్రిమెంట్ అన్ అగ్రికల్చర్ ఒప్పందం కింద అభివృద్ది చెందుతున్న దేశాలు 10శాతం మాత్రమే సబ్సిడీ ఇవ్వలని తీర్మానించారు. ఈ ఒప్పందాల నేపధ్యంలో వీటిని అమలు చేయడానికి మోడీ మూడు వ్యవసాయ బిల్లులను తెచ్చాడు.
భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ను కార్పొరేట్ల చేతులల్లో పెట్టడానికి ఈ బిల్లులు పని చేస్తాయి. 18లక్షల కోట్ల మార్కెట్‌ను 3, 4 కంపెనీలకు అప్పగించాలని, పై ఒప్పందాల ప్రకారం బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టంగా రూపొందించారు. 4,5 కార్పొరేట్ సంస్థలకు లాభాలు కల్పించడానికి 14.57 కోట్ల మంది రైతులు, 20కోట్ల మంది వ్యవసాయ కార్మికుల జీవితాలను బలిపెట్టడం జరుగుతోంది. సుశిల్ మోడీ చెప్పినట్టు బిహార్‌లో అశీర్వాద్ కంపెనీకి 3 లక్షల టన్నుల గోదుమలు ఎంఎస్పి ధర కన్న రూ.125 తక్కువకు కోన్నారు. బయట అమ్ముకున్న వారు ఎంఎస్పిపై రూ.150 అదనంగా సంపాదించారు. ఆశీర్వాద్ కంపెనికి అమ్ముకున్నవారు క్వింటాల్‌కు రూ.300 నష్టపోయారు. మొత్తం ఎన్ని కోట్లు నష్టం జరిగింది? అమెరికాలో వెనీల పంట దెబ్బతిన్నది. ఇతర దేశాలలో వెనీల పంట పండించి అమెరికాకు ఎగుమతి చేయాలి. అందులో బాగంగా కేరళ వైనాడ్‌లో వెనీల పండించారు. మన ఆహారం కన్నా గిరాకి ఉన్న అమెరికాకు పండించాం. మొదట లాభాలు వచ్చి తరువాత దివాళా తీసి ఆత్మహత్యలు కొనసాగాయి. ప్రపంచ మార్కెట్ అవసరాలకు కావాల్సిన పంటలు పండించాలంటే చట్టాలను మార్చాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలు ఆ కోవలోనివే. ముందు ఈ చట్టాలు రాజ్యాంగం రీత్యా రాష్ట్రాల పరిధిలో గల హక్కులను గుర్తించాలి. స్పష్టమైన అధికార విభజనలు ఉన్నాయి. న్యాయ, కార్యనిర్వహక, పార్లమెంట్‌కు ఉన్న అధికారాన్ని మోడి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. అర్టికల్ 32 ప్రకారం ఎవరైనా కోర్టుకు వెళ్ళవచ్చు. ఈ చట్టాలలో అలా వెళ్ళే హక్కు లేదు. అదే సందర్భంలో కార్పొరేట్లు కోర్టుకు వెళ్ళవచ్చు. ఆంధ్ర, తెలంగాణలో ఐటీసీ సంస్థ సుబాబుల ఒప్పందం చేసుకొని అమలు చేయలేదు. గుజరాత్లో ''లేెస్ కంపెనీ'' రెండు ఎకరాలు కలిగిన పేద రైతులపై కేసులు వేసి విత్తనం దోంగతనం చేసినట్లు ఆరోపించింది. ప్రభుత్వాలు కార్పొరేట్లకు అనుకూలంగా సమర్థిస్తాయి. భారతదేశ ఆర్థిక చరిత్రను పరిశీలిస్తే 1991 నుంచి సంస్కరణల పేరుతో వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు లాభకరంగా మార్చుతూ వస్తున్నారు. అందుకే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు చేసిన భారతదేశం నేడు 3లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను ఇతరదేశాల నుంచి దిగుమతులు చేసుకొని దేశీయ స్వయంపోషకత్వాన్ని దెబ్బతీసుకుంటున్నది. అతి చిన్న దేశాలైన టర్కీ, ఇరాన్, ఇరాక్, పిలిప్పైన్స్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కూడా తమ వ్యవసాయ ఉత్పత్తులు పెంచుకొని దిగుమతులను తగ్గిస్తున్నాయి. అదేపనిగా ప్రపంచమంతా చుట్టివచ్చిన మోడీ నేడు ఇంట్లో నుంచి కదలకుండా దేశ ఆర్థిక పరిస్థితిని అంగట్లో పెట్టాడు. 18 మాసాలుగా కరోనా విశృంఖలంగా విహరిస్తున్నప్పటికీ భారత వ్యవసాయ రంగం తన ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచుతూనే ఉంది. 20లక్షల కోట్ల మార్కెటింగ్ వ్యవసాయ ఉత్పత్తుల ద్వారానే జరుగుతున్నది. ఈ మార్కెట్లను కొల్లగొట్టడానికి మోడీ ప్రభుత్వం దోపిడీ దారులకు అనుకూలంగా చట్టాలు చేసింది. దేశ ప్రయోజనాలను ఆశించి, దేశీయ వ్యవసాయ ఉత్పత్తులను మరింత పెంచి దిగుమతులకు స్వస్తి పలకాలి. ఆ దిశగా జరుగుతున్న పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలి. ఉద్యమం ఉధృతం కావడం కేంద్ర ప్రభుత్వానికి మంచిదికాదు. రాబోవు రాజకీయ, ఆర్థిక నష్టాలను గుర్తించి రైతు ఆందోళనలను వెంటనే ఉపసంహరింపచేయాలి. కార్పొరేట్లు దేశ ఆర్థిక సంక్షోభానికి కారకులౌతారేతప్ప ప్రజాభివృద్దికి సహకరించరు. దేశ ఆర్థిక పెరుగుదలకు దోహదపడే రైతుల ప్రయోజనాలను కాపాడడానికి కేంద్రం ప్రయత్నించాలి.
- మూడ్ శోభన్
సెల్: 949725951